Share News

ఇంకుడు గుంతలపై అవగాహన కల్పించాలి

ABN , Publish Date - Sep 11 , 2026 | 12:59 AM

ఎల్‌నినో పరిస్థితిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వరుణ యాగం చేయించటం వల్ల కొద్దిగా ఆలస్యమైనా వర్షాలు కురిశాయి. అయితే గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నగరంలో ఎక్కడా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయని..

ఇంకుడు గుంతలపై అవగాహన కల్పించాలి

ఎల్‌నినో పరిస్థితిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వరుణ యాగం చేయించటం వల్ల కొద్దిగా ఆలస్యమైనా వర్షాలు కురిశాయి. అయితే గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నగరంలో ఎక్కడా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయని కారణంగా వర్షపు నీరు భూమిలోకి వెళ్ళలేదు. దానివల్ల భూమిలో నీటిమట్టం బాగా తగ్గిపోయింది. దాదాపు నగరంలోని 25శాతం బోర్లు ఎండిపోయాయి. ప్రజలకు ఇంకుడు గుంతలపై అవగాహన కల్పించాలి. వివిధ మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం వల్లనే ఇది సాధ్యమవుతుంది. ప్రజలు కూడా దీనిని ఒక బాధ్యతగా తీసుకొని ఇంట్లో లేదా అపార్ట్‌మెంట్‌లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుంటే భూగర్భ నీటిమట్టం పెరుగుతుంది. ప్రజలకు అవగాహన లేనందువల్ల వేల రూపాయలు ఖర్చు పెట్టి బోర్లను ఇంకా లోతుకు తవ్వుతున్నారే కానీ, కొద్దిపాటి ఖర్చుతో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవడం లేదు. ఒక్కరో, ఇద్దరో కాక, నగరంలోని ప్రతి ఇంటిలో ఇలా ఏర్పాటు చేసుకుంటేనే భూగర్భ జలమట్టం పెరుగుతుంది. మరో విషయం... వర్షపు నీటి పైపులను డ్రైనేజీ పైపులైనుకు కలపటం వల్ల, వర్షం పడితే రోడ్ల మీద నీరు పారుతోంది. కనీసం 70శాతం వర్షపు నీటిని భూమిలోకి పంపగలిగితే డ్రైనేజీ వ్యవస్థపై ఒత్తిడి తగ్గి రోడ్లపై ప్రయాణించే వారికి ఇబ్బందులు తప్పుతాయి. వచ్చే వంద రోజుల తర్వాత వానలు వచ్చే అవకాశం ఉండదు. వెంటనే ఇంకుడు గుంతలు తవ్వించే కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యవసర చర్యగా భావించి ప్రతి కాలనీలో, అపార్టుమెంట్లలో వీటిని నిర్మించుకొనేలా చూడాలి. నీరు ప్రకృతి వరం, దానిని భూమిలోకి పంపవలసిన బాధ్యత ప్రజలదేనని తెలియచేయాలి, లేకుంటే రేపు నీటి ఎద్దడి వచ్చినప్పుడు ప్రజల ఆగ్రహం ప్రభుత్వం మీదకు మరలుతుంది.

జమలాపురపు శ్రీనివాస్

ఈ వార్తలు కూడా చదవండి

రూ.1 లక్ష లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన సచివాలయం ఉద్యోగులు

ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్లపై అసెంబ్లీలో చర్చ.. భట్టి విక్రమార్క ఏం చెప్పారంటే..

Updated Date - Sep 11 , 2026 | 12:59 AM