Share News

ఎంతకాలమీ నీతిబాహ్య రాజకీయాలు?

ABN , Publish Date - Apr 29 , 2026 | 05:12 AM

‘మే 4 తర్వాత నేను బీజేపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి మరోసారి బెంగాల్ రావాల్సి వస్తుంది’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారం చివరి రోజు ఆత్మవిశ్వాసంతో ప్రకటించారు. ‘ఒడిషా, బిహార్ తర్వాత...

ఎంతకాలమీ నీతిబాహ్య రాజకీయాలు?

‘మే 4 తర్వాత నేను బీజేపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి మరోసారి బెంగాల్ రావాల్సి వస్తుంది’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారం చివరి రోజు ఆత్మవిశ్వాసంతో ప్రకటించారు. ‘ఒడిషా, బిహార్ తర్వాత బెంగాల్‌లో కమలం వికసిస్తుంది’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ బెంగాల్ నలుమూలగా సీఏపీఎఫ్ దళాలను మోహరించింది. ‘ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా మరో రెండు నెలలు ఈ దళాలు బెంగాల్‌లోనే ఉంటాయి’ అని కేంద్ర హోంమత్రి అమిత్ షా అన్నారు.

ప్రజలను, ముఖ్యంగా మహిళా ఓటర్లను పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు మోదీ ప్రచార కార్యక్రమాలను ఉద్దేశిస్తే బెంగాల్‌లో 15 రోజులు మకాం వేసిన అమిత్ షా.. అతి సూక్ష్మ స్థాయిలో పార్టీ ఎన్నికల వ్యూహరచన చేయడంలో అపర చాణక్యుడు. ఒక రాష్ట్రాన్ని గెలుచుకునేందుకు ఈ నాయక ద్వయం ఎన్నికలకు ఎంతో ముందే పకడ్బందీ వ్యూహాన్ని రచిస్తుంది. గెలిచేందుకు కావల్సిన కథనాన్ని సృష్టిస్తారు. సామ దాన భేద దండోపాయాల్ని ప్రయోగిస్తారు. అన్ని వ్యవస్థల్నీ ఉపయోగించుకుంటారు. 2.5 లక్షలమంది భద్రతా బలగాలతో బెంగాల్‌ను ఒక రణరంగంగా మార్చివేశారు. ఇన్ని చేసినా బెంగాల్‌లో బీజేపీ అధికారానికి రాగలుగుతుందా? ప్రజలు మార్పు కోరుకుని, హిందువులు సంఘటితమై, మహిళలు ఎక్కువ సంఖ్యలో మొగ్గు చూపితే, వ్యవస్థలు పూర్తిగా సహకరిస్తే బీజేపీ విజయం ఖాయమే. అయితే బెంగాల్‌ ప్రజలు మమతా బెనర్జీని తమ అస్తిత్వానికి చిహ్నంగా భావించి, హిందూత్వ ప్రభావాలకు లోను కాకపోతే తృణమూల్ కాంగ్రెస్ వరుసగా నాలుగోసారి అధికారంలోకి వచ్చి తీరుతుంది.

నిజానికి రాహుల్‌గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ కూడా బెంగాల్లో మమతా బెనర్జీ విజయం సాధించాలనుకోవడం లేదు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఇండియా కూటమి కలిసికట్టుగా పార్లమెంటులో ప్రతిఘటించినప్పుడు తృణమూల్ అండగా నిలిచింది. ఆ మరునాడే రాహుల్‌గాంధీ బెంగాల్‌లో పర్యటించి మమతా బెనర్జీ అవినీతి పాలనను తీవ్రంగా విమర్శించారు. బెంగాల్‌లో హిందూ ఓటర్లు సంఘటితం కావడానికి ఆమె విధానాలే కారణమని నిరసించారు. ఒకవైపు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ మమతా బెనర్జీకి మద్దతుగా ప్రచారం చేస్తే.. కాంగ్రెస్, వామపక్షాలు ఆమెను తీవ్రంగా దుయ్యబట్టాయి. వాటి వైఖరి ఇండియా కూటమిలో చీలికను ప్రస్ఫుటం చేయడమేగాక, బీజేపీకి ఎంతో కొంత ఉపయోగపడే అవకాశాలున్నాయి. గతంలో వెంకయ్యనాయుడు అభివర్ణించినట్లుగా కాంగ్రెస్ ‘ఢిల్లీలో దోస్తీ, గల్లీల్లో కుస్తీ’ అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఒకవైపు బీజేపీ జాతీయ స్థాయిలోనే కాక, ప్రాంతీయ స్థాయిలో కూడా ఎన్డీఏలోని వివిధ శక్తుల్ని సంఘటితం చేస్తే కాంగ్రెస్ దేశమంతటా బీజేపీని ఎదుర్కోగల బలమైన కూటమిని ఏర్పర్చుకోలేకపోతోంది. ఇది ఆ పార్టీ బలహీనతను ఎత్తి చూపుతోంది.


మమతా బెనర్జీ పట్ల మాత్రమే కాకుండా, కేజ్రీవాల్ విషయంలో కూడా కాంగ్రెస్ ఒకే వైఖరి అవలంబిస్తోంది. అందుకు కారణాలు లేకపోలేదు. అయితే దేశంలో స్వతంత్రంగా వ్యవహరించే ప్రాంతీయ పార్టీలు ఒంటరై, ఆత్మరక్షణలో పడుతున్నాయనడానికి ఇది నిదర్శనం.

ఒకవైపు బెంగాల్ ఎన్నికల హోరు సాగుతుండగానే మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు ఎంపీలు బీజేపీలో చేరడం విస్మరించలేని ఆసక్తికర పరిణామం. ఇది సూచిస్తున్నదేమిటి? ప్రస్తుత అసెంబ్లీ పోరాటాలు ఇంకా ముగియక ముందే మరో ఎనిమిది నెలల తర్వాత ఎన్నికలు జరిగే పంజాబ్‌పై బీజేపీ అగ్రనేతలు దృష్టి సారించారు! ఆ రాష్ట్రంలో ఆప్ ప్రభుత్వంపై ప్రబలుతోన్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని అక్కడ బీజేపీని బలోపేతం చేసేందుకు పకడ్బందీగా వ్యూహరచన చేసినట్లు కనపడుతోంది. పంజాబ్‌లో ఆప్ విజయానికి కారకుడైన రాఘవ్ చద్దాను లోబరుచుకుని, ఇతర ఎంపీలను ఈడీ, సీబీఐ కేసులతో భయభ్రాంతులకు గురి చేసిందన్న విమర్శలకు తావున్నప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ వ్యవహార శైలి కూడా ఈ విపరిణామానికి కారణమనడంలో సందేహం లేదు. వన్ మ్యాన్ పార్టీ అయిన ఆప్‌ను పంజాబ్‌లోనే కాదు, ఢిల్లీలో కూడా బలహీనపరిచేందుకు, ఆ పార్టీ నేతలను తమ వైపునకు తిప్పుకునేందుకు బీజేపీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇదీ బీజేపీ నీతి. దేశ రాజకీయాల్లో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు, ప్రత్యర్థి పార్టీలను బలహీనపరిచేందుకు అన్ని ఆయుధాలు ప్రయోగించడంలో బీజేపీ అగ్రనేతలు ఆరితేరారు.

రాజ్యసభ సీట్లను ఆప్‌ విక్రయించిన తీరు కూడా ఈ భ్రష్ట రాజకీయానికి దారితీసింది. సీట్లను కొనుగోలు చేసిన వారిని భయపెట్టడం, మళ్లీ కొనుగోలు చేయడం పెద్ద విషయం కాదు. యోగేంద్రయాదవ్, ప్రశాంత్ భూషణ్, అశుతోష్, షాజియా ఇల్మీ లాంటి వారిని అవమానించి బయటకు పంపి పారిశ్రామికవేత్తలు, కోటీశ్వరులను అందలాలు ఎక్కించడమే ఆప్‌ను నైతికంగా బలహీనపరిచింది. పశ్చిమబెంగాల్‌లో మమత పార్టీ ప్రాంతీయ రాజకీయ పక్షమే అయినప్పటికీ సాగరికా ఘోష్ వంటి జర్నలిస్టును, మేనకా గురుస్వామి వంటి న్యాయవాదిని, అణగారిన వర్గాలకు చెందిన మమతా బాలా థాకూర్‌ను రాజ్యసభకు పంపించారు. సీపీఎం కేరళ నుంచి జాన్ బ్రిటాస్ అనే జర్నలిస్టును రాజ్యసభకు పంపింది. ఇలాంటి వారిని బీజేపీ తమ వైపునకు తిప్పుకోగలదా? ప్రాంతీయ పార్టీలు పార్లమెంటుకు ఎవరిని పంపించాలన్న విషయంలో ఎంత ఆచితూచి వ్యవహరించాలో ఈ ఘట్టం తెలియజేస్తోంది.


ఏడుగురు ఆప్‌ ఎంపీలు ఒక శుభోదయాన తమ పార్టీని వదిలి మరో పార్టీలో చేరడం భారతదేశ రాజకీయాలు ఎంత హీనమైన స్థితికి చేరుకున్నాయో చెప్పేందుకు ఒక బలమైన ఉదాహరణ. నిన్నటి వరకు బీజేపీని సీబీఐ, ఈడీలను ప్రయోగించే గూండాల పార్టీగా అభివర్ణించిన రాఘవ్ చద్దా, ఆయన స్థానంలో విప్‌గా నియమితుడైన అశోక్ మిట్టల్ బీజేపీకి ఫిరాయించడం ద్వారా ఏ సంకేతాలను పంపిస్తున్నారు? ఇలాంటి వారిని ఎంపీలుగా చేసేందుకే పార్లమెంటులో సీట్లు పెంచాలనుకుంటున్నారా? ప్రజల నుంచి నేరుగా ఎన్నిక కాని రాజ్యసభ ఎంపీలను వారి పార్టీ ఎమ్మెల్యేలే ఎన్నుకుంటారు. ఆ ఎమ్మెల్యేలు అదే పార్టీలో ఉన్నప్పుడు రాజ్యసభలో ఉన్నవారు మాత్రం ఫిరాయించడం చట్టబద్ధం ఎలా అవుతుంది? ప్రస్తుతం అమలులో ఉన్న ఫిరాయింపుదారుల చట్టం ఫిరాయింపులను అరికట్టడానికి కాకుండా చట్టంలోని లొసుగులను ఉపయోగించుకుని చట్ట విరుద్ధ చర్యలను ప్రోత్సహించడానికేనన్న విషయం స్పష్టమవుతోంది. సైద్ధాంతిక నిబద్ధత, రాజకీయ నైతికతను విస్మరించి స్వార్థ రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చినప్పుడు మిగతా వ్యవస్థలు దిగజారకుండా ఉంటాయా? ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మహాశయుడు భారతదేశాన్ని ‘యమకూపం’ అని అభివర్ణిస్తూ అన్న మాటలు పూర్తిగా అసంబద్ధమైనవి. ప్రముఖ రష్యన్‌ రచయిత అలెగ్జాండర్ కుప్రిన్ ‘యమకూపం’ పేరుతో వ్యభిచారంపై రాసిన నవలను ట్రంప్‌ వ్యాఖ్యలు గుర్తు చేస్తున్నాయి. వ్యవస్థలు ఏ నీచ కార్యాలను తాము నిరోధిస్తామని చెప్పుకుంటాయో వాటినే ప్రోత్సహిస్తాయని కుప్రిన్ చాటిన సత్యం ఫిరాయింపుదారుల చట్టానికి కూడా పూర్తిగా వర్తిస్తుంది. ఈ చట్టంలో ఉన్న విలీనం అన్న నిబంధన చట్టబద్ధ పరిధిలోనే ఫిరాయింపులకు ఆస్కారం కలిగిస్తుంది. అయినా చట్టంలో ఒక పార్టీ విలీనం గురించి ప్రస్తావించారు కానీ పార్లమెంటరీ పార్టీ విలీనం గురించి చెప్పలేదు కదా. పార్లమెంటరీ పార్టీ నిజమైన పార్టీ ఎలా అవుతుంది? ఒక పార్లమెంటరీ పార్టీ కానీ, శాసనసభా పార్టీ కానీ తమ రాజకీయ పార్టీ వైఖరికి భిన్నంగా స్వతంత్రంగా వ్యవహరించకూడదని ఏక్‌నాథ్ షిండే కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్ ఇచ్చిన తీర్పు ఆప్ ఎంపీల విలీనం విషయంలో వర్తించదా? రాజకీయ పార్టీ అంటే పార్లమెంటరీ పార్టీయే అని నిర్వచించినప్పుడు రాజ్యాంగంలోని పదో షెడ్యూలు పనికిరాకుండా పోతుందని సుప్రీంకోర్టు 2003లోనే స్పష్టం చేసింది. 2019లో బొంబాయి హైకోర్టు గోవా బెంచ్ ఈ తీర్పుకు భిన్నంగా వ్యవహరించి, గోవాలో కాంగ్రెస్ ఎంపీల ఫిరాయింపు విలీనమేనని చెప్పింది. దీన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు వెంటనే విచారించడానికి ఉత్సుకత ప్రదర్శించకపోవడంతో ఆ పిటిషన్‌కు కాలం చెల్లింది. ఈ లోపు గోవా అసెంబ్లీ కాలపరిమితి పూర్తయి 2022లో మళ్లీ ఎన్నికలు జరగడమే ఇందుకు కారణం. ఇప్పుడు రాజ్యసభలో బీజేపీలో ఆప్‌ విలీనం రాజ్యాంగ వ్యతిరేకమని దాఖలైన పిటిషన్‌కు సుప్రీంలో ఎప్పుడు మోక్షం లభిస్తుందో చెప్పలేము.


దేశానికి ఎంతో ఉపయోగకరమైన చట్టాలు చేస్తున్నామని చెప్పుకుంటున్న బీజేపీ ప్రభుత్వం రాజకీయాల్లో అనైతిక ఫిరాయింపులను నివారించే చట్టాన్ని ఎందుకు తీసుకురావడం లేదు? అటువంటి చట్టాన్ని చేయనంతవరకూ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా ఫిరాయిస్తూనే ఉంటారు. తననుతాను భిన్నమైన పార్టీనని చెప్పుకునే బీజేపీ, గతంలో ఆయారామ్, గయారామ్ సంస్కృతిని ప్రవేశపెట్డిన కాంగ్రెస్‌కు భిన్నంగా ప్రవర్తిస్తుందా? లేదు కదా. ఎంతకూ ఎన్నికల్లో గెలవడం, దేశమంతటా విస్తరించడానికే ప్రాధాన్యమిస్తోంది. రాజకీయాల్లో నైతిక విలువలను పెంపొందించడంపై చర్చను ప్రేరేపించడం లేదు. కాంగ్రెస్ గతంలో చేసిన తప్పిదాల మూలంగానే ప్రజలు బీజేపీని ఆహ్వానించారు. గత కొద్ది సంవత్సరాల వరకూ బీజేపీలో కూడా ఎన్ని తప్పిదాలు జరిగినా కాంగ్రెస్ అకృత్యాలను దృష్టిలో పెట్టుకునే కమలనాథులను ప్రజలు ఆదరించారు. అయితే ఔషధానికి కాలపరిమితి ఉన్నట్లు ఒక రాజకీయ పార్టీకి లభించే ఏ ఆదరణకైనా కాలపరిమితి ఉంటుంది. నిన్నమొన్నటి వరకూ రాఘవ్ చద్దాకు సోషల్ మీడియాలో ఎంతో ఆదరణ ఉండేది. ఎప్పుడైతే ఆయన బీజేపీలో చేరారో 20లక్షల మందికి పైగా తనను దూరం పెట్టారు. నాయకులు దిగజారడం ప్రారంభమయినప్పుడు ప్రజల దృష్టిలో వారు భ్రష్ట నేతలు కావడానికి ఎక్కువ సమయం పట్టదు.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

ఈ వార్తలు కూడా చదవండి

పెళ్లి పేరుతో రూ.కోట్ల వసూలు.. అషురెడ్డిపై ధర్మేంద్ర తీవ్ర ఆరోపణలు

తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్

Updated Date - Apr 29 , 2026 | 05:12 AM