మార్పుల ముంగిట్లో బీజేపీ!
ABN , Publish Date - Aug 19 , 2026 | 01:22 AM
జూలైలో అపూర్వ ప్రకంపనలు సృష్టించిన విద్యార్థుల నిరసనలు, ఆ తర్వాత నినాదాల హోరులో కొట్టుకుపోయిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు, బంకీపూర్ సహా మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక ఫలితాల తీరుతెన్నుల...
జూలైలో అపూర్వ ప్రకంపనలు సృష్టించిన విద్యార్థుల నిరసనలు, ఆ తర్వాత నినాదాల హోరులో కొట్టుకుపోయిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు, బంకీపూర్ సహా మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక ఫలితాల తీరుతెన్నుల తర్వాత భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలిలో ఏమైనా మార్పు వచ్చిందా? ఇదే ఇప్పుడు దేశ రాజధానిలో ఒక ప్రధాన చర్చనీయాంశంగా ఉన్నది. ప్రస్తావిత పరిణామాల ప్రభావం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లోనూ తీవ్ర స్థాయిలో ఉన్నదని చెప్పక తప్పదు. సమాజంలో వస్తున్న మార్పులపై ఉలిక్కిపడినట్లు కనపడిన ఆర్ఎస్ఎస్ ఉన్నట్లుండి దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున యువతను, విద్యార్థులను సమీకరించే కార్యక్రమంలో పడింది. సోమవారం నుంచి విశాఖపట్టణం పొలిమేరల్లోని గుడిలోవలో మూడు రోజుల పాటు జరిగే ఆర్ఎస్ఎస్ అఖిల భారత సమన్వయ బైఠక్ సమావేశంలో బీజేపీతో సహా ఆరెస్సెస్‌కు చెందిన 32 అనుబంధ సంఘాలు హాజరవుతున్నాయి. ఈ సమావేశాల్లో కూడా ‘జన్ జడ్, యువతతో సంబంధాలను ఎలా మెరుగుపరుచుకోవాలి?’ అన్నదే ప్రధాన అజెండా. 2027 మార్చి నాటికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో భారీ అంతర్గత మార్పుల క్రమం పూర్తయి కొత్త నాయకత్వంతో ప్రజల ముందుకు సరికొత్తగా వచ్చే తరుణంలో గుడిలోవ సమావేశాలు జరుగుతున్నాయి. ఇవి ‘సంఘ్’ పరిణామ క్రమంలో కీలక భూమిక నిర్వహించనున్నాయి. ‘సంఘ్’తో పాటు భారతీయ జనతా పార్టీలో పరివర్తనానికి కూడా ఈ సమావేశాలు దోహదం చేసే అవకాశాలు లేకపోలేదు.
పన్నెండేళ్ల క్రితం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన అనంతరం చోటుచేసుకున్న పరిణామాల ప్రభావం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌పై కూడా ఉన్నదనడంలో సందేహం లేదు. 32 అనుబంధ సంఘాల్లో బీజేపీ ఒకటి అని ‘సంఘ్’లో కొందరు భావించవచ్చు కాని ఈ పన్నెండేళ్ల కాలంలో కేంద్రంలో మోదీ నాయకత్వంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీయే ‘సంఘ్’ రూపురేఖలను మార్చిందని చెప్పడానికి ఆస్కారం లేకపోలేదు. కేంద్ర ప్రభుత్వంలోని సమస్త మంత్రిత్వ శాఖల్లోనూ ‘సంఘ్’ బాధ్యులు చేరడం ఒక ఎత్తు అయితే ప్రభుత్వం చేసే తప్పిదాలు, దుశ్చర్యల బాధ్యత కూడా ‘సంఘ్’ స్వీకరించాల్సి రావడం మరో ఎత్తు. పాకిస్థాన్ వెళ్లి మహమ్మదాలీ జిన్నాకు ఘనంగా నివాళులర్పించినందుకు నాటి బీజేపీ అగ్రనేత లాల్‌కృష్ణ ఆడ్వాణీని రాజీనామా చేయించిన ఘనత ‘సంఘ్’కు దక్కింది. మరి అటువంటి నైతిక, సైద్ధాంతిక ఆధిపత్యాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో చలాయించగల శక్తి ‘సంఘ్’కు ఉన్నదా? ఇదీ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ప్రభుత్వ నియామకాల్లోనూ, పొత్తుల నిర్ణయంలోనూ, అభ్యర్థుల ఎంపికలోనూ కీలక భూమిక నిర్వహించిన ‘సంఘ్’ ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నించగలదా, నిలదీయగలదా అన్నదే కీలక ప్రశ్న. విద్యార్థులు, యువజనుల ఆందోళనను పాలకులు పట్టించుకోవాలని, విధాన నిర్ణయాల్లో తప్పిదాలు జరిగాయని మోదీ సర్కార్ అంగీకరించాలని ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ పదే పదే చెబుతున్నది. మరి ప్రభుత్వం ఎంతవరకు ఆత్మ విమర్శ చేసుకుంటున్నది? ఇది విస్మరించలేని విషయం. ఇవాళ రాహుల్‌గాంధీ సహా ప్రతిపక్ష నేతలు కొందరు బీజేపీతో సహా ఆర్ఎస్ఎస్‌ను రాజకీయాల బరిలోకి లాగి వాటి సైద్ధాంతిక స్పష్టతను ప్రశ్నిస్తున్నారు. తద్వారా ఆరెస్సెస్, బీజేపీని వారు ప్రజా న్యాయస్థానంలో నిలబెడుతున్నారనేది స్పష్టం. ప్రతిపక్షాలే కాదు, ప్రజలు కూడా ‘సంఘ్’, బీజేపీ మధ్య పెద్ద తేడా చూడని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ తన భావి సైద్ధాంతిక భూమికను నిర్ణయించుకోవడంతో పాటు తన అనుబంధ విభాగమైన బీజేపీని కూడా భావి అవసరాలకు తగ్గట్లు మార్చగలదా లేదా అన్నది తేలవలసి ఉన్నది.
నిజానికి ఒక దశలో, తనకు, అర్ఎస్ఎస్ తోడ్పాటు అవసరం లేదని బీజేపీ వాదించే పరిస్థితి ఏర్పడింది. 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంలో అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ప్రకాశ్ నడ్డా మాట్లాడుతూ ‘మొదట్లో అంత సామర్థ్యం లేనప్పుడు ఆర్ఎస్ఎస్ అవసరం మాకు ఉండేది. ఇవాళ మా పార్టీ బాగా విస్తరించింది. తన కాళ్లమీద తాను నిలబడింది. ఇక బీజేపీ తనను తాను నిర్వహించుకోగలదు’ అని స్పష్టం చేశారు. అమిత్ షా వ్యూహరచన పుణ్యమా అని ప్రపంచంలో అతి పెద్ద పార్టీగా 14 కోట్ల మంది సభ్యులతో అవతరించిన బీజేపీ ఎన్నికలను అవలీలగా గెలిచేందుకు ఒక భారీ యంత్రాంగాన్నే రూపొందించుకుంది. బీజేపీకి తిరుగులేకుండా చేసేందుకు ప్రత్యర్థి పార్టీలను నయానా భయానా వశపరుచుకోవడమో, తుత్తునియలు చేయడమో చేయగలిగింది. అందువల్లే, 2024 ఎన్నికల్లో కేవలం 240 సీట్లు మాత్రమే సాధించినప్పటికీ మోదీ, షా నాయకత్వాలకు తిరుగులేకపోయింది. ఆ తర్వాత ప్రత్యర్థులను బలహీనపరిచి ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం సాధించగలిగింది. చివరకు బెంగాల్‌ను సైతం వశపరచుకుంది. ‘సంఘ్’లో కూడా అనేకమందికి మోదీ, షా నాయకత్వాన్ని అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అటు బహిర్గతంగా, ఇటు అంతర్గతంగా తిరుగులేని శక్తిగా ఎదిగిన తర్వాత బీజేపీ అగ్ర నాయకత్వాన్ని ప్రశ్నించగల సైద్ధాంతిక నైతికత ఏ సంస్థకు ఉంటుంది?
బహుశా కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావం, విద్యార్థుల నిరసన ఈ పరిణామాలపై ఆత్మావలోకనం చేసుకునేందుకు అవకాశం కల్పించిందేమో?! దశాబ్ద కాలానికి పైగా మోదీ ఒక రాజకీయ భావజాలాన్ని, దానికొక పరిభాషను సృష్టించి లోకం మీదకు వదిలారు. దాన్ని స్వీకరించి ప్రత్యర్థులపై పదునైన విమర్శలు చేసేందుకు బీజేపీలో ఒక యంత్రాంగమే కొనసాగింది. బీజేపీ సైద్ధాంతిక భూమికను మోదీయే సృష్టించారా, అందుకు ‘సంఘ్’ ఆశీస్సులు ఉన్నాయా అన్న అనుమానాలకు తావు లేకుండా పోయింది. స్థూలంగా చెప్పాలంటే మోదీయిజమే బీజేపీ, ‘సంఘ్’ భావజాలాన్ని నిర్దేశించిందనడంలో సందేహం లేదు. ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, పార్టీ జాతీయ అధ్యక్షుడితో సహా అన్ని నియామకాల విషయంలో కూడా ఇదే ఇజం కొనసాగింది.
అయితే ఈ జూలైలో సంభవించిన పరిణామాల నేపథ్యంలో తాజాగా నియమించిన నితిన్ నబీన్ టీమ్‌లో ‘సంఘ్’ ముద్ర ప్రధానంగా కనపడుతుందని కొందరు సైద్ధాంతిక విశ్లేషకులు అంటున్నారు. దాదాపు ఆరు సంవత్సరాలుగా బీజేపీకి దూరంగా ఉన్న సిద్ధాంతకర్త రామ్ మాధవ్‌కు ఉపాధ్యక్షుడిగా స్థానం కల్పించగా, 14 మంది ఉపాధ్యక్షుల్లో 11 మంది, 18 మంది ప్రధాన కార్యదర్శుల్లో 11 మందికి బలమైన ‘సంఘ్’ శిక్షణా పునాది ఉన్నదని చెబుతున్నారు. అంతేకాదు, ఎలాంటి సమాచారాన్ని అయినా సత్యంగా ప్రచారం చేయగల, ప్రత్యర్థులపై శక్తి సామర్థ్యాలున్న ఐటీ సెల్ ఇన్‌ఛార్జి అమిత్ మాలవీయను 11 సంవత్సరాల తర్వాత ఆ పదవి నుంచి తొలగించడం, దుందుడుకు భాషను ప్రయోగించే తేజస్వి సూర్యలాంటి వారిని తప్పించడం కూడా విస్మరించదగ్గ పరిణామం కాదు. ఒక రకంగా పార్టీని, మోదీ ఆలోచనా విధానానికి అమిత్ షా శైలి వ్యూహరచనకు భిన్నంగా మార్చేందుకు ప్రయత్నం జరిగినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంత మాత్రాన ఒకప్పుడు వెంకయ్య, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, అనంతకుమార్ తదితర నేతలతో నిత్యం పార్టీ కార్యకర్తలు, మీడియా ప్రతినిధులతో ఆరోగ్యకరంగా కనపడ్డ బీజేపీ కేంద్ర కార్యాలయాన్ని మళ్లీ చూడగలిగిన పరిస్థితులు వస్తాయా? కాలచక్రం వెనక్కి తిరగడం అంత సులభం కాదు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తాజాగా ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్రమోదీ చేసిన 13వ ప్రసంగంలో గడచిన 12 సంవత్సరాల్లో సాధించిన విజయాలు చెప్పుకోవడానికి పెద్దగా సమయం కేటాయించలేదు. యువ భారతదేశానికి శాస్త్రీయ దృక్పథం, ఆధునిక జాతి నిర్మాణ భాష గురించి పలవరించిన నెహ్రూ బాటలో ఆయన పయనించలేదు. లాల్‌బహదూర్ శాస్త్రిలా ‘జై జవాన్, జై కిసాన్’ అని నినదించాలనుకోలేదు. అటల్ బిహారీ వాజపేయిలా ‘జై విజ్ఞాన్’ అని జోడించి సైన్స్‌కు ఉన్న ప్రాధాన్యాన్ని చెప్పాలనుకోలేదు. పీవీ నరసింహారావులా సంక్లిష్టమైన ఆర్థిక సంస్కరణల గురించి సరళమయిన భాషలో వివరించాలని భావించలేదు. మన్మోహన్‌సింగ్ మాదిరి జ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడలేదు. వీరందరికీ భిన్నంగా నరేంద్రమోదీ భారత రాజకీయాల నిఘంటువుకు ఒక కొత్త పదాన్ని జోడించారు. అది: దిమాగీ నక్సల్ (ఆలోచనల పరంగా నక్సలైట్ ). అయితే మోదీ ఆ పదానికి నిర్వచనం ఇవ్వలేదు. ఉద్యోగాలను అందించలేని విద్యావ్యవస్థను, ప్రశ్న పత్రాల లీక్‌ను, నెరవేరని హామీలను గురించి ప్రశ్నించేవారు, జంతర్ మంతర్ వద్దనే కాకుండా రాంచీ, పాట్నా వంటి నగరాల్లో వీధుల్లోకి వచ్చి ఆందోళన చేసిన వారు ఈ కోవలోకి వస్తారా? పాత వ్యవస్థలతో ఎలా పోరాడాలో మోదీకి తెలుసు. గతంలో ప్రత్యర్థులపై ల్యూటియన్స్, ఆందోళన జీవులు, అర్బన్ నక్సల్స్ లాంటి ముద్రలు ఆయన వేయగలిగారు. అందరినీ ఒకే భావజాలానికి అంటగట్టగలిగారు. కాని అలాంటి ముద్రలతో జెన్ జడ్‌ను కొట్టిపారేయడం అంత సులభం కాదు. స్వీయ దేశంలోనే ఆలోచనాపరులైన, ప్రశ్నించే పౌరుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించడం జాతీయ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందా? ప్రపంచ వ్యాప్తంగా జ్ఞాన శక్తిగా గుర్తింపు పొందిన, అనేక కీలక సంస్థల్లో సీఈఓలను సృష్టించిన భారతదేశంలో ఎవరి గురించి మోదీ ఆందోళన చెందుతున్నారు? 12 ఏళ్లు నిరాఘాటంగా పాలించిన తర్వాత మోదీ ఇవాళ ఎదుర్కొంటున్న కొత్త సమస్య ఒక అంగీకరించగల భావజాలాన్ని, అందుకు తగ్గ పదజాలాన్ని సృష్టించలేకపోవడమే. అందుకు ప్రధాన కారణం భారతీయ జనతా పార్టీ కానీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కానీ ఒక బలమైన, స్పష్టమైన, శాస్త్రీయమైన, నవీన తరానికి అనువైన భావజాలాన్ని ఎప్పటికప్పుడు ఏర్పర్చుకోలేకపోవడమే. నినాదాలు, దుర్భాషల రాజకీయాలకు అవకాశం కల్పించడమే. తన పేరును నినదిస్తే మురిసిపోయే వ్యక్తులు కాదు, కాలానికి అనుగుణమైన సిద్ధాంతమే ఇవాళ దేశానికి తక్షణ అవసరం.
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
ఈ వార్తలనూ చదవండి:
ఇమ్రాన్ ఖాన్‌ను ఆస్పత్రిలో చేర్పించి.. చికిత్స అందించాలి.. సుప్రీం కీలక ఆదేశాలు
మీరు గట్టిగా మాట్లాడుతున్నారు.. నిశ్శబ్దంగా ఉండండి: వైట్ హౌస్‌లో విలేకరిపై ట్రంప్ ఆగ్రహం