Share News

నితీశ్‌ నిష్క్రమణ సూచిస్తున్నదేమిటి?

ABN , Publish Date - Mar 11 , 2026 | 02:22 AM

రెండు దశాబ్దాల నాటి మాట. 2006 జనవరిలో హైదరాబాద్‌లోని బాలయోగి ఆడిటోరియంలో కనీవినీ ఎరుగని రీతిలో కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఆయన సహచరుడు కేవీపీ...

నితీశ్‌ నిష్క్రమణ సూచిస్తున్నదేమిటి?

రెండు దశాబ్దాల నాటి మాట. 2006 జనవరిలో హైదరాబాద్‌లోని బాలయోగి ఆడిటోరియంలో కనీవినీ ఎరుగని రీతిలో కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఆయన సహచరుడు కేవీపీ రామచంద్రరావు రాత్రింబగళ్లు కష్టపడి ఈ ప్లీనరీని దిగ్విజయంగా నిర్వహించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ హైదరాబాద్‌లో జరిగిన ఏర్పాట్లు చూసి పొంగిపోయారు. ఇక ఆ తర్వాత జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కేవీపీకి రాజ్యసభ సీటు ఖాయమేనని ఊహాగానాలు వచ్చాయి. అభ్యర్థుల ఎంపిక సమీపిస్తున్న సమయంలో ఒక రోజు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌ను అడిగినప్పుడు కేవీపీకే రాజ్యసభ సీటు వచ్చే అవకాశాలున్నాయని చెప్పారు. ఆ విషయం వార్తగా రాశాను. మరునాడు దిగ్విజయ్‌సింగ్‌ను మీడియా కలిసినప్పుడు ‘కేవీపీకి రాజ్యసభ సీటు ఇస్తారని వార్త వచ్చింది కదా.. ఆయనకే ఇస్తున్నారా?’ అని ఒక మిత్రుడు అడిగాడు. ‘ఎవరు చెప్పారు మీకు.. ఇంతకీ కేవీపీ ఎవరు?’ అని దిగ్విజయ్‌సింగ్ నవ్వుతూ అడిగారు. ఒక్క రోజులోనే కాంగ్రెస్ అధిష్ఠానం మూడ్ మారిపోయింది. వైఎస్ ప్రత్యర్థులు కొందరు ఢిల్లీలో అధిష్ఠానానికి లేనిపోనివి చెప్పి సోనియా మనసు మార్చేశారు. ఆ రోజుల్లో దాదాపు 16 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉండేది. ప్రతి చిన్న విషయానికీ వైఎస్ ఢిల్లీకి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చేది. తన ఆత్మబంధువుకు రాజ్యసభ సీటు వచ్చేందుకు ఆయన మరో రెండేళ్లు వేచి ఉండాల్సి వచ్చింది.

వైఎస్ నాటి పరిస్థితితో పోలిస్తే ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అత్యంత బలవంతుడనే చెప్పాలి. నాడు వైఎస్ తన కుడిభుజంకు రాజ్యసభ సీటు అడిగిన వెంటనే ఇప్పించలేకపోయారు కాని రేవంత్ వేం నరేందర్‌ రెడ్డికి సీటు ఇప్పించడంలో కృతకృత్యులు కాగలిగారు. కొన్ని దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో విశ్వాసపాత్రుడుగా ఉన్న వైఎస్ తన సోదరుడు వివేకానందరెడ్డిని రాజీనామా చేయించి తన కుమారుడు జగన్మోహన్‌రెడ్డికి కడప సీటు ఇప్పించాలనుకున్నా అధిష్టానం అందుకు ఒప్పుకోలేదు. కాంగ్రెస్ అధిష్ఠానాన్ని మెప్పించేలా చేసుకోవడానికి వైఎస్‌కు చాలా సంవత్సరాలు పట్టింది. ఆయన చనిపోయిన తర్వాత అధిష్టానం ఆయన కుమారుడిపై కేసులు పెట్టించేందుకు కూడా వెనుకాడలేదు. కాని రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన నాలుగేళ్లలోపే పీసీసీ అధ్యక్షుడు కావడం, ఆ తర్వాత నాలుగేళ్లకే ముఖ్యమంత్రి కావడం, రాజ్యసభ సీటు విషయంలోనే కాదు, చాలా అంశాల్లో అధిష్ఠానం ఆయన మాటలకు తలొగ్గేలా చేసుకోవడం వెనుక విజయ రహస్యం ఏమిటి?


తాజాగా జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి వేం నరేందర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి ఎంత రాజకీయ ప్రాముఖ్యత ఉన్నదో, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ రాజ్యసభకు పోటీ చేయాలని తీసుకున్న నిర్ణయానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉన్నదని చెప్పక తప్పదు. ఒకటి మారిన కాంగ్రెస్ అధికార సంస్కృతిని సూచిస్తే రెండవ పరిణామం దేశమంతటా విస్తరిస్తున్న బీజేపీ రాజకీయ అధిపత్య సంస్కృతిని ప్రతిబింబిస్తోంది. బిహార్‌లో దాదాపు రెండు దశాబ్దాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న, ఎన్డీఏ కూటమి గెలుపులో కీలక పాత్ర పోషించిన నితీశ్‌కుమార్ సీఎం పదవిని వదులుకోవడంపై ఆ పార్టీ నేతలు ఇప్పటికీ దిగ్భ్రాంతి నుంచి తేరుకోలేదు. జనతాదళ్(యు) పార్టీ అంతర్గత సమావేశాల్లో పలువురు ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించారు. నితీశ్‌కుమార్ 1 అన్నేమార్గ్ నివాసం బయట ఉన్న పార్టీ కార్యాలయాన్ని జేడీ(యూ) కార్యకర్తలు ధ్వంసం చేశారు. నితీశ్‌ రాజీనామా వెనుక అజ్ఞాత కుట్రదారులు ఉన్నారంటూ నినాదాలు చేశారు. నిన్నమొన్నటి వరకూ నితీశ్‌ కుమారుడు నిశాంత్ రాజకీయాల్లోకి వస్తారని ఎవరూ ఊహించలేదు. పైగా నితీశ్‌ పలు సందర్భాల్లో వారసత్వ రాజకీయాలను తీవ్రంగా విమర్శించారు. తన ఇష్టప్రకారమే రాజ్యసభకు రావాలనుకుంటున్నానని నితీశ్‌ ఎన్ని చెప్పినా ఆయన ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడం సహజంగా జరిగిన పరిణామం కాదని ప్రస్తుతం దేశ రాజకీయాలు నడుస్తున్నతీరు గమనిస్తున్న ప్రతి ఒక్కరికీ అర్థమవుతోంది.

నిజానికి నితీశ్‌ పాట్నాను వదులుకుని ఢిల్లీకి రావడానికి అవసరమైన స్క్రిప్టు బీజేపీ ఎప్పటి నుంచో రచిస్తోందని తెలుస్తోంది. ఫిబ్రవరి చివరి వారంలో హోంమంత్రి అమిత్ షా సీమాంచల్ ప్రాంతంలో మూడు రోజుల పాటు జరిగిన పర్యటనలో పార్టీ నేతలతో జరిపిన కీలక చర్చల తర్వాత ఈ మేరకు నిర్ణయం జరిగిందని, మధ్యవర్తుల ద్వారా నితీశ్‌తో సంప్రదింపులు జరిపి తప్పుకోక తప్పదని తేల్చారని రాజకీయ కథనాలు వచ్చాయి. అయితే హిందీ బెల్ట్‌ను పూర్తిగా వశపరుచుకున్న భారతీయ జనతా పార్టీ బిహార్‌ను కూడా పూర్తిగా కైవశం చేసుకోవాలని ఎప్పటి నుంచో వ్యూహరచన చేస్తోంది. బిహార్‌ను పూర్తిగా సైద్ధాంతికంగా స్వాధీనం చేసుకునేందుకు బీజేపీ పావులు కదిపినందువల్లే ఈ పరిణామం జరిగిందని, తద్వారా మొత్తం ఉత్తర భారతంలో అధికార రాజకీయాలను తన పట్టులోకి తీసుకు రాగలిగిందని అనేక మంది రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 18శాతం ముస్లింలు, బంగ్లాదేశ్‌తో సరిహద్దు ఉన్న బిహార్‌ను హిందూత్వ, జాతీయవాదం విషయంలో ప్రయోగశాలగా మార్చాలని బీజేపీ భావించడంలో ఆశ్చర్యం లేదు. ఈ పరిణామం ఒక రకంగా రక్తరహిత తిరుగుబాటు అని అభివర్ణించినవారు కూడా ఉన్నారు. మండల్ రాజకీయాల మూలంగా బిహార్‌లో పెల్లుబుకిన సామాజిక శక్తుల్లో భాగంగా. సోషలిస్టు నేత కర్పూరీ ఠాకూర్ శిష్యులైన లాలూప్రసాద్ యాదవ్, నితీశ్‌కుమార్ తమను ఎవరూ విస్మరించలేని శక్తులుగా ప్రభవించారు. వెనుకబడిన వర్గాలకు ఒక గౌరవం కల్పించారు.


ఆడ్వాణీ నిర్వహించిన రామ్ రథయాత్రను లాలూప్రసాద్ అడ్డుకున్న బిహార్‌లోనే బీజేపీ అధికారంలోకి రావడానికి చారిత్రక ప్రాధాన్యత ఉన్నది. ఈ చారిత్రక ప్రాధాన్యతకు వీలుకల్పించిన నితీశ్‌కుమార్ బీజేపీ కోసం తన పదవిని వదులుకోవడం మొత్తం దేశంలో జరిగే కీలక పరిణామాలకు కూడా నాంది కావవచ్చని విశ్లేషించేవారు కూడా ఉన్నారు.

దేశంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా 1988లో వీపీసింగ్ నాయకత్వంలో ఉద్భవించిన జనతాదళ్‌కు ఒక చరిత్ర ఉన్నది. 1989లో తెలుగుదేశం భాగస్వామిగా ఉన్న నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో అది కీలకపాత్ర పోషించింది. 1991లో అది మూడో అతిపెద్ద పార్టీగా అవతరించింది. పీవీ అనంతరం ఢిల్లీలో యునైటెడ్ ఫ్రంట్ సర్కార్‌లో కూడా జనతాదళ్‌దే కీలక భాగస్వామ్యం. ఆ తర్వాత అది ముక్కలు చెక్కలైనా ఒడిషాలో బిజూ జనతాదళ్, కర్ణాటకలో జనతాదళ్(ఎస్), బిహార్‌లో రాష్ట్రీయ జనతాదళ్, జనతాదళ్(యూ) రూపేణా అస్తిత్వం నిలుపుకుంది. కాని ఇప్పుడు బిహార్‌లో జనతాదళ్(యూ) అధికారాన్ని బీజేపీకి అప్పగించడం మొత్తం జనతాదళ్ చరిత్రకు అంతిమ ఘట్టంగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఒడిషా, కర్ణాటకలో జనతాదళ్ వర్గాలు అస్తిత్వం కోల్పోయేందుకు బీజేపీ అవలంబించిన రాజకీయ వ్యూహాలు చరిత్ర పుటల్లో నమోదు అయ్యాయి. పాత జనతాదళ్‌లో భాగమైన లాలూప్రసాద్ యాదవ్ అవినీతి కేసుల్లో ఇరుక్కుని రాజకీయ విరమణ చేశారు. రాంవిలాస్ పాశ్వాన్ మరణించారు. నితీశ్‌ నేతృత్వంలోని జనతాదళ్(యూ) చరమఘట్టం ఇపుడే ప్రారంభమైంది.

గత ఏడాది జరిగిన బిహార్ ఎన్నికలు పూర్తిగా నితీశ్‌ నాయకత్వంలోనే జరిగాయి. తొలుత నితీశ్‌ను ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థిగా ప్రకటించేందుకు బీజేపీ వెనుకాడినప్పటికీ తర్వాత రాజీపడాల్సి వచ్చింది. ‘పచ్చీస్ సే తీస్ (2025 నుంచి 2030 వరకు), ఎక్ బార్ ఫిర్ నితీష్’ అన్న నినాదంలో ఎన్నికల బరిలో ప్రవేశించారు. కాని మరో నాలుగేళ్లుండగానే, నాలుగు నెలల్లోనే నితీశ్‌ పాలనకు స్వస్తి పలికారు. అమిత్ షా స్వయంగా దగ్గరుండి రాజ్యసభకు నితీశ్‌తో నామినేషన్ వేయించారు.


నిజానికి బీజేపీకి 2020, 2025 ఎన్నికల్లో జేడీ(యూ) కంటే ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ నితీశ్‌ రాజకీయ అవసరం రీత్యా ఆయననే ముఖ్యమంత్రిగా కొనసాగించింది. ఇప్పుడు తానే అధికారంలోకి రావాలని నిర్ణయించుకున్నదంటే నితీశ్‌ను పూర్తిగా నిర్వీర్యం చేసి ఉండాలి. 2024లో ఎన్డీఏ సమావేశంలోను తన ప్రమాణ స్వీకారం తర్వాత పాట్నా విమానాశ్రయంలోనూ మోదీ కాళ్లు మొక్కేందుకు నితీశ్‌ ప్రయత్నించడమే ఇందుకు నిదర్శనం. ఆయన అనారోగ్యం కూడా ఆయన బలహీనతకు తోడయింది. లాలూప్రసాద్ నుంచి విడివడి తన సొంత పార్టీని నిర్మించిన నితీశ్‌ సాధారణ వ్యక్తి కాదు. తొలి రోజుల్లో జనతాదర్బార్ నిర్వహించి స్వయంగా ప్రజల సమస్యలను పరిష్కరించేవారు. ఇటుక, ఇటుక పేర్చి అతి వెనుకబడిన యాదవేతర వర్గాలను దరి చేర్చుకున్నారు. సుశాసన్ బాబుగా పేరొందారు. మహిళల ఆదరణ చూరగొన్నారు. తన 20 ఏళ్ల పాలనలో బిహార్‌లో ఎంతో కొంత మార్పు తీసుకువచ్చారు. గత ఎన్నికల్లో జేడీ (యూ) కంటే కేవలం నాలుగు సీట్లు తక్కువ సాధించినప్పటికీ ఆ పార్టీని వశపరుచుకుని బిహార్‌లో తాము స్వంతంగా రాజకీయాలు నిర్వహించగలమని, నితీశ్‌కుమార్ సమీకరించిన వర్గాలనన్నిటినీ తమవైపునకు తిప్పుకోగలమని బీజేపీకి ధీమా వచ్చి ఉండాలి. 2024లో మహారాష్ట్రలో ఎన్డీఏ విజయం తర్వాత అప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న శివసేన చీలికవర్గం నేత ఏక్‌నాథ్ షిండేను పక్కకు తప్పించి బీజేపీ తమ నేతను ముఖ్యమంత్రిగా నియమించింది. బిహార్‌లో దాదాపు అదే ఫార్ములాను అవలంబించినప్పటికీ నితీశ్‌కుమార్‌ను నాలుగు నెలల పాటు సీఎంగా కొనసాగించేందుకు అంగీకరించింది. కాళ్లు మొక్కినంత మాత్రాన, అతిగా పొగిడినంత మాత్రాన బీజేపీలో వ్యక్తులపై అంచనాలు మారవు.

అన్నిటికన్నా మించి దేశంలో రెండు పార్టీల వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న బీజేపీ సంకల్పం బిహార్‌లో నెరవేరింది. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీతోనూ, పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌తోనూ తలపడుతున్న బీజేపీ దేశవ్యాప్తంగా కూడా ఇదే దిశన అడుగులు వేస్తోంది. అధ్యక్ష తరహా మాదిరి 2029లో జరిగే జమిలి ఎన్నికల్లో ఒక వైపునకు తిరుగులేని నేతగా నరేంద్రమోదీ సన్నద్ధమవుతున్నారు. అవతలి వైపు నుంచి ప్రతిపక్షాలు ఎవర్ని సిద్ధం చేస్తున్నాయి? ఈ పోరులో ఇతర ప్రాంతీయ పార్టీల నేతల భవితవ్యం ఏమిటి?

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

ఇవి కూడా చదవండి..

సుదీర్ఘ యుద్ధానికి సిద్ధం... ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారు కమల్ ఖరాజీ

నౌకల స్వాధీనం కంటే ముంచేయడమే సరదాగా ఉంటుంది.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

Updated Date - Mar 11 , 2026 | 02:26 AM