ఎన్నికల రాజకీయాల్లో భగ్నమైన మహిళ కల
ABN , Publish Date - Apr 22 , 2026 | 02:05 AM
‘ఈ బిల్లు పాసవుతుందంటారా.. మా బాస్ ఒకటికి రెండుసార్లు అడుగుతున్నారు’ అని ఒక మిత్రపక్ష ఎంపీ గతవారం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజూను అడిగారు. ‘ఆ అనుమానం మీకు ఎందుకు వస్తోంది? నరేంద్ర మోదీ...
‘ఈ బిల్లు పాసవుతుందంటారా.. మా బాస్ ఒకటికి రెండుసార్లు అడుగుతున్నారు’ అని ఒక మిత్రపక్ష ఎంపీ గతవారం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజూను అడిగారు. ‘ఆ అనుమానం మీకు ఎందుకు వస్తోంది? నరేంద్ర మోదీ ప్రధానిగా ఉండగా ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్నది సాధించి తీరుతారు. తెరవెనుక చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనేకమంది మన వైపు మొగ్గు చూపుతారు. చూస్తూ ఉండండి’ అని ఆయన సదరు నేతకు చెప్పారు. ‘అంతేకాదు, నేనే మీ బాస్‌తో మాట్లాడతా’ అని స్వయంగా తానే ఫోన్ చేసి ‘బిల్లు పాసవడానికి ఎలాంటి అడ్డంకులు లేవు’ అని చెప్పారు. దీంతో ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మహిళలను పిలిచి సంబరాలు జరుపుకునేందుకు ఏర్పాట్లు చేశారు.
అసలు బిల్లు ఆమోదం పొందదేమోనన్న అభిప్రాయం ప్రధానమంత్రికి కూడా ఉన్నట్లు కనిపించలేదు. ఏప్రిల్ రెండో వారం నుంచే దేశవ్యాప్తంగా మహిళలను ఢిల్లీకి రప్పించడం మొదలు పెట్టారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ అన్ని రాష్ట్రాల అధ్యక్షుల్ని, ముఖ్యమైన నేతల్ని పిలిపించి రాష్ట్రాల్లో మహిళా సదస్సులు నిర్వహించాలని, మహిళా రిజర్వేషన్‌పై విలేఖరుల సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. విజ్ఞాన్ భవన్‌లో మహిళలతో ఒక పెద్ద సదస్సు నిర్వహించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగించారు. తమ పార్టీకి చెందిన మహిళల్లో ముఖ్య నేతలందర్నీ కేంద్ర కార్యాలయానికి రప్పించి ప్రజల్లోకి వెళ్లేందుకు, మీడియాతో మాట్లాడేందుకు శిక్షణ నిప్పించారు. ఏఏ రాష్ట్రాలలో ఎన్నెన్ని సీట్లు పెరుగుతాయో డాక్యుమెంట్లు తయారు చేసి పంపిణీ చేశారు. చివరకు లోక్‌సభ గ్యాలరీలను మహిళా ప్రజాప్రతినిధులతో నింపేశారు. దేశ రాజధాని, పార్లమెంట్ ప్రాంగణం అంతా మహిళలతో కళకళలాడిపోయింది. చాలామంది మహిళలు ఇక తాము కూడా త్వరలో సభలో ప్రవేశిస్తామని కలలు కన్నారు. కొందరు తమకు సీట్లను కూడా నిర్ణయించుకున్నారు.
మహిళా రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొంది ఉంటే దేశవ్యాప్తంగా మహిళల్లో పెద్ద ఊపు తెప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ఎన్ని సన్నాహాలు చేసి ఉండేవో! కానీ, ఏప్రిల్ 16న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే ప్రతిపక్షాలు సంఘటితంగా ఉన్నట్లు స్పష్టమైంది. ప్రతిపక్షాలను తమ వైపునకు తిప్పుకునేందుకు, గైర్హాజరు చేయించేందుకు తెర వెనుక ప్రయత్నాలు ముమ్మరంగా జరిగాయి. ‘ఈ బిల్లు వీగిపోతే ప్రతిపక్షాలను మహిళలు క్షమించరు’ అని మోదీ హెచ్చరించాల్సి వచ్చింది. అసలు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల నుంచి ప్రతిపక్ష ఎంపీలు ఈ సమావేశాలకు రాగలరా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. నిజానికి పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఈసారి గతంలో ఎన్నడూ లేనంత గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. ఆ పార్టీ ఎంపీలంతా ప్రచారంలో మునిగి ఉన్నారు. ప్రతిపక్షాలు ఎంత సంఘటితంగా ఉండాలనుకున్నా ఓటింగ్‌కు ఏడుగురు తృణమూల్ ఎంపీలు గైర్హాజరు కావల్సి వచ్చింది. అయినప్పటికీ లోక్‌సభలో రెండింట మూడోవంతు మెజారిటీకి, ఎన్డీఏ సంఖ్యా బలానికి ఎంతో తేడా ఉండడంతో రాజ్యాంగ సవరణ వీగిపోక తప్పలేదు.
కర్ణుడి చావుకు లక్ష కారణాలున్నట్లు ఈ బిల్లు వీగిపోవడానికి కూడా ఎన్నో కారణాలున్నాయి. ఎంతో చరిత్రాత్మకమైన ఘట్టం అనుకున్నది ఇలా చివరకు ఒక ప్రహసనంగా ఎందుకు తేలిపోవల్సి వచ్చింది? 2023లో మహిళా రిజర్వేషన్ కల్పించేందుకు ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లును అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో ఆమోదించినప్పుడు ఈ బిల్లును ఎందుకు వ్యతిరేకించాయి? అసలు ఆ రాజ్యాంగ సవరణ బిల్లును మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఒకవేళ మార్చాలనుకుంటే దానిపై కూడా ఏకాభిప్రాయం సాధించేందుకు ఎందుకు ప్రయత్నాలు జరగలేదు? 2029లో మహిళా రిజర్వేషన్‌ను అమలు చేయాలనుకుంటే ఇంకా మూడేళ్ల సమయం ఉన్నది. అందుకోసం బడ్జెట్ సమావేశాలనే పొడిగించి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? మోదీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బెంగాల్ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో మహిళలను తమ వైపునకు తిప్పుకునేందుకు మహిళా రిజర్వేషన్ పేరుతో పావులు కదిపారా? అటువంటప్పుడు ఆ రిజర్వేషన్‌కూ సీట్ల పెంపునకూ ముడిపెట్టి రాజ్యాంగ సవరణ బిల్లును తేవాల్సిన అవసరం ఏమిటి? ఉత్తరప్రదేశ్‌లో సీట్ల పెంపు వల్ల సమాజ్‌వాది పార్టీకి కూడా ప్రయోజనం కనుక ఆ పార్టీని తమ వైపునకు తిప్పుకునేందుకే ఈ మేరకు ప్రభుత్వం వ్యూహం పన్నిందా? డీలిమిటేషన్ బిల్లులో జనాభా ప్రాతిపదికనే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని చెప్పడం, 50శాతం సీట్ల పెంపు ప్రతిపాదన లేకపోవడం, ఉత్తరాది– దక్షిణాదికి మధ్య వ్యత్యాసాలు పెరుగుతాయన్న చర్చ ప్రబలడం అనుమానాలకు దారితీస్తుందని ప్రభుత్వం ముందుగా ఊహించలేదా? చివరి నిమిషంలో బిల్లును మారుస్తామని హోంమంత్రి అమిత్ షా చెప్పినా ప్రతిపక్షాలు ఒప్పుకోలేదంటే అధికార పక్షానికీ, విపక్షాలకూ మధ్య ఒకర్నొకరు విశ్వసించలేని శత్రుభావం ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. 2011 జనగణనను ఆధారంగా తీసుకోవడం ఓబీసీలను విస్మరించేందుకే అన్న చర్చ జరుగుతుందని కూడా ప్రభుత్వం ఊహించినట్లు కనపడలేదు.
మన దేశంలో తక్షణ ప్రయోజనాలకోసం ఆడే రాజకీయాలు, ప్రచారార్భాటాల వల్ల ఒక్కోసారి మహిళలకు ప్రాతినిధ్యం వంటి అవసరమైన నిర్ణయాలు కూడా వెనక్కి వెళ్లక తప్పదు.
పార్లమెంట్ సమావేశాలు ముగిసినప్పటికీ మహిళా రిజర్వేషన్‌పై అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్ధం ఆగలేదు. బిల్లు వీగిపోవడానికి ప్రతిపక్షాలను తీవ్రంగా విమర్శిస్తూ ప్రధాని మోదీ ఏకంగా దూరదర్శన్‌లో ప్రసంగించారు. అలా చేయడం ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని ప్రతిపక్షాలు ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశాయి. మోదీ లాంటి మేరునగ ధీరుడిని సీఈసీ ప్రశ్నిస్తారని ఊహించడం వారి అమాయకత్వం. ప్రశ్నించదలచుకుంటే మహిళా రిజర్వేషన్ కోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయడాన్నే ప్రశ్నించాలి.
నిజంగా మోదీ అనుకున్నట్లు బెంగాల్ ఎన్నికల్లో మహిళలు పెద్ద ఎత్తున బీజేపీవైపు మొగ్గు చూపితే ఆ పార్టీ ఘన విజయం సాధించక తప్పదు. బెంగాల్‌లో ఈసారి 2 లక్షల మంది మహిళా ఓటర్లు పెరిగారు. 6.75 కోట్ల మంది ఓటర్లలో 3.44 కోట్ల మంది మహిళలే. అంతేగాక గత ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. గత ఎన్నికల్లో 88శాతం మహిళలు ఓటు వేశారు. బెంగాల్‌లోనే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా మహిళల ఓటు శాతం పురుషుల ఓటు శాతం కంటే ఎక్కువగా పెరుగుతోంది. అనేక రాష్ట్రాల్లో మహిళలను దృష్టిలో ఉంచుకుని పథకాలను ప్రకటించడం ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రయోజనం చేకూర్చింది. అందువల్ల మహిళా ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ నుంచి మహిళా ఓటర్లను బీజేపీ వైపునకు తిప్పుకోవడం కోసం మహిళా రిజర్వేషన్‌ను మోదీ పాచికగా విసిరారనడంలో ఎవరికీ సందేహం లేదు. నిజానికి దేశంలో అన్ని పార్టీల కన్నా ఎక్కువగా మమతా బెనర్జీ మహిళలకు అధిక ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు. ఆ పార్టీలో ఇప్పటికే 33శాతం మేరకు మహిళలకు ప్రాతినిధ్యం లభిస్తోంది. 29 మంది తృణమూల్ ఎంపీల్లో 11 మంది మహిళలే. మమతా బెనర్జీ మంత్రిమండలిలో కూడా 20శాతం మహిళలే. తృణమూల్ ఈసారి 52 మంది మహిళలకు సీట్లు ఇచ్చింది. ఇది అన్ని పార్టీల్లో మహిళలకిచ్చిన సీట్లకంటే ఎక్కువే. మహిళల కోసం మమతా బెనర్జీ అమలు చేస్తున్న కన్యశ్రీ ప్రకల్ప, లక్ష్మీ బంఢార్ వంటి పథకాలు కూడా జనాదరణ పొందాయి. అందువల్ల మహిళా రిజర్వేషన్ బిల్లు ద్వారా మహిళలను బీజేపీ తమ వైపునకు తిప్పుకోగలదా అన్నది చర్చనీయాంశం. కానీ బీజేపీ గెలిస్తే మాత్రం మహిళల వల్లే గెలిచామని చెప్పుకోవడానికి ఆస్కారం ఉన్నది.
మహిళల కంటే ఎక్కువగా బీజేపీ ఈసారి హిందూ మెజారిటీ సీట్లపై దృష్టి సారించింది. పశ్చిమ బెంగాల్లోని 294 సీట్లలో కేవలం 234 సీట్లలోనే 40శాతం కంటే తక్కువ ముస్లింలు ఉన్నారు. ఈ సీట్లలోనే బీజేపీ గత ఎన్నికల్లో 77 సీట్లను గెలిచింది. 1977 కంటే ముందు ముస్లింలు కాంగ్రెస్‌కు, ఆ తర్వాత 2006 వరకు వామపక్షాలకు, 2006 నుంచి తృణమూల్‌కు మద్దతునిస్తున్నారు. మమత రాజకీయ విజయానికి వారే ప్రధాన కారణం.
2014 వరకు పశ్చిమ బెంగాల్‌లో ఉనికిలోనే లేని బీజేపీ 2014 లోక్‌సభ ఎన్నికల్లో 17శాతం ఓట్లు గెలుచుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంకు 40శాతానికి పెరిగింది. ఈ ఏడేళ్లలో ఈ శాతం పెద్దగా మారలేదు. తృణమూల్‌కూ, బీజేపీకి దాదాపు అయిదు శాతం ఓట్ల తేడా మాత్రమే ఉన్నది. ఈ శాతాన్ని అధిగమించాలంటే హిందూ ఓట్లు సంఘటితం కావడం అవసరం. వీరిలో హిందూ మహిళల ఓట్లు మరీ ముఖ్యం.
మహిళా రిజర్వేషన్‌ను ఎవరూ కాదనలేరు కానీ, ఒక్కో ఎంపీకి ఏడాదికి జీతభత్యాల రూపంలో నాలుగైదు కోట్లు ఖర్చవుతున్న నేపథ్యంలో ఎంపీ సీట్లను సగానికి పైగా పెంచడం వల్ల ప్రజలపై పడే భారానికి తగ్గట్లుగా ప్రయోజనాలు లభిస్తాయా? పార్లమెంటరీ వ్యవస్థ ప్రామాణికంగా, చర్చలు అర్థవంతంగా మారనంత కాలం సీట్ల పెంపు వల్ల కొట్లాట, వేలకోట్ల ఖర్చు పెరగడమే కానీ ఒరిగేదేమీ ఉండదేమో!
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
ఇవి కూడా చదవండి..
అది నాకు గర్వకారణం.. సీఎం స్టాలిన్ వీడియో సందేశం
విజిల్ రెవల్యూషన్‌కు పిలుపు.. టీవీకే చీఫ్ విజయ్ బహిరంగ లేఖ