ఇప్పటికీ
ABN , Publish Date - Jul 27 , 2026 | 03:00 AM
మబ్బుల్లేని జ్ఞాపకాల ముసురు మడతబడిన పేగును అవ్వచేతులతో తడిమి సవరించిన పనసకొమ్మ ఆకలికి వెక్కిళ్లుపడిన రాత్రికి రేగుపళ్ళ ఊరడింపు...
మబ్బుల్లేని జ్ఞాపకాల ముసురు
మడతబడిన పేగును
అవ్వచేతులతో తడిమి సవరించిన పనసకొమ్మ
ఆకలికి వెక్కిళ్లుపడిన రాత్రికి
రేగుపళ్ళ ఊరడింపు
రొజ్జకు తడిసిన ముంజూరులో
బిక్కమొగమేసిన బాల్యానికి
సీతాఫలాల బుజ్జగింపు
సాయంకాలపు కొసరు ఆకలికి
గొణుగుపళ్ళ ఊరట
ఇప్పటికీ
పేగు తడిమితే గుర్తుకొచ్చే పాలకొబ్బరి తీపి
ముళ్ళకు ఎదురొడ్డి ఏరుకున్న
గుప్పెడు ఓకాయిపళ్ళ ముందు
చిన్నబోయే ఉగాది పచ్చడి
రెప్పపడనివ్వని గాలివాన తర్వాత
చేరడు నూకలేసి వండిన
వేడివేడి పుడకొట్టు కూర చెవులూరింపు
మూడు నెలల జీడిపంటను
తొమ్మిది నెలల చెమటతో గుణించి
తృప్తిపడే సన్నకారు జీవితం
నెలకోసారైనా కూరగిన్నెలో కూయని
కోడి సంగతి పక్కన పెడితే
పలవరింపు కొచ్చేదైతే
పకాలన్నంతో నెత్తళ్ళు నంజుకున్న రోజులే
ఇప్పటికీ
కాపుపట్టిన కొబ్బరిచెట్టును చూస్తే చాలు
పెదాలు తడుపుకుంటూ
పాలగుండెల కేసి చూసే పసితనం
చంక దిగదు
సాంబమూర్తి లండ
96427 32008
ఇవి కూడా చదవండి:
ఎన్నికల్లో పోటీ చేయను.. సిద్ధరామయ్య సంచలన నిర్ణయం..
అడవిలో తప్పిపోయిన 23 మంది అధికారులు.. చివరకు