Share News

అవే రోడ్లు.. అవే ప్రమాదాలు!

ABN , Publish Date - Jul 09 , 2026 | 04:11 AM

మన దేశంలో రోడ్లే కల్యాణ మండపాలు, రోడ్లే ఆట స్థలాలు, రోడ్లే పబ్లిక్ పాయిఖానాలు, ఆ దారిలో ఇళ్లున్న వారందరికీ రోడ్లే స్టోర్‌ రూములు, కిళ్లీ కొట్ల నుంచి కిరాణా కొట్ల వరకు రోడ్లే అన్ని వ్యాపారాలకు ఆవాసాలు....

అవే రోడ్లు.. అవే ప్రమాదాలు!

మన దేశంలో రోడ్లే కల్యాణ మండపాలు, రోడ్లే ఆట స్థలాలు, రోడ్లే పబ్లిక్ పాయిఖానాలు, ఆ దారిలో ఇళ్లున్న వారందరికీ రోడ్లే స్టోర్‌ రూములు, కిళ్లీ కొట్ల నుంచి కిరాణా కొట్ల వరకు రోడ్లే అన్ని వ్యాపారాలకు ఆవాసాలు. మరి ఇలాంటి దేశంలో సంవత్సరానికి నాలుగు లక్షల యాభై వేల రోడ్డు ప్రమాదాలు జరగటంలో వింతేమీ లేదు.

మన దేశంలో ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు రోడ్డు ప్రమాదాల విషయంలో సంఖ్య రీత్యా మొదటి, రెండో స్థానాల్లో ఉన్నాయి. అలాగని తెలుగు రాష్ట్రాల పరిస్థితి మెరుగ్గా ఏమీ లేదు. 2014–24 సంవత్సరాల మధ్య పదేళ్లలో తెలంగాణలో 2,49,778 ప్రమాదాలు జరగ్గా 86,305 మంది ప్రాణాలు కోల్పోయి, 2,46,174 మంది గాయపడ్డారు. ఇదే కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన 2,43,015 ప్రమాదాల్లో 85,353 మంది మరణించగా, 2,57,023 మంది గాయపడ్డారు. మన దేశపు నగరాల్లో 2024లో ఢిల్లీ 5,573 ప్రమాదాలతో మొదటి స్థానంలో ఉండగా, 3,785 ప్రమాదాలతో మన హైదరాబాద్ మూడో స్థానంలో ఉంది.

రాజస్థాన్ (ధిపల్లో) హైవే, బీజాపూర్–హైదరాబాద్ హైవేలపై జరిగిన తీవ్ర ప్రమాదాల సందర్భంగా గత సంవత్సరం జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ వినయ్ బిష్ణోయ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సుమోటోగా విచారణ చేపట్టి, భారీగా టోల్‌ ఫీజులు వసూలు చేస్తూ కూడా ఆ హైవేలను సరిగా అభివృద్ధి చేయటం లేదన్న కారణంగా ఆ రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది.

ఇంటి మొత్తానికి ఆధారమైన వ్యక్తి వాహన ప్రమాదంలో మరణిస్తేనో, లేక లేక పుట్టి చేతికి అందివచ్చే సమయంలో కొడుకు చనిపోతేనో ఆ కుటుంబం పడే వేదనా, తలకిందులయ్యే ఆశలూ వర్ణనాతీతం! ఈ ప్రమాదాల్లో గాయాలపాలై సుదీర్ఘకాలం ఆసుపత్రుల్లో ఉండాల్సి వస్తే ఆ పేద మధ్యతరగతి కుటుంబాలు ఆస్తులన్నీ అమ్ముకోవాల్సిందే!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు, పిల్లలు విదేశాల్లో ఉండటం, ఉద్యోగుల జీతాలు అకస్మాత్తుగా ఆరంకెల్లోకి పోవటం, పెన్షన్లు కూడా అదే స్థాయిల్లో వుండటం, వస్తు వ్యామోహం... తదితర కారణాల వల్ల మోటారు వాహనాల సంఖ్య జనాభాతో సమానంగా పెరుగుతున్నది. కానీ మరోపక్క వాహనాల నిర్మాణ, భద్రతా ప్రమాణాలన్నీ అవినీతి గాలిలో కొట్టుకుపోతున్నాయి. వాహనాలు నడిపేవారు మద్యం మత్తులో ఉండటం వల్ల, నిద్రలేమి వల్ల, డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ వాడటం వల్ల, రోడ్డు భద్రతపై ప్రభుత్వాలు తగినంత శ్రద్ధ చూపకపోవటం వల్ల... ఈ ప్రమాదాలు ఒక నిరంతర జాడ్యంగా ఉంటున్నాయి. ఎవరి ఇష్టానికి వారు మామూలు బస్సులను స్లీపర్లుగా మార్చుకుని తిప్పుతున్నా కిమ్మనకుండా చోద్యం చూస్తున్న రవాణాశాఖ కారణంగా ఇటీవల స్లీపరు బస్సు దహనాలు ఎక్కువవ్వటం చూస్తూనే ఉన్నాం. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాల నుంచి పిల్లలు వీకెండ్‌లో వస్తున్నారంటే శుక్రవారం రాత్రి తల్లిదండ్రులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు!


పైన చెప్పినవన్నీ నాణానికి ఒకవైపు విషయాలే. మరోవైపు మరింత విస్తుగొలిపే వాస్తవం ఏమిటంటే చాలా ప్రమాదాల్లో ప్రమాదానికి కారణమైన వాహనాలకు ఇన్సూరెన్స్ లేకపోవటం వల్ల, డ్రైవర్లకు లైసెన్స్‌లు లేకపోవటం వల్ల ఆ ప్రమాద బాధితులు, చనిపోయిన వారి వారసులు నష్టపరిహారాన్ని పొందలేకపోతున్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ రవాణాశాఖ వైఫల్యమే. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోకుండా ఏ మోటారు వాహనమైనా రోడ్డుపైకి రావటం మోటార్ వాహనాల చట్టం ప్రకారం నేరం. కానీ రవాణాశాఖ వారి పర్మిట్‌లతో ఆ వాహనాలు యథేచ్ఛగా నడుస్తున్నాయి. ఈ విషయంపై ఒక సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ నాతో మాట్లాడుతూ ‘‘మా పోలీసులు, మీ లాయర్ల వెహికిల్స్‌తో సహా పల్నాడు జిల్లాలో ఏ టూ వీలర్‌కి, ఏ త్రీ వీలర్‌కి, ఏ ట్రాక్టర్‌కీ ఇన్సూరెన్స్‌లు ఉండవు’’ అన్నాడు. మరో సందర్భంలో ఒక రవాణా శాఖ అధికారిని ఈ విషయంపై ప్రశ్నిస్తే– ‘‘జిల్లాలో డజనుకు పైగా ఉండాల్సిన బ్రేక్ ఇన్‌స్పెక్టర్లు ఇద్దరు ముగ్గురే ఉన్నారు. ఇక వాహనాల్ని ఏం తనిఖీ చేస్తాం సార్!’’ అన్నాడు. చివరకు ఇదంతా ‘‘చేపా చేపా ఎందుకు ఎండలేదు?’’ అన్న కథను గుర్తుకు తెస్తుంది.

కనుక వాహన ప్రమాదాల విషయంలో నివారణ చర్యలు ఎంత ముఖ్యమో, ప్రమాదాల తరువాత బాధితులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం తన బాధ్యత నిర్వహించడమూ అంతే ముఖ్యం. ఇలా జరగకపోతే ఈ అలసత్వానికి కారణమైన ప్రభుత్వ రవాణా శాఖ నష్టపరిహారం చెల్లించేలాగా చట్టాన్నైనా మార్చాలి.

చెరుకూరి సత్యనారాయణ

ఇవీ చదవండి:

ఎన్నికల విజయంపై న్యాయపోరు.. సీఎం విజయ్‌కు కొత్త చిక్కులు

ఢిల్లీ నుంచి సిలిగురికి 6 గంటల్లో.. పట్టాలెక్కిన బుల్లెట్‌ రైల్ ప్లాన్

Updated Date - Jul 09 , 2026 | 04:11 AM