Share News

భయపడుతూ బతకాల్సిన అవసరం లేదు!

ABN , Publish Date - Apr 18 , 2026 | 03:35 AM

‘మనం బతకడానికి ఇక్కడకు వచ్చాం. అనవసరమైన వివాదాలు మనకు అక్కర్లేదు. ఎవరైనా ఒక మాట అన్నా కూడా సర్దుకుపోదాం. అవమానించినా పర్లేదు. నలుగురి కంట్లో పడకుండా రోజులు గడిపేద్దాం’ వంటి సర్దుబాటు...

భయపడుతూ బతకాల్సిన అవసరం లేదు!

‘మనం బతకడానికి ఇక్కడకు వచ్చాం. అనవసరమైన వివాదాలు మనకు అక్కర్లేదు. ఎవరైనా ఒక మాట అన్నా కూడా సర్దుకుపోదాం. అవమానించినా పర్లేదు. నలుగురి కంట్లో పడకుండా రోజులు గడిపేద్దాం’ వంటి సర్దుబాటు ధోరణి అమెరికాలో ఉంటున్న ఎన్నారై కమ్యూనిటీలో ఇటీవలి కాలంలో బాగా పెరుగుతోంది. అమెరికాలో నివసించే ప్రతి ఒక్కరికీ చట్టపరమైన రక్షణ పకడ్బందీగా ఉంటుంది. ఈ నేలపై నివసించే వారికి నిర్దిష్టమైన హక్కులను ఇక్కడి చట్టాలు కల్పిస్తాయి. కానీ ఎన్నారై భారతీయ సమాజం అంత దూరం ఆలోచించడం లేదు. ‘హేట్ కల్చర్’ పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో దానికి వ్యతిరేకంగా పోరాడడం కంటే, మనం ఓరిమితో ఉంటే చాలు అనుకుంటోంది. కొన్ని సందర్భాల్లో అవసరాన్ని మించిన ఈ పరిమితవాదం మనవారి జీవనశైలిగా మారుతోంది.

సోషల్ మీడియా విశృంఖలత మితిమీరుతున్న వర్తమానంలో ఒకరి ఘనతను, సౌశీల్యాన్ని తెలియజెప్పే పోస్టులకంటె.. ఒకరిపట్ల విద్వేషాన్ని, విషాన్ని కక్కే పోస్టులే వేగంగా వ్యాపిస్తుంటాయి. అవే ఎక్కువమందిని ప్రభావితం చేస్తున్నాయి. ‘ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్’గా అమెరికాను అభివర్ణిస్తుంటారు. అలాంటి నేలమీద ఇటీవలి కాలంలో సోషల్ మీడియా తాకిడికి అనేక మార్పులు జరుగుతున్నాయి. ఇతర దేశాల నుంచి ఇక్కడకు వచ్చిన వారిని ద్వేషించడం పెరుగుతోంది. భారతీయులు, ప్రత్యేకించి తెలుగువారు ఇలాంటి పరిణామాల బారిన పడుతున్నారు.

అమెరికాలోని నేషనల్ కంటాజియన్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌సిఆర్ఐ) 2026 నివేదిక ప్రకారం.. 2025లో ‘ఎక్స్’ సోషల్ మీడియా వేదికగా వచ్చిన భారత వ్యతిరేక పోస్టులకు వెల్లువెత్తిన వీక్షణలు 300 మిలియన్లకు పైమాటే! 2024తో పోల్చినప్పుడు 2025లో ఎక్స్‌లో భారత వ్యతిరేకతతో విద్వేషం వెదజల్లుతున్న పోస్టులు మూడు రెట్లు పెరిగాయి. ఒక ఏడాదిలో సుమారు 14వేల యునిక్ అకౌంట్స్ నుంచి 24,674 భారత వ్యతిరేక పోస్టులు వ్యాపించాయి. కార్నెగీ 2026 సర్వే ప్రకారం.. 48శాతం భారతీయ అమెరికన్లు సోషల్ మీడియాలో తరచుగా జాతి వివక్షతో కూడిన పోస్టులను ఎదుర్కోవాల్సి వస్తోంది. 2025 ప్రారంభం నుంచి కూడా భారతీయ అమెరికన్లలో ప్రతి నలుగురిలో ఒకరు నిందల పాలవుతున్నారు. 31శాతం మంది భారతీయ అమెరికన్లు ఆన్‌లైన్‌లో రాజకీయాల గురించి మాట్లాడడానికి భయపడుతున్నారు. 19 శాతం బహిరంగంగా భారతీయ వస్త్రాలను ధరించడానికి సంకోచిస్తున్నారు. సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న ద్వేషం మాత్రమే కాదు. పోలీసులు తమను రోడ్డు మీద ఆపినా, ప్రశ్నించినా వణికిపోయే పరిస్థితి ప్రస్తుతం ఉంది. యుద్ధం నేపథ్యంలో అమెరికాలో గ్యాలన్ పెట్రోల్‌ ధర ఒక డాలరు పెరిగింది. దీంతో అన్ని నిత్యావసరాల ధరలు సహజంగానే పెరిగాయి. మొత్తం అమెరికా పౌరజీవనంపై యుద్ధం తాలూకు ప్రభావం గణనీయంగా ఉంది. అందుకే యుద్ధవ్యతిరేక నిరసనలు మిన్నంటాయి. అయితే, ఆ నిరసనల్లో భారతీయుల పాత్ర మనకు కనిపించదు.


సోషల్ మీడియాలో విద్వేషం గురించి గానీ, అమెరికాలో ఎదురయ్యే ఇతరత్రా అవమానాల గురించి గానీ సర్దుబాటు ధోరణితో ఉండాల్సిన అవసరం లేదు. అమెరికన్ చట్టాలు ప్రతి ఒక్కరికీ అందించే రక్షణ గురించి భారతీయులందరికీ అవగాహన కల్పించడానికి ప్రత్యేక కృషి జరుగుతోంది. ఇండియన్ అమెరికన్ అడ్వొకసీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ‘మీ హక్కులను తెలుసుకోండి’ పేరుతో హక్కుల వివరాలను ప్రచురించి అందరికీ అవగాహన కల్పిస్తున్నారు. ఇమిగ్రేషన్ స్టేటస్ ఏ దశకు చెందినదైనా సరే.. అమెరికాలో ఉండే ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించే అమెరికన్ రాజ్యాంగ సవరణల గురించిన అనేక వివరాలు ఇందులో పొందుపరిచారు. వాక్‌స్వాతంత్ర్యం నుంచి, నచ్చిన మతాల్ని విశ్వాసాల్ని అనుసరించడం వరకు, పోలీసులు ఇంటిమీదకు వస్తే వారంటు గానీ, మీ అనుమతి గానీ లేకుండా సోదాలు చేయలేరని తెలియజెప్పే హక్కుల వరకు అనేక రాజ్యాంగ సవరణల వివరాలు ఇందులో ఉన్నాయి. అమెరికాలోని ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) అధికారులు ప్రశ్నించినప్పుడు ధైర్యంగా ఉండడం, అలాంటి సందర్భాల్లో వర్తించే రక్షణ, హక్కుల గురించి ఇందులో తెలిపారు. ఫెడరల్ లేదా స్టేట్ జడ్జి సంతకంతో కూడిన వారంటు ఉంటే తప్ప.. ఐసీఈ అధికారులు వచ్చినప్పుడు తలుపు తెరవాల్సిన అవసరం కూడా లేదనే ప్రాథమిక విషయాలపై కూడా అవగాహన కల్పిస్తున్నారు. అదే సమయంలో భౌతికంగా అడ్డుకోకూడదని, ఆయా సందర్భాలను వీడియో రికార్డు చేసి ఉంచుకోవచ్చునని చెబుతున్నారు.

సోషల్ మీడియా విద్వేషానికి గురయ్యే బెడదను గురించి కూడా ఈ అడ్వొకసీ కౌన్సిల్ ప్రస్తావిస్తూ, వాటిని తేదీలు, సమయంతో సహా దాచుకోవాలని.. ఫొటోలు, స్క్రీన్‌షాట్‌లు, వీడియోలు, అన్నీ భద్రపరచడం మేలని చెబుతోంది. ఏది హేట్ క్రైమ్ కిందకు వస్తుందో స్పష్టత లేకపోయినా, పోలీసులకు ఫిర్యాదు చేయడం మంచిదని, అలాగే స్క్రీన్ షాట్లు వంటివి తీసినప్పుడు వాటిని క్రాప్ చేయకుండా ఒరిజినల్స్ గానే భద్రపరచాలని సూచించారు. అంతర్జాలంలో వెల్లువెత్తే విద్వేషాన్ని కూడా స్క్రీన్‌షాట్‌లుగా దాచడం మంచిదని చెబుతున్నారు. ఆయా సోషల్ మీడియా హ్యాండిల్స్‌కు కూడా ఫిర్యాదు చేయాలి. విద్వేష పోస్టుల్లో భాగంగా ఏవైనా హెచ్చరికలు వస్తే, వెంటనే స్థానిక పోలీసులకు, ఎఫ్‌బీఐ వంటి సంస్థలకు ఫిర్యాదు చేయాలి.

అమెరికాలోని భారతీయ సమాజం ప్రాథమికంగా గుర్తుంచుకోవాల్సిన విషయం.. ‘మనం ఈ దేశంలో ఉన్నప్పుడు ఈ దేశ చట్టాలను, నిబంధనలను గౌరవిస్తూ జీవనం సాగించాలి’ అని. అందుకోసం ఈ తరహా ‘పరిమితవాదా’న్ని ఆశ్రయించడం తప్పు కాకపోవచ్చు. కానీ, అవమానాలు, ఇబ్బందులు ఎదురైనా కూడా భయంతో బతకాల్సిన అవసరం లేదు.

కృష్ణమోహన్ దాసరి

జర్నలిస్టు, డల్లాస్‌

ఇవి కూడా చదవండి

హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని మృతదేహం

వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు

Updated Date - Apr 18 , 2026 | 03:35 AM