Share News

పాలకుల నిర్దేశాలే న్యాయ నిర్ణయాలా?

ABN , Publish Date - May 27 , 2026 | 01:05 AM

‘న్యాయవ్యవస్థ విశ్వసనీయత కోల్పోతే ఇక మిగిలేదేమీ ఉండదు. స్వతంత్ర న్యాయవ్యవస్థ రాజ్యాంగ జీవ లక్షణం. అది లేకపోతే.. న్యాయమూర్తులు ఉంటారు, కోర్టులు ఉంటాయి, తీర్పులు ఉంటాయి. అయితే...

పాలకుల నిర్దేశాలే న్యాయ నిర్ణయాలా?

‘న్యాయవ్యవస్థ విశ్వసనీయత కోల్పోతే ఇక మిగిలేదేమీ ఉండదు. స్వతంత్ర న్యాయవ్యవస్థ రాజ్యాంగ జీవ లక్షణం. అది లేకపోతే.. న్యాయమూర్తులు ఉంటారు, కోర్టులు ఉంటాయి, తీర్పులు ఉంటాయి. అయితే వాటి హృదయమూ, ఆత్మ కనుమరుగైపోతాయి’ అని జస్టిస్‌ ఉజ్జ్వల్ భుయాన్ (సుప్రీంకోర్టు న్యాయమూర్తి) అన్నారు. ఇటీవల పుణేలో వెలువరించిన ఒక స్మారకోపన్యాసంలో కేంద్ర ప్రభుత్వ అభీష్టం మేరకే ఒక హైకోర్టు న్యాయమూర్తిని బదిలీ చేస్తున్నామని కొలీజియం స్వయంగా తన మినిట్స్‌లో రికార్డు చేసిందని కూడా ఆయన వెల్లడించారు. రాజ్యాంగానికి నిబద్ధమై స్వతంత్రంగా వ్యవహరించాల్సిన న్యాయవ్యవస్థ ప్రభుత్వ ఒత్తిడికి లోనవుతూ పనిచేస్తోందని అనడానికి అది ఒక స్పష్టమైన నిదర్శనం.

‘న్యాయవ్యవస్థ పార్టీ రాజకీయాలకు దూరంగా, దృఢ చిత్తంతో వ్యవహరించాలి. ప్రభుత్వంలో మార్పులకూ, న్యాయవ్యవస్థకూ ఏ మాత్రం సంబంధం ఉండకూడదు. అది అందరి పట్లా సదుద్దేశం, సానుభూతితో వ్యవహరించాలి కాని ఎవరి పక్షానా కొమ్ముకాయకూడదు’ అని సుప్రీంకోర్టు ప్రారంభ సమావేశంలో తొలి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హరిలాల్ జె కానియా ఉద్ఘాటించారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 76 సంవత్సరాలు గడిచిపోయాయి. అది ఎలా అమలువుతుందని సమీక్షించుకుంటే సర్వోన్నత న్యాయస్థానంలో ప్రమాణాలు సమున్నతమయ్యాయా లేక దిగజారిపోయాయా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

నిజానికి మన రిపబ్లిక్‌ చరిత్రలో మొదటి పాతికేళ్లవరకు న్యాయవ్యవస్థ తన ఉనికిని కాపాడుకునేందుకు, ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ పరిధిని నిర్ణయించడంలో తన వంతు బాధ్యతను నిష్పాక్షికంగా నిర్వర్తించింది. ముఖ్యంగా అధికరణలు 14, 15, 19, 31లను సుప్రీంకోర్టు నిర్వచించింది. ప్రాథమిక హక్కులను మార్చేందుకు ఏ మాత్రం వీలు లేదని 1967లో గోలక్‌నాథ్ కేసులో స్పష్టం చేస్తే, రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని మార్చే అధికారం పార్లమెంట్‌కు లేదని 1973లో కేశవానంద భారతి కేసులో మరింత తేటతెల్లం చేసింది. 1971లో అఖండమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ఇందిరాగాంధీ న్యాయవ్యవస్థతో చెలగాటమాడారు. ఆమె చర్యలకు వత్తాసు పలికిన న్యాయవ్యవస్థ పతనానికి పరాకాష్ఠ ఏడీఎం జబల్పూర్ కేసు. వేలాది రాజకీయ ప్రత్యర్థులను, జర్నలిస్టులను అరెస్టు చేసినప్పుడు ప్రజలు తమ ప్రాథమిక హక్కులను కాపాడుకునేందుకు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చా అని అడిగితే సుప్రీంకోర్టు అయిదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం అత్యంత దుర్మార్గమైన తీర్పు వెలువరించింది. ఎమర్జెన్సీ సమయంలో ప్రజలకు ఆర్టికల్ 21 క్రింద జీవించే హక్కే లేదని ఆ ధర్మాసనంలోని నలుగురు న్యాయమూర్తులు– ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏఎన్ రే, జస్టిస్ పి.భగవతి, జస్టిస్ ఎంహెచ్ బేగ్, జస్టిస్ వై.వి.చంద్రచూడ్ (రెండేళ్ల క్రితం సీజేఐగా రిటైరైన డివై చంద్రచూడ్ తండ్రి)– ఏకగ్రీవంగా తీర్పునిచ్చారు. ‘ఎమర్జెన్సీ పేరిట కాల్చి చంపినా అడగకూడదంటారా?’ అని ఈ కేసులో నిరసన తీర్పు చెప్పిన ఏకైక న్యాయమూర్తి జస్టిస్ ఖన్నా ప్రశ్నించినప్పుడు ‘మిలార్డ్, చట్టం అదే చెబుతున్నది’ అని నాటి అటార్నీ జనరల్ జవాబిచ్చారట!


న్యాయవ్యవస్థ చరిత్రలో చీకటి రోజులు అనదగిన ఎమర్జెన్సీ తర్వాత సుప్రీంకోర్టు ఎన్నో ఆత్మవిమర్శలు చేసుకుంది. ఎన్నో దిద్దుబాటు చర్యలను తీసుకుంది. ఎమర్జెన్సీ వైఫల్యాలనుంచి ప్రజల దృష్టి మళ్లిస్తూ రాజ్యాంగమే సుప్రీం అని ప్రకటించింది. అనేక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలకు అవకాశం కల్పించింది. జైలులో విచారణ లేకుండా కునారిల్లుతున్న వేలాది ఖైదీలను విడుదల చేసింది. కట్టుబానిసలను విముక్తి చేసింది. న్యాయవ్యవస్థలో నియమాకాలకు కొలీజియం పద్ధతిని ప్రవేశపెట్టింది. ముఖ్యంగా ప్రజల హక్కులను, పర్యావరణాన్ని, పనిచేసే మహిళల ప్రయోజనాలను పరిరక్షించింది. రాష్ట్ర ప్రభుత్వాలను ఇష్టారాజ్యంగా గద్దె దించడాన్ని అడ్డుకున్నది. చట్టసభల్లోనే ప్రభుత్వాలు మెజారిటీని నిరూపించుకోవాలని నిర్దేశించింది. వెనుకబడిన వర్గాలు, దళితులు, ఆదివాసీల ప్రయోజనాలకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులెన్నో. ఒక దశలో న్యాయవ్యవస్థ క్రియాశీలత అబ్బురపరిచేలా కనపడింది.

ఇవాళ ఎమర్జెన్సీ రోజులు లేకపోవచ్చు. కాని న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసం సన్నగిల్లుతోందా అన్న అనుమానాలు వస్తున్నాయి. జస్టిస్ ఉజ్వల్ భుయాన్ లాంటి న్యాయమూర్తులే న్యాయవ్యవస్థ స్వతంత్రతలో ఎవరూ చొరబడకుండా చూసుకోవాల్సిన అవసరం ఉన్నదని, న్యాయమూర్తుల రాజకీయ, సైద్ధాంతిక అభిప్రాయాలు బెంచ్‌లో నిర్ణయాలను ప్రభావితం చేయకూడదని అన్నారంటే తరిచి చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. న్యాయమూర్తులు బయటి నుంచి వచ్చే ఒత్తిళ్లకు ప్రభావితం కాకూడదని, తమకొచ్చే ఆదాయంతో తృప్తిగా జీవించలేని న్యాయమూర్తులను వ్యవస్థనుంచే తొలగించాలని మరో ప్రస్తుత సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న అన్నారు. ఒక కళంకిత న్యాయమూర్తి వ్యవస్థకే మచ్చలాంటి వాడని ఆమె వ్యాఖ్యానించారు. ‘నిష్పాక్షికత న్యాయవ్యవస్థ ఆత్మ, స్వతంత్రత న్యాయవ్యవస్థ నరాల్లో ప్రవహించే రక్తం’ అని ఒడిషా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మురళీధరన్ అన్నారు. ఆయన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు రాజధానిలో జరిగిన అల్లర్లపై పోలీసులను నిశితంగా ప్రశ్నించారు. దీంతో రాత్రికి రాత్రే ఆయనను మరో హైకోర్టుకు బదిలీ చేశారు.


అసలు న్యాయమూర్తులే న్యాయవ్యవస్థ గురించి వ్యాఖ్యానించాల్సిన అవసరం ఎందుకు వస్తోంది? సామాన్య ప్రజలకు న్యాయం చేయాల్సిన, రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన సర్వోన్నత న్యాయస్థానం సంపన్నవర్గాలకు, ప్రభుత్వ ప్రయోజనాలకు, రాజకీయ నాయకులకు మాత్రమే అధికంగా ప్రతిస్పందిస్తోందని, పలుకుబడిగల వారికే వేగంగా తీర్పులు వస్తున్నాయని ఎందుకు విమర్శలు చెలరేగుతున్నాయి? ఒక కేసు ఫలానా బెంచి వద్దకు వెళితే ఫలానా నిర్ణయం వస్తుందని చెప్పగలిగే పరిస్థితి ఎందుకు వస్తోంది? ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా న్యాయవ్యవస్థపై రాజకీయ ప్రభావం, దళారీల పాత్రపై అత్యధికంగా చర్చ జరుగుతోంది. దేశం ఒక నియంతృత్వ రాజ్యంగా మారిపోతోందని, రాజకీయంగా సున్నితమైన కేసుల్లో న్యాయం కొరవడిందని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు దుశ్యంత్ దవే మాటలు కొట్టివేయవలసినవి కాదు. రాజకీయంగా సున్నితమైన కేసులను కొన్ని బెంచ్‌లకు కేటాయించడం, రిటైర్ అయిన తర్వాత లభించే పదవుల కోసం న్యాయమూర్తులు అర్రులు చాచడం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఎన్నికల కమిషన్ లాంటి వ్యవస్థలు బలహీనపడిపోయినా సుప్రీం పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. కొలీజియంలో చర్చించే న్యాయమూర్తుల నియామకాలు, వారి బదిలీలు గతంలో ఎన్నడు లేనంతగా ప్రశ్నార్థకమవుతున్నాయి. న్యాయమూర్తులు ఉన్నత ప్రమాణాలు పాటించాలని, తమ ప్రవర్తన, తాము చేసే ప్రతి చర్య ప్రజల విశ్వాసం చూరగొనేలా ఉండాలని సుప్రీంకోర్టు 1997లో న్యాయవ్యవస్థలో విలువల గురించి ప్రకటించింది. అయితే ఇటీవలి కాలంలో ప్రధాన న్యాయమూర్తి, పలువురు న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు, సిబ్బంది ప్రైవేట్ విమానాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పలు నగరాలకు పర్యటించడాన్ని ‘కాంపైన్ ఫర్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ, రిఫార్మ్స్’ అనే సంస్థ తీవ్రంగా విమర్శించింది. ఇది న్యాయవ్యవస్థ నైతిక ప్రమాణాలను ప్రశ్నార్థకం చేస్తోందని విమర్శించింది. ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి నివాసంలో భారీ ఎత్తున నోట్ల కట్టలు దొరకడం, దానిపై ఎలాంటి చర్యలు లేకపోవడం ఇలాంటి విమర్శలకు మరింత తావిస్తోంది.


సమాజం, ముఖ్యంగా యువత ఈ పరిణామాలను గమనిస్తూనే ఉన్నది. ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తమను బొద్దింకలతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలకు యువత అందుకే తీవ్రంగా ప్రతిస్పందించింది. ఎలాంటి పనీపాటలేని, ఉద్యోగం రాని యువత బొద్దింకల్లా తయారైందని, వారిలో కొందరు మీడియాలోను, మరికొందరు సోషల్ మీడియాలోనూ, ఆర్టీఐ కార్యకర్తలు, ఇతర కార్యకర్తలుగా తయారయ్యారని, వారు ప్రతి ఒక్కరిపై దాడి చేస్తున్నారని ఆయన ఒక కేసు విచారణ సందర్భంగా విమర్శించారు. తనను సీనియర్ న్యాయవాదిగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ ఒక న్యాయవాది దాఖలు చేసిన పిటీషన్‌ను విచారించే సందర్భంగా తాను ఈ వ్యాఖ్యలు చేశానని, యువతను విమర్శించలేదని సూర్యకాంత్ వివరణ ఇచ్చినప్పటికీ ఆయన ఏమన్నారో అప్పటికే వైరల్ కావడంతో ప్రజలు ఆ వివరణను పట్టించుకునే స్థితి దాటిపోయింది.

జస్టిస్ సూర్యకాంత్ ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత ‘కాక్రోచ్ జనతా పార్టీ’ పేరిట ఒక యువకుడు సోషల్ మీడియాలో అకౌంట్ ఏర్పర్చుకున్నారు. కోట్లాది యువజనులు దానికి స్పందించారు, ఇంకా స్పందిస్తున్నారు. నిరుద్యోగం, పెట్రోల్ ధరల పెంపు, అవినీతి, కుంభకోణాలకు వ్యతిరేకంగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం మొదలు పెట్టారు. ‘అవును మేము బొద్దింకలమే’ అని యువతీ యువకులు విపరీతంగా స్పందిస్తున్నారు. అసలు వ్యాఖ్యలు చేసింది జస్టిస్ సూర్యకాంత్ అయితే ప్రజలు ప్రభుత్వంపై ఎందుకు విమర్శలు గుప్పిస్తున్నారు? అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వమూ, న్యాయవ్యవస్థ వేరు వేరు కాదని వారు భావిస్తున్నారా? ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వానికీ, న్యాయవ్యవస్థకూ మధ్య సరిహద్దులు చెరిగిపోతే మన ప్రజాస్వామ్య వ్యవస్థకు అంతకు మించి వాటిల్లే ప్రమాదం మరేముంటుంది? ఈ పరిస్థితి నుంచి న్యాయవ్యవస్థే తనను తాను కాపాడుకోవాల్సి ఉన్నది. లేకపోతే బొద్దింకలే న్యాయనిర్ణేతలయ్యే ఆవశ్యకత ఏర్పడుతుంది.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌లో కొత్తగా మరో జీసీసీ కేంద్రం

లొంగిపోయిన మావోయిస్టు దంపతులు.. చెక్కులు అందజేసిన డీజీపీ

Updated Date - May 27 , 2026 | 01:05 AM