భారతీయ బహుళత్వమే నియంతృత్వం నుంచి రక్ష!
ABN , Publish Date - Aug 02 , 2026 | 07:35 AM
జాతీయ రాజ్యం (Nation–state) ఏర్పాటులోనే నియంతృత్వానికి సంబంధించిన బీజాలు అంతర్గతంగా ఉన్నాయి. అయితే, భారతదేశంలో శతాబ్దాలుగా వర్ధిల్లిన స్థానిక సంప్రదాయక బహుళత్వం ఆ నియంతృత్వాన్ని ఒక పెద్ద వృక్షంగా ఎదగకుండా అడ్డుకుంటూ వచ్చింది.
నేటి హిందూత్వ భావజాలం భారతీయ భక్తిమార్గంలోని లలితమైన బహుళత్వాన్ని, స్వేచ్ఛను తుడిచిపెడుతోంది. పాశ్చాత్య మతాలలోని ‘ప్రభువు’ భావనను అరువు తెచ్చుకుని, ఒక సర్వాధికారిని, ఒక నియంతను ఆరాధించే సంస్కృతిని హిందూ సమాజంలోకి చొప్పిస్తోంది. దేవుడిని సైతం ఒక రాజకీయ పాలకుడిగా, అధికార కేంద్రంగా మార్చే ప్రక్రియ ఇది.దేవానాంప్రియ తన సామ్రాజ్యంలో ఉన్న ఆటవిక తెగలను (గిరిజనులను) అనునయిస్తున్నాడు. అదే సమయంలో తన వద్ద ఉన్న శక్తిని (శిక్షించే అధికారాన్ని) వారికి గుర్తుచేస్తున్నాడు.
– సామ్రాట్ అశోక 13వ రాతిశాసనం
జాతీయ రాజ్యం (Nation–state) ఏర్పాటులోనే నియంతృత్వానికి సంబంధించిన బీజాలు అంతర్గతంగా ఉన్నాయి. అయితే, భారతదేశంలో శతాబ్దాలుగా వర్ధిల్లిన స్థానిక సంప్రదాయక బహుళత్వం ఆ నియంతృత్వాన్ని ఒక పెద్ద వృక్షంగా ఎదగకుండా అడ్డుకుంటూ వచ్చింది. జాతీయవాదం, జాతీయ రాజ్యం అనేవి కాలక్రమేణా కేంద్రీకృత నియంతృత్వానికి దారితీస్తాయని రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి వారు స్వాతంత్ర్య ఉద్యమ కాలంలోనే గుర్తించి హెచ్చరించారు. గాంధీ కూడా ఈ ప్రమాదాన్ని గ్రహించి, బహుళత్వాన్ని జాతీయవాదంతో మిళితం చేయడానికి ప్రయత్నించారు.
భారత రాజ్యాంగం పౌరులకు జీవించే హక్కు, మాట్లాడే హక్కు వంటి ప్రాథమిక హక్కులను హామీ ఇచ్చింది. కానీ, జాతీయ రాజ్యానికి భౌగోళిక సరిహద్దులు ఎంత ముఖ్యమో, పౌరుల హక్కులపై రాజ్యానికి ఉండే నియంత్రణకూ అంతే బలమైన సరిహద్దులు ఏర్పడ్డాయి. ఆ సరిహద్దుల పేరే ‘ప్రివెంటివ్ డిటెన్షన్ లా’ (నిరోధక నిర్బంధ చట్టం). భౌతికశాస్త్రంలో ‘బ్లాక్ హోల్’లో సర్వ భౌతిక సూత్రాలు ఎలాగైతే విఫలమవుతాయో, ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ పరిధిలోకి వచ్చాక పౌరులకు రాజ్యాంగం ఇచ్చిన అన్ని ప్రాథమిక హక్కులు పోతాయి.
సాధారణ చట్టాల ప్రకారం ఒక వ్యక్తిని అరెస్టు చేసినప్పుడు లభించే కనీస రక్షణలు కూడా ఇందులో ఉండవు. రాజ్యాంగంలోని ఈ నిబంధనల నుంచి పుట్టిన సంతానమే నేటి ఉపా (UAPA) వంటి నల్ల చట్టాలు. న్యాయస్థానాలు, ప్రభుత్వాలు చేతులు కలిపి ప్రజల హక్కులను నిరాకరించడం భారత చరిత్రలో కొత్తేమీ కాదు. కానీ, నేడు పౌర సమాజంలో పెరిగిన హిందూత్వ భావజాలం, హిందూ జాతీయవాదం ఇటువంటి ప్రజావ్యతిరేక చట్టాలకు, రాజ్య హింసకు పౌరుల నుంచే ఒక విస్తృతమైన ‘సమ్మతి’ (Consent) లభించేలా చేస్తున్నాయి. అసలైన ప్రమాదం ఇక్కడే పొంచి ఉంది.
అంబేడ్కర్, నెహ్రూలతో సహా ఆధునిక భారత నిర్మాతలంతా కేంద్రీకృత రాజ్యాన్ని గత సమాజంలోని మూర్ఖత్వాలు, సంకుచితత్వాలు, భూస్వామ్య దొరతనం, కులతత్వం నుంచి లభించే విముక్తిగా భావించారు. ఆ విముక్తి కోసమే వారు కేంద్రీకృత రాజ్యాన్ని బలపరచాలని నమ్మారు. ఆ రాజ్యాన్ని నిలపడం కోసం, దేశ సమగ్రత కోసం అవసరమైతే పౌరుల హక్కులను కుదించవచ్చని వారు భావించారు. దాని ఫలితమే రాజ్యాంగంలో నిర్బంధ చట్టాలకు చోటు దక్కడం. దీనివల్ల భారతదేశంలో ప్రభుత్వాలు అనేకసార్లు పేదలు, మైనారిటీల పట్ల వివక్షాపూరితంగా వ్యవహరించాయని మేధావులు, జర్నలిస్టులు నిరంతరం స్పష్టం చేస్తూనే ఉన్నారు. రాజ్యం రహస్యంగా హక్కులను హరించడం ఒక ఎత్తయితే, ఇప్పుడు పౌర సమాజంలోనే ఆ హక్కులు హరించడాన్ని సమర్థించేలా ఒక ఉన్మాద భావజాలం వ్యాప్తి చెందడం పెద్ద విషాదం.
భారతదేశ ఆత్మ నిలబడింది ఇక్కడి వైవిధ్యంలో. మన సాంస్కృతిక, ఆధ్యాత్మిక చరిత్రను పరిశీలిస్తే, భారతీయ భక్తి మార్గం దేవుడిని ఒక సర్వాధికారిగా చూడలేదు. ఇక్కడ దేవుడు స్నేహితుడు (సఖుడు), ప్రియుడు, బిడ్డ, ఆఖరికి వాదనకు దిగే ఒక తోటివాడిగా కనిపిస్తాడు. భగవంతుడితో పౌరుడికి ఉండే సంబంధం స్వేచ్ఛతో కూడుకున్నది. కానీ, పాశ్చాత్య ప్రొటెస్టెంట్ లేదా అబ్రహామిక్ మత భావనలలో ‘ప్రభువు’ (The Lord/ Master) అనే భావన ప్రధానమైనది. అక్కడ దేవుడంటే సర్వశక్తిమంతుడు, ఆజ్ఞలు జారీ చేసేవాడు, భయపడి లొంగిపోవాల్సిన ఒక పాలకుడు (Ruler).
స్వేచ్ఛను భరించలేని ప్రజలు నియంతను ఆశ్రయించే అవకాశం ఉంటుందని ఎరిక్ ఫ్రామ్ అనే తత్వవేత్త చెప్పారు. నేటి హిందూత్వ భావజాలం భారతీయ భక్తి మార్గంలోని ఈ లలితమైన బహుళత్వాన్ని, స్వేచ్ఛను పూర్తిగా తుడిచిపెడుతోంది. ఇది పాశ్చాత్య మతాలలోని ‘ప్రభువు’ భావనను అరువు తెచ్చుకుని, ఒక సర్వాధికారిని, ఒక నియంతను ఆరాధించే సంస్కృతిని హిందూ సమాజంలోకి చొప్పిస్తోంది. దేవుడిని సైతం ఒక రాజకీయ పాలకుడిగా, అధికార కేంద్రంగా మార్చే ప్రక్రియ ఇది. దీనివల్లే స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో ఉన్న ‘అన్ని మతాలు, సంస్కృతుల సమ్మేళనం’ అనే స్పృహ నేడు వెటకారానికి గురవుతోంది. ఒకే చట్టం, ఒకే మతం, ఒకే ధర్మం, ఒకే రాజ్యం అనే ఏకశిలా (Monolithic) మూస ఆలోచనలకు ప్రాధాన్యం పెరుగుతోంది.
రాజ్యం కేంద్రీకృతమయ్యేకొద్దీ పౌరుడి హక్కులు ఎలా నలిగిపోతాయో అర్థం చేసుకోవడానికి మన ప్రాచీన రాజకీయ చారిత్రక పరిణామ క్రమమే ఉదాహరణ. మొదటవెలసిన మౌర్య సామ్రాజ్యం ఒక బలమైన కేంద్రీకృత మహా సామ్రాజ్యం. ఆ కాలానికి చెందిన కౌటిల్యుని ‘అర్థశాస్త్రం’ ప్రకారం... రాజ్యాన్ని నిలపడమే అన్నిటికంటే ప్రధాన లక్ష్యం. అక్కడ ధర్మం కంటే రాజ్యాధికారానిదే పైచేయి. అందుకే, వర్ణ వ్యవస్థలో ఉన్నత స్థానంలో ఉన్న బ్రాహ్మణుడు సైతం రాజద్రోహానికి లేదా రాజధిక్కారానికి పాల్పడితే అతనికి మరణ శిక్ష విధించవచ్చని అర్థశాస్త్రం నిర్దేశించింది. ఇంక సామాన్యుడి పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఈ వ్యవస్థలో పౌరుడి కంటే సామ్రాజ్య రక్షణే పరమావధి కాబట్టి, ఇందులో ఒక రకమైన ‘మత్స్య న్యాయం’ (రాజ్యాధికార బలం) అంతర్లీనంగా చట్టబద్ధమైంది.
కానీ, మౌర్య సామ్రాజ్య పతనం తర్వాతి కాలంలో విస్తరించిన గ్రామీణ సమాజాలు, చిన్న చిన్న రాజ్యాల నేపథ్యంలో రూపుదిద్దుకున్న ధర్మశాస్త్రాలు, మనుస్మృతి వంటి స్మృతి గ్రంథాలు దీనికి భిన్నమైన వైఖరిని ప్రదర్శించాయి. ఈ గ్రంథాలలో వర్ణ/ కుల వివక్షలు, సామాజిక అసమానతలు తీవ్రంగా ఉన్న మాట నిజమే అయినప్పటికీ, ఇవి కేంద్రీకృత రాజ్యాధికార బలాన్ని లేదా ‘మత్స్య న్యాయాన్ని’ పూర్తిగా వ్యతిరేకించాయి. ‘రాజు కంటే ధర్మమే గొప్పది’ అని ఇవి స్పష్టం చేశాయి. ఈ స్మృతి గ్రంథాలు ఆర్థిక నేరాలలో కింది వర్ణాల కంటే, సమాజంలో ఎక్కువ బాధ్యత కలిగి ఉండాల్సిన బ్రాహ్మణుడికి, క్షత్రియుడికే ఎక్కువ శిక్షలను విధించాయి.
చదువు జ్ఞానం ఉన్న శిష్ట వర్గాలనే ఇటువంటి నేరాలలో తీవ్రంగా శిక్షించాలని మనువు భావించాడు. నేటి పరిస్థితి దీనికి పూర్తి విరుద్ధం. అంటే చారిత్రకంగా చూస్తే, కేంద్రీకృత మహా సామ్రాజ్యాల కాలంలోనే (అర్థశాస్త్ర కాలంలో) రాజ్య రక్షణ పేరిట హక్కుల్ని హరించడం తీవ్రంగా ఉండేది. అలాగే ప్రజల హక్కుల గురించి మాట్లాడే నేటి ఆధునిక కేంద్రీకృత రాజ్యంలో మరింత తీవ్రమైన హక్కుల హరణ కనిపిస్తోంది. ఉమ్మడి పౌర స్మృతి పేరుతో గిరిజనుల మైనారిటీల ప్రత్యేక హక్కులను హరించే ప్రమాదం ఉందని, ఒకే ఒక సంస్కృతిని ఎప్పటిలాగే రుద్దే ప్రమాదం ఉందని అందరూ భయపడుతున్నారు. నేటి గ్లోబల్ మెగా నాగరికతల ప్రపంచంలో, జాతీయ రాజ్యం కోసం అమాయకులను బలి చేయడం కూడా అభివృద్ధి పేరుతో, దేశభక్తి పేరుతో ఆమోదం పొందుతోంది. మతం, సంస్కృతి అనే పదాలు దానికి పౌర సమాజంలో సమ్మతిని పెంచుతున్నాయి.
ఈ కేంద్రీకృత రాజ్యానికి, ధనస్వామ్యానికి (Capitalism) నేడు విడదీయరాని బంధం ఏర్పడింది. 17వ శతాబ్దానికి చెందిన నీలకంఠ దీక్షితులు తన ‘కలివిడంబనం’ అనే గ్రంథంలో– ఆధ్యాత్మికత, దేవుడు కూడా వ్యాపారమయం కావడం, ధనస్వామ్యానికి మితిమీరిన ప్రాధాన్యం రావడం పట్ల అప్పట్లోనే భయాన్ని వ్యక్తపరిచారు. అది యూరోపియన్ల వ్యాపార సంస్కృతి మన దేశాన్ని ఆక్రమిస్తున్న తొలినాళ్ల తరుణం. నేడు ఆశిష్ నంది చెప్పినట్లు– భారతదేశం అమెరికాకు ఒక సాంస్కృతిక మురికివాడగా మారుతోంది.
మన జాతీయ రాజ్యం, మన సంస్కృతి అంతకంటే పెద్దదైన పాశ్చాత్య ప్రొటెస్టెంట్ క్రైస్తవ నిర్మాణానికి (అధికార కేంద్రాల ఆరాధనలో, ఏకశిలా రూపంలో) ఒక నకలుగా మారుతున్నాయి. నిర్బంధ చట్టాల ద్వారా జాతీయ రాజ్యం అనే వ్యవస్థ నెరపబోయే నియంతృత్వం గురించి ఆనాడే రాజ్యాంగ పరిషత్తులో మహావీర్ త్యాగి వంటి స్వాతంత్ర్య సమరయోధులు వ్యక్తపరిచిన భయాలు నేడు నిజమవుతున్నాయి. మనుస్మృతి చెప్పే అంతర్గత సామాజిక అసమానతలను అధిగమిస్తూనే, కేంద్రీకృత రాజ్య నియంతృత్వం నుంచి భారతీయ ఆత్మ అయిన బహుళత్వాన్ని కాపాడుకోవడమే నేడు మన ముందున్న ఏకైక మార్గం.
ఇవి కూడా చదవండి
డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు.. గంభీర్‌కు ఇదే అసలు పరీక్ష!
ఆ విగ్రహ ధ్వంసంపై ఆగ్రహం కలగలేదా?