Share News

రాజకీయం సరే, ఆర్థికం మాటేమిటి?

ABN , Publish Date - Jun 03 , 2026 | 12:25 AM

‘ఆడుతూ ఉన్నప్పుడే మీరు గెలుస్తారు. మీరు ఆడకపోతే గెలుపెలా వస్తుంది?’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల చిన్నపిల్లలతో మాట్లాడుతూ అన్నారు. 1987లో భారతీయ జనతా పార్టీలో చేరినప్పటి నుంచీ...

రాజకీయం సరే, ఆర్థికం మాటేమిటి?

‘ఆడుతూ ఉన్నప్పుడే మీరు గెలుస్తారు. మీరు ఆడకపోతే గెలుపెలా వస్తుంది?’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల చిన్నపిల్లలతో మాట్లాడుతూ అన్నారు. 1987లో భారతీయ జనతా పార్టీలో చేరినప్పటి నుంచీ నరేంద్రమోదీ రాజకీయాల్లో ఆడుతూనే ఉన్నారు. వచ్చే ఏడాది ఈ రాజకీయ క్రీడలో నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకోనున్న మోదీకి ఇప్పటి వరకూ చెప్పుకోదగ్గ ఓటమి వాటిల్లలేదు. 1987లో బీజేపీ గుజరాత్ ప్రధాన కార్యదర్శిగా ఆయనకు అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ బాధ్యతలు అప్పజెప్పినప్పుడు తొలిసారి తన పార్టీకి ఆ నగర పాలనా సంస్థను కైవసం చేయడంలో సఫలమయ్యారు. అప్పటి నుంచీ ఆయన వెనక్కు తిరిగి చూడనే లేదు. కార్పొరేషన్ గెలుపుతో గుజరాత్‌లో ప్రారంభమయిన ఆయన విజయ ప్రస్థానం రాష్ట్రంలో బీజేపీని అధికారంలో తెచ్చి, తర్వాత స్వయంగా తానే ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి, 12 సంవత్సరాలు తిరుగులేని పాలన చేపట్టేంతవరకూ సాగింది. అంతటితో ఆగకుండా మోదీ 2014లో ఏకంగా దేశ ప్రధాని బాధ్యతలు చేపట్టారు. కేంద్రంలోనూ నిరాఘాటంగా గత 12 సంవత్సరాలుగా ఆ అత్యున్నత పదవిలో కొనసాగుతున్నారు. 1987లో మోదీ ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించేనాటికి కాంగ్రెస్ కేంద్రంలోనూ, 15 రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉండేది. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో గెలుపుతో మోదీ సారథ్యంలో బీజేపీ, దాని మిత్రపక్షాలు 21 రాష్ట్రాల్లో అధికారం సాధించినట్లయింది. ఒక రకంగా మోదీ ఇప్పుడు రాజకీయ జీవితపు మహోన్నత దశలో ఉన్నారు. ఒకవైపు 12 సంవత్సరాల తన పాలన విజయోత్సవాలకు సన్నాహాలు చేస్తూనే మరోవైపు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ భారీ మార్పులకు ఆయన సిద్ధమవుతున్నారు. తన తదుపరి రాజకీయ క్రీడకు ఆయన రంగం సిద్ధం చేస్తున్నారు.


‘గెలుపు క్రీడ మాత్రమే కాదు, అది పులిపై స్వారీ చేయడం లాంటిది’ కూడా అని రాజనీతిజ్ఞులు అభివర్ణిస్తుంటారు. ఒక్కసారి దానిపై నుంచి దిగితే అదే మనను స్వాహా చేస్తుంది. ‘ప్రజాస్వామ్యం అంటే ఎన్నికల్లో విజయం సాధించడం మాత్రమే కాదు’ అని అంబేడ్కర్ ఎప్పుడో చెప్పారు. రాజకీయాల్లో మోదీ ప్రభుత్వానికి తిరుగు లేకపోయినా, భారత ఆర్థిక పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉన్నది. జీడీపీ పెరుగుదల క్రమంగా తగ్గుతోందని, సగటు ద్రవ్యోల్బణం రెట్టింపు అవుతోందని, అభివృద్ధి వేగం మందకొడిగా సాగుతోందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. మే నెలలో ఆర్థిక మంత్రిత్వశాఖ రూపొందించిన నెలవారీ సమీక్ష అంతర్జాతీయ పరిణామాలు భారతదేశ ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని స్పష్టం చేసింది. రూపాయి విలువ రోజురోజుకూ పడిపోతోంది. క్రూడాయిల్ దిగుమతి బిల్లులు పెరుగుతున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మే 15 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు నాలుగుసార్లు పెరిగాయి. వరుసగా రెండో వారం భారత విదేశీమారక ద్రవ్య నిల్వలు పడిపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. దేశంలో ప్రైవేట్ పెట్టుబడులు కూడా తగ్గిపోతున్నాయని మాజీ ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యం వంటి ఆర్థికవేత్తలు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. జపాన్‌ను అధిగమించి నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఆవిర్భవించిందని మే 2025లో నీతీ ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం ప్రకటించారు. కానీ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ తాజాగా విడుదల చేసిన వరల్డ్ ఎకనమిక్ అవుట్ లుక్ ప్రకారం భారతదేశం ఆరవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు పడిపోయింది. ఈ విషయం ఎలా ఉన్నప్పటికీ గణాంక వివరాలతో సంబంధం లేకుండా దేశంలో తలసరి ఆదాయం అతి తక్కువస్థాయిలో ఉన్నదని అందరికీ తెలుసు. 1991 నుంచి చైనాలో తలసరి ఆదాయం 38సార్లు పెరిగితే.. మన దేశంలో కేవలం 8సార్లే పెరిగిందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ప్రధాని మోదీ స్వయంగా పొదుపు చర్యలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేయడమే పరిస్థితి తీవ్రతను తెలుపుతోంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్వల్పకాలిక చర్యలు తీసుకుంటోంది కానీ, దీర్ఘకాలిక చర్యలు చేపట్టడం లేదని ఆర్థికవేత్తలు అంటున్నారు. దీర్ఘకాలిక చర్యలు అంటే ఏమిటి? సంస్కరణలను మరింత వేగవంతం చేయడమా? విదేశీ పెట్టుబడులు మరింత స్వేచ్ఛగా ప్రవేశించేందుకు వీలు కల్పించడమా అన్న చర్చలు జరుగుతున్నాయి. మోదీ ఈ దిశగా ఏ చర్యలు తీసుకుంటున్నారో ఎవరికీ స్పష్టత లేదు. దేశ ఆర్థిక పరిస్థితిపై నీతీ ఆయోగ్ వంటి సంస్థలు కూడా పారదర్శకంగా నివేదికలు ప్రకటించడం లేదు. ఇలాంటి సంస్థలు అభివృద్ధిని గోరంతలు కొండంతలు చేసేందుకే తహతహలాడుతుంటాయి. ప్రభుత్వానికి వాస్తవ పరిస్థితిని చెప్పేందుకు అవి ప్రయత్నించడం మానేసి చాలా కాలమైంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మంత్రుల తలలు మారిస్తే మాత్రం పరిస్థితి మెరుగవుతుందా?


రెండవది, ఎన్నికల్లో విజయం సాధించలేకపోతోన్న ప్రతిపక్షాలు.. వ్యవస్థలు నిర్వీర్యమవుతున్నాయన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించడంలో విజయవంతమయినట్లే కనిపిస్తున్నాయి. ఎన్నికల కమిషన్, సీబీఐ, ఈడీ, ఐటీ, సీవీసీ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వంటి సంస్థల పనితీరుపై మాత్రమే కాదు, సుప్రీంకోర్టు ఇస్తున్న తీర్పులపై కూడా అనుమానం కలిగించేందుకు ఆస్కారం కలిగిస్తున్నాయి. విచిత్రమేమంటే ఎన్నికలు సవ్యంగా జరిగినా ఎన్నికల కమిషన్ విశ్వసనీయత ప్రశ్నార్థకమవుతోంది. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై ఎడాపెడా ప్రయోగించడం వల్ల అవి నిజంగా పనిచేసినా వాటిపై నమ్మకం కలగడం లేదు. సుప్రీంకోర్టుకూ, ప్రభుత్వానికీ మధ్య ఉండాల్సిన హద్దులు చెరిగిపోతున్నాయా అన్న అనుమానం కలిగే విధంగా న్యాయమూర్తులు వ్యవహరిస్తున్నారు. చివరకు విద్యార్థులకు పరీక్షలు కూడా సరిగా నిర్వహించలేని దుస్థితి ఈ దేశంలో నెలకొన్నదని నీట్ ప్రశ్నపత్రాలు మరోసారి లీక్ కావడంతో తేలింది. ఈ పరిస్థితులపై కాక్రోచ్ జనతా పార్టీ పేరిట సోషల్ మీడియాలో ఇచ్చిన పిలుపునకు ఈ దేశ యువత కనీవినీ ఎరుగని రీతిలో ప్రతిస్పందించిన తీరు ఎక్కడో నిప్పు రగులుతోందన్న భావనను కలిగిస్తోంది. సోషల్ మీడియా అకౌంట్లను నిలిపివేసినంత మాత్రాన ప్రశ్నలు వేసేవారు తగ్గిపోతారనుకోవడం అమాయకత్వం. అందువల్ల, ఎన్నికల్లో విజయం సాధించడమే కాదు, వ్యవస్థల విశ్వసనీయతను పెంచేందుకు, సమస్యలను పరిష్కరించేందుకు యువత ప్రయత్నించినప్పుడే మోదీ సర్కార్‌ విజయం సాధించినట్లు భావించాల్సి ఉంటుంది.

అంతేకాదు, బెంగాల్‌లో విజయంతో మోదీ సర్కార్ రాజకీయ విజయాలు పూర్తయినట్లు కాదు. వచ్చే ఏడాది నుంచి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మళ్లీ విజయం సాధించాల్సి ఉన్నది. ఇందులో ప్రధాని స్వంత రాష్ట్రం గుజరాత్‌తో పాటు, అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్, ఇంకా మధ్యప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాలున్నాయి. దక్షిణాదిన నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి అంత భవ్యంగా ఏమీ లేదు. కర్ణాటకలో యడ్యూరప్పకు అతీతంగా బీజేపీకి స్వంత అస్తిత్వమంటూ లేదు. దత్తాత్రేయ హోసబలె, సంతోష్, ముకుంద్ వంటి అగ్రశ్రేణి ఆరెస్సెస్ నాయకులు పలువురు కర్ణాటకకు చెందినవారే అయినా అక్కడ బీజేపీ స్థిరంగా నిలదొక్కుకోలేకపోతున్నది. ఇక తెలంగాణలో తానెక్కిన కొమ్మను తానే నరుక్కోవడంలో బీజేపీని మించిన పార్టీ కనపడడం లేదు. తమిళనాడులో నిన్న మొన్నటిదాకా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అన్నామలై.. రాష్ట్రంలో బీజేపీకి భవిష్యత్తు లేదని ప్రకటించి తన దారి తాను చూసుకునేందుకు సిద్ధమవుతున్నారు. బెంగాల్‌లో కంటే దక్షిణాదిలో ఆమోదయోగ్యత సాధించడం ముఖ్యమని బీజేపీ నేతలు గ్రహించినట్లు కనపడడం లేదు.


మోదీ బలహీనతలు ఏమైనప్పటికీ వాటిని ఉపయోగించుకోవడంలో కాంగ్రెస్ ఎంతవరకు ప్రయత్నిస్తున్నదనేది చర్చనీయాంశం. యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో బీజేపీని ముఖాముఖి ఢీకొనేందుకు కాంగ్రెస్ ఏమి చేస్తున్నదో ఎవరూ చెప్పలేరు. కేరళలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిని నిర్ణయించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం 11 రోజుల సమయం తీసుకున్నది. అక్కడి ప్రజలు, పార్టీ సీనియర్లు, కేడర్ పూర్తిగా సతీశన్‌ను అభిమానిస్తున్నారని తెలుసుకునేందుకు రాహుల్‌గాంధీకి ఇన్ని రోజులు పట్టింది. తన కుడిభుజంగా ఉన్న కేసీ వేణుగోపాల్ తానే ముఖ్యమంత్రి అయ్యేందుకు తీవ్ర యత్నాలు చేస్తున్నప్పటికీ ఆయన వారించలేకపోయారు. అంతేకాదు, కేరళలో గెలిచామన్న సంతోషం లేకుండా ఢిల్లీకి కర్ణాటక తలనొప్పి ప్రారంభమైంది. అక్కడ సిద్దరామయ్య, డీకే శివకుమార్‌ మధ్య సర్దుబాటు చేయలేని దుస్థితిలో ఢిల్లీ పెద్దలు ఇద్దర్నీ తమ వెంట తిప్పుకున్నారు. అల్పసంఖ్యాకులు, వెనుకబడిన వర్గాలు, దళితులతో కూడిన అహిందా వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దరామయ్య ఒకవైపు, పార్టీకి ఎంతో విధేయంగా ఉంటూ ప్రతి సంక్షోభంలో జాతీయ నాయకత్వానికి చేదోడు వాదోడుగా ఉన్న డీకే ఒకవైపు అధిష్ఠానాన్ని దిక్కుతోచని పరిస్థితిలో పడేశారు. నిజానికి ఒకప్పుడు అహ్మద్ పటేల్‌ను గెలిపించడం కోసం గుజరాత్ ఎమ్మెల్యేలను బెంగళూరు తరలించిన డీకే పలు కేసుల్లో చిక్కుకున్నారు. చివరకు ఆయన తీహార్ జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. అలాంటి డీకేకు ముఖ్యమంత్రి ఇవ్వడం సబబే కానీ, తాను రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటానని, రాజ్యసభకు రానని స్పష్టం చేసిన సిద్దరామయ్య భవిష్యత్ కార్యాచరణ గురించి ఇప్పుడే చెప్పలేం. శివకుమార్ తన మంత్రివర్గంలో సిద్దరామయ్య చెప్పినవారందర్నీ చేర్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. గత 20 రోజులుగా తొలుత కేరళ నేతలు, ఇప్పుడు కర్ణాటక నేతలతో ఏఐసీసీ, ఢిల్లీ హోటళ్లు కిటకిటలాడిపోతున్నాయి. కాంగ్రెస్‌లో వర్గ పోరు ప్రతి రాష్ట్రంలో ఉన్నా ఢిల్లీ అధిష్ఠానం ఏమీ చేయలేని పరిస్థితి నెలకొన్నది. బీజేపీలో ఆ పరిస్థితి ఎప్పుడూ లేదు. 17 రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్యమంత్రులున్నా, ఏ ఒక్కరూ మంత్రివర్గ విస్తరణ కోసం, ఇతర మార్పులకోసం ఢిల్లీకి వచ్చిన దాఖలాలు లేవు. వారు రానక్కర లేకుండానే ఎవర్ని నియమించాలో నిర్దేశించగలిగిన పట్టు బీజేపీ పెద్దలకు ఉన్నది. అది బీజేపీకి, కాంగ్రెస్‌కు ఉన్న తేడా. వాటి జయాపజయాల వెనుక రహస్యం కూడా అదే.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ పోరాట స్ఫూర్తితో ఉత్తేజం పొందాం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

యూఎస్‌లో 30 మంది భారతీయుల అరెస్ట్

Read Latest TG News And Telugu News

Updated Date - Jun 03 , 2026 | 12:25 AM