న్యాయ వ్యవస్థ స్వతంత్రత కోల్పోతున్నదా?
ABN , Publish Date - Jul 15 , 2026 | 05:18 AM
ఒక తండ్రి తన అయిదేళ్ల కుమారుడిని స్కూలుకు తీసుకువెళుతుండగా, ఒక ట్యాంకర్ వెనుకనుంచి వచ్చి ఢీకొనడంతో ఆ బాలుడు మరణించాడు. ఆ రోడ్డుకు ఫుట్‌పాత్ కానీ, రోడ్డు దాటేందుకు క్రాసింగ్ గుర్తులు కానీ లేవు...
ఒక తండ్రి తన అయిదేళ్ల కుమారుడిని స్కూలుకు తీసుకువెళుతుండగా, ఒక ట్యాంకర్ వెనుకనుంచి వచ్చి ఢీకొనడంతో ఆ బాలుడు మరణించాడు. ఆ రోడ్డుకు ఫుట్‌పాత్ కానీ, రోడ్డు దాటేందుకు క్రాసింగ్ గుర్తులు కానీ లేవు. దేశంలో ఇలాంటి ఘటనలు పెద్ద సంఖ్యలో జరుగుతూనే ఉంటాయి కానీ ఉన్నత న్యాయస్థానం మాత్రం ఈ విషాద ఘటనపై అరుదైన రీతిలో స్పందించింది. నడిచి వెళ్లడం అనేది ఆర్టికల్ 19(1)(డి), ఆర్టికల్ 21 క్రింద ప్రాథమిక హక్కులుగా గుర్తించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నరసింహ ఆదేశాలు జారీ చేశారు. రహదారులను వాహనాల కోసమే కాకుండా పాదచారులకు అనువైన విధంగా నిర్మించాలని ఆయన చెప్పారు. భారతదేశంలో నడిచి వెళ్లడం అనేదానికి సాంస్కృతిక, మతపరమైన, రాజకీయ, సామాజిక విలువ ఉన్నదని కూడా ఆయన గుర్తు చేశారు. దండి యాత్ర, భూదానోద్యమం లాంటి చారిత్రక ఘటనలను జస్టిస్ నరసింహ ఉదహరించారు.
నడిచి వెళ్లడమే ఒక ఘర్షణగా మారిన ఈ దేశంలో ఏటా సగటున 36,500 మంది పాదచారులు సరైన ఫుట్‌పాత్‌లు, క్రాసింగ్‌లు లేక మరణిస్తున్నారని ఒక అధ్యయనం వెల్లడించింది. 80శాతం పట్టణ రోడ్లలో సురక్షితమైన, నడిచివెళ్లే వారికి అనువైన మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల ఈ ఘటనలు జరుగుతున్నాయి. మెట్రో నగరాల్లో 44శాతం రోడ్లకు అసలు ఫుట్‌పాత్‌లే లేవు. ఉన్న ఫుట్‌పాత్‌లలో అత్యధికం ఇండియన్ రోడ్ కాంగ్రెస్ విధించిన నిబంధనలకు అనుగుణంగా లేవు. వికసిత్ భారత్, ట్రిలియన్ ఎకానమీ, విశ్వనగరాల గురించి మాట్లాడే ప్రభుత్వ పెద్దలకు దేశంలో నడిచివెళ్లే వారి దుస్థితి గురించి ఎంతవరకు తెలుసు?
ప్రజల ప్రాథమిక హక్కులకు అనుగుణంగా చట్టాలు చేయకపోవడాన్ని ఈ సందర్భంగా జస్టిస్ నరసింహ ప్రశ్నించారు. మోటారు వాహనాల చట్టం చేసినప్పుడు నడిచి వెళ్లే ప్రజల ప్రాథమిక హక్కును గుర్తించలేదని, ఈ చట్టం కేవలం వాహనాల కోసమే చేసినట్లున్నదని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ప్రధాన న్యాయమూర్తి కానున్న రెండో తెలుగువాడైన జస్టిస్ పీఎస్ నరసింహ నడకను ప్రాథమిక హక్కుగా గుర్తించాలని తీర్పు ఇచ్చిన తర్వాత ప్రజల నుంచి విపరీతమైన ప్రతిస్పందన వచ్చింది. అనేక నగరాల్లో ఫుట్‌పాత్‌లు లేకపోవడం గురించి కథనాలు వస్తున్నాయి. రూల్ ఆఫ్ లా, స్వతంత్ర వైఖరి, ప్రమాణాల గురించి న్యాయవాదులు ముందుగా తెలుసుకోవాలని, విశ్వసనీయత పెంచుకోవాలని జస్టిస్ నరసింహ ఇచ్చిన మరో తీర్పుకు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సానుకూలంగా స్పందించింది. జస్టిస్ నరసింహ సూచించినట్లుగా న్యాయవాదులకు జాతీయ లీగల్ అకాడమీని ఏర్పర్చేందుకు సిద్ధమయింది. ‘గురుబ్రహ్మ, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరః’ అని శ్లోకాలు చదవడం ప్రధానం కాదు, ఆ గురువులకు సరైన జీతాలు ఇవ్వాలి.. అని గుజరాత్ విద్యాలయాల్లో అధ్యాపకులకు కనీస వేతన స్కేలును వర్తింపచేయాలని జస్టిస్ నరసింహ ఇచ్చిన తీర్పును కూడా అనేకమంది స్వాగతించారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్ పేరిట రాజస్థాన్ గుజరాత్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పక్షులకు ముప్పు రాకుండా ఆయన అడ్డుకున్నారు.
మండుటెండల్లో మంచి చినుకుల్లాగా అప్పుడప్పుడూ జస్టిస్ నరసింహ మాత్రమే కాదు, జస్టిస్ ఉజ్జ్వల్ భుయాన్, జస్టిస్ విక్రంనాథ్, జస్టిస్ నాగరత్న, జస్టిస్ విశ్వనాథన్ తదితరులు ఇచ్చిన కొన్ని మంచి తీర్పులను విస్మరించలేం. వందమీటర్ల ఎత్తు దాటితే ఆరావళి పర్వతాలను కూల్చివేయవచ్చని ఇచ్చిన తీర్పును పర్యావరణవేత్తల ఆందోళనతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నిలిపివేశారు. పలు చెప్పుకోదగ్గ తీర్పులు అడపాదడపా సుప్రీంకోర్టు నుంచి వస్తున్నప్పటికీ న్యాయవ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరిస్తోందా అన్న చర్చ మాత్రం ఆగడం లేదు.
దేశంలో ఉన్నత న్యాయస్థానం పాత్ర రోజురోజుకూ వివాదాస్పదంగా మారుతున్న విషయం చర్చనీయాంశమవుతోంది. సుప్రీంకోర్టు అస్తిత్వం కోల్పోతోందని, ఎవరి నియంత్రణలోనో ఉన్నట్లుగా వ్యవహరిస్తోందని, ప్రాథమిక హక్కులను విస్మరిస్తోందని మాజీ న్యాయమూర్తులు, సీనియర్ న్యాయవాదులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై చెప్పు విసిరిన ఘటనను దేశం మరిచిపోకముందే గతవారం ఒక పిటిషనర్ నిండు కోర్టులో సీజేఐపై అసభ్య వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి ఘటనలు సర్వోన్నత న్యాయస్థానం పట్ల పెరుగుతున్న నిరాశా నిస్పృహలకు సంకేతాలుగా అభివర్ణించేవారున్నారు. మరో వైపు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో భారీ ఎత్తున డబ్బు దొరికిన ఘటన రీత్యా ఆయనపై మహాభియోగం ప్రవేశపెట్టేందుకు పార్లమెంట్ సిద్ధమవుతోంది. న్యాయవ్యవస్థను ఆత్మరక్షణలో పడవేసేందుకు లభించే అవకాశాన్ని ప్రభుత్వం ఎందుకు వదులుకుంటుంది?
రాజ్యాంగ విలువలను పరిరక్షిస్తూ, అధికార దుర్వినియోగాన్ని అడ్డుకోవాలంటే న్యాయవ్యవస్థ స్వతంత్రత అవసరం అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్వయంగా స్టాక్ హోమ్‌లో జరిగిన ఒక సదస్సులో అభిప్రాయపడ్డారు. ప్రాథమిక హక్కులను కాపాడిన కేశవానంద భారతి, సమాఖ్య స్ఫూర్తిని పరిరక్షించిన ఎస్.ఆర్ బొమ్మై తదితర కేసులను ఆయన ఉటంకించారు. ఈ తీర్పులు చరిత్ర పుటల్లో కెక్కాయి. సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు స్వేచ్ఛగా సజావుగా ఎలాంటి బయటి ఒత్తిడి లేకుండా వ్యవహరించేందుకు సుప్రీంకోర్టు గతంలో పలుమార్లు జోక్యం చేసుకుంది. మరి గత కొన్నేళ్లుగా సుప్రీంకోర్టు నుంచి ఇలాంటి ఎన్ని అద్భుతమైన తీర్పులు వచ్చాయి?
కొన్ని హైకోర్టుల నుంచి కూడా ఇటీవలి కాలంలో మంచి తీర్పులు వచ్చిన ఉదంతాలు లేకపోలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే నగర బహిష్కారం విధిస్తారా? అని బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవ్ జె జమ్దార్ ప్రశ్నించారు. ప్రజలు ప్రభుత్వానికి బానిసలు కాదు, ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ నిరసన తెలుపడం, నినాదాలు చేయడం వారి హక్కు అని ఆయన ప్రకటించారు. పోలీసులు ప్రజలకు సేవకులే కానీ ప్రభుత్వానికి కాదని జస్టిస్ మాధవ్ స్పష్టం చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ అకౌంట్‌ను బ్లాక్ చేయడాన్ని ప్రశ్నించిన ఢిల్లీ హైకోర్టు ఆ అకౌంట్‌పై నిషేధం ఎత్తివేయాల్సిందిగా ఆదేశించింది. ‘న్యాయమూర్తులేమీ పవిత్రమైన గోవుల్లాంటి వారు కాదు, వారిలో కూడా అవినీతిపరులు ఉన్నారు’ అని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఒక న్యాయమూర్తి అవినీతికి పాల్పడిన విషయాన్ని చూపించిన సినిమాను నిషేధించాలని దాఖలైన పిటిషన్‌పై అలా స్పందించింది. విచిత్రమేమంటే న్యాయవ్యవస్థలో అవినీతి ఉన్నదని ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకంలో పేర్కొన్నందుకు సుప్రీంకోర్టు మూడో కన్ను తెరిచి ఆ పేరాను మార్పించింది. కోర్టుల్లో వేలాది కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు గతంలో చెప్పిన వివరాలను కూడా కొత్త అధ్యాయంలో తీసేశారు. కార్యనిర్వాహక వ్యవస్థ, చట్టసభలకు అతీతంగా న్యాయవ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరిస్తుందని ఆ పాఠ్యపుస్తకంలో పేర్కొన్నారు. నిజంగా అలా జరుగుతోందా?
ప్రపంచ జస్టిస్ నివేదిక ప్రకారం, రూల్ ఆఫ్ లా విషయంలో భారతదేశం 86వ స్థానంలో ఉన్నది. అమెరికాకు చెందిన ఒక స్వతంత్ర సంస్థ రూపొందించిన ఆ నివేదిక ప్రకారం, అమెరికాలో కూడా రూల్ ఆఫ్ లా అంత గొప్పగా లేదని, ఆ విషయంలో అది 36వ స్థానంలో ఉన్నదని తేల్చింది. ప్రపంచంలో నాలుగోవంతు దేశాలు నిరంకుశత్వంలోకి జారిపోతున్నాయని అందులో అమెరికా, ఇండియా కూడా ఉన్నాయని స్వీడెన్‌కు చెందిన వీడెమ్ ఇనిస్టిట్యూట్ నివేదిక తెలిపింది. ఉదారవాద ప్రజాస్వామిక దేశం అన్న గుర్తింపును అమెరికా యాభై ఏళ్ల తరువాత తొలిసారి కోల్పోయిందని ఆ నివేదిక పేర్కొంది. భారత్‌లో పద్ధతి ప్రకారం వ్యవస్థలు కూలిపోతున్నాయని వెల్లడించింది. ప్రభుత్వాలు నిరంకుశంగా మారితే దాని ప్రభావం వ్యవస్థలపై నేరుగా ఉంటుందన్న విషయం వేరే చెప్పనక్కర్లేదు.
న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి గురించి, వెలుపలి శక్తుల నుంచి వస్తున్న ఒత్తిళ్ల గురించి సిట్టింగ్ న్యాయమూర్తులైన జస్టిస్ నరసింహ, జస్టిస్ ఉజ్జ్వల్ భుయాన్, జస్టిస్ నాగరత్న, జస్టిస్ దీపాంకర్ దత్తా తదితరులు పదే పదే హెచ్చరిస్తూనే ఉన్నారు. కోర్టుల స్వతంత్రతకు అతి పెద్ద ముప్పు కోర్టుల నుంచే వస్తోందని ప్రస్తుత న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జ్వల్ భుయాన్ చెప్పారు... ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా ఉన్నదని చెబితే సరిపోదు, అది స్వతంత్రంగా పనిచేస్తున్నట్లు తెలియాలి అని జస్టిస్ దీపాంకర్ దత్తా అన్నారు. మాజీ న్యాయమూర్తుల్లో కూడా ప్రస్తుత పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తున్న వారున్నారు. సమాఖ్య వ్యవస్థ ప్రమాదంలో పడిందని జస్టిస్ కురియన్ ఆందోళన వ్యక్తం చేశారు. విచారణ లేకుండా వేలాది మంది జైళ్లలో మగ్గుతున్నారని జస్టిస్ మదన్ లోకూర్ అంటే, ప్రాథమిక హక్కులను కాపాడే విషయంలో సుప్రీంకోర్టు నిదానంగా వ్యవహరిస్తోందని జస్టిస్ దీపక్ గుప్తా విమర్శించారు.
సీనియర్ న్యాయవాదులూ ఇలాంటి అభిప్రాయాలనే వ్యక్తం చేస్తున్నారు. న్యాయవ్యవస్థ ప్రభుత్వ ఆగడాల నుంచి ప్రజలను కాపాడలేకపోతున్నదని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు దుశ్యంత్ దవే అన్నారు. గత కొన్నేళ్లుగా సుప్రీంకోర్టు నాయకత్వం దేశాన్ని, న్యాయవ్యవస్థను విఫలం చేసిందని ఆయన ఆరోపించారు. కపిల్ సిబాల్, ప్రశాంత్ భూషణ్, ఇందిరా జైసింగ్, సంజయ్ హెగ్డే తదితరులు కూడా తరచూ న్యాయ వ్యవస్థ దుస్థితిని ఎత్తిచూపుతున్నారు. ఈ దేశంలో ప్రజల కన్నా ప్రభుత్వాలే అభద్రతలో పడ్డట్లు అసహనానికి ఎక్కువగా గురవుతున్నట్లు కనపడుతోంది. పాలనపై దృష్టి కేంద్రీకరించాల్సిన ప్రభుత్వాలు తమ అసహనాన్ని, అభద్రతా భావాన్ని ప్రజలు, వ్యవస్థలపై చూపించినప్పుడే దుష్పరిణామాలు సంభవిస్తాయనడంలో అతిశయోక్తి లేదు.
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
Also Read:
ఇథనాల్‌పై నెపం పెట్టొద్దు: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
మత్స్యకారుల కన్నీళ్లపై జగన్ రాజకీయాలు మానుకోవాలి: పల్లా