Share News

కాక్రోచ్‌ దండు కదను తొక్కిన వేళ..

ABN , Publish Date - Jul 22 , 2026 | 01:02 AM

‘చరిత్ర గమనాన్ని మార్చడానికి గొప్ప శక్తులు అవసరం లేదు. తమ లక్ష్యంపై మొక్కవోని విశ్వాసంతో రగిలిపోతున్న దృఢ సంకల్పం గల కొద్దిమంది వ్యక్తుల సమూహం కూడా మార్పును సాధ్యం చేయగలదు ’అని...

కాక్రోచ్‌ దండు కదను తొక్కిన వేళ..

‘చరిత్ర గమనాన్ని మార్చడానికి గొప్ప శక్తులు అవసరం లేదు. తమ లక్ష్యంపై మొక్కవోని విశ్వాసంతో రగిలిపోతున్న దృఢ సంకల్పం గల కొద్దిమంది వ్యక్తుల సమూహం కూడా మార్పును సాధ్యం చేయగలదు ’అని మహాత్మాగాంధీ అన్నారు. భారతదేశం ఇప్పుడు ఒక అనిర్వచనీయ మార్పు దిశగా సాగుతున్నట్లు కనపడుతోంది. నీట్ ప్రశ్నపత్రాల లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ నెల రోజులుగా నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) కార్యకర్తలు సోమవారం దేశ రాజధానిలో వర్షాకాల సమావేశాల తొలి రోజు పార్లమెంటును ముట్టడించడం ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న ఒక బృహత్పరిణామం అని చెప్పక తప్పదు. నాలుగంచెల బారికేడ్లు ఏర్పాటు చేసి, రాపిడ్ యాక్షన్ ఫోర్స్, సీఆర్పీఎఫ్, ఢిల్లీ, త్రిపుర పోలీసు బలగాలను పెద్ద ఎత్తున మోహరించినా, మెట్రో స్టేషన్లను మూసివేసినా, ఇంటర్నెట్ దిగ్బంధనం చేసినా సరే.. వేల సంఖ్యలో ఉన్న కాక్రోచ్ దండు పార్లమెంటు గేట్ల వరకు దూసుకెళ్లింది. పోలీసులు చితకబాదుతున్నా యువతీ యువకులు తెగింపు ప్రదర్శించారు. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో గాయాలతో పడి ఉన్న యువతీ యువకులే సోమవారం నాటి దమనకాండకు ప్రత్యక్ష సాక్షులు.

ఒక దశాబ్దానికి పైగా ప్రతిపక్షాలు ఎన్ని దాడులు, విమర్శలు చేసినా చలించని మోదీ ప్రభుత్వం బొద్దింకల తిరుగుబాటు ఉదంతంతో ఆత్మరక్షణలో పడ్డట్లు స్పష్టమవుతోంది. కాక్రోచ్ పార్టీ ప్రారంభించిన ఉద్యమంలో ఎంతమంది పాల్గొన్నారు అన్నది ముఖ్యం కాదని, దాని ప్రభావం ఎంత మేరకు ఉన్నది అన్నదే ముఖ్యమని బీజేపీ ఎంపీ ఒకరు చెప్పారు. ‘మా నాన్న బీజేపీలో అతి ముఖ్యమైన నాయకుడు. అయితే సంభవిస్తున్న పరిణామాలు అంత ఆరోగ్యకరంగా లేవు..’ అని జంతర్ మంతర్ ధర్నాలో పాల్గొన్న ఒక యువకుడు అన్నారు. ‘రాజకీయ నాయకులు విఫలమైన చోట పిల్లలే ప్రశ్నిస్తారు..’ అని ఒక విద్యార్థి అన్నారు.

నిజానికి కాక్రోచ్ జనతా పార్టీ ఒక సంస్థ కాదు. దేశ వర్తమాన చరిత్రలో దిక్కుతోచని యువతీ యువకుల సమూహమది. జంతర్ మంతర్ వద్ద ధర్నాకు వచ్చినవారు కానీ, ఊరేగింపులో పాల్గొన్నవారు కానీ ఎవరో డబ్బులిచ్చి పిలిస్తే వచ్చినవారు కాదు. వారి రాక కోసం ఎవరూ బస్సులు, రైళ్లు ఏర్పాటు చేయలేదు. కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చే వారిని ఢిల్లీకి బయలుదేరేలా చేసింది. కేవలం నీట్ ప్రశ్న పత్రాల లీక్‌కు మాత్రమే రగిలిపోతూ వారు రాలేదు. యువత ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా నిరుద్యోగం, చాలీచాలని జీతాలు, వ్యవస్థలో లోపాలు, రాజకీయ పార్టీల కుతంత్రాలను చూసి విసిగిపోయినవారే ఆ వచ్చిన యువతీయువకులు. జంతర్ మంతర్ ధర్నా స్థలానికి వచ్చిన వారికి ఒక లక్ష్యం అంటూ ఏమీ లేదు. 14–28 సంవత్సరాల మధ్య వయసు ఉన్న యువతను లెఫ్ట్, రైట్ అనే సిద్ధాంతాల మూసలో ఇమడ్చలేము. ఎమర్జెన్సీ వారి అనుభవంలో లేదు. ఒకప్పుడు ప్రతిపక్షాలను ఏకం చేసిన లోక్‌నాయక్‌ జయప్రకాశ్ నారాయణ్ గురించి వారికి తెలియదు. మండల్, కమండల్ ఉద్యమాల అనుభవం సైతం వారికి లేదు. మూడు దశాబ్దాల క్రితం జరిగిన సంఘటనల జ్ఞాపకాలు వారికి లేవు. వర్తమాన సమస్యలతో సతమతమవుతూ తాము ఏమి చేయాలో తేల్చుకోలేక, భవిష్యత్తు అగమ్యగోచరమై, రకరకాల ప్రశ్నలతో వచ్చినవారు.. వారు ఏ సంప్రదాయక సూత్రాలకూ కట్టుబడి లేరు. తామే ప్రశ్నలు వేసుకుంటూ, తామే జవాబులు ఇచ్చేందుకు గడచిన నాలుగు వారాలుగా ఈ ధర్నా వేదిక వారికి ఉపయోగపడింది. ఆ నిరసన గురించి సోషల్ మీడియాలో విశేషంగా ప్రచారమయింది. మూడు వారాలకు పైగా నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై యువత ఎంత ఆందోళన చెందిందో ప్రత్యామ్నాయ మీడియా సాధనాల్ని పరిశీలిస్తే అర్థమవుతుంది.


ప్రతిపక్షాలకు విశ్వసనీయత లేదని, అందుకే తమకు ప్రత్యామ్నాయం అంటూ ఏమీ లేదని, తాము ఏమి చేసినా చెల్లుతుందని విశ్వసించిన మోదీ సర్కార్‌.. కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావాన్ని తక్కువ అంచనా వేసినట్లే కనిపిస్తోంది. సాగునీటి చట్టాలపై రైతులు, పౌరసత్వ సవరణ చట్టంపై ముస్లింలు సుదీర్ఘకాలం చేసిన నిరసన ప్రదర్శనలను మోదీ ప్రభుత్వం అవలీలగా ఎదుర్కోగలిగింది. తమపై జరిగిన అత్యాచారాల్ని ప్రశ్నించిన మహిళా మల్లయోధుల ఆక్రందననూ ఆలకించలేదు. దేశంలో ఏ ఉద్యమం జరిగినా దాని విశ్వసనీయతను దెబ్బతీసేందుకు రకరకాల మార్గాలను అవలంబించింది. ఆందోళనకారులను రకరకాల పేర్లతో దుయ్యబట్టింది. ఇప్పుడు పోటెత్తిన యువత ఆందోళనను శాంతిభద్రతల సమస్యగా భావించి, దాన్ని అణచివేస్తే సరిపోతుందని మోదీ సర్కార్‌ భావించింది. కాక్రోచ్ పార్టీ నిరసన ప్రదర్శన తారస్థాయికి చేరుకుంటున్న సమయంలో ఢిల్లీ పోలీసు కమిషనర్ సతీశ్‌ గోల్చాను తొలగించి ఆయన స్థానంలో ఇప్పటి వరకూ స్పెషల్ డైరెక్టర్ (ఇంటెలిజెన్స్‌)గా ఉన్న అనురాగ్ కుమార్‌ను నియమించారు. జమ్మూ–కశ్మీర్ డెస్క్ ఇన్‌చార్జిగా ఆయన.. కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను విచ్ఛిన్నం చేయడంలో కీలకపాత్ర పోషించారు. అలాంటి వ్యక్తి అదే మనస్తత్వంతో యువతీ యువకుల ఆందోళనను అణచివేసే ప్రయత్నం చేయడంలో ఆశ్చర్యం లేదు.

యూపీఏ ప్రభుత్వ హయాంలో కూడా నిర్భయ అత్యాచారానికి వ్యతిరేకంగా యువతీ యువకులు వీధుల్లోకి వెల్లువెత్తారు. అయితే నాడు సోషల్ మీడియా ఇప్పుడున్నంత ప్రభావవంతంగా లేదు. సోషల్ మీడియా ఇవాళ ప్రజలకు ప్రత్యామ్నాయ మీడియాగా మారిందనడంలో సందేహం లేదు. నిజానికి మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు బీజేపీ ఐటీ సెల్ ప్రజలను సంఘటితం చేసేందుకు, ముఖ్యంగా హిందువుల భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు రకరకాల ప్రచారాలు చేసింది. ముఖ్యంగా వాట్సాప్ యూనివర్సిటీలను అధికంగా ఉపయోగించుకుంది. ఇప్పుడు జెన్ జీ తరం చేతుల్లో ఉన్న సోషల్ మీడియా ముందు ఆ ఐటీ సెల్ ప్రచారాలు వెలవెలబోతున్నట్లు కనిపిస్తోంది. ఏ ప్రచారమైనా ప్రజల మనోభావాలకు తగ్గట్లు లేకపోతే ఎక్కువ కాలం నిలబడదని ఈ పరిణామం రుజువు చేస్తోంది.

మోదీ ఏ వాగ్దానాలతో ప్రజల ముందుకు వచ్చారో ఆ వాగ్దానాలు తెరమరుగుకావడం, భావోద్వేగ అంశాలే ప్రధాన అజెండాగా మారడం, నేటి తరం గమనించకపోలేదు. ఉద్యోగాలు కల్పించకపోవడం సరే, కనీసం పరీక్షల్ని సవ్యంగా నిర్వహించలేకపోవడం, నాణ్యమైన విద్యను అందించలేకపోవడం, అధికారమే పరమావధిగా అనేక కుతంత్రాలకు, అధర్మ యుద్ధాలకు పాల్పడడాన్ని వారు నిశితంగా గమనిస్తున్నారు. అయినప్పటికీ ప్రతిపక్షాలను, ముఖ్యంగా కాంగ్రెస్‌ను నేటి తరం నెత్తికెక్కించుకుంటోందని చెప్పడానికి ఆధారాలు ఏవీ లేవు. ఒక దశాబ్దకాలంగా కాంగ్రెస్, ఇతర పార్టీలు మోదీ పట్ల ప్రజా వ్యతిరేకత రగిలించడంలో విఫలమయ్యాయన్నది సందేహాతీత వాస్తవం. అయితే ప్రతిపక్షాలు విఫలమైన చోట యువత బయలుదేరుతుందని ఎవరూ ఊహించలేదు. కాంగ్రెస్‌ పార్టీయే బలమైన ప్రతిపక్షంగా వ్యవహరించి, యువత ఆకాంక్షల్ని ప్రతిఫలించి ఉంటే కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భవించి ఉండేది కాదు. మోదీని ఎదుర్కోవడంలో విఫలమైన అనేక శక్తులు ఇప్పుడు కాక్రోచ్ దండులో కనపడడం ఆసక్తికరమైన విషయం.


విచిత్రమేమంటే పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలిరోజు ప్రభుత్వం ప్రవేశపెట్టదలుచుకున్న బిల్లుల గురించి కానీ, ప్రతిపక్షాలు లేవనెత్తదలుచుకున్న సమస్యల గురించి కానీ జనం పట్టించుకోలేదు. కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చిన ‘చలో సంసద్’ పిలుపునకే ఎంతో ప్రాచుర్యం లభించింది. ఒక రకంగా ఈ పరిణామం ప్రభుత్వ అస్తిత్వాన్నే కాదు, ప్రతిపక్షాల అస్తిత్వాన్ని కూడా ప్రశ్నార్థకం చేసింది. కాక్రోచ్ జనతా పార్టీ ధర్నాపై ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు యువతపై లాఠీచార్జి జరగడం గురించి గగ్గోలు పెట్టడం కానీ, ప్రధానమంత్రి నివాసం ఎదుట రాహుల్‌గాంధీ ధర్నా చేయడం కానీ కాంగ్రెస్‌ తన అస్తిత్వాన్ని నిరూపించుకోవడంలో భాగమే. కాక్రోచ్ జనతా పార్టీ అనుభవంతోనైనా కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా పునరుత్థానం చెందుతుందా లేదా అన్నదానికి కాలమే సమాధానం చెబుతుంది. మోదీకి కూడా ప్రతిపక్షం ఎంతో కొంత ఉనికిలో ఉండడమే శుభప్రదం. లేనిపక్షంలో కాక్రోచ్‌ జనతా పార్టీలాంటివి మరిన్ని పుట్టే అవకాశాలున్నాయి.

నైతిక బాధ్యత అన్నది నేటి కాలంలో ఒక వినకూడని అపశబ్దంగా మారింది. బడ్జెట్ లీక్‌ అయినందుకు మొత్తం మంత్రివర్గంతో రాజీనామా చేయించిన ఎన్టీఆర్ వంటి నేతలు కానీ, రైలు, విమాన ప్రమాదాలకు బాధ్యత వహించి రాజీనామా చేసే మంత్రులు కానీ నేడు లేరు. ధర్మేంద్ర ప్రధాన్‌ను అస్తమానం ఎన్నికల్లో పార్టీ గెలిచేందుకు ఉపయోగించుకున్నప్పుడు ఆయన తన మంత్రి పదవీ బాధ్యతలపై ఎలా దృష్టి సారించగలరు? బిహార్, హరియాణా, బెంగాల్‌లో బీజేపీ గెలిచేందుకు సమర్థంగా వ్యూహరచన చేసిన ధర్మేంద్ర ప్రధాన్... తన మంత్రిత్వ శాఖను సమర్థంగా నిర్వహించని మాట నిజమే. అయితే ఆ తప్పు పూర్తిగా ఆయనది కాదు. ఎన్నికల్లో తమ పార్టీ గెలవడమే జీవన్మరణ సమస్యగా భావించి, అన్ని శక్తియుక్తులను ఆ దిశగా మళ్లించడమే ధర్మేంద్ర ప్రధాన్‌ లాంటి నేతల వైఫల్యానికి కారణం. ఇప్పటికైనా జరిగిన తప్పులకు బాధ్యత వహించడానికి, వ్యవస్థలపై ప్రజల్లో విశ్వాసం పెంచడానికి మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందా?

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

ఇవి కూడా చదవండి

బీసీసీఐ కీలక నిర్ణయం.. ఉద్దేశపూర్వకంగా నో బాల్ వేస్తే మ్యాచ్ నుంచే సస్పెన్షన్

12వ అంతస్తు నుంచి కిందపడ్డ యువకుడు.. రోడ్డుపై వెళుతున్న మహిళపై పడటంతో..

Updated Date - Jul 22 , 2026 | 01:02 AM