విదేశాంగ నీతిలో తప్పటడుగులు..
ABN , Publish Date - Mar 12 , 2026 | 01:12 AM
‘మేము నిటారుగా నిల్చుంటాం. ఎవరిముందూ తలవంచం. మా మిత్రులందరికీ స్నేహహస్తం అందుబాటులో ఉంటుంది. మా వ్యవహారాల్లో ఎవరి జోక్యాన్ని సహించం’. 1982లో నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ...
‘మేము నిటారుగా నిల్చుంటాం. ఎవరిముందూ తలవంచం. మా మిత్రులందరికీ స్నేహహస్తం అందుబాటులో ఉంటుంది. మా వ్యవహారాల్లో ఎవరి జోక్యాన్ని సహించం’. 1982లో నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య ఇది. భారత్‌ను అమెరికా శిబిరంలో చేరాలని ప్రెసిడెంట్ రీగన్ చేసిన ప్రతిపాదనకు ఇందిర నిష్కర్షగా చెప్పిన సమాధానం అది. ఆమె ఈ మాటల్ని ఎక్కడో అనలేదు. తన అమెరికా పర్యటనలో, సాక్షాత్తు రోనాల్డ్ రీగన్ సమక్షంలోనే అమెరికా, రష్యాల మధ్య సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధంలో– తాము ఎవరి పక్షమూ వహించబోమని, దౌత్యపరంగా తమది తటస్థ వైఖరి అని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు ఇందిర.
దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ మొదలుకొని, అటల్ బిహారీ వాజపేయి వరకు, మధ్యలో దేశ ప్రధానులుగా కాంగ్రెస్ పార్టీ వారున్నా, కాంగ్రెసేతర పార్టీలకు చెందిన వారెవరున్నా.. భారతదేశ విదేశాంగ విధానం సుదృఢంగా అలీన విధానం (నాన్ అలైన్డ్) గానే కొనసాగింది. నిజానికి ఆనాటి భారత్ నేటి మాదిరిగానే ప్రబల ఆర్థికశక్తిగా లేదు. పేదరికం, అవిద్య, నిరుద్యోగం వంటి ఎన్నో సామాజిక, ఆర్థిక రుగ్మతలతో దేశం సతమతమవుతోంది. అయినప్పటికీ అన్న వస్త్రాల కోసమో, అణ్వాయుధాల కోసమో భారత్ ఎవరిముందూ తలవంచలేదు. దేశాన్ని ఎవరు ఏలుతున్నా.. వారు ఏకపక్షంగా తమకు తోచినట్టుగా నిర్ణయాలు తీసుకోలేదు. సొంత పార్టీ నేతలను, దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల నేతలను కలుపుకుని అందరి సలహాలు, సూచనల మేరకు విదేశాంగ విధానాన్ని తీర్చిదిద్దారు. ప్రధానంగా దేశ ప్రయోజనాలు, మరీ ముఖ్యంగా ప్రపంచ మానవాళి శాంతి సౌభాగ్యాలకు దోహదం చేసే విదేశాంగ విధానాన్ని అనుసరించారు. కొన్ని సందర్భాలలో విదేశాంగనీతిలో రాజీపడవలసిన అనివార్యత ఏర్పడినా.. దేశ ప్రయోజనాల్ని ఎవరూ ఎన్నడూ పణంగా పెట్టలేదు. ఫలితంగానే నిన్నమొన్నటి వరకూ.. ‘భారత’ కీర్తి ప్రతిష్ఠల్ని అంతర్జాతీయంగా సమున్నత స్థాయికి తీసుకువెళ్లగలిగారు.
అయితే, ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో నడుస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గత కొన్నేళ్లుగా అనుసరిస్తున్న ఏకపక్ష విదేశాంగ విధానంతో అంతర్జాతీయంగా మన దేశ ప్రతిష్ఠ మసకబారింది. దేశ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. భారతదేశం అనుసరించే విదేశాంగ విధానాన్ని ఒకప్పుడు వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి (స్ట్రాటజిక్ అటానమీ)గా చెప్పుకొనేవారు. దానివల్లనే దక్షిణాసియా దేశాలకు భారత్ ప్రాంతీయ నాయకత్వం వహించే స్థితికి చేరింది. కానీ, నేడు భారత విదేశాంగ విధానంలో స్పష్టత లోపించింది. ప్రత్యర్థి దేశాలకంటే వెనుకబడిపోయింది. అంతర్జాతీయంగా అనేక అవకాశాలు కోల్పోయింది. చివరకు– నేడు భారత్ ఎవరిపక్షం ఎందుకు వహిస్తున్నదో, దానివల్ల సాధిస్తున్న ప్రయోజనాలేమిటో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి.
‘ఎలాంటి స్నేహితులు ఉండాలో ఎంచుకొనే అవకాశం మీకు ఉంది. కానీ పొరుగున ఎవరు ఉండాలో నిర్ణయించడం మీ చేతుల్లో ఉండదు’ అనేవారు అటల్‌బిహారీ వాజపేయి. ఆ కారణంగానే ఒక్క పాకిస్థాన్ మినహా మిగతా పొరుగు దేశాలతో వాణిజ్య, దౌత్య, సాంస్కృతికపరంగా చక్కటి సంబంధాలు నెలకొల్పడానికి ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. భారత్ తనకు మించిన స్థాయిలో నేపాల్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్, శ్రీలంక, మాల్దీవులకు అన్ని రకాలుగా సాయం చేసింది. అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్‌లను దాదాపుగా ఒంటిచేత్తో పునర్నిర్మాణం చేసింది. అఫ్ఘానిస్థాన్ పార్లమెంట్ భవనం నిర్మాణం మొదలుకొని రోడ్లు, బ్రిడ్జిలు, టెలిఫోన్ వ్యవస్థ వరకు అనేక రంగాలలో సాయం చేసింది. 1971–72లో తూర్పు పాకిస్థాన్ విముక్తమై బంగ్లాదేశ్‌గా అవతరించడానికి పాకిస్థాన్‌తో యుద్ధమే చేసిన భారత్.. ఆనాడు బంగ్లాదేశ్ శరణార్థులకు చోటిచ్చింది. వారి ఆకలి దప్పులు తీర్చడానికి దేశ ప్రజలపై అదనపు పన్నులు వేసింది. శ్రీలంకలో వేర్పాటువాదాన్ని అణచడానికి భారత్ తన సైన్యాన్నే (ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్– ఐపీకేఎఫ్) పంపింది. పొరుగు దేశాలైన మయన్మార్, మాల్దీవులకు సైతం సాయపడింది. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా.. ఇదొక నిరంతర ప్రక్రియలా కొనసాగింది.
నేడు ‘నైబర్ హుడ్ ఫస్ట్’ కాస్తా.. ‘నైబర్ హుడ్ ఫర్‌గెట్’గా మారింది. భారత్‌ను ద్వేషించే దేశాలలో పాకిస్థాన్ సరసన బంగ్లాదేశ్ చేరిపోయింది. బంగ్లాదేశ్ పూర్తిగా చైనా చెప్పుచేతల్లోకి వెళ్లిపోయింది. హసీనా ప్రభుత్వ పతనం అనంతరం బంగ్లాదేశ్‌లో చైనా భారీగా పెట్టుబడులు పెట్టింది. మోంగ్లా ఓడరేవును, తీస్థా నదీ ముఖద్వారాన్ని చైనా అభివృద్ధి చేస్తోంది. నేపాల్, శ్రీలంక, మాల్దీవులతో సైతం భారత్ సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఏదో సామెత చెప్పినట్లు.. సొమ్మూ పోయి, శని పట్టడానికి కారణం– మన దౌత్యనీతిలో వచ్చిన మార్పే! పొరుగు దేశాలతో పరస్పర సహకారం, గౌరవం ఇచ్చిపుచ్చుకుంటూ స్వప్రయోజనాలను కాపాడుకోవలసిన దౌత్య విధానంలో రాజకీయాలు జొరబడడం వల్ల.. సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. బంగ్లాదేశ్‌లో అవామీలీగ్ నేత షేక్ హసీనాతో అనుబంధం పెంచుకోవడం వల్ల అమెను వ్యతిరేకించే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైనాకు దగ్గరయింది. అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ అధినేత తారిక్ రెహ్మాన్ చైనాకు తమ దేశపు తలుపులు బార్లా తెరిచాడు. అమెరికా విషయంలో కూడా ప్రధాని నరేంద్రమోదీ ఈ విధంగానే వ్యవహరించారు. ట్రంప్‌ను గెలిపించాలని ఆ దేశం వెళ్లి ఇండియన్ డయాస్పోరాకు పిలుపునిచ్చారు. పోనీ ట్రంప్ ఆ మేరకు నరేంద్రమోదీ పట్ల, భారత్ పట్ల కృతజ్ఞత చూపించాడా అంటే అదీలేదు. భారత్‌పై ఏకపక్షంగా టారిఫ్‌లు భారీగా విధించాడు. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలుపై ఆంక్షలు విధించాడు. ఇరాన్ నుంచి కూడా చమురు దిగుమతి చేసుకోరాదని అంతకుముందే హెచ్చరించాడు. పైగా, అమెరికా ఆంక్షలకు తలొగ్గిన ఫలితంగా.. భారత మార్కెట్లను అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు ముంచెత్తబోతున్నాయి. దాంతో, భారత రైతాంగం పరిస్థితి ప్రశ్నార్థకం కావడం ఖాయం.
ఇటీవల విశాఖలో జరిగిన నేవీ ఫీట్‌లో పాల్గొని స్వదేశానికి బయలుదేరిన ఇరాన్ ఓడను హిందూ మహాసముద్రంలో అమెరికా అత్యంత అమానుషంగా ముంచేసిన ఘటనపై భారత్ నోరు మెదపలేదు. తమ అతిథిని ఆ విధంగా చేయడమేమిటని అమెరికాను ప్రశ్నించలేదు. హిందూ మహాసముద్రంలో దొంగచాటుగా అమెరికా తన జలాంతర్గాములను మోహరిస్తే దానిని తప్పని ఖండించలేదు. ఇక, ఇరాన్ అధినేత ఖొమేనీ హత్య జరిగిన ఆరు రోజుల అనంతరం భారత్ దౌత్యాధికారి ఒకరు ఢిల్లీలోని ఇరాన్ కాన్సులేట్‌కు వెళ్లి మొక్కుబడి సంతాపం తెలిపి వచ్చారు. ఈ దాడి ఘటనపై మన దేశాధినేత నోరు మెదపకపోవడం ఆశ్చర్యం. ఇరాన్ వద్ద అణ్వస్త్రాలు ఉండి ఉంటే.. ఈ పాటికే వాటిని ప్రయోగించి ఉండేది. ఆయా దేశాలను నాశనం చేయడానికి అమెరికా బూచీగా చూపించే అంశం– అణ్వాయుధాలు కలిగి ఉండడం. దీనిని కూడా ఇండియా ప్రశ్నించలేకపోయింది. అన్నిటికంటే ముఖ్యంగా.. ఇరాన్‌తో యుద్ధానికి సిద్ధపడిన ఇజ్రాయెల్ దేశంలో, మన ప్రధాని నరేంద్రమోదీ పర్యటించడమే ఆశ్చర్యం. ఇజ్రాయెల్‌ను పర్యటించిన ఏకైక భారత ప్రధాని ఇప్పటివరకు ఒక్క మోదీయే. ఈ పర్యటనలో ప్రధాని మోదీ.. హమాస్‌తో ఇజ్రాయెల్ జరిపిన యుద్ధంలో చనిపోయిన 1,219 ఇజ్రాయెలీలకు సంతాపం వ్యక్తం చేశారేతప్ప, ఇప్పటివరకు అసువులు బాసిన 70 వేల మంది పాలస్థీనీయుల పట్ల చుక్క కన్నీరు కూడా కార్చలేకపోయారు.
మోదీ ప్రభుత్వం అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠ గురించి మాట్లాడటం లేదు. ముఖ్యంగా– నెల రోజులపాటు రష్యా నుంచి చమురు కొనుగోలు చేసుకోవడానికి భారత్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుమతి ఇవ్వడం గురించి అధికార పార్టీకి చెందినవారెవరూ నోరు మెదపకపోవడం సిగ్గుచేటు. ప్రస్తుతం ఇరాన్‌పై సాగుతున్న అమెరికా, ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో నరేంద్రమోదీ అనుసరిస్తున్న మౌనం దేనికి సంకేతం?! విదేశీ విధానంలో కేంద్ర ప్రభుత్వం వేస్తున్న తప్పటడుగులు, తప్పుడు అడుగులకు దేశం చెల్లించే మూల్యం ఏ మేరకు ఉంటుందో ఊహించడం కష్టం.
సి.రామచంద్రయ్య
ఏపీ శాసనమండలి సభ్యులు
ఇవి కూడా చదవండి:
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే అభిషేక్ శర్మ.. సత్తా చాటిన ఇషాన్ కిషన్
టీమిండియా కష్టాన్ని తక్కువ చేయొద్దు.. కీర్తి ఆజాద్‌పై వ్యాఖ్యలపై గంభీర్ కౌంటర్