Share News

వాణిజ్య బంధాలూ సమర వివాదాలూ

ABN , Publish Date - Feb 04 , 2026 | 01:05 AM

రాష్ట్రపతి ప్రసంగం ముగిసిన తర్వాత కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రెండో రోజే పార్లమెంటులో తీవ్ర గందరగోళం నెలకొన్నది. దీన్నిబట్టి చూస్తే అసలు పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరగాలన్న...

వాణిజ్య బంధాలూ సమర వివాదాలూ

రాష్ట్రపతి ప్రసంగం ముగిసిన తర్వాత కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రెండో రోజే పార్లమెంటులో తీవ్ర గందరగోళం నెలకొన్నది. దీన్నిబట్టి చూస్తే అసలు పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరగాలన్న ఉద్దేశం అటు ప్రతిపక్షాలకు కానీ, ఇటు ప్రభుత్వానికి కానీ ఉన్నదా అన్న అనుమానం వస్తోంది. సాధారణంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగడం ఆనవాయితీ. ఆ తర్వాతే బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చలు మొదలవుతాయి. పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి వెలువరించే ప్రసంగం ఒక రకంగా ప్రభుత్వ విధాన డాక్యుమెంట్. నిజానికి మోదీ ప్రభుత్వం అమలుపరుస్తోన్న వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇస్తోన్న ప్రాధాన్యం గురించి రాష్ట్రపతి ప్రపంగం వివరించింది.. రాజకీయ విభేదాలు విస్మరించి వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా జాతీయ ప్రజాప్రతినిధులు అందరూ దేశ ప్రయోజనాలకోసం కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. విచిత్రమేమంటే బడ్జెట్ ప్రవేశపెట్టిన మరుసటి రోజే పాలక, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలతో సభా సమావేశాలు కొనసాగలేని పరిస్థితి ఏర్పడింది. ఇందుకు ఎవరు కారణం? రాష్ట్రపతి ప్రసంగంపై సోమవారం నాడు ప్రారంభమైన చర్చలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య కాంగ్రెస్‌పై వాడి వేడి బాణాలు సంధించారు. భారతీయ నాగరికత, సంస్కృతి, జాతీయవాదం, దేశభక్తి అనే వాటికి కాంగ్రెస్ పార్టీ తీవ్ర వ్యతిరేకమని ఆయన మాట్లాడిన మాటలు కాంగ్రెస్‌ను రెచ్చగొట్టాయి.

ఇప్పటికే అనేక గాయాలతో రెచ్చిపోతున్న కాంగ్రెస్ ఊరుకుంటుందా? ఆ వెంటనే కాంగ్రెస్ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ రంగంలోకి దిగి తమ దేశ భక్తిని, జాతీయవాదాన్ని శంకించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘మా దేశ భక్తి గురించి, భారతీయ సంస్కృతి గురించి బీజేపీ యువ ఎంపీ వ్యాఖ్యలు చేసినందుకే నేను కొన్ని వాక్యాలను చదివి వినిపించదలుచుకున్నాను’ అని రాహుల్ మొదలుపెట్టారు. ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పేరిట 2020లో చైనాతో జరిగిన సరిహద్దు ఘర్షణపై మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే రచించిన పుస్తకంలో ఉన్న అంశాలపై ‘కారవాన్’ అనే పత్రిక వెలువడిన ఆ పుస్తక భాగాలను చదవ సాగారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురించి నరవణే రాసిన వాక్యాలను చదవడం మొదలుపెట్టగానే బీజేపీ ఎంపీలు తీవ్ర గందరగోళం సృష్టించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇంకా ప్రచురణ కాని ఆ పుస్తకంలోని వాక్యాలను ఎలా చదువుతారని మంత్రులు ప్రశ్నించారు. స్పీకర్ ఓం బిర్లా కూడా 342 నిబంధన క్రింద అలా చదవడం కుదరదని స్పష్టం చేశారు. అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్యే కాక, స్పీకర్‌కూ, ప్రతిపక్ష సభ్యుల మధ్య కూడా వాగ్వివాదం జరిగింది. మంగళవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. తాను నరవణే పుస్తకంలో ఉన్న అంశాలు సరైనవేనని సాధికారికంగా చెబుతున్నానంటూ రాహుల్ స్పీకర్‌కు నోట్ సమర్పించి మరీ మళ్లీ ప్రసంగం ప్రారంభించారు. అయితే అధికార పక్షం వారు యథా ప్రకారం రాహుల్ మాట్లాడకుండా అడ్డుకున్నారు. ప్రధానమంత్రి అన్న పదం ఉచ్చరించినప్పుడల్లా స్పీకర్ అడ్డుకున్నారు. రాహుల్‌ను అడ్డుకుంటున్నారని గందరగోళం సృష్టించినందుకు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేశారు. చివరకు అనేక వాయిదాల తర్వాత సభ మళ్లీ బుధవారానికి వాయిదా పడింది.


అసలీ పరిస్థితి ఎందుకు వచ్చింది? తేజస్వి సూర్య విమర్శనాస్త్రాలే కాంగ్రెస్‌ను రెచ్చగొట్టాయా? జనరల్ నరవణే పుస్తకంలోని అంశాలను రాహుల్ ప్రస్తావించకుండా బీజేపీ ఎందుకు అడ్డుకుంటోంది? నిజానికి నరవణే పుస్తకం వెలుగులోకి రాకుండా గత రెండేళ్లుగా కేంద్రం అడ్డుకుంటోంది. ఆ పుస్తకం ప్రచురించడానికి రక్షణమంత్రిత్వ శాఖ, విదేశాంగమంత్రిత్వ శాఖ ఇంతవరకూ పబ్లిషర్‌కు అనుమతినీయలేదు. ‘నేను రాయాల్సింది రాశాను. ఇక ఆ పుస్తకాన్ని ఎలా విడుదల చేయాలో పబ్లిషరే తేల్చుకోవాలి’ అని నరవణే అన్నారు. ఆ పుస్తకంలో తాను రాసిన అంశాలపై వస్తున్న వివాదం విషయమై కూడా ఆయన ఏ మాత్రం స్పందించలేదు. ‘కారవాన్’లో వచ్చిన పుస్తక భాగాలపై కూడా ఆయన వ్యాఖ్యానించలేదు. అంటే తాను రాసిన వాటికి ఆయన కట్టుబడి ఉన్నట్లే కదా.

భారత్‌ చైనాల మధ్య సరిహద్దు ఘర్షణలు కొత్త కాదు. ఆ పొరుగు దేశంతో విభేదాలు యుద్ధానికి దారితీయడంలో నెహ్రూ ప్రభుత్వ తప్పిదాల గురించి అనేక పుస్తకాలు వచ్చాయి. చైనాతో యుద్ధం జరుగుతున్నప్పుడు అసోంను కోల్పోతామేమోనన్న ఆవేదనను నెహ్రూ వ్యక్తపరిచారు. ‘నా హృదయం అసోం ప్రజలకోసం తపిస్తోంది..’ అన్న ఆయన ఆవేదనాపూరిత వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. కాంగ్రెస్ హయాంలో జరిగిన అనేక తప్పిదాలు, సంభవించిన పరాజయాలు, వాటిల్లిన వైఫల్యాలను కప్పిపుచ్చడానికి ఎవరూ ప్రయత్నించలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశ రక్షణ, భద్రత నుంచి అనేక విషయాల్లో ఆత్మరక్షణలో పడేందుకు, ఎన్నికల పరాభవాల నుంచి కోలుకోలేకపోతున్నందుకు అవే కారణం. మరి మోదీ హయాంలో ఇలాంటి విషయాలపై చర్చ జరిగేందుకు కూడా ఆస్కారం లేకుండా పోతోంది. ఏ చిన్న విజయం లభించినా ఉప్పొంగిపోయి, అమితోత్సాహం ప్రదర్శించి ప్రచారార్భాటాలు చేసేవారు జాతీయ ప్రాధాన్యమున్న వివాదాలపై చర్చించడానికి నిరాకరించడం దేనికి? జనరల్ నరవణే పుస్తకం బయటకు వచ్చి ఉంటే దానిపై కొద్ది రోజులు చర్చ జరిగి సమసిపోయివుండేది. గల్వాన్‌ లోయలో చైనా చొచ్చుకువస్తున్నప్పుడు ‘మీకేది సముచితమో అదే చేయండి’ అని ప్రధానమంత్రి తనకు చెప్పారని రక్షణమంత్రి వెల్లడించినట్లు నరవణే రాశారు. ఆ సమయంలో జరిగిన ఘటనలేమిటో, ఎంతమందితో ఎన్ని చర్చల తర్వాత, ఎన్ని తర్జనభర్జనల తర్వాత ప్రధానమంత్రి సమస్యను ఆర్మీకే వదిలేయాలని అనుకున్నారో పార్లమెంటు సాక్షిగా వివరించడం సాధ్యం కాదు. అదే సమయంలో వివాదాన్ని పూర్తిగా తొక్కిపెట్టి పార్లమెంటులో ఎవరినీ గొంతెత్తనీయకుండా చేయడం కూడా రకరకాల అనుమానాలకు దారి తీస్తుంది.


నిజానికి బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్‌పై చర్చ జరగాలి. బడ్జెట్‌కు కొద్ది రోజులముందే యూరోపియన్ యూనియన్‌తో కుదిరిన ‘సమస్త ఒప్పందాలకూ తల్లి’ లాంటి ఒప్పందం కుదరడంపై సానుకూల చర్చ జరిగేందుకు వాతావరణం కల్పించాలి. అయితే నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన బడ్డెట్‌పై చర్చ రెండో రోజే నీరుకారిపోయింది. మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన మూడో బడ్జెట్ ఇది. ఆదాయం రూ.36.5 లక్షల కోట్లు, ఖర్చులు రూ. 53.5 లక్షల కోట్లు కనుక దాదాపు రూ.12 లక్షల కోట్లు అప్పు చేయాలని, మిగతా మొత్తాన్ని ప్రజల నుంచి, పెట్టుబడుల ఉపసంహరణ నుంచి సేకరించాలని నిర్ణయించారు. మూలధన వ్యయం క్రింద రూ. 12.20 లక్షల కోట్లు కేటాయించడం, అందులో దాదాపు సగం రహదారి, రైల్ నెట్ వర్క్‌కు మళ్లించడం, ఉత్పాదక రంగానికి చేయూత నివ్వడం, పారిశ్రామిక కారిడార్లను ప్రకటించడం, ఆహార ద్రవ్యోల్బణాన్ని తగ్గించే ప్రయత్నం చేయడం, గ్లోబల్ మార్కెట్‌లకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లకు అనువుగా దేశాన్ని సంసిద్ధం చేయాలనుకోవడం... ఇత్యాదులన్నీ మెరుపుల్లా కనిపించవచ్చు. అయితే ఇవేవీ ఒక్కసారి భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఉవ్వెత్తున పుంజుకునేలా చేయకపోవచ్చు. ఆర్థిక సర్వే సూచించిన నిర్మాణాత్మక సంస్కరణలపై విధాన నిర్ణయాలు తీసుకోలేకపోవచ్చు కాని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కొన్ని ప్రకటనలు చేసి తప్పించుకున్నట్లుగా కనపడుతోంది.

మార్కెట్ అనేది ప్రవాహం లాంటిది. దానికి ఎక్కడ అవరోధం కలిగినా మరో చోటికి ప్రవహిస్తుంది. తన దారిని తాను వెతుక్కుంటుంది. ట్రంప్‌ టారిఫ్‌లకు ప్రపంచం ఏమీ భయపడలేదు. అమెరికాను ఏకాకి చేసి దాని భాగస్వామ్య దేశాలు సైతం తమ వర్తక ఒప్పందాలను తాము కుదుర్చుకున్నాయి. భారత్‌తో యూరోపియన్ యూనియన్ కుదుర్చుకున్న ఒప్పందం అనేక వస్తువులపై జీరో టారిఫ్‌లు నిర్ణయించింది. చైనా, కెనడాలు కూడా తమ ఒప్పందాలు తాము కుదుర్చుకున్నాయి. దీనితో ట్రంప్ కూడా తన వైఖరి మార్చుకుని తన భాగస్వాములతో పోటీపడేందుకు భారత్‌పై విధించిన టారిఫ్‌లను 18శాతానికి తగ్గించక తప్పలేదు. అయితే రష్యా నుంచి చమురు కొనడాన్ని భారత్‌ మానివేస్తుందని, 500 బిలియన్ డాలర్ల మేరకు వ్యవసాయం, ఇంధనం, టెక్నాలజీ, బొగ్గు ఇతర అనేక ఉత్పత్తులను తమ దేశం నుంచి కొనుగోలు చేస్తుందని ట్రంప్‌ ప్రకటించడంలో ఈ ఒప్పందం ప్రయోజనాలపై చర్చలు ప్రారంభమయ్యాయి. అమెరికాతో మోదీ రాజీపడ్డారని, ఈ ఒప్పందం వల్ల మన రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయని రాహుల్ అంటే ఈ చారిత్రక ఒప్పందం భారత ప్రజలకు బృహత్తర అవకాశాలు కల్పిస్తుందని వాణిజ్యమంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఇరు దేశాల సంయుక్త వ్యాపార ఒప్పంద వివరాలు అధికారికంగా బయటకు వెల్లడి కానంత వరకూ సానుకూల, ప్రతికూల వాదనలు శ్రేయస్కరం కాదు. ఏమైనా 2026 సంవత్సరం ప్రారంభంలోనే మోదీ ప్రభుత్వం రెండు కీలక అంతర్జాతీయ ఒప్పందాలను కుదుర్చుకున్నది. ఇదొక పరిణామం, సందేహం లేదు. అయితే నరవణే పుస్తకం, ఎప్‌స్టీన్‌ ఫైల్స్ వంటి వివాదాల్లో చిక్కుకోవడమూ జరిగింది. ఈ పరిణామాల పర్యవసానాలు ఎలా ఉంటాయో మున్ముందు తేలుతుంది.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

ఇవీ చదవండి:

ప్రియుడి కోసం జంట హత్యలు

సర్పంచ్‌గా పోటీ చేయాలని..కన్నకూతురినే చంపేశాడు

Updated Date - Feb 04 , 2026 | 01:05 AM