దక్షిణాపథంలో బీజేపీ జైత్రయాత్ర ఎప్పుడు?
ABN , Publish Date - May 13 , 2026 | 12:14 AM
కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో కొన్ని దశాబ్దాల పాటు ఎర్ర కెరటాలు ప్రతి ఏటా ఉప్పొంగేవి. కానీ ఈ మే 9న కాషాయ అలలు పరవళ్లు తొక్కాయి. ప్రధానమంత్రి మోదీ, వేలాది ప్రజల సమక్షంలో సువేందు అధికారి బీజేపీ...
కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో కొన్ని దశాబ్దాల పాటు ఎర్ర కెరటాలు ప్రతి ఏటా ఉప్పొంగేవి. కానీ ఈ మే 9న కాషాయ అలలు పరవళ్లు తొక్కాయి. ప్రధానమంత్రి మోదీ, వేలాది ప్రజల సమక్షంలో సువేందు అధికారి బీజేపీ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సరిగ్గా ఒక రోజు తర్వాత ఆదివారంనాడు దక్షిణాదిన చెన్నైలో జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో సినీనటుడు చంద్రశేఖరన్ జోసెఫ్ విజయ్ జాతీయ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సమక్షంలో తమిళనాడు 9వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్ పట్టాభిషేకానికీ అంతే భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో బలంగా వేళ్లూనుకుని, పశ్చిమాన గుజరాత్, మహరాష్ట్రల్లో, ఈశాన్య రాష్ట్రాలైన అసోం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపురలో, తూర్పు, కోస్తా ప్రాంతంలో తొలుత ఒడిషా, ఇప్పుడు బెంగాల్‌లో విస్తరించిన భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో అడుగుపెట్టడం అంత సులభం కాదని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది. అటు సువేందు అధికారి, ఇటు జోసెఫ్ విజయ్ ఈ పరిణామాలకు ప్రతిఫలనాల్లా కనిపిస్తున్నారు. ఈ రెండు ఘట్టాలు భారత దేశ ప్రజల ఆలోచనా దృక్పథంలో రెండు భిన్న కోణాలను ప్రతిబింబిస్తున్నాయా?
బెంగాల్‌లో సువేందు అధికారి పక్కన నిలబడిన నరేంద్రమోదీ ఇప్పుడు దక్షిణాదిలో విస్తరించేందుకు ఉవ్విళ్లూరుతుంటే, కేరళలో విజయం సాధించి, జోసెఫ్ విజయ్ పక్కన నిలబడ్డ రాహుల్‌గాంధీ ఉత్తరాదిలో పూర్వవైభవాన్ని సంతరించుకునేందుకు ఎన్ని యత్నాలు చేసినా ఫలితాలు సాధించలేకపోతున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్‌ను ప్రతిఘటించిన దక్షిణాది రాష్ట్రాలు బీజేపీని ఏమంత ఆహ్వానించలేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో బీజేపీ ప్రవేశించేందుకు చేయని ప్రయత్నం లేదు. అమలు చేయని ప్రయోగం అంటూ లేదు.
ఏపీలో తెలుగుదేశం ఆధిపత్యాన్ని అంగీకరించిన బీజేపీ కర్ణాటకలో ఉన్న అధికారాన్ని కోల్పోయి, మళ్లీ పట్టుకోసం నానా యత్నాలు చేస్తోంది. తమిళనాడులో స్వంతంగా బలపడడం కష్టమని గ్రహించిన తర్వాత మళ్లీ అన్నాడీఎంకేతో చేతులు కలపక తప్పలేదు. కేరళలో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి 3 సీట్లు సాధించిన బీజేపీ ఓట్ల శాతం మాత్రం గతంతో పోలిస్తే ఏమంత పెరగలేదు. కేరళ, తమిళనాడులో బీజేపీ ప్రవేశించడం సుదూర స్పప్నమైతే అవకాశం ఉన్న రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణ మాత్రమే. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఈ రెండు రాష్ట్రాల్లో పర్యటించారు. అయితే కర్ణాటక, తెలంగాణల్లో మోదీ పర్యటన భిన్న రీతుల్లో సాగింది. కర్ణాటకలో జాతీయవాద రాజకీయాలవైపు ప్రజలు మొగ్గుచూపుతున్నారని, త్వరలో కాషాయ ప్రభంజనం ఆ రాష్ట్రంలో వీస్తుందని చెప్పిన మోదీ తెలంగాణలో మాత్రం ఆ విశ్వాసాన్ని ప్రకటించలేదు.
1984లో దేశ వ్యాప్తంగా కేవలం బీజేపీ గెలుచుకున్న రెండు స్థానాల్లో ఒకటి గుజరాత్‌లోని మెహసానా కాగా, రెండవది తెలంగాణలో హన్మకొండ. ఇప్పుడు గుజరాత్‌తో పాటు దేశంలోని అనేక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రాగా, తెలంగాణలో మాత్రం అనుకున్నంతమేరకు విస్తరించలేకపోతోంది. ఈ విషయాన్ని స్వయంగా మోదీయే రాష్ట్ర నేతల దగ్గర ప్రస్తావించి వారిని విమర్శించారు. బండి సంజయ్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు బీజేపీ కేడర్‌లో కొంత ఊపు వచ్చింది కాని ఆ తర్వాత ఆ ఉత్సాహం క్రమంగా నీరుకారిపోయింది. సంఘ్ పరివార్ సంస్థలైతే హిందూత్వ దిశగా ప్రజల్ని మళ్లించగలవు కాని రాజకీయంగా ప్రజల్లో కదలిక తేవాల్సింది బీజేపీ నేతలే. మోదీ తాజా పర్యటనలో బీజేపీ నేతలకు బహిరంగంగా ఎలాంటి దిశానిర్దేశం చేయలేదు. ఉత్తరాది, బెంగాల్‌లో అవలంబించిన పద్ధతులు దక్షిణాదిన పనిచేయవని ఆయనకు తెలుసు. అయితే తెలంగాణకు సంబంధించి మోదీ వద్ద ఏదో వ్యూహమే ఉన్నట్లు ఆయన మాటలు, సమావేశాలు అనుమానాలు కలిగిస్తున్నాయి. అదేమిటో కాలమే చెబుతుంది.
బెంగాల్‌లో బీజేపీ విజయంతో మమతా బెనర్జీ తర్వాత కమలనాథులను ఢీకొనగల శక్తులంతా ఒక్కొక్కరూ మాయవుతున్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో జాతీయ పార్టీ కాంగ్రెస్ అయినా కనీసం బీజేపీని ఢీకొనగలదా అన్న ప్రశ్న తలెత్తుతోంది. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఐక్యం చేసేందుకు ప్రయత్నించిన నాయకులు అందరూ ఒక్కొక్కరూ కుప్పకూలిపోయారు. నితీశ్‌కుమార్, మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, కేసీఆర్, శరద్‌పవార్, కేజ్రీవాల్, ఉద్దవ్ ఠాక్రే అందరూ మోదీని వ్యతిరేకించి ప్రతిపక్షాలను ఏకం చేయాలనుకున్నవారే. 2023లో ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు తీవ్ర యత్నాలు చేసిన నితీశ్ తర్వాత అధికారం కోసం బీజేపీ వైపు మళ్లి, ఇప్పుడు బీజేపీకే అధికారాన్ని వదులుకున్నారు. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాలు చేయగలిగిన నేతల నందరినీ మోదీ చతుర్విధోపాయాలు ఉపయోగించి పక్కకు తప్పించారు. వీరెవరూ జాతీయ స్థాయిలో ఇప్పుడు మోదీని ఎదుర్కోగలిగేందుకు చేయగలిగింది ఏమీ లేకపోగా, రాష్ట్ర స్థాయిలో మనుగడకు పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మహారాష్ట్రలో శివసేన, ఎన్‌సీపీని చీల్చి ప్రాబల్యం సంపాదించిన బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీలో కూడా తిరుగుబాటును ప్రేరేపించింది. తమిళనాడులో కొత్త శక్తి ఆవిర్భవించినప్పటికీ లోక్‌సభ ఎన్నికలు జరిగే వరకు ఈ శక్తి తన బలం ఎంతమేరకు పుంజుకుంటుందో ఇప్పుడే చెప్పలేం. వామపక్షాలకు ఉన్న ఏకైక ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ వశమైంది. పార్లమెంటులో వామపక్షాల ఉనికి క్రమంగా క్షీణించిపోతోంది.
ప్రాంతీయ పార్టీలు, వామపక్షాలు బలహీనపడంతో బీజేపీని కాంగ్రెస్ మాత్రమే ఒంటరిగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. బహుశా బీజేపీ కూడా అదే కోరుకుంటుందేమో. బీజేపీ వ్యతిరేక రాజకీయాలు బలహీనపడడమో, ఆవశ్యకత కోల్పోవడమో స్పష్టంగా కనపడుతోంది. అది నాయకత్వస్థాయిలోనూ, సైద్ధాంతిక స్థాయిలోనూ ప్రస్ఫుటిస్తోంది. దానివల్ల దక్షిణాదిలో కూడా బీజేపీతో చేతులు కలిపేందుకు, దాని రాజకీయ సిద్ధాంతాన్ని ఆమోదించేందుకు పార్టీలు ఏ మాత్రం వెనుకాడడం లేదు. బీజేపీ వ్యతిరేకత సోషల్ మీడియా కాగితపు పులులకు మించి జనంలోకి వ్యాపించేందుకు ఎంత సమయం పడుతుందో చెప్పలేము.
స్వాతంత్ర్యం తర్వాత దశాబ్దాలపాటు రాజ్యమేలిన కాంగ్రెస్ ఆ తర్వాత క్రమంగా బలహీనపడింది. అప్పుడు జనసంఘ్, బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉన్నదో ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి కూడా అదే విధంగా మారింది. కేవలం రెండేళ్లలో బీజేపీ తూర్పున ఒడిషా, బిహార్, పశ్చిమబెంగాల్‌లో అధికారంలోకి రాగలిగింది. అసోంలో మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకుంది. పశ్చిమాన రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రలో బీజేపీకి స్వంత ముఖ్యమంత్రులున్నారు. గుజరాత్‌లో 30 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉన్నది. ఒక్క జార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్ తప్ప హిందీ బెల్ట్ అంతటా బీజేపీ ముఖ్యమంత్రులున్నారు. పంజాబ్‌లో కూడా ఇప్పటికే బీజేపీ చాపక్రింద నీరులాగా ప్రవేశించేందుకు పథకాలు మొదలుపెట్టింది. ఉత్తర, తూర్పు, పశ్చిమాన ఆధిపత్యం నిరూపించుకోగలిగిన బీజేపీకి దక్షిణాదిలో ప్రవేశించడం అసాధ్యమా?
అయితే ఎన్నికల రాజకీయాల్లో బీజేపీ ఎంత తలపండిపోయిందంటే ఆ పార్టీని ఓడించడం అసాధ్యమనే స్థితి ఏర్పడింది. ఎన్నికల్లో బీజేపీ విజయ సూత్రాన్ని ఎవరూ ఛేదించలేకపోతున్నారు. గెలిచేందుకు ఏ సాధనాన్ని బీజేపీ వదిలిపెట్టదు, అది నైతికమా, అనైతికమా అన్న చర్చతో ఆ పార్టీకి నిమిత్తం లేదు. ‘సర్’ వల్ల 31 స్థానాల్లో బీజేపీ తమపై గెలిచిందని తృణమూల్ కాంగ్రెస్ నేతలే అంగీకరించినందువల్ల మిగతా స్థానాల్లో గెలిచేందుకు బీజేపీ ఇతర వ్యూహాలు ప్రయోగించి ఉండాలి.
ఏ పార్టీకైనా ఎల్లకాలమూ శిఖర స్థాయిలో ఉండడం సాధ్యం కాదు. బీజేపీ ఆ స్థాయి కోల్పోవాలంటే తన పతనానికి తానే కారణం కావాలి. ఆ పార్టీని గద్దెదించగల ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఆవిర్భవించాలి. ప్రజలు అడుగడుగునా వ్యతిరేకించగల పరిస్థితులు రావాలి. ఈ మూడూ సమీప భవిష్యత్తులో జరిగే అవకాశాలు కనపడడం లేదు. సాధారణంగా ప్రభుత్వ పాలన పట్ల కనపడే వ్యతిరేకతను కూడా బీజేపీ అధిగమించింది. ప్రభుత్వ వ్యతిరేకతను తటస్థం చేయడంలో బీజేపీ నేతలు దిట్టలు. అసోంలో రెండుసార్లు అధికారంలో ఉన్న తర్వాత కూడా కాంగ్రెస్ బీజేపీని ఓడించకపోగా ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థి, మూడుసార్లు ఎంపీ అయిన గౌరవ్ గొగోయ్ కూడా 23వేల ఓట్ల తేడాతో ఓడిపోయారంటే ఏమనాలి?
2029లో సార్వత్రక ఎన్నికలు జరిగే లోపు బీజేపీని ఓడించగల సత్తాను ప్రతిపక్షాలు ఎంత మేరకు సాధించగలుగుతాయో చెప్పలేం. కేరళలో వామపక్షాలను ఓడించి, బెంగాల్‌లో వామపక్షాలతో తృణమూల్‌ను దెబ్బతీసేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్‌తో జాతీయ స్థాయిలో ఎన్ని పార్టీలు కలిసి వస్తాయో చెప్పలేం. అన్ని పార్టీలు మళ్లీ చేతులు కలిపినా బీజేపీని ఓడించగల సైద్ధాంతిక భూమిక, నాయకత్వాన్ని అవి ఏర్పర్చుకోవడం సులభం కాదు. జయప్రకాశ్ నారాయణ్, వీపీ సింగ్ వంటి నాయకులు అవతరించే అవకాశం లేదు. నిజానికి దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు సాధించిన ఓట్లన్నీ ఒకప్పుడు కాంగ్రెస్‌వే. ఈ ప్రాంతీయ పార్టీలు బలహీనపడితే కాంగ్రెస్ మళ్లీ ఆ ఓట్లను సాధించుకోగలగాలి. కానీ కాంగ్రెస్ ఆ శక్తిని సంపాదించుకోలేకపోతోంది. హిందూత్వ రాజకీయాల విషయంలో బీజేపీకి పోటీ లేదు. సంస్థాగత నిర్మాణం విషయంలో కాంగ్రెస్ బీజేపీతో పోటీపడలేకపోతోంది. బీజేపీతో ముఖాముఖి పోటీలో నెగ్గగలమన్న విశ్వాసాన్ని కాంగ్రెస్ కల్పించలేకపోతోంది. వచ్చే రెండేళ్లలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు ఏ సందేశాన్నిస్తాయి? కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు తమిళనాడులాగా తమ ప్రత్యేకత నిలబెట్టుకోగలవా? వేచి చూడాల్సిందే.
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
ఈ వార్తలు కూడా చదవండి...
తెలంగాణలో నూతన విద్యావిధానం అమలు చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
దేశంలో ఉత్తమ వేతన నమూనాలను తెలంగాణలో అమలు చేస్తాం: మల్లు భట్టి విక్రమార్క
తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి..
Read Latest Telangana News And AP News And International News And Telugu News