ఎవరి కోసం ఈ బ్యాంకింగ్ సంస్కరణలు?
ABN , Publish Date - Sep 11 , 2026 | 01:27 AM
మన దేశ ప్రభుత్వరంగ బ్యాంకింగ్ వ్యవస్థలో పెనుమార్పులు జరగబోతున్న సంకేతాలు, ప్రకటనలు అనేకం చూస్తున్నాం. ప్రభుత్వ బ్యాంకుల సేవల మీద ఆధారపడ్డ విస్తృత ప్రజానీకం, మధ్యతరగతి....
మన దేశ ప్రభుత్వరంగ బ్యాంకింగ్ వ్యవస్థలో పెనుమార్పులు జరగబోతున్న సంకేతాలు, ప్రకటనలు అనేకం చూస్తున్నాం. ప్రభుత్వ బ్యాంకుల సేవల మీద ఆధారపడ్డ విస్తృత ప్రజానీకం, మధ్యతరగతి మేధావివర్గం, ప్రజాస్వామ్యవాదులు, చిన్న–మధ్యతరహా పరిశ్రమల అధిపతులు మారుతున్న పరిస్థితులను అర్థం చేసుకోవాలి, స్పందించాలి. ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఉన్న పొదుపు ప్రజలది. బ్యాంకుల మూలధనం (కాపిటల్) ప్రజలు కట్టిన పన్నుల ఆదాయం నుంచి సమకూర్చినది. లక్షల కోట్ల రూపాయల లాభాలు ఉద్యోగుల శ్రమశక్తితో సంపాదించినవి. భారత ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటిస్తున్న ‘వికసిత్ భారత్–2047’ సాధనలో బ్యాంకుల పాత్ర ఎలా ఉండాలో అధ్యయనం చేయడం కోసం ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2026–27 బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. తదనుగుణంగా, ఆగస్టు 17, 18 తేదీల్లో ఆర్థికమంత్రిత్వ శాఖ నిర్వహించిన ప్రభుత్వరంగ బ్యాంకుల శిఖరాగ్ర సమావేశం ఆ ఉన్నతస్థాయి కమిటీకి నివేదించాల్సిన ప్రతిపాదనల మీద చర్చించింది. దీనికితోడు ప్రధానమంత్రి తన స్వాతంత్ర్యదినోత్సవ ప్రసంగంలో ప్రపంచస్థాయి ఐదు పెద్ద బ్యాంకులలో కనీసం ఒక భారతీయ బ్యాంకు ఉండాలనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఇవన్నీ బ్యాంకింగ్ రంగంలో పెనుమార్పులకు సంకేతం. అద్భుతమైన ఈ నినాదాల వెనుక దాగి ఉన్న నిజాలేమిటి?
ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఉన్న పొదుపు (డిపాజిట్లు)లో 60శాతం పైగా సొమ్ము సామాన్యులు, ఉద్యోగులు తమ భవిష్యత్తు కోసం, పిల్లల చదువులు, పెళ్లిళ్లకోసం దాచుకున్నదే. ఈ కష్టార్జితాన్ని సేవింగ్స్ ఖాతాలో పెట్టుకుంటే బ్యాంకులు చెల్లించే వడ్డీ 2.5 శాతం నుంచి 2.7శాతం. అదే ఫిక్స్‌డ్ డిపాజిట్ అయితే 6.5శాతం. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ సంవత్సరం ద్రవ్యోల్బణం 6శాతానికి చేరువలో ఉంది. అంటే ప్రతి ఏటా సామాన్యుడు దాచుకున్న పొదుపు విలువ తగ్గుతోంది తప్ప, రూపాయి విలువకు రక్షణ లేదు.
బ్యాంకు రుణాల విషయంలో కూడా ప్రజలు ఆర్థికదోపిడీకి గురవుతున్నారు. సంస్కరణల పేరుతో బ్యాంక్ విధానాలలో వచ్చిన మార్పులే దీనికి కారణం. బ్యాంకులు మొత్తం ఇచ్చే రుణాలలో 40శాతం ప్రాధాన్యతా రంగాలైన వ్యవసాయం, చేతి వృత్తులు, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ఇవ్వాలి. ఈ రుణాలు ఇవ్వని బ్యాంకుల మీద ఒకప్పుడు పెనాల్టీలు వేసేది రిజర్వ్ బ్యాంక్. కానీ బ్యాంకింగ్ సంస్కరణల అమలుతో మైక్రోఫైనాన్స్ కంపెనీలకు, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు (ఎన్‌బీఎఫ్‌సీ) ఇచ్చిన రుణాలనే ప్రాధాన్యతా రంగాలకు ఇచ్చినట్టుగా పరిగణించడం మొదలయ్యింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు రైతులు, సామాన్యులకు ఇవ్వవలసిన రూ.14 లక్షల కోట్ల సొమ్మును ఎన్‌బీఎఫ్‌సీలకు ఇచ్చాయి. ఇదే సొమ్మును మైక్రోఫైనాన్స్ కంపెనీలు, ఎన్‌బీఎఫ్‌సీలు సామాన్య ప్రజలకు అప్పుగా ఇచ్చి, 20–30శాతం వడ్డీ వసూలు చేస్తూ వేల కోట్ల రూపాయల లాభాలు సంపాదిస్తున్నాయి. ఆ రుణభారం, అప్పుల ఊబి నుంచి బయటపడలేక అనేక కుటుంబాలు బలవన్మరణానికి పాల్పడుతున్న వార్తలు నిత్యం చూస్తూనే ఉన్నాం. బ్యాంకులే నేరుగా అప్పులివ్వొచ్చుగా... మధ్యలో ఈ మధ్యవర్తులెందుకు? వైపరీత్యం ఏమిటంటే బ్యాంకులలో తన పొదుపు సొమ్ము దాచుకునే సామాన్యుడు ఒకవైపు దోపిడీకి గురవుతున్న రుణదాత. రెండోవైపు ఎన్‌బీఎఫ్‌సీల వద్ద అధిక వడ్డీ దోపిడీకి గురయ్యే రుణగ్రహీత. ఈ దోపిడీలను కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఎందుకు అనుమతిస్తున్నాయి? దీనికితోడు, గత ఐదేళ్ల కాలంలో ఖాతాలో మినిమం బ్యాలెన్స్ లేదనో, తగిన బ్యాలెన్స్ లేకుండా చెక్కులు ఇచ్చారనో, ఇంకా అనేక కారణాలతో పెనాల్టీల రూపంలో ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకులు ఖాతాదారుల నుంచి రూ.28,495 కోట్లు వసూలు చేశాయి.
పార్లమెంటు చట్టాల ద్వారా ఏర్పడిన ప్రభుత్వ రంగ సంస్థలు లేబర్ చట్టాలను అమలుచేస్తూ ‘మోడల్ ఎంప్లాయర్’గా ఉండాలి, పర్మినెంట్ ఉద్యోగులను నియమించాలి. ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలు సక్రమంగా అందించడానికి, పెరుగుతున్న వ్యాపారానికి తగినట్టుగా ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. కానీ ప్రభుత్వరంగ బ్యాంకులలో పర్మినెంట్ ఉద్యోగులకంటే ఎన్నోరెట్లు అధికంగా క్యాజువల్, టెంపరరీ, అప్రెంటిస్, కాంట్రాక్టు, ఫిక్స్‌డ్ టర్మ్, బిజినెస్ కరస్పాండెంట్లు తదితర అనేక రూపాలలో పర్మినెంట్ ఉద్యోగులు చెయ్యాల్సిన పనులే చేస్తున్నారు. వీరికి సరైన జీతాలు, ఇతరత్రా సౌకర్యాలు లేవు. బ్యాంకుల్లో కనీసం లక్షా నలభైవేల పర్మినెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొండి బాకీలను సమర్థవంతంగా వసూలు చెయ్యబోతున్నట్టు ప్రకటించింది. ఆ పేరుతో ‘ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ చట్టం–2016’ చేసింది. ప్రత్యేకంగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్స్, ఎన్‌సీఎల్‌టీలు సైతం ఏర్పాటు చేశానని చెప్పింది. కానీ, అప్పటివరకూ లేని విధంగా బ్యాంకులు పెద్ద ఎత్తున మొండి బాకీలు రద్దు చేసుకుంటున్నాయి. రిలయన్స్ కమ్యూనికేషన్స్, వీడియోకాన్ ఇండస్ట్రీస్, జీ నెట్వర్క్ లాంటి ఏడు కంపెనీలు అవి చెల్లించాల్సిన సొమ్ములో 97శాతం రద్దయి, 3శాతమే వసూలయ్యింది. ఈ ప్రభుత్వకాలంలో రూ.18 లక్షల కోట్లను మొండి బకాయిలుగా పరిగణించాయి. లక్షలాదిమంది బ్యాంకు ఉద్యోగుల శ్రమతో సంపాదించిన లాభాలు, ప్రజలపై పన్నుల ద్వారా సంపాదించిన పెట్టుబడి ఇలా బాకీల రూపంలో కార్పొరేట్ కంపెనీలకు చేరింది. ప్రభుత్వం చేసిన చట్టాలు బాకీలను వసూలు చెయ్యడం కాక, కార్పొరేట్ రుణాల రద్దును చట్టబద్ధం చేశాయి. ఇదే సొమ్ము సామాన్య ప్రజలకు, వ్యవసాయరంగానికి, ఎంఎస్ఎంఈలకు రుణాలుగా ఇచ్చి ఉంటే దేశ ఆర్థికవ్యవస్థ ఎంతో వృద్ధిచెందేది. ఎంప్లాయిమెంట్ పెరిగేది. కార్పొరేట్ శక్తులు, బ్యూరోక్రసీ, రాజకీయ శక్తుల అపవిత్ర కూటమి (నెక్సస్) వలనే ఇంత ప్రజాధనం దోపిడీకి వీలుకలిగిందనేది వాస్తవం కాదా? ఇది కాకులను కొట్టి గద్దలకు వెయ్యటం కాక మరేమిటి?
ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలలో అనుభవం ఉన్నవారిని ప్రభుత్వ రంగ బ్యాంకుల మేనేజింగ్ డైరెక్టర్లు, చైర్మన్లు తదితర ఉన్నతాధికారులుగా నియమించాలని, బ్యాంకుల మూలధనంలో విదేశీ పెట్టుబడిని 49శాతానికి పెంచాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. విదేశీ పెట్టుబడి లాభాల కోసమే వస్తుంది, లాభాలు లేకపోతే వాపసు వెళ్తుంది. అప్పుడు బ్యాంకులు ఆర్థిక ఒడుదుడుకులకు లోనవుతాయి, ప్రజల పొదుపు ప్రమాదంలో పడుతుంది.
అందుకే, ఈ పరిస్థితులను అధ్యయనం చేసి వాస్తవాలను సామాన్య ప్రజానీకానికి, ప్రజాస్వామ్య శక్తులకు, రైతు, కార్మిక సంఘాలకు, దేశ యువతకు తెలియజేయాలని బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక –యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్– నిర్ణయించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రజల పొదుపుతో నడుస్తున్న ప్రజాసంస్థలు. ప్రజల పొదుపునకు ద్రవ్యోల్బణం నుంచి రక్షణనిచ్చేవిధంగా వడ్డీ రేట్లు పెంచాలని, దేశ ఆర్థికవ్యవస్థ సమ్మిళిత వృద్ధికి వెన్నెముకలైన వ్యవసాయ రంగానికి, గ్రామీణాభివృద్ధికి, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు, మౌలిక వసతుల రంగానికి ఎటువంటి మధ్యవర్తి సంస్థలు లేకుండా నేరుగా తక్కువ వడ్డీకి రుణాలనివ్వాలని సంఘాలు కోరుతున్నాయి. విధాన నిర్ణయాలు చేసే బ్యాంకు బోర్డులలో ఉద్యోగ సంఘాలకు, రైతు, కార్మిక, ఎంఎస్ఎంఈ రంగాల నిపుణులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలి. దీనివలన రుణాల మంజూరు, వసూలు లాంటి అంశాలమీద పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులను కాపాడుకోవటం ప్రజలందరి కర్తవ్యం. అది దేశ ఆర్థిక స్వావలంబనకు, సమ్మిళిత వృద్ధికి ఆధారంగా నిలుస్తుంది.
పి. వెంకటరామయ్య
ప్రధాన కార్యదర్శి, బ్యాంక్ ఎంప్లాయీస్
ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, తెలంగాణ
ఈ వార్తలు కూడా చదవండి
రూ.1 లక్ష లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన సచివాలయం ఉద్యోగులు
ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లపై అసెంబ్లీలో చర్చ.. భట్టి విక్రమార్క ఏం చెప్పారంటే..