గ్రీన్‌హంట్ నుంచి కగార్ దాకా...
ABN , Publish Date - Apr 01 , 2026 | 02:12 AM
‘ఈ దుర్మార్గమైన వ్యవస్థను కూలద్రోయాల్సిందే సార్.. నేను కూడా అన్నలతో కలిసి పనిచేయాలనుకుంటున్నాను..’ అని ఇంజనీరింగ్ చదువుతున్న శ్రీనివాస్ అనే 20 ఏళ్ల యువకుడు...
‘ఈ దుర్మార్గమైన వ్యవస్థను కూలద్రోయాల్సిందే సార్.. నేను కూడా అన్నలతో కలిసి పనిచేయాలనుకుంటున్నాను..’ అని ఇంజనీరింగ్ చదువుతున్న శ్రీనివాస్ అనే 20 ఏళ్ల యువకుడు 1990లో చెప్పాడు. నేను ఆశ్చర్యపోయాను. ‘నీకు నక్సలైట్ల గురించి ఏమి తెలుసని వారితో కలిసి పనిచేయాలనుకుంటున్నావు? ముందు బాగా అధ్యయనం చేయి, పుస్తకాలు చదువు.. వారి సిద్ధాంతం పట్ల అవగాహన వస్తే నీకు నచ్చినట్లే చేయి’ అని నచ్చజెప్పాను. అతడికి నా మాటలు రుచించినట్లు లేదు. తర్వాత కలవడం మానేశాడు. ఒకటి రెండు చోట్ల రచయితల సమావేశాలలో, బంధుమిత్రుల ఇళ్లలో తటస్థించేవాడు కానీ, నాతో పొడిపొడిగా మాట్లాడేవాడు. ఒక రోజు హైదరాబాద్‌లో నేను పని చేస్తున్న దినపత్రిక కార్యాలయానికి వచ్చాడు. గడ్డం పెంచుకుని మాసిపోయిన దుస్తులతో కనిపించాడు. ‘నేను ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్నాను. మురికివాడల్లో పనిచేస్తున్నాను. ఈ ప్రెస్ రిలీజ్ పూర్తిగా అచ్చుకావాలి’ అని గుసగుసగా మాట్లాడి మాయమయ్యాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు నేను ఢిల్లీ వచ్చాను. ఒక ఏడాది తర్వాత సెలవుపై హైదరాబాద్ వచ్చే సరికి బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో శ్రీనివాస్ సంస్మరణ సభ జరుగుతోంది. హైదరాబాద్ పొలిమేరల్లోనే అతడి ఎన్‌కౌంటర్ జరిగింది. శ్రీనివాస్ గురించి ప్రముఖ విప్లవ రచయితలు ఆవేదనతో, ఆవేశంగా మాట్లాడారు. అతడు రాసినవన్నీ పుస్తకంగా అచ్చేసి ఆవిష్కరించారు. ఒక్కగానొక్క కొడుకును కోల్పోయిన అతడి తల్లిదండ్రులు ప్రెస్‌క్లబ్‌లో ఒక మూలన కూర్చుని మౌనంగా రోదిస్తున్నారు.
శ్రీనివాస్ మాదిరే 1975లో కృష్ణా జిల్లా నుంచి గరికపర్రుకు చెందిన సూరపనేని జనార్దన్ వరంగల్ రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీలో నాలుగో సంవత్సరం చదువుతూ మాయమై, గిరాయిపల్లి అడవుల్లో ఎన్‌కౌంటర్‌కు గురయ్యాడు. ఇలాంటి ఎందరో విద్యాధికులు, యువతీ యువకులు ఆకస్మికంగా నక్సలైట్లుగా మారి ప్రాణాలు కోల్పోయారు. అమర్ రహే నినాదాలతో గోడలు నిండిపోవడం, అమరత్వాన్ని కీర్తిస్తూ కవిత్వం రాయడం మామూలైపోయింది. చాలాకాలం వరకూ, ఎక్కడైనా అన్యాయాలు జరిగితే నక్సలైట్లు ఆదుకుంటారని అనుకునే సామాన్య జనం ఉండేవారు. అందుకే 1983లో ఎన్టీఆర్ నర్సంపేట, ములుగు ప్రాంతాల్లో తిరిగినప్పుడు ‘నక్సలైట్లే దేశభక్తులు’ అన్నారు. కానీ రెండేళ్లలోనే ఆయన వైఖరి మారిపోయింది. నినాదాలివ్వడం వేరు, ప్రభుత్వాన్ని నడపడం వేరు. గద్దర్, వంగపండు లాంటి గాయకులు పాడే పాటలు, విప్లవ రచయితల కవితలు, ఉపన్యాసాలు ఒకప్పుడు తెలుగు ప్రాంతాలను ఉర్రూతలూగించేవి. ఈ వెల్లువలో పవన్ కల్యాణ్ లాంటి సినిమా నటుడు కూడా అన్నల్లో చేరాలనుకున్నారని, ఆయనను చిరంజీవి వారించారని ఎంత మందికి తెలుసు? వివిధ పార్టీల్లో ఉన్న పలువురు రాజకీయ నాయకులకు నక్సల్ నేపథ్యం ఉన్న విషయం సత్యదూరం కాదు.
ఆర్థిక సంస్కరణల తర్వాత ఆర్థిక వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి. సహజంగానే నక్సలైట్లు ప్రతిపాదించే ఆర్థిక నమూనాను సంస్కరణల అనంతరం భారతదేశం అవలంబించిన ఆర్థిక నమూనా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మొదట్లో నక్సలైట్ల హింసాకాండ గురించి పార్లమెంట్‌లో ప్రశ్నలు వచ్చినప్పుడు ‘శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వ పరిధికి సంబంధించిన అంశం’ అని కేంద్ర హోంమంత్రి సమాధానం చెప్పేవారు. అయితే ఆర్థిక సంస్కరణలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కలిసికట్టుగా పనిచేసేందుకు పురిగొల్పాయి. ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టిన పీవీ నరసింహారావు నక్సలైట్ సమస్యను ఆర్థిక, సామాజిక సమస్యగా భావించారు. ఆయన తరువాయి ప్రధానమంత్రులు అలా భావించలేదు. ఆర్థిక సంస్కరణల ఫలితంగా ఉపరితలంలోనే కాదు, పునాదిలో కూడా మార్పులు వచ్చాయి. ఈ మార్పుల మూలంగా నక్సలైట్ ఉద్యమం అడవులకు పరిమితమవుతూ, తన అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుందని గ్రహించే నాటికే చాలా ఆలస్యం జరిగింది. ‘ఏ ప్రజల పేరిటనైతే ఒక పంథాను అవలంబిస్తున్నారో, ఆ ప్రజలకు ఆ పంథా పట్ల ఆమోదం ఉన్నదా, అసలు అవగాహన ఉన్నదా, ఆ పంథాను అమలు చేసే క్రమంలో చేస్తున్న హాని, తీస్తున్న ప్రాణాలు, తెస్తున్న నిర్బంధం విప్లవానికి అనివార్యమా..?’ అని పౌరహక్కుల మేధావి బాలగోపాల్ 1998లోనే ప్రశ్నించారు. 2026లో లొంగిపోయిన సీనియర్ మావోయిస్టు నేత మల్లోజుల వేణుగోపాలరావు కూడా అదే అన్నారు. మావోయిస్టు ఉద్యమం తన స్వయం కృతాపరాధాల వల్ల తప్పుల వల్ల సామాజిక పునాది కోల్పోయిందని, తమదొక విఫల ప్రయోగమని, కొన్ని దశాబ్దాలు ఆ ఉద్యమంలో పనిచేసిన తర్వాత ఆయన చెప్పడం ఆశ్చర్యకరం. ఈ విఫల ప్రయోగానికి సంకేతాలు నక్సలైట్ ఉద్యమ సహ వ్యవస్థాపకుడైన కానూ సన్యాల్ ఆత్మకథలో కూడా ఉన్నాయి.
ఆసక్తికరమైన విషయం ఏమంటే ఆర్థిక సంస్కరణలు తీవ్రతరం అవుతున్న రోజుల్లోనే 2000 సంవత్సరంలో మావోయిస్టులు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీని స్థాపించారు. 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును హతమార్చే ప్రయత్నం చేశారు. ఈ శతాబ్ది మొదటి దశకంలో అనేక మంది పోలీసులు నక్సల్స్ దాడుల్లో మరణించారు. 2009లో హోంమంత్రి చిదంబరం సారథ్యంలో ఆపరేషన్ గ్రీన్‌హంట్ ప్రారంభమైంది. నక్సలిజం భారతదేశానికి అత్యంత ప్రమాదకరమైన అంతర్గత ముప్పుగా నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ అభివర్ణించిన తర్వాత 2010లో నక్సల్స్ నేతలు చెరుకూరి ఆజాద్, 2011లో కిషన్‌జీల ఎన్‌కౌంటర్ జరిగింది.
2011 డిసెంబర్‌లో ఒక రోజు పార్లమెంట్ సెంట్రల్ హాలులో అప్పటి కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రి జైరాం రమేశ్‌తో మాట్లాడుతుండగా ఆపరేషన్ గ్రీన్‌హంట్ ప్రస్తావన వచ్చింది. ‘కేంద్ర స్థాయిలో చర్చలు జరిపే ఆలోచన ఏమైనా ఉన్నదా?’ అని నేను అడిగాను. ‘ఎవరున్నారు చర్చలు జరపడానికి?’ అని ఆయన ఎదురు ప్రశ్నించారు. ఆ రోజుల్లో విప్లవ రచయిత వరవరరావు ఢిల్లీలోనే తలదాచుకుంటున్న విషయాన్ని నేను వెల్లడించాను. ‘ఆయనతో చర్చించడానికి సిద్ధమే’ అని జైరాం అన్నారు. అందుకు చిదంబరం అనుమతి కూడా తీసుకున్నారు. 2011 డిసెంబర్ 15న ఢిల్లీలోని సమ్రాట్ హోటల్‌లో జైరాం రమేశ్‌తో చర్చించేందుకు నేను వరవరరావును తీసుకెళ్లాను. చర్చల్లో నాటి గ్రామీణాభివృద్ధి సంయుక్త కార్యదర్శి విజయకుమార్, జైరాం వ్యక్తిగత కార్యదర్శి వినీల్ కృష్ణ కూడా ఉన్నారు. ఈ ఇరువురు ఐఏఎస్ అధికారులను గతంలో నక్సలైట్లు కిడ్నాప్ చేశారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకోగల శంకరన్, వినీల్ కృష్ణలను కిడ్నాప్ చేయడం నక్సలైట్ల తప్పేనని అంగీకరించిన వరవరరావు ఆదివాసీలపై జరుగుతున్న అత్యాచారాలు, మావోయిస్టుల పేరిట వారిని కాల్చి చంపడం, మైనింగ్ కంపెనీలను విచక్షణా రహితంగా అనుమతించడం గురించి ప్రస్తావించారు. ఆదివాసీలకోసం పనిచేస్తున్న జీన్ డెరిజె, అరుణారాయ్ లాంటి వారిని ఎందుకు హెచ్చరిస్తున్నారని జైరాం ప్రశ్నించారు. తనను కిడ్నాప్ చేసిన వారిలో 14–15 సంవత్సరాల పిల్లలు ఉన్నారని వినీల్ కృష్ణ గుర్తు చేశారు. మావోయిస్టులు రాజకీయ క్రమంలో ఎందుకు పాల్గొనరని జైరాం ప్రశ్నించినప్పుడు వారు కూడా ఒక రాజకీయ శక్తేనని, అయితే పార్లమెంటరీ వ్యవస్థపై వారికి నమ్మకం లేదని వరవరరావు చెప్పారు. నూతన ఉదారవాద ఆర్థిక విధానాలే ప్రజల జీవితాల్లో కల్లోలం సృష్టిస్తున్నాయని, ప్రభుత్వ మైనింగ్, అటవీ యాజమాన్య విధానాలు ఆదివాసీల సంక్షేమంతో చెలగాటమాడుతున్నాయని చెప్పారు. చైర్మన్ మావో విధానాల వల్ల 1958–60లో తీవ్ర కరువు సంభవించి దాదాపు 3 కోట్ల మంది మరణించారని, విధ్వంసకరమైన సాంస్కృతిక విప్లవం జరిగిందని జైరాం చెప్పారు.
ఇదంతా పెట్టుబడిదారీ ప్రచారమేనని వరవరరావు కొట్టి పారేశారు. ఆదివాసీలు, దళితుల ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం చర్చించి సరైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమేనని, ఇలాంటి ఏకాభిప్రాయం కుదిరిన అంశాలపై చర్చించవచ్చునని జైరాం ప్రతిపాదించారు. అయితే బూటకపు ఎన్‌కౌంటర్లను నిలిపివేయాలని అప్పుడే మావోయిస్టులు చర్చల కోసం ప్రతిస్పందించవచ్చునని వరవరరావు డిమాండ్ చేశారు. చర్చలకోసం వచ్చిన ఆజాద్, కిషన్‌జీలను ఎన్‌కౌంటర్‌లో చంపారని ఆయన గుర్తు చేశారు. చిదంబరంను తాను నమ్మబోనని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశం తరువాత చర్చలు ముందుకు సాగలేదు.
యూపీఏ ప్రభుత్వమే కొనసాగి ఉంటే ఆపరేషన్ గ్రీన్‌హంట్ తార్కిక స్థాయికి వెళ్లేదేమో? 2014లో నరేంద్రమోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నక్సలైట్లపై చిదంబరం వ్యూహాన్ని తారస్థాయికి తీసుకువెళ్లి ఆపరేషన్ కగార్‌ను అమలు చేశారు. అధునాతన టెక్నాలజీని తిరుగులేని విధంగా ఉపయోగించుకున్నారు. నక్సలైట్ల నిధులకు కత్తెర వేశారు. 2026 మార్చి 31 నాటికి దేశాన్ని మావోయిస్టుల నుంచి విముక్తి చేసేందుకు మోదీ సర్కార్ సంకల్పించింది. ఈ విషయంలో తాము విజయం సాధించగలిగామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. నక్సలిజాన్ని బీజేపీ ఎప్పుడూ సామాజిక, ఆర్థిక అభివృద్ధి అంశంగా కాక సైద్ధాంతిక కోణంలో చూసింది. నక్సలైట్ల నిర్మూలన తర్వాత ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న సహజ వనరులను కార్పొరేట్లకు అప్పగించడం వారి అభివృద్ధి సిద్ధాంతంలో భాగమే. ఇంతకాలం పేదరికం వల్ల నక్సలిజం బలపడి ఉంటే దేశంలో పేదలు ఉన్న ప్రాంతాలన్నింటిలోనూ నక్సలైట్లు ఉండేవారని, వారిది సైద్ధాంతిక పోరాటమేనని అమిత్ షా లోక్‌సభలో నక్సల్స్‌పై జరిగిన చర్చకు సమాధానమిస్తూ చెప్పారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న అన్ని రాజకీయ నిర్ణయాల కంటే ప్రజలకు అత్యంత ఉపయోగకరమైనది నక్సల్స్ నుంచి దేశాన్ని విముక్తి చేయడమేనని కూడా ఆయన ఘంటాపథంగా చెప్పారు. ఇతర వామపక్షాలతో పాటు కాంగ్రెస్‌ను కూడా నక్సల్స్ సానుభూతిపరులుగా తీర్మానించడం ఆయన రాజకీయం. అది వేరే సంగతి.
అమిత్ షా అన్నట్లు నక్సలైట్లది నిజంగా సైద్ధాంతిక పోరాటమైతే, ఆ సిద్ధాంతం ప్రజల్లోకి బలంగా వెళితే, వారు నిజంగా బలపడి దేశమంతా విస్తరించేవారే. లొంగిపోయిన నక్సలైట్లందరికీ భారత రాజ్యాంగ ప్రతిని బహూకరించారు. భారత రాజ్యాంగ స్ఫూర్తితో, గాంధీజీ ప్రతిపాదించిన సత్యాగ్రహం పద్ధతిలో కూడా అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించే అవకాశం ఉన్నది. ఈ విలువలైనా మరో ప్రజాస్వామిక ఉద్యమానికి దారితీస్తాయా?
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
ఇవి కూడా చదవండి..
యూసీసీ అమలు, లవ్ జిహాద్‌కు చెక్.. అస్సాంలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో
దేశంలో ఇంధన పరిస్థితి అదుపులో ఉంది: మోదీ