సామ్రాజ్యవాద యుద్ధాలకు నిరసనగా...
ABN , Publish Date - Mar 08 , 2026 | 01:27 AM
వెలగట్టలేని కుటుంబ శ్రమతోను, సమాన పనికి సమాన వేతనం పొందలేని వేతన బానిసత్వంలోనూ యావత్ మహిళా ప్రపంచం రోజూ యుద్ధ వాతావరణంలోనే జీవిస్తోంది. ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ దాడి...
వెలగట్టలేని కుటుంబ శ్రమతోను, సమాన పనికి సమాన వేతనం పొందలేని వేతన బానిసత్వంలోనూ యావత్ మహిళా ప్రపంచం రోజూ యుద్ధ వాతావరణంలోనే జీవిస్తోంది. ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ దాడి మూడో ప్రపంచ యుద్ధ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. ప్రతి సామ్రాజ్యవాద అధర్మ యుద్ధాల్లో ముందుగా బలయ్యేది పసిపిల్లలు, స్త్రీలు మాత్రమే. ఇరాన్‌పై దాడి చేసి ఖమేనీని దారుణంగా హతమార్చడమే కాకుండా, ఒక పాఠశాలపై కురిపించిన బాంబుల వర్షంలో 165 మంది బాలికలు హతమయ్యారు. ఇక 2023 అక్టోబర్ 7న జరిగిన హమాస్ దాడికి ప్రతీకారం పేరిట గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 23 నెలల్లోనే 28 వేల మంది మహిళలు మరణించారని యూఎన్ ఉమెన్ నివేదిక స్పష్టం చేసింది. ‘మిడిల్ ఈస్ట్’ అనే పత్రిక ‘పితృస్వామ్య సమాజంలో యుద్ధానికి అధికంగా బలయ్యేది స్త్రీలే’ అని అభివర్ణించింది. ఇందులో స్త్రీలపై అత్యాచారాలు సర్వసాధారణమని స్పష్టం చేసింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో 57 శాతం మంది ఉక్రెయిన్ పిల్లలు నిర్వాసితులయ్యారని స్పష్టం చేసింది. అందుకే 116వ అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం– మార్చి 8 సందర్భంగా, పశ్చిమాసియాలోని యుద్ధ బీభత్సాన్ని వ్యతిరేకిద్దాం. మొత్తం సామ్రాజ్యవాద అధర్మ యుద్ధాలనే నిలిపివేయాలని నినదిద్దాం.
దాదాపు 120 సంవత్సరాల క్రితమే అమెరికన్ మహిళా కార్మికులు సమాన హక్కుల కోసం, పని గంటల తగ్గింపు కోసం క్రమంగా ఓటు హక్కు కోసం పోరాటబాట పట్టారు. ప్రపంచ కార్మిక వర్గానికి ఆశాదీపంగా 1948 లోనే కమ్యూనిస్టు ప్రణాళిక వెలువడ్డ కాలంలోనే సావిత్రిబాయి పూలే ఆధ్వర్యంలో పూణెలో బడుగు వర్గాల బాలికలకు పాఠశాల ఏర్పడడం, మహిళా విద్యకు పునాదులేర్పరిచిందని చెప్పడం అతిశయోక్తి కాదు. వేద కాలంలోనే మైత్రి, గార్గేయ లాంటి మహిళలు విద్యను అభ్యసించినారని గొప్పగా చెప్పుకుంటున్నా, పితృస్వామ్య భారతీయ కుల–వర్గ సమాజం స్త్రీలను అధమ స్థాయిలోనికే నెడుతున్నది. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ‘ఒక సమాజపు అభివృద్ధిని కొలవాలంటే ఆ సమాజంలోని మహిళాభివృద్ధితో సరిపోల్చాలి’ అని చెప్పడం ఎంతో సరైనది. భారత రాజ్యాంగం ద్వారా ఎన్ని హక్కులు సంక్రమించినా సమాన పనికి సమాన వేతనం అనేది నేటికీ అందని ద్రాక్షగానే ఉన్నది. పైగా పని స్థలాల్లో లైంగిక వేధింపులు, అక్రమ రవాణా, పోర్న్ సైట్స్ స్త్రీల పాలిట శాపంగా పరిణమించాయి.
ప్రభుత్వాలు స్త్రీలకు ఉచిత బస్సు, ఉచిత గ్యాస్, ఉచిత కరెంటు అంటున్నాయి. కానీ అధిక సుంకాలు, అధర్మ యుద్ధాలు సామాన్యుల నెత్తిమీద పిడుగులాగా పడుతూ అధిక ధరల రూపంలో మరింతగా విరుచుకు పడడం ఖాయం.
అంతర్జాతీయంగా శ్రామిక మహిళల పోరాటాలను 1917లో రష్యాలో జరిగిన సోషలిస్టు విప్లవం, 1949లో చైనా నూతన ప్రజాస్వామిక విప్లవాలు మార్చి 8ని విశ్వవ్యాప్తం చేశాయి. కానీ దీనిని 1975లో ఆలస్యంగా గుర్తించిన ఐక్యరాజ్యసమితి ప్రతి ఏటా ఏదో ఒక పిలుపునిస్తోంది. ఐక్యరాజ్యసమితి 2026 మార్చి 8 కోసం ‘రైట్స్, జస్టిస్, యాక్షన్ ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్’ అంటూ పిలుపునిచ్చింది. ఇలా ఎన్ని పిలుపులిచ్చినా సంపూర్ణ ఆచరణ రూపం ధరించడం లేదు. స్త్రీ శక్తిని గుర్తించి సంక్షేమ పథకాలన్నీ స్త్రీల పేరు మీదనే ఉన్నాయి. అయితే స్థానిక సంస్థల్లో స్త్రీల రిజర్వుడ్ అధికారాలు దాదాపుగా పురుషుల అధికారాలుగానే అమలవుతున్నాయి.
అందుకే స్త్రీలు సమాజ విముక్తిలో పురుషులతో భుజం కలిపి పోరాటడమే కాకుండా, పితృస్వామ్యానికి వ్యతిరేకంగానూ పోరాట జెండా ఎగరేస్తుండాలని మార్చి 8 మనకు గుర్తుచేస్తున్నది. ఈ దఫా యావత్ ప్రపంచాన్ని ప్రత్యేకించి స్త్రీలు–పిల్లల జీవితాలను నిర్దాక్షిణ్యంగా చిదిమేస్తున్న అమెరికా–ఇజ్రాయెల్ దుష్ట కూటమికి, విధ్వంసకర యుద్ధాలకు వ్యతిరేకంగా మహిళలమైన మనం పిడికిళ్ళు బిగిద్దాం.
అరుణోదయ విమలక్క
ప్రజాగాయని
ఇవి కూడా చదవండి..
రాష్ట్రపతి ఈవెంట్‌కు మమత డుమ్మా.. ప్రోటోకాల్ నిబంధనల ఉల్లంఘన
విజయ్ ఇంట్లో ఉండేందుకు అనుమతి కోరుతూ ఆయన భార్య పిటిషన్