Share News

విపక్షాలకు ఒకే మాట, ఒకే బాట ఏదీ?

ABN , Publish Date - Jun 10 , 2026 | 02:22 AM

ఢిల్లీలో సోమవారం జరిగిన ఇండియా కూటమి సమావేశంలో వాడిపోయిన ముఖంతో కనపడ్డ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ గట్టిగా హత్తుకున్నారు...

విపక్షాలకు ఒకే మాట, ఒకే బాట ఏదీ?

ఢిల్లీలో సోమవారం జరిగిన ఇండియా కూటమి సమావేశంలో వాడిపోయిన ముఖంతో కనపడ్డ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ గట్టిగా హత్తుకున్నారు. ఒక స్త్రీ మనసును మరో స్త్రీ తప్ప మరెవరు అర్థం చేసుకోగలరు? ‘కొన్ని దృశ్యాలను మాటల్లో చెప్పలేం’ అని సీనియర్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. ఈ ఇద్దరు మహిళలను గతంలో అంతర్జాతీయ సంస్థలు దేశంలోనే అత్యంత శక్తిమంతమైన నేతలుగా అభివర్ణించాయి. సోనియా పది సంవత్సరాలకు పైగా దేశ రాజకీయాలను శాసిస్తే, మమతా బెనర్జీ 15 సంవత్సరాలు బెంగాల్ రాజకీయాలను శాసించారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని వారికి తెలియనిది కాదు.

గత నెలలో వెలువడిన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ వ్యతిరేక శక్తులు మళ్లీ ఢిల్లీలో సమావేశమయ్యాయి. నిన్నటి వరకూ తాము కాంగ్రెస్‌ను కూడా ఢీకొన్న విషయాన్ని మరిచిన మమతా బెనర్జీ, వామపక్షాలు జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు సిద్ధమయ్యాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ అరాచక, అవినీతి పాలనపై రాహుల్‌గాంధీ ఇటీవలే తనను తీవ్రంగా విమర్శించిన విషయాన్ని మమతా బెనర్జీ మరిచిపోయినట్లే కనపడుతోంది. ‘దేశంలో కాంగ్రెస్ నిర్వీర్యమైపోయింది. ఇక జాతీయ స్థాయిలో నేనే కీలక పాత్ర పోషిస్తాను’ అని 2021లో ప్రధానమంత్రి పదవి గురించి కలలు కన్న విషయం కూడా ఆమెకు ఇప్పుడు గుర్తుండే అవకాశాలు లేవు.

1998లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి కోల్‌కతాలో ఏఐసీసీ ప్లీనరీ జరుగుతున్నప్పుడు ర్యాలీ నిర్వహించి పార్టీని ప్రకటించిన బెబ్బులి మమతా బెనర్జీ ఇప్పుడు కోరలు తీసేసినట్లే కనపడుతున్నారు. లోక్‌సభ, అసెంబ్లీల్లో తృణమూల్‌ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఆమెపైనే తిరుగుబాటును ప్రకటించారు. ఆమె కుడిభుజం అభిషేక్ బెనర్జీ. ఎంపీ కల్యాణ్ బెనర్జీ తదితర తృణమూల్‌ నేతలపై వీధుల్లో దాడులు జరుగుతున్నాయి. మమత ఒకప్పుడు ప్రత్యర్థులపై అవలంబించిన విధానాలే ఇప్పుడు ఆమెపై ప్రత్యర్థులు ప్రయోగిస్తున్నారు. కోల్‌కతా వీధుల్లో ఇప్పుడు మమతా బెనర్జీ, ఆమె వర్గీయులు అరణ్య రోదన చేస్తుంటే వారికి అండగా ఇప్పుడు కాంగ్రెస్ నేతలే నిలిచే పరిస్థితి ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో అటు రాష్ట్రంలోనూ, ఇటు ఢిల్లీలోనూ బీజేపీ వంటి మహాశక్తిని ఎదుర్కోవాలంటే కాంగ్రెసే శరణ్యమని మమతా బెనర్జీ గ్రహించినట్లు కనపడుతోంది.


బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాలు సీట్లు పెద్దగా గెలుచుకోనప్పటికీ తృణమూల్‌ను బాగా దెబ్బతీయగలిగాయి. ముర్షీదాబాద్, మాల్డా, ఉత్తర్ దినాజ్‌పూర్ లాంటి మైనారిటీల ఆధిపత్యం ఉన్న ప్రాంతాల్లో కాంగ్రెస్–వామపక్ష కూటమి తృణమూల్‌కు సంప్రదాయంగా లభించే మద్దతు రాకుండా చూశాయి. 50శాతానికి పైగా ముస్లింల జనాభా ఉన్న 32 అసెంబ్లీ స్థానాల్లో తృణమూల్ ఒక్క సీటును కూడా గెలుచుకోలేదు. జంగీపూర్ అనే నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థికి 31వేల ఓట్లు రాగా తృణమూల్ అభ్యర్థికి 10,542 ఓట్లు మాత్రమే లభించాయి. అదే కరండిఘి అనే నియోజకవర్గంలో సీపీఐ(ఎం)కు 39వేల ఓట్లు రాగా, ఆ పార్టీ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి 20వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. బహుశా ఈ ఫలితాలు వచ్చిన తీరు మమతా బెనర్జీకి తన అహంకారం, దౌర్జన్యపూరిత ధోరణి, మిత్రపక్షాలను లెక్కచేయనితనం గురించి గుణపాఠాలు నేర్పే ఉంటుంది. అందుకే ఆమె ఇప్పుడు ఢిల్లీ వీధుల్లో కనపడుతున్నారు.

ఇక దేశంలో తమ కాళ్ల కింద నేల క్రుంగిపోతున్న వామపక్షాలకు కూడా ఢిల్లీ వీధులే శరణ్యంగా మారాయి. 140 సీట్లున్న కేరళ అసెంబ్లీలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 100 సీట్లకు పైగా గెలుచుకోవడం, బీజేపీ మూడు సీట్లు గెలుచుకోవడం, పినరయి విజయన్ కేబినెట్‌లో అత్యధిక మంత్రులు పరాజయం పాలుగావడం విస్మరించదగ్గ విషయం కాదు. అక్కడ కూడా పినరయి విజయన్ పదేళ్ల కేంద్రీకృత అహంకార పాలన, రైతులు, యువత, ఆశా వర్కర్లు తీవ్ర నిరుత్సాహానికి గురికావడం, పార్టీ కేడర్ అసంతృప్తి... వంటివి వామపక్ష కూటమి పరాజయానికి కారణమని విశ్లేషకులు అభివర్ణించారు. పినరయి విజయన్ బీజేపీతో కుమ్మక్కయ్యారని, అవినీతిపరులను ప్రోత్సహిస్తున్నారని రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి వంటి కాంగ్రెస్ నేతలు విమర్శించారు. విజయన్‌పై కేంద్ర ఏజెన్సీలు ఎందుకు విచారణ జరపలేదని ప్రశ్నించారు. ఏమైతేనేం అయిదు దశాబ్దాల తర్వాత దేశంలో ఎక్కడా అధికారంలో లేని పరిస్థితికి వచ్చిన వామపక్షాలు బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసి పనిచేయడం తప్ప తమకు మరో మార్గం లేదని గ్రహించాయి. ఇండియా కూటమి సమావేశానికి హాజరైన వామపక్ష నేతలు డి.రాజా, జాన్ బ్రిటాస్‌కు ఆ స్పష్టత ఉన్నది.


దేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితిని రెండేళ్ల క్రితం మరణించిన సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి బాగా అర్థం చేసుకున్నారు. సీపీఐ(ఎం) బహిష్కరించిన ప్రసేనజిత్ బోస్‌ను కాంగ్రెస్ తన పార్టీలో చేర్చుకున్నప్పుడు ‘మీ కామ్రేడ్‌ను మేము మా పార్టీలో చేర్చుకున్నాం’ అని రాహుల్‌గాంధీ ఏచూరితో పరిహాసమాడారు. ‘మీ వాడు, మా వాడు అనేది ఏముంది, ఈ పోరులో మనమిద్దరమూ ఒకే పడవలో ప్రయాణిస్తున్నాం’ అని ఏచూరి నవ్వుతూ జవాబిచ్చారు. దేశంలో బీజేపీ అడ్డూ ఆపూ లేకుండా దూసుకువస్తున్న పరిస్థితుల్లో ఆ పార్టీని ఎదుర్కొనేందుకు అన్ని బీజేపీ వ్యతిరేక శక్తులూ సంకుచిత ధోరణి వీడి కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరాన్ని ఆయన ఎప్పుడో గ్రహించారు. ఇవాళ ఎన్డీఏలో ఉన్న పార్టీలేవీ ఎన్నికల్లో పరస్పరం పోటీపడడం లేదు. కానీ ఇండియా కూటమిలో ఉన్న పార్టీలకు ఆ మేరకు సమైక్యత లేదు. దాదాపు రెండేళ్ల తర్వాత ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్‌లో సమావేశమైన 23 పార్టీలకు ఎంత మేరకు లక్ష్యశుద్ధి ఉన్నది? డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీలు హాజరు కాకపోవడంలో మర్మం ఏమిటి? ఎమర్జెన్సీ అనంతరం 1977లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఒకే ఎన్నికల గుర్తుపై జనతా పార్టీ పేరుతో పోటీ చేశాయి. అప్పటి చిత్తశుద్ధి, పోరాట స్ఫూర్తి ఇప్పుడు ఎన్ని పార్టీలకు ఉంది? మిత్రపక్షాలను కూడా తన సైద్ధాంతిక బాటలో నడిపించగలిగిన బీజేపీ మాదిరి కాంగ్రెస్ ఇతర పార్టీలకు సారథ్యం వహించగలదా?

ఇండియా కూటమి సమావేశం జరిగిన రెండు రోజుల తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ 12 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశాన్ని ఏర్పరిచారు. పేరుకు ఇది ఎన్డీఏ సమావేశమైనా, జరుగుతోంది బీజేపీ సమావేశమే. నాగాలాండ్, మేఘాలయ, పుదుచ్చేరి వంటి చిన్న రాష్ట్రాలను పక్కన పెడితే ఎన్డీఏ పాలన అమలులో ఉన్న అతి పెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. నిన్నమొన్నటి వరకు బిహార్‌లో జనతాదళ్(యు) అధినేత నితీశ్‌ కుమార్ ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఇప్పుడు అక్కడ కూడా బీజేపీ నేతే ముఖ్యమంత్రిగా ఉన్నారు. నితీశ్‌ రాజ్యసభకు రావడంతో లోక్‌సభలో ఉన్న 12 మంది జేడీ(యు) ఎంపీలకు మోదీయే నాయకుడుగా భావించవలసి ఉంటుంది. లోక్‌సభలో 28 మంది తృణమూల్ ఎంపీలు ఉండగా, ఆ పార్టీ చీఫ్ విప్ కాకోలీ ఘోష్ దస్తిదార్ నేతృత్వంలోని 20 మంది ఎంపీలు మమతా బెనర్జీపై తిరుగుబాటు చేసి తమను ప్రత్యేక గ్రూప్‌గా గుర్తించమని స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాయాలని నిర్ణయించారు. వీరు కూడా ఏ సుముహూర్తాన్నో బీజేపీలో చేరి, ఆ పార్టీ ఎంపీలుగా కాషాయ కండువా కప్పుకోక తప్పదు. అంటే బీజేపీకి తెలుగుదేశం ప్రమేయం లేకుండానే ఇప్పటికే లోక్‌సభలో పూర్తి మెజారిటీ వచ్చినట్లే లెక్క.


అంతేకాక శివసేనకు చెందిన ఏడుగురు, లోక్ జనశక్తికి చెందిన అయిదుగురు, జనతాదళ్ సెక్యులర్‌కు చెందిన ఇద్దరు, రాష్ట్రీయ లోక్‌దళ్‌కు చెందిన ఇద్దరు, ఎన్‌సీపీ పవార్ గ్రూప్‌కు చెందిన ఒక్కరు, అప్నాదళ్, హిందూస్థానీ ఆవామీ మోర్చాకు చెందిన ఇద్దరితో పాటు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఆరుగురు ఇప్పటికే బీజేపీకి మద్దతునిస్తున్నారు. మోదీ అధికారంలోకి వచ్చాక శివసేన, ఎన్‌సీపీ, లోక్ జనశక్తి, రాష్ట్రీయ లోక సమతా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ వంటి పలు ప్రాంతీయ పార్టీలను చీల్చిన ఘనత, పలువురు ఇతర పార్టీల నేతలను తమతో పాటు కలుపుకున్న ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కింది. అంతే కాదు, మోదీ హయాంలోనే బీఎస్పీ, బీజేడీ, అన్నాడీఎంకేతో పాటు పలు ప్రాంతీయ పార్టీల భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. మోదీకి దాసోహం అనకపోతే తమ మనుగడ కష్టమని పలు ప్రాంతీయ పార్టీలు భావించే పరిస్థితి దేశంలో నెలకొంది.

ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన నేడు 13వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న దృష్ట్యా ఆయన రాజకీయాలు ఇంకెంత తీవ్ర స్థాయిలో ఉంటాయో అన్న విషయమై సోషల్ మీడియాలో వ్యాఖ్యలు, కాక్రోచ్ జనతా పార్టీ వంటి పరిణామాలు, ప్రజాస్వామ్య సంస్థలు బలహీనపడడం, న్యాయవ్యవస్థ లొంగిపోయిందనే ఆరోపణలు, నీట్, సీబీఎస్ఈ వంటి సంస్థలు పరీక్షలను నిర్వహించలేని వైఫల్యంపై ఎన్ని విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ రాజకీయంగా మోదీ బలం రోజురోజుకూ పెరుగుతోందనే విషయాన్ని ఎవరూ కాదనలేరు. అంతర్వైరుధ్యాలను తొలగించుకోకుండా, సమాన ప్రత్యామ్నాయ దృక్పథాన్ని ఏర్పర్చుకోకుండా ఎన్ని సమావేశాలు నిర్వహించినప్పటికీ ప్రతిపక్షాలు కానీ, ఇతరేతర శక్తులు కానీ ఏ మార్పును సాధించగలుగుతాయి?

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

ఇవి కూడా చదవండి..

విజయ్ కీలక నిర్ణయం.. మహిళల భద్రత కోసం సింగప్పెన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్

సంతకాల ఫోర్జరీ కేసు.. మమతా బెనర్జీ కార్యాలయానికి సీఐడీ టీమ్

Updated Date - Jun 10 , 2026 | 02:22 AM