Share News

ఇది మహిళా పోరాట దినం!

ABN , Publish Date - Mar 08 , 2026 | 01:32 AM

మార్చి 8 అనగానే దాని పోరాట స్ఫూర్తిని మహిళలకు అందించడం కాకుండా దానిని కొంతమంది కేవలం శుభాకాంక్షల రోజుగా దిగజార్చారు. ఈ నేపథ్యంలో గ్రామీణ భారతదేశంలో మహిళల జీవనాధారంగా నిలిచిన...

ఇది మహిళా పోరాట దినం!

మార్చి 8 అనగానే దాని పోరాట స్ఫూర్తిని మహిళలకు అందించడం కాకుండా దానిని కొంతమంది కేవలం శుభాకాంక్షల రోజుగా దిగజార్చారు. ఈ నేపథ్యంలో గ్రామీణ భారతదేశంలో మహిళల జీవనాధారంగా నిలిచిన ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితి ఆందోళన కలిగిస్తోంది.

గ్రామీణ భారతదేశంలో పేదలు, దళితులు, మహిళలు జీవనోపాధి కోసం ఎక్కువగా ఆధారపడే పథకం ఇది. సంవత్సరానికి కనీసం వంద రోజుల పనిని హామీ ఇస్తూ, పల్లెల్లోనే ఉపాధి కల్పించడం ద్వారా ఈ పథకం లక్షలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇచ్చింది. ముఖ్యంగా మహిళల భాగస్వామ్యం ఈ పథకంలో గణనీయంగా పెరిగింది. పల్లెల్లో మహిళలు స్వయంగా పనికి వెళ్లి సంపాదించడం వల్ల వారి కుటుంబాల్లో నిర్ణయాధికారం పెరిగింది. అప్పుల బానిసత్వం కొంతవరకు తగ్గింది. వలసల ఒత్తిడి కూడా తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంఎన్ఆర్ఈజీఏను బలహీనపరచడం, దానికి బదులుగా వీబీ జీ రామ్ జీ పథకాన్ని తీసుకురావడం వంటివి గ్రామీణ సమాజంలో అనిశ్చితి కలిగిస్తున్నాయి.

నిజానికి వ్యవసాయరంగంలోని మహిళల స్థితిగతులు పరిశీలించి, అసమానతలను తొలగించడానికి ప్రపంచ ప్రజల్లో అవగాహన పెంపొందించే లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి 2026ను అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరంగా ప్రకటించింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ముఖ్యంగా మూడో ప్రపంచ దేశాల్లో ఆహార ఉత్పత్తుల్లో పాల్గొంటున్న వారిలో 60 నుంచి 80శాతం వరకూ మహిళలే ప్రధాన భాగస్వామిగా ఉంటున్నారు. అయితే భూ యాజమాన్యంలో స్త్రీ పురుషుల మధ్య తీవ్ర అంతరాలు కొనసాగుతున్నాయి. ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొంటున్న మహిళలు 80శాతం మంది వ్యవసాయ రంగంలోనే కొనసాగుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని హామీలు ఇచ్చినా ఎన్ని చట్టాలు చేసినా భూ కమతాలపై యాజమాన్యం, అధికారం పురుషులదే అవుతోంది. చట్టాలు కూడా వారికే అనుకూలంగా ఉన్నాయి. సొంత భూ కమతాలు ఉన్నవారు మహిళల్లో 8 నుంచి 14శాతం మాత్రమే ఉన్నారు. వ్యవసాయ రంగంలో పురుషుల కంటే ఎక్కువగా శ్రమిస్తున్న మహిళా రైతులు, రైతు కూలీలకు నేటికీ న్యాయం జరగట్లేదు. మహిళలు పోరాడి సాధించుకున్న హక్కులు రక్షించుకోవడానికి పోరాటాలే స్ఫూర్తిగా తీసుకోవాలనేది ఈ మార్చి 8 పిలుపులో మరో ముఖ్యమైన అంశం.


మహిళల హక్కుల చరిత్రను చూస్తే ఒక స్పష్టమైన నిజం మనకు కళ్ళకు కనబడుతుంది. ఏ హక్కూ స్వయంగా దానధర్మంగా రాలేదు. ప్రతి హక్కూ పోరాటాల ద్వారానే సాధ్యమైంది. సమాజంలో సమానత్వం కోసం మహిళలు సాగించిన ఉద్యమాలు అనేక చట్టాలకు పునాది అయ్యాయి. వరకట్న నిరోధం నుంచి గృహహింస నిరోధం వరకు, పని స్థలాల్లో లైంగిక వేధింపుల నివారణ నుంచి క్రిమినల్ చట్టాల్లో మార్పుల వరకు– ప్రతి చట్టం వెనుక మహిళల నిరంతర పోరాటాల చరిత్ర ఉంది. అయినా, మహిళల సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. ఇన్ని చట్టాలు ఉన్నా మహిళలు ఎందుకు ఇంకా రోడ్డెక్కి పోరాడాల్సి వస్తోంది? అంటే, ప్రభుత్వాలు చట్టాలు చేయడం ఒక్కటే సరిపోదు. అవి సక్రమంగా అమలయ్యేవిధంగా చూడాలి. ఈ బాధ్యత ప్రభుత్వానిదే.

చట్టాలు వచ్చినప్పటికీ మహిళల జీవన స్థితిగతులు పూర్తిగా మారలేదు. గ్రామీణ ప్రాంతాల్లో, పేద వర్గాల్లో మహిళలకు న్యాయం జరగడం ఇంకా కష్టసాధ్యంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మహిళల ఉద్యమాలు మరింత తీవ్రతరం కావాల్సిన అవసరం పెరుగుతోంది. మహిళల సమాన హక్కుల కోసం సాగుతున్న ప్రతి ఉద్యమమూ మన సమాజానికి ఒక చైతన్యాన్ని అందిస్తుంది. న్యాయం కోసం, హక్కుల కోసం మన మహిళల పోరాటం ఇంకా ముగియలేదు. అది నిరంతరం కొనసాగాలి.

బి.పద్మ

ప్రగతిశీల మహిళా సంఘం

ఇవి కూడా చదవండి..

రాష్ట్రపతి ఈవెంట్‌కు మమత డుమ్మా.. ప్రోటోకాల్ నిబంధనల ఉల్లంఘన

విజయ్ ఇంట్లో ఉండేందుకు అనుమతి కోరుతూ ఆయన భార్య పిటిషన్

Updated Date - Mar 08 , 2026 | 01:32 AM