Share News

తన కథ వెనక సోనియా రాజకీయ వ్యథ!

ABN , Publish Date - Nov 18 , 2026 | 03:22 AM

సోనియా గాంధీ తన ఆత్మకథ ‘బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌’లో రాసింది పూర్తిగా రాజీవ్ గాంధీతో తన ప్రేమకథ అనుకుంటే పొరపాటే అవుతుంది. ఆమె రాసింది తన అత్తమ్మ, భర్త హత్యలకు గురైన విషాద గాథల...

తన కథ వెనక సోనియా రాజకీయ వ్యథ!

సోనియా గాంధీ తన ఆత్మకథ ‘బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌’లో రాసింది పూర్తిగా రాజీవ్ గాంధీతో తన ప్రేమకథ అనుకుంటే పొరపాటే అవుతుంది. ఆమె రాసింది తన అత్తమ్మ, భర్త హత్యలకు గురైన విషాద గాథల గురించి అనుకుంటే తప్పుదోవ పట్టినట్లవుతుంది. ఆమె రాసింది 58 ఏళ్ల క్రితం ఇటలీ నుంచి పరాయిదేశంలో అడుగుపెట్టి, భారతదేశ ప్రజానీకంతో తానెలా మమేకమయిందీ చెప్పేందుకే సోనియా తన ఆత్మకథ వెలువరించారని అనుకుంటే అది కూడా పూర్తిగా సరైనది కాదు. ‘బిలాంగింగ్‌’ను నిశితంగా చదివితే ఈ దేశ రాజకీయ జీవితంలోకి సంఘ్ పరివార్, బీజేపీ చొచ్చుకుపోవడం దేశానికి ఏ విధంగా తీరని నష్టం చేస్తుందో చెప్పడానికే ఆమె ప్రధానంగా తన ఆత్మకథను ఉద్దేశించినట్టు కనిపిస్తోంది. వందేళ్లకు పైగా చరిత్ర గల సంఘ్ పరివార్ మూలాలు, ఆలోచనా విధానం, ఆయా సందర్భాల్లో ఈ దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన తీరును వివరిస్తూ ఆరెస్సెస్‌–బీజేపీలపై ఆమె ఒక సైద్ధాంతిక సమర శంఖారావం చేశారు.

తన ఆత్మకథలో 147 సార్లు ఆరెస్సెస్‌, జనసంఘ్, బీజేపీల గురించి ప్రస్తావించిన సోనియా వాటి మూలాలపై దాడి చేసేందుకే ప్రయత్నించారు. తాను ఇండియా రాక పూర్వం ఆరెస్సె్‌స్‌ చరిత్రనూ ఆమె వివరించారు. 1925లో ఏర్పడిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్... రాజ్యాంగం ప్రవచించిన లౌకికవాదం, సమానత్వం, బహుళత్వ సిద్ధాంతాలను పక్కనపెట్టి ముస్లింలు, క్రైస్తవులు వంటి మైనారిటీ మతస్థులను ద్వితీయశ్రేణి పౌరులుగా మార్చే హిందూ రాష్ట్ర స్థాపనే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోందని విశ్లేషించారు. ఈ ఆధిపత్య భావజాలమే తర్వాతి కాలంలో భారతీయ జనతా పార్టీ రాజకీయ అజెండాగా మారిందని వివరించారు. స్వాతంత్ర్య సమరంలో సంఘ్ పాత్ర ఏమీ లేదని, కాంగ్రెస్ స్వాతంత్ర్య సమరయోధులు బ్రిటిష్ పాలకుల దాడులు, కారాగార శిక్షలను అనుభవిస్తున్న సమయంలో, వినాయక్ దామోదర్ సావర్కర్ వంటి ఆరెస్సెస్ సీనియర్ సిద్ధాంతకర్తలు తమకు క్షమాభిక్ష ప్రసాదించాలని వేడుకుంటూ బ్రిటిష్‌ వలసపాలకులతో కుమ్మక్కయ్యారని సోనియా రాశారు. సంఘ్ ప్రధాన సిద్ధాంతకర్తలు హిట్లర్‌ను, మైనారిటీల పట్ల ఆయన అనుసరించిన విధానాలను ప్రశంసించారని సోనియా తెలిపారు. తమ ప్రణాళికకు కాంగ్రెస్, దాని విలువలే ప్రధాన అడ్డంకిగా ఆరెస్సెస్ ఎప్పుడూ భావించిందని ఆమె పేర్కొన్నారు. దేశ పాలనాధికారాలు సంఘ్‌ పరివార్‌ చేతుల్లోకి వెళితే సంఘ్‌ విభజన వాద, తిరోగమన, నిరంకుశ సిద్ధాంతాలు దేశ ఐక్యతకు ముప్పు చేస్తాయని కాంగ్రెస్ ఎప్పుడూ గట్టిగా నమ్ముతూ వచ్చిందని సోనియా తెలిపారు.


ఇందిర పాలనకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను సంఘటితం చేసిన జయప్రకాశ్ నారాయణ్‌ను ఆరెస్సెస్‌ ఒక ప్రధాన పావుగా వాడుకున్నదని, ఆయన వారి ఎత్తుగడలకు ఉపయోగపడుతున్నారని ఇందిరాగాంధీ తీవ్రంగా ఆందోళన చెందినట్లు సోనియా తన ఆత్మకథలో వెల్లడించారు. మితవాద, మతతత్వ శక్తులతో చేతులు కలపడం కాంగ్రెస్ సిద్ధాంతాలకు ద్రోహం చేయడమేనని ఇందిర విశ్వసించారని సోనియా అన్నారు. జర్మనీలోని నాజీల ‘బ్రౌన్ షర్ట్స్’ ఉద్యమంతో ఆరెస్సెస్ పెరుగుదలను ఇందిర పోల్చినట్లు తెలిపారు. ‘నేను రాజీనామా చేస్తే కాంగ్రెస్‌ ముక్కలైపోతుంది, ఆరెస్సెస్‌ తన లక్ష్యాన్ని సాధించుకుంటుంది. ఆ సంస్థ చరిత్ర నాకు తెలుసు. వారు ఏదైనా చేయగలరు. దేశాన్ని విధ్వంసం చేస్తారు’ అని రాజీవ్‌కు ఇందిరాగాంధీ చెప్పినట్లు సోనియా తన ఆత్మకథలో తెలిపారు. ఎమర్జెన్సీ తర్వాత జనతా ప్రభుత్వంలో జనసంఘ్ కీలక పాత్ర పోషించిందని, అయితే ఆరెస్సెస్‌ సభ్యత్వాలకు రాజీనామా చేయాలని లౌకికవాదులు డిమాండ్‌ చేయడంతో వాజపేయి, ఆడ్వాణీ తమ మంత్రిపదవులకు రాజీనామా చేసిన వైనాన్ని కూడా సోనియా వివరించారు. 1984 లో ఢిల్లీలో సిక్కుల ఊచకోతలో ఆరెస్సెస్‌ కూడా పాల్గొన్నదని ఆమె వెల్లడించారు. మత కల్లోలాలను, హింసాకాండను నివారించేందుకు కాంగ్రెస్ రెండుసార్లు బిల్లులను తీసుకువచ్చినప్పటికీ బీజేపీ, ఆరెస్సెస్‌ వ్యతిరేకించాయని విమర్శించారు. మహాత్మాగాంధీ కలలు కన్న రామరాజ్యాన్ని రాజీవ్‌ గాంధీ స్థాపించాలనుకుంటే ఆరెస్సెస్‌ విషపూరిత ప్రచారంతో దాన్ని అడ్డుకున్నదని చెప్పారు. ఆడ్వాణీ రథయాత్ర, బాబ్రీమసీదు కట్టడం కూల్చివేత, గుజరాత్‌లో మారణకాండ గురించి ఆమె వివరంగా ప్రస్తావించి సంఘ్ పరివార్, బీజేపీలను దుయ్యబట్టారు. అన్నాహజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం వెనుక కూడా సంఘ్ పరివార్ హస్తం ఉన్నదని అన్నారు. బీజేపీ, ఆరెస్సెస్‌ వంటి మతోన్మాద శక్తులను ఎదుర్కొనేందుకే తాను కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టానని ఆమె తేల్చి చెప్పారు. సోనియా అక్షరాల్లోని తీవ్రతను చూసి ఆమె పుస్తకాన్ని ప్రచురించేందుకు పెంగ్విన్‌ ప్రచురణ సంస్థ వెనుకాడినట్లు స్పష్టమవుతోంది.

ఇంకా సంఘ్, బీజేపీలపై సోనియా చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. దశాబ్దాలుగా ఆరెస్సెస్ సాగిస్తున్న విషపూరిత ప్రచారం సోషల్ మీడియా రాకతో మరింత వేగవంతమైందని, ఏఐ, డీప్‌ఫేక్‌ల ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోందని, దేశ సామాజిక సమగ్రత తీవ్ర ప్రమాదంలో పడిందని సోనియా భావిస్తున్నారు. మైనారిటీలపై ద్వేషాన్ని పెంచి, సమాజంలోని పేదలు, అణగారిన వర్గాల ప్రయోజనాలను పణంగా పెట్టి సంపన్నుల ప్రయోజనాలను కాపాడే విధానాలను అవలంబిస్తున్నారని సోనియా విమర్శించారు. పాఠ్యపుస్తకాలను మార్చడం నుంచి విశ్వవిద్యాలయాల ఉపకులపతుల నియామకాల వరకు, ఆరెస్సెస్‌ దాదాపు అన్ని ఉన్నత విద్యాసంస్థలను తన సైద్ధాంతిక నియంత్రణలోకి తీసుకున్నదని, దీనివల్ల విద్యా వ్యవస్థకు తీరని నష్టం జరుగుతోందని సోనియా చెప్పారు.


చివరకు తాను, మోదీ పూర్తిగా భిన్నమైన సైద్ధాంతిక ప్రపంచాల నుంచి ఎలా వచ్చామో కూడా సోనియా తెలిపారు. ‘ఈ దేశం గురించి మోదీకి ఉన్న భావనకు, నాకు ఉన్న భావనకు మధ్య చాలా తేడా ఉన్నది. భారతదేశం గురించి నేను నేర్చుకున్నదంతా మా కుటుంబ సభ్యుల నుంచి, వారు చేసిన త్యాగాల నుంచి, అనేక జాతులు, సంస్కృతులు, భాషలు, విశ్వాసాలను గౌరవిస్తూ అందరికీ స్వేచ్ఛ, సమానత్వం అనే సూత్రాలపై నిలిచిన దేశం పట్ల వారికి ఉన్న విశ్వాసం నుంచి వచ్చింది. నరేంద్ర మోదీకి సంబంధించిన భారతదేశ భావన ఆరెస్సెస్‌ సిద్ధాంతకర్తల ఆలోచనల నుంచి, మతం, సంస్కృతి అన్నింటికంటే ఉన్నతమైనవని భావించే మౌలికవాదం నుంచి రూపుదిద్దుకున్నది’ అంటూ ‘ఆయన తాను ఆశిస్తున్న భారతదేశం కోసం పోరాడుతున్నారు, నేను ఆధిపత్యానికి వ్యతిరేకమైన, సమ్మిళితత్వం, లౌకికవాదం, సామాజిక న్యాయానికి కట్టుబడిన భారతదేశం కోసం పోరాడుతున్నాను’ అని సోనియా చెప్పారు. హిందూమతంలోని సమ్మిళితత్వం అనే ప్రధాన ఆదర్శం ‘ఏకం సత్ విప్రా బహుధా వదంతి’ అనే వేదమంత్రంలో సంక్షిప్తంగా వ్యక్తమవుతుందని ఆమె సంఘ్ పరివార్‌కే పాఠం బోధించారు.

కొన్ని దశాబ్దాల క్రితం ఇండియాలో అడుగుపెట్టిన ఒక విదేశీ మహిళ ఆరెస్సె్‌స్‌, బీజేపీలపై ప్రయోగించిన ఆయుధమే సోనియా ఆత్మకథ. స్పష్టంగా ఇది కాంగ్రెస్ పార్టీ దృక్పథం. ఇప్పటికే 2 లక్షలకు పైగా కాపీలు అమ్ముడుపోయిన ఈ పుస్తకం ఇతర భారతీయ భాషల్లో కూడా వచ్చే అవకాశాలున్నాయి. అయితే సోనియా రాసినట్లు కాంగ్రెస్‌ పార్టీని ఆరెస్సెస్‌ పూర్తిగా ద్వేషించిందా అన్నది చర్చనీయాంశం. నిజానికి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో ఆరెస్సెస్‌ను నిషేధించినప్పటికీ బాలాసాహెబ్ దేవరస్ వంటి సంఘ్ అగ్రనేతలు జాతీయవాద కారణాలతో ఇందిరాగాంధీని ప్రశంసించారనడానికి దాఖలాలు లేకపోలేదు. 1980ల్లో ఇందిర హిందూ కేంద్రీకృత వైఖరిని అధికంగా అవలంబించారని, సంఘ్‌ ప్రముఖులతో ప్రైవేట్‌గా చర్చలు జరిపారని, ఎన్నికల్లో ప్రయోజనం పొందారని కాంగ్రెస్ రాజకీయాలను కొన్ని దశాబ్దాలుగా అధ్యయనం చేస్తోన్న ప్రముఖ జర్నలిస్టు నీరజా చౌదరి ‘హౌ ప్రైమ్‌ మినిస్టర్స్ డిసైడ్’ అన్న తన పుస్తకంలో పేర్కొన్నారు. వాజపేయిని కూడా విస్మరించి ఇందిరకు ప్రాధాన్యమిచ్చారని ఆమె తెలిపారు. ఇందిర తర్వాత ప్రధాని అయిన రాజీవ్ గాంధీ కూడా దేవరస్‌తో రహస్య చర్చలు జరిపారని ఆమె వెల్లడించారు.


కొద్ది రోజుల క్రితం మాలినీ భట్టాఛార్జీ అనే సీనియర్ రచయిత్రి రాసిన ‘స్వయం సేవక్’ అనే ఆసక్తికరమైన పుస్తకం విడుదలయ్యింది. ఆరెస్సెస్‌ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆరెస్సెస్‌ కోసం తమ జీవితాలను త్యాగం చేసిన పది మంది స్వయం సేవకుల జీవిత చరిత్రలను ఆమె ఆ పుస్తకంలో పొందుపరిచారు. వ్యక్తిత్వ నిర్మాణానికే సంఘ్‌ ప్రాధాన్యమిస్తుందని ఆ పదిమంది స్వయం సేవక్‌లు ముక్తకంఠంతో చెప్పారని మాలిని తెలిపారు. ఈ పదిమందిలో ఒకరు ఆరెస్సెస్‌పై తొలి నిషేధం ఎత్తివేసిన రోజుల్లో జరిగిన ఒక సంఘటనను వివరించారు. ప్రచారక్‌ల బైఠక్ (సమావేశం) నొకదానికి హాజరైన వారిలో అటల్ బిహారీ వాజ్‌పేయి కూడా ఉన్నారు. ఆ సమావేశంలో గోల్వాల్కర్‌ను ‘అధికారం వల్ల మనం అవినీతికి లోనుకాకుండా ఎలా చూసుకోవాలి?’ అని వాజపేయి ప్రశ్నించారు. ‘మన ఆధ్యాత్మిక పునాదిని కాపాడుకున్నంతకాలం, మనం అవినీతికి గురయ్యే అవకాశం చాలా తక్కువ. అదే కీలకం. మన మౌలిక విలువలను కాపాడుకోవడంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి’ అని గోల్వాల్కర్ చాలా సరళంగా సమాధానం ఇచ్చారు. ఈ పదిమందీ అనుసరించిన, గోల్వాల్కర్ చెప్పిన విలువలను సంఘ్ ఇప్పటికీ పాటిస్తున్నదా? ఈ దేశంలో రెండు సైద్ధాంతిక కూటముల మధ్య దాడి తీవ్రతరమయినట్లు సోనియా విమర్శలతో స్పష్టమవుతోంది.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

ఈ వార్తలనూ చదవండి:

వీఐపీల కోసం సింహాన్ని బైక్‌లతో తరిమిన పార్క్ సిబ్బంది.. వీడియో వైరల్

జంగిల్ సఫారీలో పర్యాటకులకు షాక్.. దూసుకొచ్చిన పెద్దపులి!

Updated Date - Nov 18 , 2026 | 03:22 AM