Share News

రాహులే మోదీ విజయ రహస్యం!

ABN , Publish Date - Sep 23 , 2026 | 01:06 AM

పావు శతాబ్ది క్రితం నాటి మాట. 2001 అక్టోబర్ 1న న్యూఢిల్లీలో ఉన్న నరేంద్రమోదీ ఫోన్ మోగింది. ‘ఎక్కడున్నారు?’ అని అడిగిన ప్రశ్న విని మోదీ చకితులయ్యారు. ఎందుకంటే ఆ స్వరం....

రాహులే మోదీ విజయ రహస్యం!

పావు శతాబ్ది క్రితం నాటి మాట. 2001 అక్టోబర్ 1న న్యూఢిల్లీలో ఉన్న నరేంద్రమోదీ ఫోన్ మోగింది. ‘ఎక్కడున్నారు?’ అని అడిగిన ప్రశ్న విని మోదీ చకితులయ్యారు. ఎందుకంటే ఆ స్వరం ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయిది. ‘శ్మశానంలో ఉన్నాను’ అని మోదీ జవాబిచ్చారు. వాజపేయి దిగ్భ్రాంతి చెందారు. ‘అక్కడేం చేస్తున్నారు?’ అని అడిగారు. ‘నిన్న విమాన ప్రమాదంలో మరణించిన కాంగ్రెస్ నేత మాధవరావు సింధియాతో పాటు నా మిత్రుడు, ఫొటో జర్నలిస్టు గోపాల్ భిస్త్‌ కూడా మరణించాడు. అతడి అంత్యక్రియలకు వచ్చాను’ అని మోదీ చెప్పారు. ‘సరే, సాయంత్రం రండి..’ అని వాజపేయి ఫోన్ పెట్టేశారు. సాయంత్రం తనను కలిసిన మోదీని చూడగానే వాజపేయి నవ్వుతూ ‘ఢిల్లీలో పంజాబీ తిండి బాగా ఒంటబట్టినట్లుంది. మీకిక్కడ ఏమీ పనిలేదు. గుజరాత్‌కు వెళ్లి అక్కడ పనిచేసుకోండి’ అని చెప్పారు. వాజపేయి ఏమంటున్నారో మోదీకి మొదట అర్థం కాలేదు. అప్పటికే ఆయన ఆరేళ్లుగా ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వివిధ రాష్ట్రాల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ‘గుజరాత్‌లో ఏమి చేయాల్సి ఉంటుంది సార్’ అని వాజపేయిని మోదీ అడిగారు. ‘ఏం చేస్తారు? ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాలి’ అని అటల్జీ అన్నారు. మోదీ ఉబ్బితబ్బిబ్బయ్యారు. తనకు అంత పెద్ద బాధ్యత అప్పగిస్తారని ఆయన ఊహించలేదు. ‘నేను ఇంతవరకూ అసెంబ్లీ ముఖమే చూడలేదు. ముఖ్యమంత్రి కార్యాలయంలోకి అడుగు పెట్టలేదు. ఆరేళ్లుగా అక్కడేం జరుగుతున్నదో నాకు తెలియదు’ అని మోదీ అన్నారు. ‘నేను కూడా మొదటిసారి ఢిల్లీ వచ్చినప్పుడు నాకిక్కడ ఎవరూ తెలియదు’ అని వాజపేయి చమత్కరించారు.

మోదీ వెన్వెంటనే తనకు మార్గదర్శకుడైన లాల్‌కృష్ణ ఆడ్వాణీ ఇంటికి వెళ్లారు. ‘అటల్జీ అంతా చెప్పారు కదా?’ అని ఆయన అనేసరికి మోదీ ఆశ్చర్యపోయారు. తనను గుజరాత్ పంపాలన్న ఆలోచన వాజపేయి ఒక్కరిదే కాదని ఆయనకు అర్థమైంది. అప్పటి ఆరెస్సెస్, సర్ సంఘ్ చాలక్ సుదర్శన్, సంస్థాగత ప్రధాన కార్యదర్శి మదన్‌దాస్ దేవి, సీనియర్ నేత దత్తోపంత్ థేంగ్డీలతో చర్చించిన తర్వాతే తాను, వాజపేయి కలిసి నిర్ణయం తీసుకున్నామని మోదీకి ఆడ్వాణీ చెప్పారు. ఆ తరువాత అశోకా రోడ్‌లోని బీజేపీ కార్యాలయానికి మోదీ వెళ్లారు. అక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ ‘నేను మళ్లీ గుజరాత్‌లో అడుగుపెడుతున్నాను’ అని మందహాసంతో చెప్పారు. పత్రికా గోష్ఠిని ముగిస్తూ ప్రతి ఒక్కరితో కరచాలనం చేశారు. అప్పట్లో ఆయనకు విలేఖర్లతో మంచి సంబంధాలు ఉండేవి. విలేఖర్ల సమావేశంలో మాట్లాడేందుకు ఇతర నేతలతో పోటీపడేవారు. ఆ తర్వాత అంత హాయిగా ఆయన మాట్లాడడాన్ని నేనెప్పుడూ చూడలేదు.


మోదీని ముఖ్యమంత్రిగా గుజరాత్ పంపాలని బీజేపీ అగ్రనేతలు నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణాలున్నాయి. గుజరాత్‌లో పార్టీ అగ్రనేతలు కేశుభాయి పటేల్, శంకర్‌సింగ్ వాఘేలాల మధ్య అంతర్గత చిచ్చు నేపథ్యంలో మోదీ 1995లో ఢిల్లీ రావాల్సి వచ్చింది. 1998 ఫిబ్రవరిలో జరిగిన శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్‌లో పార్టీని గెలిపించేందుకు ఆయన విశేష కృషి చేశారు. మోదీ ప్రాధాన్యాన్ని గుర్తించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు కుశాభావు ఠాక్రే ఆయనను గోవిందాచార్య, వెంకయ్యనాయుడు, సుమిత్రా మహాజన్‌లతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. 2000లో బంగారు లక్ష్మణ్ అధ్యక్షుడైన తర్వాత కూడా మోదీని తన టీమ్‌లో కొనసాగించారు. ఈ మధ్య కాలంలో గుజరాత్‌లో పార్టీ పరిస్థితి బాగా బలహీనపడింది. పటిష్ఠ పాలననందించడంలో కేశుభాయి పటేల్‌ వైఫల్యం, తీవ్ర కరువు తాండవించడం, భుజ్‌లో భయానక భూకంపం సంభవించినప్పుడు ప్రభుత్వం సరైన సహాయక చర్యలు చేపట్టలేకపోవడంతో బీజేపీ ప్రతిష్ఠ తీవ్రంగా దిగజారింది. స్థానిక ఎన్నికల్లో పార్టీ ఘోరంగా దెబ్బతింది. మొత్తం 25 జిల్లా పంచాయతీల్లో 23 పంచాయతీలను బీజేపీ కోల్పోయింది. పట్టణ ప్రాంతాల్లో కూడా బీజేపీ పట్టు కోల్పోసాగింది. 2001 సెప్టెంబర్‌లో ఆడ్వాణీ ప్రాతినిథ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని సబర్మతితో సహా రెండు స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయింది. గుజరాత్‌లో నాయకత్వ మార్పు జరగాల్సిందేనని పార్టీ పరిశీలకులు మదన్ లాల్ ఖురానా, కుశాభావు ఠాక్రే నివేదిక సమర్పించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే వాజపేయి, ఆడ్వాణీల నిర్ణయం మేరకు 2001 అక్టోబర్ 7న మోదీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నరేంద్రమోదీ సుదీర్ఘకాలం ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడమే కాకుండా ప్రధానమంత్రి అవుతారని, అధికారంలో పాతికేళ్ల ప్రస్థానం పూర్తి చేస్తారని వాజపేయి, ఆడ్వాణీలు ఆ రోజు బహుశా ఊహించి ఉండకపోవచ్చు. ఒక పదవిని సాధించడమే కాక, ఆ పదవిలో స్థిరపడి తిరుగులేని నాయకుడుగా ఎదగగలగడం వెనుక మోదీ విజయ రహస్యం ఏమిటి?

మోదీ ముఖ్యమంత్రి అయిన వెంటనే తొలుత చేసిన పని పార్టీలో అంతర్గత కుమ్ములాటలను ఉక్కుపిడికిలితో అణచివేయడం తనకు వ్యతిరేకంగా ఉన్న సంజయ్ జోషిని గుజరాత్ నుంచే కాక పార్టీ నుంచి కూడా బయటకు పంపించడంలో మోదీ కృతకృత్యులు కాగలిగారు. సామ, దాన, భేద దండోపాయాలతో తనకు ఎదురు లేకుండా చేసుకుంటేనే మనుగడ సాధించగలమని ఆయన గ్రహించడమే అందుకు కారణం. చిన్నప్పుడు శాఖలో ఒక వ్యక్తి ఆదేశాలివ్వడం, అందరూ వాటిని క్రమశిక్షణతో పాటించడం మోదీ మనసుపై ప్రగాఢ ప్రభావం చూపింది. సంఘ్ పరివార్ వ్యవహారశైలే ఆయన డీఎన్ఏగా మారింది. నాయకుడన్న వ్యక్తి ఏది చెబితే అదే జరగాలని, రెండో అభిప్రాయానికి ఆస్కారం లేదని ఆయన పూర్తిగా విశ్వసించారు. తన చుట్టూ ఉన్నవారు తననే గమనించేలా, తన మాటే వినేలా చేయడం ఆయన తత్వంలో జీర్ణించుకుపోయిందని ఆయనపై రచనలు చేసిన అనేకమంది రచయితలు అభిప్రాయపడ్డారు. నరేంద్రమోదీ తన ప్రత్యర్థులను ఎప్పుడూ సహించరని, గుజరాత్‌లో ఆయన మంత్రివర్గంలో హోంశాఖ సహాయమంత్రిగా ఉన్న గోవర్ధన్ జడాఫియా వ్యాఖ్యానించారు. జడాఫియా మాత్రమే కాదు, మోదీకి గురువుగా ప్రసిద్ధుడైన కేశుభాయి పటేల్ కూడా తన శిష్యునికి వ్యతిరేకంగా వేర్వేరు పార్టీలు స్థాపించి తెరమరుగయ్యారు.


గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తాను అనుసరించిన వైఖరినే ప్రధానమంత్రి అయ్యాక కూడా మోదీ అనుసరించారు. గుజరాత్ అల్లర్ల సమయంలో తనకు అండగా నిలిచి తన పదవి పోకుండా కాపాడి, మొత్తం పార్టీ మద్దతునిచ్చేలా చేసిన లాల్‌కృష్ణ ఆడ్వాణీ, తనను ఏకతా యాత్రలో వెంట తీసుకువెళ్లిన మురళీ మనోహర్ జోషిని ఆయన మార్గదర్శక మండలికి పంపించారు. అయితేనేం, మోదీ ప్రధాని అయినప్పటి నుంచీ గత పన్నెండు సంవత్సరాలుగా బీజేపీలో ఎలాంటి లుకలుకలు లేవు. మంత్రులు గానీ, పార్టీ సభ్యులు గానీ నాయకత్వానికి వ్యతిరేకంగా కిక్కురుమన్న సందర్భాలు లేవు. ఎవరిని కేంద్రమంత్రిగా నియమించినా ముఖ్యమంత్రిగా నియమించినా, చివరకు పార్టీ జాతీయ అధ్యక్షుడుగా ఎవరిని నియమించినా అడిగేవారు లేరు. ఒక పరిపాలకుడిగా బ్యూరోక్రాట్లతో చర్చించినట్లు మోదీ కనపడినా రాజకీయ కీకారణ్యంలో ఆయనే రారాజు. మోదీ చెప్పిందే వేదం. పార్టీ నేతలే కాదు, ఎన్డీఏలో ఒకప్పుడు మోదీని వ్యతిరేకించిన నేతలందరూ ఇవాళ ఆయన పుట్టిన రోజు వేడుకలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా పోటీపడి మోదీని పొగడడం, దీపాలు వెలిగించడం చేస్తున్నారంటే రాజకీయాలపై ఆయన పట్టు బిగించిన తీరును అభినందించాల్సిందే. బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని సైతం ఉపేక్షించిన నేతలు మోదీ జన్మదినాన్ని జరుపుకుంటున్నారంటే అది ఆయన నాయకత్వ విశిష్టత అని చెప్పక తప్పదు. ఇదివరకు నియంతృత్వ పాలకుల ఆధిపత్యానికి, నిఘాకు సంకేతంగా ‘బిగ్ బ్రదర్ ఈజ్ వాచింగ్’ అని హెచ్చరించేవారు. ఇప్పుడదే వ్యాఖ్య మోదీ విషయంలో వర్తిస్తుందని బీజేపీ, ఎన్డీఏ నాయకులందరికీ తెలుసు. ఎవరు దీపాలు వెలిగిస్తున్నారో, ఎవరు చప్పట్లు కొడుతున్నారో, ఎవరు తనను ఆకాశానికెత్తుతున్నారో మోదీకి తెలియకుండా ఉంటుందా? ఏమైతేనేం అధికారంలో పాతికేళ్లు పూర్తిచేసుకున్న పలువురు ప్రపంచ నేతల సరసన మోదీ కూడా చేరారు.


తననే అందరూ గమనించేలా, తన గురించే అందరూ మాట్లాడేలా చేసుకోవడం. తనను విమర్శించినా, దూషించినా, తనను అవహేళన చేసినా తానే చర్చలో ప్రధాన కేంద్రం అయ్యేలా చూసుకోవడం మోదీ స్వభావం. ఇది ఆయన విజయ రహస్యంలో మరో కీలకాంశం. గుజరాత్ రోజుల నుంచీ ఆయన ఇదే శైలిని అవలంబిస్తున్నారు. వేషాలు మార్చినా, నాటకీయంగా వ్యవహరించినా, నవ్వినా, విదేశీ నేతలను హత్తుకున్నా అందరి దృష్టీ తనపై పడేలా ఉద్దేశపూర్వకంగా చేయడమే మోదీ లక్ష్యం. దానివల్ల తన అభిమానులు, భక్తుల సంఖ్య ఏ మాత్రం తగ్గదని, పైగా తననెవరైనా విమర్శిస్తే వారు రెట్టింపు ఆగ్రహంతో దాడి చేస్తారని మోదీకి తెలుసు. తాను ఏమి చేసినా మైమరిచిపోయే, అంకితభావం గల భక్తులను పెద్ద సంఖ్యలో తయారు చేసుకోగలగడం మోదీ విజయానికి మరోకారణం. నెహ్రూ నుంచి వాజపేయి వరకూ ఏ నాయకుడికీ ఇలాంటి భక్తగణం లేనేలేదు. తన ఓటు బ్యాంకులో ప్రధానమైన హిందూత్వ వర్గాలను కోల్పోకుండా చూసుకున్నంతవరకూ తనకు నష్టం జరగదని మోదీ భావిస్తుండవచ్చు. జనసంఘ్, బీజేపీలో చిరకాలం పనిచేసిన ఒక పెద్దాయన ఇటీవల మోదీని కలిసి ‘మీ విజయ రహస్యం ఏమిటో నాకు తెలుసు’ అన్నారట. ‘చెప్పుకోండి చూద్దాం’ అని మోదీ అన్నారట. ‘రాహుల్‌గాంధీ.!’ అని ఆ పెద్దాయన ఇచ్చిన జవాబుకు మోదీ విరగబడి నవ్వారట! ఇటీవలి కాలంలో విద్యార్థుల మధ్య పెద్ద ఎత్తున తిరుగుతూ మోదీని అవహేళన చేస్తూ సంచలనం సృష్టిస్తున్న రాహుల్‌గాంధీ తనపై ఉన్న జనాభిప్రాయాన్ని మార్చివేయాలి. ఇది జరగాలంటే మోదీపై కనీసం ఒక బలమైన ఎన్నికల విజయాన్ని అయినా ఆయన సాధించాల్సిందే.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

ఈ వార్తలు కూడా చదవండి..

రాజధాని అమరావతి పనులకు ఆటంకాలు లేకుండా వేగం పెంచాలి: నారాయణ

ఆసియా క్రీడల్లో స్వర్ణం.. కమలినికి తమిళనాడు ప్రభుత్వం భారీ నజరానా

Updated Date - Sep 23 , 2026 | 01:06 AM