అప్పుల ఊబిలో అన్నదాత.. సంస్కరణలే మార్గం!
ABN , Publish Date - Apr 29 , 2026 | 05:02 AM
దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు దాటినా దేశ జనాభాలో అత్యధికులు ఆధారపడిన వ్యవసాయ రంగం తీవ్ర ఒడుదుడుకులకు లోనవుతూనే ఉంది. అన్నదాతే దేశానికి వెన్నెముక అని...
దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు దాటినా దేశ జనాభాలో అత్యధికులు ఆధారపడిన వ్యవసాయ రంగం తీవ్ర ఒడుదుడుకులకు లోనవుతూనే ఉంది. అన్నదాతే దేశానికి వెన్నెముక అని పాలకులంటున్నా, వివిధ పథకాలు అమలుచేస్తున్నా, రైతన్నల పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. నిజానికి రైతు శ్రమకు తగిన గుర్తింపు, గౌరవం ఇస్తున్నామా అని ప్రభుత్వాలు సమీక్షించుకోవాలి. దేశ జీడీపీలో 18.2శాతం వాటాతో సుమారు 42.3శాతం జనాభాకు వ్యవసాయ రంగం జీవనాధారాన్ని అందిస్తున్నదని 2024నాటి ఆర్థిక సర్వే పేర్కొంది. పారిశ్రామిక, సాంకేతిక, సేవా రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నా, జాతీయ స్థూల విలువ జోడింపు (జీఏవీ)లో వ్యవసాయం దాని అనుబంధ రంగాల వాటా తగ్గుతోంది. ఏఐ అన్ని రంగాల్లోనూ ప్రవేశించి ప్రగతిని పరుగులు పెట్టిస్తున్నా వ్యవసాయ రంగం మాత్రం తిరోగమనంలో ఉంది. దేశానికి ఆహార భద్రత కల్పించే రైతన్న అప్పుల ఊబిలో పీకలలోతు దాకా కూరుకుపోతున్నాడు. ప్రభుత్వాలు రుణమాఫీ చేసినా సగటు రైతుకు అప్పుల భారం తప్పడం లేదు.
ఆలిండియా డెట్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ సర్వే–2019 పేరిట దేశంలోని 5,940 గ్రామాల్లో ఉన్న 69,455 కుటుంబాలు, 3,995 పట్టణాల్లో ఉన్న 47,006 కుటుంబాల ఆర్థిక స్థితిపై నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) నిర్వహించిన సర్వే దేశంలోని రైతుల దీనస్థితిని వెల్లడించింది. దేశంలో ఒక్కో రైతు కుటుంబంపై సగటున లక్ష రూపాయల పైన రుణభారం ఉన్న రాష్ట్రాలు ఎనిమిది ఉంటే, వాటిలో దక్షిణాది నుంచే నాలుగు రాష్ట్రాలు ఉన్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల రైతులు కూడా అప్పుల సుడిగుండంలో కూరుకుపోయారని ఇటీవల పార్లమెంటులో కేంద్ర వ్యవసాయశాఖమంత్రి ఇచ్చిన సమాచారంతో తేటతెల్లం అయ్యింది. దీని ప్రకారం, దేశవ్యాప్తంగా రైతుల రుణాలు రూ.31,34,807 కోట్లు కాగా, వీటిలో పంట రుణాలు రూ.16,34,219 కోట్లు, దీర్ఘకాలిక రుణాలు రూ.15,00,588 కోట్లు. ఆంధ్రప్రదేశ్‌లో రైతుల రుణాలు రూ.3,75,254 కోట్లు (పంట రుణాలు రూ.2,01,744 కోట్లు, దీర్ఘకాలిక రుణాలు రూ.1,73,510 కోట్లు), తెలంగాణలో రూ.1,75,960 కోట్లు (పంట రుణాలు రూ.96,167కోట్లు, దీర్ఘకాలిక రుణాలు రూ.80,792కోట్లు). దేశంలోనే అత్యధికంగా రైతుల అప్పులున్న రాష్ట్రంగా తమిళనాడు మొదటి స్థానంలో నిలిస్తే, రెండు, ఏడు స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఎన్‌ఎస్‌ఎస్‌ఓ సర్వే నివేదిక ప్రకారం, జాతీయంగా సగటు రైతు కుటుంబ అప్పు రూ.74,121లు కాగా, సగటు నెలసరి వ్యవసాయ ఆదాయం రూ.10,218. అయితే అత్యంత వెనుకబడిన రాష్ట్రాలుగా చెప్పుకునే ఈశాన్య రాష్ట్రాలలో రైతు కుటుంబాల సగటు నెలసరి ఆదాయం రూ.16,863 కాగా, సగటు రుణభారం రూ.13,642 మాత్రమే. ఏపీలో రైతు కుటుంబాల సగటు నెలసరి ఆదాయం జాతీయ సగటు కన్నా 2.56శాతం (రూ.10,480) మేర ఎక్కువగా ఉన్నా, అప్పులు మాత్రం సుమారు మూడింతలు (రూ.2,35,554) అధికం.
అదే సమయంలో తెలంగాణ రైతు కుటుంబాల ఆదాయం జాతీయ సగటు వ్యవసాయ ఆదాయం కంటే 7.9శాతం తక్కువగా ఉన్నా (రూ.9,403), అప్పులు దాదాపు రెండింతలు (రూ.1.52,000) అధికం. ఏపీలో 92.9శాతం, తెలంగాణలో 89.1శాతం రైతు కుటుంబాలు అప్పుల్లో ఉన్నాయన్న సత్యం ఉభయ తెలుగు రాష్ట్రాలలోని రైతుల దయనీయ ఆర్థిక స్థితికి నిదర్శనం.
అనేక మంది రైతులు, కౌలురైతులు.. భారీగా పెరిగిన వ్యవసాయ అవసరాలకు సరిపడా రుణాలు బ్యాంకుల నుంచి పొందలేక ప్రైవేటు వడ్డీ వ్యాపారస్థుల నుంచి అధిక వడ్డీలకు డబ్బు తీసుకుంటున్నారని ఎన్‌ఎస్‌ఎస్‌ఓ సర్వే వెల్లడించింది. ఇంత శ్రమించినా పంట దిగుబడి బాగా వస్తుందన్న నమ్మకం లేదు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోతున్న పరిస్థితి. అన్నీ అనుకూలించి పంటలు పండినా ఒక్కోసారి మార్కెట్లో ధర ఉండదు. రైతుల చేతి నుంచి పంట వ్యాపారుల చేతికి వచ్చిన తరువాత, ధర ఆకాశాన్ని అంటుతోంది. ఇలా ధరల్లో స్థిరత్వం లేకపోవడం వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. దీంతో అప్పుల భారాన్ని మోయలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 2023లో దేశవ్యాప్తంగా 10,700 మంది (4,690 మంది రైతులు, 6,096 మంది వ్యవసాయ కార్మికులు) వ్యవసాయదారులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడించింది. ఇది దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం ఆత్మహత్యలలో 6.3శాతం. రైతు ఆత్మహత్య కేసులు ఎక్కువగా మహారాష్ట్ర (38.5శాతం), కర్ణాటక (22.5శాతం), ఆంధ్రప్రదేశ్ (8.6శాతం), మధ్యప్రదేశ్ (7.2శాతం), తమిళనాడు (5.9శాతం)లలో నమోదయ్యాయి. 2021 నుంచి ప్రతి ఏడాది పదివేల మందికి పైగా వ్యవసాయదారులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇది వ్యవసాయ రంగంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని సూచిస్తున్నదని ఈ నివేదిక హెచ్చరించింది.
వ్యవసాయానికి అత్యంత కీలకమైన రుణ సదుపాయం బ్యాంకుల ద్వారా అందించి అన్నదాతలను ప్రైవేటు వడ్డీ వ్యాపారస్థుల బారి నుంచి ప్రభుత్వాలు కాపాడాలి. సాగు ఖర్చు తగ్గేలా సహజ, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు అధిక ఉత్పత్తినిచ్చే వంగడాలను అభివృద్ధి చేసి రైతులకు అందించాలి. పంటకు సరైన మద్దతు ధరను నిర్ణయించి, పటిష్ఠంగా అమలు చేయాలి. దళారీలపై ఆధారపడకుండా పంటను నేరుగా రైతులే అమ్ముకునేలా మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలి. ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించేలా పంటల బీమా అమలు చేయాలి. కేవలం వ్యవసాయం పైనే ఆధారపడకుండా పండ్లు, కూరగాయలు, పశుపోషణ, కోళ్ల పెంపకం వంటి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల వైపు రైతులను ప్రోత్సహించాలి. స్థిరమైన సాగునీటి వసతి కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పంటను నిల్వ చేసుకోవడానికి గోదాములు, కోల్డ్ స్టోరేజీలు తగినన్ని ఏర్పాటు చేయాలి. రైతులు ఎఫ్‌పీఓలను ఏర్పాటు చేసుకుని తమ ఉత్పత్తులను విక్రయిస్తే అధిక ధర దక్కే అవకాశం ఉంటుంది. రుణమాఫీ అనేది తాత్కాలిక ఉపశమనం మాత్రమే కానీ దీర్ఘకాలిక పరిష్కారం కాదని, వ్యవసాయం లాభసాటి కావాలంటే రుణమాఫీలు, రైతు పథకాలు సరిపోవని.. పంటలకు సరైన ధర, తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడం, పంటల బీమాతోపాటు మార్కెట్ సంస్కరణలు కూడా చేపడితే సత్ఫలితాలు అందుతాయని వ్యవసాయరంగ నిపుణులు సూచిస్తున్నారు.
లింగమనేని శివరామప్రసాద్
రాజకీయ, సామాజిక విశ్లేషకులు
ఈ వార్తలు కూడా చదవండి
పెళ్లి పేరుతో రూ.కోట్ల వసూలు.. అషురెడ్డిపై ధర్మేంద్ర తీవ్ర ఆరోపణలు
తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్