Share News

జన జీవితాలలో కన్పించని జీడీపీ వృద్ధి

ABN , Publish Date - Sep 12 , 2026 | 05:46 AM

జనులు జీడీపీ అంకెలను భుజిస్తారా? అని ఒక విజ్ఞుడు ప్రశ్నించాడు. ఆ ప్రశ్న ఒక వ్యంగ్య ఛలోక్తి. నిజమే. ప్రజలు ఆహారాన్ని తింటారు, వస్త్రాలను ధరిస్తారు, పాదరక్షలు వేసుకుంటారు, తమ పిల్లలను బడికి...

జన జీవితాలలో కన్పించని జీడీపీ వృద్ధి

జనులు జీడీపీ అంకెలను భుజిస్తారా? అని ఒక విజ్ఞుడు ప్రశ్నించాడు. ఆ ప్రశ్న ఒక వ్యంగ్య ఛలోక్తి. నిజమే. ప్రజలు ఆహారాన్ని తింటారు, వస్త్రాలను ధరిస్తారు, పాదరక్షలు వేసుకుంటారు, తమ పిల్లలను బడికి పంపుతారు, వ్యాధుల నుంచి విముక్తికి ఔషధాలు కొనుక్కుంటారు, మొబైల్‌ ఫోన్స్‌ ఉపయోగిస్తారు. వీటితో పాటు టెలివిజన్‌ కార్యక్రమాలను వీక్షిస్తారు, సామాజిక మాధ్యమాల్లో పోస్టులను చదవడంలో నిమగ్నమవుతారు, భద్రమైన జీవనం, సంతోషదాయక జీవితాన్ని కోరుకుంటారు– ఇవన్నీ వ్యక్తుల వినియోగాలు. ఈ మొత్తం వినియోగాల విలువ ఎంత? ప్రభుత్వం విధించే, ఇచ్చే రాయితీలను పరిగణనలోకి తీసుకున్న తరువాత వినియోగం (కన్సంప్షన్‌), మదుపు (ఇన్వెస్ట్‌మెంట్‌), ప్రభుత్వ వ్యయం (గవర్నమెంట్‌ స్పెండింగ్‌), నికర ఎగుమతులు (ఎక్స్‌–ఎమ్‌) మొత్తమే స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ). ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యాన్ని కొలవడానికి జీడీపీ వృద్ధిరేటు చాలా ముఖ్యం.

2026–27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి (ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు) జీడీపీ అంకెలను గణాంకాల, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ ఇటీవల విడుదల చేసింది. 2025–26 ఆర్థిక సంవత్సర మొదటిత్రైమాసికంతో పోలిస్తే జీడీపీ వృద్ధిరేటు నామమాత్ర (ప్రస్తుత) ధరల ప్రకారం 10.3 శాతంగాను, స్థిర ధరల ప్రకారం 7.8 శాతంగాను నమోదయింది. ఈ గణాంకాల పట్ల ప్రభుత్వ ఆర్థికవేత్తలు ఎనలేని సంతృప్తి, ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. సంశయగ్రస్తులూ తక్కువేవీ కాదు. వీరు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. జీడీపీ గణాంకాల విశ్వసనీయతపై ప్రస్తుతం ఒక తీవ్ర చర్చ నడుస్తోంది. ఫెడరల్‌ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ‘ఒక దేశం, ఒకే ఎన్నిక’ ప్రతిపాదనపై కంటే జీడీపీ అంకెలు, వాటి పెరుగుదల ప్రయోజనాలు ప్రజల జీవితాల్లో ప్రతిబింబిస్తున్నాయా అన్న విషయమై చర్చించడం మంచిది.

గణాంకాల, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ వెల్లడించిన జీడీపీ అంకెలు సరైనవని భావిద్దాం. రెండు భిన్న ఆధార సంవత్సరాల (బేస్‌ ఇయర్స్‌) ప్రాతిపదికన నామమాత్ర జీడీపీ, వాస్తవ జీడీపీ సంయుక్త వార్షిక వృద్ధిరేటు (కాంపౌండెడ్‌ యాన్యువల్‌ గ్రోత్‌ రేట్‌– సీఏజీఆర్‌) ఇలా ఉంది: సంవత్సరం ఎదుట బ్రాకెట్‌లోని మొదటి సంఖ్య ప్రస్తుత ధరల ప్రకారం నామమాత్ర జీడీపీని, రెండో సంఖ్య స్థిర ధరల ప్రకారం వాస్తవ జీడీపీని లక్షల కోట్ల రూపాయల్లో సూచిస్తుంది: ఆర్థిక సంవత్సరం 2022–23: (268.90, 161.65); 2023–24: (301.23, 176.51); 2024–25: (330.68, 187.97); 2025–26: (357.14, 201.90).


సీఏజీఆర్‌: నామమాత్ర జీడీపీకి 9.92శాతం; వాస్తవ జీడీపీకి 7.69శాతం.

ఆధార సంవత్సరం 2022–23 ప్రాతిపదికన జీడీపీ అంకెలు ఇలా ఉన్నాయి: ఆర్థిక సంవత్సరం 2022–23: (261.77, 261.77); 2023–24: (290.73, 280.94); 2024–25: (317.99, 301.15); 2025–26: (345.37, 324.70).

సీఏజీఆర్‌: నామమాత్ర జీడీపీకి 9.68శాతం; వాస్తవ జీడీపీకి 7.45శాతం.

కొత్త ఆధార సంవత్సరం ప్రాతిపదికన 2026–27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో నామమాత్ర జీడీపీ 88.26 లక్షల కోట్లు కాగా వాస్తవ జీడీపీ 81.36 లక్షల కోట్లు.

2025–26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సర మొదటి త్రైమాసికంలో పెరుగుదల నామమాత్ర జీడీపీ 10.33శాతం, వాస్తవ జీడీపీ 7.82శాతం.

పరిగణనలోకి తీసుకున్న నాలుగు ఆర్థిక సంవత్సరాలకు గాను సీఏజీఆర్‌ పాత, కొత్త ఆధార సంవత్సరాల ప్రాతిపదికన ఇంచుమించు ఒకే విధంగా ఉండడం గమనార్హం. 2026–27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో వృద్ధిరేటు స్వల్పస్థాయిలో మాత్రమే అధికంగా ఉన్నది. దీన్నిబట్టి దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతుల గురించి మనం ఎటువంటి అభిప్రాయానికి రావచ్చు? ఇదీ నా అభిప్రాయం: 2026–27లో భారత ఆర్థిక వ్యవస్థ దశ దిశ మారలేదు. దాని పురోగమనం వేగం పుంజుకోలేదు. మరి ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడానికి నిజంగా ఏమైనా ఉందా? ఏమీలేదు.

పాత ఆధార సంవత్సరం ధరల ప్రాతిపదికన అంచనాలలో స్థిర ధరల్లో జీడీపీ, నామమాత్ర ధరల్లో జీడీపీతో పోలిస్తే చాలా నిరుత్సాహకరంగా ఉన్నది. అయితే కొత్త ఆధారసంవత్సరం ధరల ప్రాతిపదికన అంచనాలలో అలా లేదు. ఎందుకని? ఆ వ్యత్యాసం చాలా చికాకుపరచడం లేదూ? అదలా ఉంచితే అంకెల్లో ఘనంగా ఉన్న జీడీపీ వృద్ధిరేటు సామాన్య ప్రజల జీవితాల్లో అంతే ఉజ్వలంగా ప్రతిబింబిస్తున్నదా? ఉద్యోగాల సృష్టి, వేతనాల పెరుగుదల, వినియోగం పరిమాణం, వ్యాపార వాణిజ్యాలు, పెట్టుబడులు మొదలైన విషయాలలో ఆ వృద్ధి ఎలా కనిపిస్తోంది? కొన్ని ప్రాసంగిక ప్రశ్నలు:

15 నుంచి 29 సంవత్సరాల వయసు యువజనులలో నిరుద్యోగిత రేటు అధిక స్థాయిలో 16.2శాతం మేరకు ఎందుకు ఉన్నది? 29 నుంచి 34 సంవత్సరాల వయసులో ఉన్న పట్టభద్రులలో నిరుద్యోగిత రేటు తరచూ 40 నుంచి 45శాతం దాకా ఉంటోంది. కారణమేమిటి? నీతి ఆయోగ్‌ నివేదిక ప్రకారం– 15 నుంచి 29 సంవత్సరాల వయసులో ఉన్న 8.7 కోట్ల మంది యువజనులు అటు ఉద్యోగంలో గానీ, ఇటు విద్యాభ్యాసం, వృత్తిపరమైన శిక్షణలో గానీ లేరు. ఎందుకని?; వాస్తవ వేతనాల పెరుగుదల చాలా నిరుత్సాహకరంగా ఉన్నది. రోజువారీ కూలీలు, వేతన ఉద్యోగులు, స్వయం ఉపాధి కార్మికులకు ఆ వాస్తవ వేతనాల పెరుగుదల వరుసగా (–) 5.5, 1.7, 3.3 శాతంగా మాత్రమే ఉంది. దేశ కార్మికశక్తిలో రోజువారీ కూలీలు 20శాతంగా ఉన్నారు. వాస్తవ వేతనాల పెరుగుదల అంత ప్రతికూలంగా ఉన్నప్పుడు కాయకష్టంపై బతుకుతున్న కోట్లాది శ్రామికుల జీవితాలలో పండుగలు ఎలా పరిమళిస్తాయి?


నికర ఎఫ్‌డీఐ (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) చాలా తక్కువగా ఎందుకు ఉన్నాయి? ఎఫ్‌సీఎన్‌ఆర్‌ (ఫారిన్‌ కరెన్సీ నాన్‌ రెసిడెంట్‌– ప్రవాస భారతీయుల కోసం భారతదేశంలోని బ్యాంకుల్లో విదేశీ కరెన్సీలోనే డబ్బు దాచుకునే సౌలభ్యమున్న ఒక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఖాతా. ఈ డిపాజిట్లపై 6 నుంచి 7శాతం వడ్డీ ఇస్తారు) నిధులు పెద్ద ఎత్తున సమకూరుతుండగా విదేశీ పెట్టుబడులు ప్రత్యక్ష మదుపులుగా ఎందుకు రావడం లేదు?; మన విదేశీ మారకద్రవ్య నిల్వలు ఎన్నడూ లేని రీతిలో అత్యధికం (740 బిలియన్‌ డాలర్లు)గా ఉన్నాయి. అయినా రూపాయి విలువ ఎందుకు పెరగడం లేదు? ఈ ఏడాది జనవరి నుంచి డాలర్‌–రూపాయి మారకం రేటు దాదాపు 5శాతం మేరకు తగ్గిపోయింది. ఆసియా దేశాల కరెన్సీలలో కెల్లా రూపాయి విలువే చాలా అధమంగా ఉన్నది. ఎందుకని?

ఎగుమతులు పెరుగుతున్నాయి. దిగుమతులూ పెరుగుతున్నాయి. ప్రస్తుత ధరల వద్ద దిగుమతులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. మన విదేశీ వాణిజ్యలోటు ఈ ఏడాది ఏప్రిల్‌–ఆగస్టులో 150 బిలియన్‌ డాలర్ల మేరకు ఉన్నది. చైనాతో వాణిజ్య లోటు ఈ ఏడాది ఏప్రిల్‌–జూలైలో 44 బిలియన్‌ డాలర్లుగా ఉన్నది. ఈ వాణిజ్యలోటు దేశ ఆర్థిక వ్యవస్థకు పెనుభారంగా లేదూ? మేకిన్‌ ఇండియా, పీఎల్‌ఐ, ఎన్‌ఎమ్‌సీపీ మొదలైన పథకాలు మన తయారీరంగాన్ని ఎందుకు మెరుగుపరచడం లేదు? చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులను దేశంలోనే ఉత్పత్తి చేసుకునే సామర్థ్యాన్ని ఎందుకు సమకూర్చడం లేదు?

తయారీరంగం నామినల్ జీవీఏ (నామమాత్ర స్థూల విలువ జోడింపు– ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేయకుండా ప్రస్తుత మార్కెట్‌ ధరల వద్ద ఒక ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి అయిన వస్తు సేవల మొత్తం విలువను లెక్కగట్టే కొలమానం) 13శాతం వద్దే ఎందుకు స్తంభించిపోయింది? ప్రభుత్వ పథకాలు ఈ పరిస్థితిని ఎందుకు చక్కదిద్దలేకపోతున్నాయి?

గ్రాస్‌ ఫిక్స్‌డ్‌ క్యాపిటల్‌ ఫార్మేషన్‌ (జీఎఫ్‌సీఎఫ్‌–స్థూల స్థిర మూలధన నిర్మాణం– ఒక ఆర్థిక వ్యవస్థలో వ్యాపార సంస్థలు, ప్రభుత్వాలు సంపాదించిన, నిర్మించిన స్థిర ఆస్తుల నికర విలువను కొలుస్తుంది) జీడీపీలో 33.5శాతంగా మాత్రమే ఎందుకు ఉండిపోతోంది? ఈ జీఎఫ్‌సీఎఫ్‌లో ప్రైవేట్‌ కార్పొరేట్‌ మూలధన వ్యయం ఎంతకూ 12శాతంగా మాత్రమే ఉంటోంది. కార్పొరేట్‌ మదుపుదారులు మూలధన పెట్టుబడులు ఎందుకు పెట్టడం లేదు?; పెరిగిన జీడీపీ వృద్ధిరేటు మెరుగైన పాఠశాలలు, ఆస్పత్రులు, రహదారులు, మంచినీటి సరఫరా, పోలీసు సేవలకు ఎందుకు దోహదం చేయడం లేదు? ఈ సదుపాయాల విషయంలో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారనేది ఒక కఠోర వాస్తవం కాదూ?


ఎటుచూసినా నిరుత్సాహకర పరిస్థితులే. మరి జెన్‌జీ యువజనులు నిరసనలు తెలుపడంలో ఆశ్చర్యమేముంది? మంచి భవిష్యత్తు సమకూరగలదనే ఆశాభావాన్ని వారిలో దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు ఎంతమాత్రమూ పాదుకొల్పడం లేదు. గణాంకాల ప్రకారం మన ఆర్థిక వ్యవస్థ 7.8శాతం వృద్ధిరేటుతో పురోగమిస్తుండవచ్చు, కానీ అత్యధిక ప్రజలు ఆ విషయాన్ని అనుభవపూర్వకంగా నమ్మడం లేదు. పాలకులు ఏమి చెబుతున్నప్పటికీ తమ జీవన ప్రమాణాలు గతంలో కంటే మెరుగ్గా లేవన్న నిజం మాత్రమే వారికి తెలుసు.

పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

ఈ వార్తలు కూడా చదవండి

ఆర్‌డబ్ల్యూఎస్‌ కాంట్రాక్టర్లకు గుడ్ న్యూస్.. రూ.620 కోట్లు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం..

2027 నాటికి వందశాతం అక్షరాస్యతే లక్ష్యం.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

Updated Date - Sep 12 , 2026 | 05:46 AM