Inkavund Book That Defined Poet Identity : ‘ఇంకావుంది’ అనడం చాలామందికి నచ్చలేదు
ABN , Publish Date - Jan 12 , 2026 | 12:46 AM
‘రక్తస్పర్శ’ కవిత్వ సంపుటిలోని కవులలో నేనొకడిని. కానీ అది మరో ఇద్దరితో జమిలి సంకలనం కనుక నాదైన మొదటి కవితా సంపుటిగా నా లెక్కలోది ‘ఇంకావుంది’ మాత్రమే. 1991 నాటికి....
‘రక్తస్పర్శ’ కవిత్వ సంపుటిలోని కవులలో నేనొకడిని. కానీ అది మరో ఇద్దరితో జమిలి సంకలనం కనుక నాదైన మొదటి కవితా సంపుటిగా నా లెక్కలోది ‘ఇంకావుంది’ మాత్రమే. 1991 నాటికి కవిత్వ పుస్తకాల శీర్షికలు అదిగో అలా ‘రక్త స్పర్శ’లా బరువుగా బొద్దుగా సంస్కృతాన్ని పులుముకుని ఉండేవి. నేను ‘ఇంకావుంది’ అనడం చాలామందికి నచ్చలేదు. నా అత్యంత సన్నిహితులు కూడా ముక్కు విరిచారు. బాగుంది అన్నవాడు ఒక్క త్రిపురనేని శ్రీనివాస్ మాత్రమే. నా ఆ తరవాతి పుస్తకాల శీర్షికలు కూడా అలాగే కొనసాగించాను. ‘ఏదీ కాదు’ అన్నాను. ‘ఎవరికి వర్తిస్తే వారికి’ అన్నాను. కవిత్వం అనకుండా ‘భావ వ్యాకరణం’ అన్నాను. ‘ఇంకా వుంది’ సైజ్ విషయంలో కూడా నేను ఆ తేడా తీసుకొచ్చాను. ఒన్ యైత్ డమ్మీ కాక అడ్డం పెంచి నిలువు తగ్గించి కొంచెం అటూ ఇటుగా చతురస్రంలా వేసాను. ‘‘వద్దు బాబూ పేపర్ అనవసరంగా ఎక్కువ కటింగ్‌లో పోతుంది, అనవసరపు ఖర్చు’’ అని శ్రీశ్రీ విశ్వేశ్వరరావ్‌గారు అభ్యంతరపడ్డా అయితే అయింది అని ముందుకెళ్ళా. ఆ తరువాత త్రిశ్రీ కవిత్వం సిరీస్‌లో దాదాపు నాలుగు సంపుటాలు ఈ సైజ్‌లోనే వేసాడు.
‘రక్తస్పర్శ’ 1985లో. ‘ఇంకావుంది’ 1991 ఫిబ్రవరిలో. ఈ ఆరేళ్లలో చాలా కవితలు పత్రికల్లో అచ్చయినా వాటన్నింటినీ ‘ఇంకా వుంది’ లోకి తీసుకోలేదు. ఎక్కువ కొత్త పద్యాలతో సంపుటిని ఫ్రెష్‌గా ఉంచాలనుకున్నాను. ముఖచిత్రం కాళ్ళ వేసారు. అప్పట్లో ఆయనతో ముఖచిత్రం నాకు ప్రివిలేజ్. పైగా ఆయనే స్వయంగా స్క్రీన్ ప్రింటింగ్ కూడా చేసారు. ఆ బొమ్మ, ఆ అక్షరాలు ఇప్పటికీ నాకు ఆయన జ్ఞాపకాలు.
ఇప్పటిలా వంద, యాభై కాపీల పద్ధతి అప్పుడు లేదు. వెయ్యి ప్రతులు వేసాను. ఇప్పటికీ నాదగ్గర ప్రతులు లేవు. మంచి రివ్యూలు వచ్చాయి. చేరా రాసారు. వేగుంట మోహనప్రసాద్ ‘‘సమకాలీన కవులకంటే రూపం విషయంలో ప్రసేన్ వందేళ్లు ముందున్నాడు’’ అని అనడానికి ‘ఇంకా వుంది’ పునాది. ‘రక్తస్పర్శ’ సంపుటి పట్ల నాకు చాలా అసంతృప్తి. దాని ముద్రను తుడిచేసుకోవాలన్న నా ప్రయత్నం ‘ఇంకా వుంది’తో సఫలమైంది. నాకో ప్రత్యేక ఉనికిని ‘ఇంకావుంది’ ఇచ్చింది. ఇంకావుంది తరహా శీర్షికలు కూడా రావడం మొదలైంది. ఇటీవల విడుదలైన మోహనలాల్ సినిమా మలయాళ పేరు ‘తుడుఱుమ్’కు తెలుగు అర్థం ‘ఇంకావుంది’ అనే. మూడు దశాబ్దాల తరవాత ఇప్పుడొక మంచి సినిమాకు అది టైటిల్ కావడం నాకు సరదాగా ఉంది.
ఇప్పటికీ నా పుస్తకాల ఆవిష్కరణ సభలు పెట్టడానికి నేను వ్యతిరేకం. వేటికీ పెట్టలేదు. కానీ ఆనాడు చాలా మంది నా కవిత్వాన్ని ప్రేమించి విజయవాడ, గుంటూరు, కాకినాడ, రాజమండ్రి, వరంగల్ లలో ఇంకా కొన్ని చోట్ల నాతో సంబంధం లేకుండా ‘ఇంకావుంది’ పరిచయ సభలు పెట్టారు. అప్పట్లో అలా వుండేది మరి. నేను ఇప్పుడు విరివిగా ముందుమాటలు రాస్తున్నాను కానీ నా కవిత్వ పుస్తకాలలో నేను ముందుమాట ఒక్క దానికి కూడా రాయించుకోలేదు.
నిజానికి కవిత్వం తాత్విక ప్రకటనగా ఉండాలి అన్న నా భావజాలం ‘ఇంకావుంది’ రోజుల్లోనే కొద్ది కొద్దిగా బలపడుతోంది. కవిత్వం రొడ్డకొట్టుడు వ్యవహారం కాకూడదని నమ్మి ఆచరణ మెదలు పెట్టిన రోజులవి. అది తీవ్రమై నా రెండో కవితా సంపుటి ‘ఏదీ కాదు’ నాటికి బలపడి, ‘ఎవరికి వర్తిస్తే వారికి’ నాటికి ఒక దారి వెతుక్కుంది. నా వ్యక్తిగత మాగ్నం ఓపస్ ‘ఏదీకాదు’ సంపుటి అని నేను భావించినప్పటికీ నాకు నా ‘ఇంకావుంది’ మీద బోలెడు ప్రేమ. ‘ఏదీ కాదు’లో నన్ను నేను లోకానికి ప్రకటించుకున్నప్పటికీ, నేనేమిటో నాకు తెలియచెప్పిందీ లోకానికి నన్ను ఆవిష్కరించిందీ ‘ఇంకావుంది’ మాత్రమే!
ప్రసేన్
ఇవి కూడా చదవండి:
జట్టు నుంచి తప్పిస్తారనుకోలేదు.. అక్షర్ పటేల్ ఆవేదన
కోహ్లీకి ఆటోగ్రాఫ్ ఇచ్చిన కోహ్లీ.. ఎలాగంటే?