Share News

న్యాయస్థానాలను ప్రశ్నించకూడదా?

ABN , Publish Date - Mar 04 , 2026 | 12:33 AM

‘సుప్రీంకోర్టు సంస్థాగత ఆధిపత్యాన్ని దిగజార్చేందుకు, న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఒక పద్ధతి ప్రకారం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాలను అడ్డుకోకపోతే, ప్రజల దృష్టిలో...

న్యాయస్థానాలను ప్రశ్నించకూడదా?

‘సుప్రీంకోర్టు సంస్థాగత ఆధిపత్యాన్ని దిగజార్చేందుకు, న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఒక పద్ధతి ప్రకారం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాలను అడ్డుకోకపోతే, ప్రజల దృష్టిలో న్యాయవ్యవస్థ పవిత్రత క్షీణిస్తుంది. యువత లేత మనసులపై ప్రభావం చూపుతుంది.. మాపై తుపాకి కాల్చారు.. న్యాయవ్యవస్థ నెత్తురోడుతోంది.’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్‌సీఈఆర్‌టీ ప్రచురించిన 8వ తరగతి పుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతి గురించి వివరించినందుకు ఆయన ఏకంగా ఆ పుస్తకాన్నే నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. కనీసం డిజిటల్ రూపేణా కూడా ఈ పుస్తకం కనపడరాదని ఆయన ఆజ్ఞాపించారు. ఈ నిషేధాజ్ఞల తర్వాత కొన్ని లక్షల పుస్తకాలను ఎన్‌సీఈఆర్‌టీ ఉపసంహరించుకుంది. ఈ పాఠ్యపుస్తకం జిరాక్స్ కాపీలను అమ్ముతున్నందుకు ఒక పుస్తకాల షాపు యజమానిని పోలీసులు అరెస్టు చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి.

‘న్యాయవ్యవస్థను అప్రతిష్టపాలు చేసేందుకు ఈ భూమి మీద ఏ ఒక్కరినీ నేను అంగీకరించే ప్రసక్తి లేదు’ అని సీజేఐ అన్నారు. ఆ పాఠ్యపుస్తకంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇజ్రాయెల్‌లో ఉన్నారు. న్యాయవ్యవస్థ మనసు గాయపరిచినందుకు మోదీ కూడా బాధపడ్డారు. అసలు ఇవన్నీ ఎవరు చూస్తున్నారు.. అని మోదీ అన్నట్లు అధికార వర్గాలే మీడియాకు వెల్లడించాయి. దేశానికి తిరిగి వచ్చిన తర్వాత కేబినెట్ సమావేశంలో కూడా మోదీ ఈ విషయం ప్రస్తావించారు. ‘మన న్యాయవ్యవస్థలో అవినీతి ఉన్నదని మనమే 8వ తరగతి పిల్లలకు ఎలా చెబుతాం’ అని మోదీ అన్నట్లు వార్తలు వచ్చాయి. విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా న్యాయవ్యవస్థలో అవినీతి గురించి వివాదాస్పద అధ్యాయాన్ని 8వ తరగతి పాఠ్యపుస్తకంలో చేర్చినందుకు విచారం వ్యక్తం చేశారు. ‘న్యాయవ్యవస్థ అంటే మాకెంతో గౌరవం ఉన్నది. ఉద్దేశపూర్వకంగా న్యాయవ్యవస్థను అవమానించాలని మేము అనుకోలేదు’ అని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఎన్‌సీఈఆర్‌టీ చైర్మన్ ప్రొఫెసర్ దినేష్ ప్రసాద్ సక్లానీకి సుప్రీంకోర్టు నోటీసులు పంపింది.


భారత ప్రధాన న్యాయమూర్తి ఆందోళన వ్యక్తం చేసినట్లు ఈ మొత్తం ఉదంతం వెనుక న్యాయవ్యవస్థను అప్రతిష్ఠపాలు చేసే కుట్ర ఉన్నదా? ఒక పద్ధతి ప్రకారం న్యాయవ్యవస్థ పట్ల ప్రజల గౌరవం తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? నిజానికి మోదీ ప్రభుత్వమే ఈ కుట్ర పన్నిందన్న అభిప్రాయం కలిగించేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది. ‘ఒక దశాబ్ద కాలంగా పాఠ్యపుస్తకాల్లో తమ సైద్ధాంతిక వైరస్‌ను వ్యాప్తి చేసేందుకు బీజేపీ సర్కార్ ప్రయత్నిస్తోంది. న్యాయవ్యవస్థలో అవినీతి గురించి వివరించడం అనేది యాదృచ్ఛికంగా జరగలేదు. కాని ఒక పద్దతి ప్రకారం విద్యార్థుల మనసులను చెడగొట్టేందుకు ప్రయత్నం జరిగింది’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ అన్నారు. మోదీ స్వయంగా ఈ ప్రక్రియకు మార్గదర్శకత్వం వహించారని, ఆర్ఎస్ఎస్ దీని వెనుక ఉన్నదని చెప్పేందుకు ఆధారాలు ఉన్నాయని ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టులో ప్రతిపక్షాల కేసులను వాదించే న్యాయవాదులు కపిల్ సిబాల్, అభిషేక్ సింఘ్వీ ఈ విషయాన్ని జస్టిస్ సూర్యకాంత్ మరింత తీవ్రంగా పట్టించుకునేలా తమ వాదనలు వినిపించారు. ఏదో పెద్ద కుట్ర జరిగిందనే అభిప్రాయం కల్పించడంలో వారు కృతకృత్యులయ్యారు. ‘ఈ దేశంలో అభివృద్ది వేగంగా జరిగేందుకు న్యాయవ్యవస్థే ప్రధాన అడ్డంకి..’ అని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ గతంలో అన్నమాటలు కూడా ఇదే సమయంలో ప్రస్తావనకు వచ్చాయి.

న్యాయ వ్యవస్థ ద్వారానే తమకు అంతిమంగా న్యాయం జరుగుతుందనే అభిప్రాయం ప్రజల్లో ఉన్నందువల్లే లక్షలాది సంఖ్యలో వారు కోర్టు తలుపుతడుతున్నారు. కోర్టులు తమకు న్యాయం చేస్తాయన్న అభిప్రాయం లేకపోతే, వారు కోర్టులకు వెళ్లకుండా ఆటవిక న్యాయానికి పాల్పడే అవకాశం ఉన్నది. ‘ఈ దేశంలో ప్రజలకు న్యాయం లభించదు అన్న అభిప్రాయం విద్యార్థులకు కలిగించలేం..’ అన్న జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయం సరైనది కాదని అనలేము. మురికివాడల్లో నివసించే పేదలను కూడా దురాక్రమణదారుల్లా ఒక తీర్పులో చెప్పారని ఆ పాఠ్యపుస్తకంలో ప్రస్తావించారు. అలా ప్రస్తావించడం ద్వారా మొత్తం న్యాయవ్యవస్థ పేదలకు వ్యతిరేకమని చిత్రించేందుకు ప్రయత్నించడం సరైనది కాదు.


‘అన్యాయం ఎక్కడ జరిగినా అంతటా న్యాయానికి ముప్పు వాటిల్లినట్లే’ అన్న మార్టిన్ లూథర్ కింగ్ వ్యాఖ్యలను ఉటంకించిన సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ జితేందర్‌సింగ్ ఇటీవల ఢిల్లీ మద్యం కేసుపై ఇచ్చిన తీర్పులో అధికార పార్టీ ప్రత్యర్థులను కేసుల్లో ఇరికించేందుకు సీబీఐ ఎలా వాస్తవాలను తనకు అనుగుణంగా మార్చుకుంటుందో దాదాపు 600 పేజీల తీర్పులో వివరించారు. ‘ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు తీసుకున్న విధాన నిర్ణయాలను కూడా నేరాలుగా భావిస్తే ఇక ఏ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోగలదు?’ అని ఆయన ప్రశ్నించారు. కేసులో అప్రూవర్లు, నేరంలో పాలుపంచుకున్న సాక్షుల మాటలనే విశ్వసించి నెలల తరబడి నిందితులను జైళ్లో బంధించడంలోని అన్యాయాన్ని ఆయన ఎత్తిచూపారు. జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ రెండూ ప్రభుత్వ దయతో రాలేదని, అవి రాజ్యాంగం ద్వారా వచ్చాయని, రాజ్యాంగానికీ, చట్టాలకూ మధ్య సమతుల్యత పాటించకపోతే నేర న్యాయ విచారణ వ్యవస్థపైనే ప్రజల విశ్వాసం సన్నగిల్లుతుందని ఆయన అన్నారు. ఢిల్లీ మద్యం కేసుల్లో అనేక సందర్భాల్లో స్టేకు నిరాకరించిన రాజ్యాంగ ధర్మాసనాలు కూడా ఈ స్థాయిల్లో క్రింది కోర్టు మాదిరి ఆలోచించలేకపోవడం గమనార్హం. ఈ తీర్పును పై కోర్టుల్లో ఎంత సవాలు చేసినా ఆ తీర్పు లేవనెత్తిన ప్రశ్నల ప్రాధాన్యత తగ్గే అవకాశాలు లేవు.

న్యాయవ్యవస్థలో అవినీతి గురించి ప్రస్తావించిన ఒక పాఠ్యపుస్తకాన్ని నిషేధించడం వల్ల విద్యార్థులకు న్యాయవ్యవస్థలో ఏమి జరుగుతుందో క్లాసురూమ్‌లో తెలుసుకునే అవకాశం లేకుండా పోవచ్చు. నిషేధించడం ద్వారా జరిగిన చర్చ వల్ల ఆ విషయంపైకి వారి దృష్టి మరింత మళ్లేందుకు ఆస్కార మేర్పడింది. విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాల ద్వారానే లోకంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారా? పాఠ్యపుస్తకాల్లో చెప్పనంత మాత్రాన న్యాయవ్యవస్థపై వారికి దురభిప్రాయం కాకుండా ఉన్నతాభిప్రాయం కలిగే అవకాశం ఉన్నదా? ఇవాళ ఏ పాఠ్యపుస్తకమూ చూపనంత ప్రభావాన్ని సోషల్ మీడియా చూపుతుందన్న విషయం తెలియనిది కాదు. 8వ తరగతి పిల్లలు టీవీ చూడరా, పేపర్లు చదవరా? అంతే కాదు, పాఠ్యపుస్తకంలో ప్రస్తావించినట్లుగా సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో కలిపి కోట్లాది కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్న విషయం ప్రభుత్వమే పార్లమెంట్‌లో అనేక సందర్భాల్లో వెల్లడించింది. న్యాయవ్యవస్థలో అవినీతి, దుష్ప్రవర్తన వల్ల ప్రజల విశ్వాసం తగ్గిపోతుందని 2025లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ గవాయ్ అన్న వ్యాఖ్యలను కూడా ఇదే పాఠ్యపుస్తకంలో ప్రస్తావించారు. అందువల్ల పాఠ్యపుస్తకాన్ని నిషేధించినంత మాత్రాన ప్రజల దృష్టిలో న్యాయవ్యవస్థపై ప్రజల గౌరవం పెరిగే అవకాశాలు లేవు. పుస్తకంలో చదువుకోనంత మాత్రాన ఆ విషయాలు విద్యార్థులకు తెలియకుండా దాచిపెట్టగలగడం అసాధ్యం.


రెండవది, సుప్రీంకోర్టుకు ఒక పుస్తకాన్ని కానీ ప్రసంగాన్ని కానీ నిషేధించే రాజ్యాంగాధికారం ఉన్నదా అన్న విషయమూ చర్చనీయాంశమైంది. ఒక ప్రజాస్వామిక సమాజంలో ఒక పుస్తకాన్ని సెన్సార్ చేయడం అనేది ఆర్టికల్ 19 క్రింద భావ ప్రకటనా స్వేచ్చను హరించడం క్రిందకు వస్తుంది. ఆర్టికల్ 19 విషయంలో న్యాయపరమైన తీర్పులు చట్టం క్రిందకు వస్తాయా, రాజ్యాంగం ఈ అధికారం న్యాయవ్యవస్థకు ఇచ్చిందా అన్న విషయంపై న్యాయనిపుణులు చర్చను లేవనెత్తుతున్నారు. తమ ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు ప్రజలు కోర్టు తలుపు తట్టవచ్చు. కాని కోర్టులే ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినప్పుడే ఏమి చేయాలి.. అని వారు ప్రశ్నిస్తున్నారు.

అసలు న్యాయవ్యవస్థలో అవినీతి గురించి ప్రస్తావించినప్పుడే కోర్టు ఎందుకు ప్రతిస్పందించాలి? మిగతా వ్యవస్థలను ఎంత విమర్శించినా ఎందుకు ఊరుకోవాలి? పాఠ్యపుస్తకాలు ఈ దేశంలో ఉన్న రుగ్మతల్ని చర్చించడంలో తప్పులేదని, వాటిని చర్చించడం ద్వారానే వాటిని పరిష్కరించుకోవచ్చునని వాదించేవారు ఉన్నారు. ఉదాహరణకు ఎన్నికల వ్యవస్థల్లో అక్రమాల గురించి కూడా పాఠ్యపుస్తకాల్లో చర్చించారు. ఒక అభ్యర్థి కారులో కరెన్సీ నోట్లు దొరికినట్లు చిత్రాన్ని ప్రచురించారు. అలా జరగడం లేదా? ఇప్పటి వరకూ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల గురించి అనేక ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు కూడా దొరికిన దృశ్యం ప్రజల మనసుల్లో చెరిగిపోలేదు. ఏ న్యాయమూర్తికీ అవినీతి ఆరోపణలపై శిక్షపడినట్లు, లేదా అభిశంసించినట్లు దాఖలాలు లేవు. మహా అయితే బదిలీలు జరిగాయి. సాధారణ ప్రజలు, రాజకీయ నేతలు సీబీఐ దాడులు, ఈడీ దర్యాప్తులు ఎదుర్కొంటున్నప్పుడు న్యాయమూర్తులపై మాత్రం అలా ఎందుకు జరగదు? 8వ తరగతి పుస్తకాన్ని నిషేధించిన ఉన్నత న్యాయస్థానమే ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

ఇవి కూడా చదవండి..

ఇరాన్ దిగి వచ్చింది.. కానీ ఇప్పటికే ఆలస్యమైంది: ట్రంప్

ఇరాన్ అధ్యక్ష కార్యాలయంపై దాడి.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడి

Updated Date - Mar 04 , 2026 | 12:33 AM