బంకీపూర్: మోదీ సర్కార్‌కు మరో పాఠం
ABN , Publish Date - Aug 05 , 2026 | 01:11 AM
కాక్రోచ్ జనతా పార్టీ పేరిట దేశ రాజధాని ఢిల్లీలో వేలాది విద్యార్థులు, ఇతరేతర శక్తులు రగిల్చిన ఆందోళన చల్లారి వారం రోజులు దాటినప్పటికీ దాని ప్రకంపనలు ఇంకా సమసిపోలేదు. కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత...
కాక్రోచ్ జనతా పార్టీ పేరిట దేశ రాజధాని ఢిల్లీలో వేలాది విద్యార్థులు, ఇతరేతర శక్తులు రగిల్చిన ఆందోళన చల్లారి వారం రోజులు దాటినప్పటికీ దాని ప్రకంపనలు ఇంకా సమసిపోలేదు. కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత పరిస్థితి పూర్తిగా సద్దుమణగడం లేదు. విద్యార్థులపై లాఠీచార్జి, పెల్లెట్లను ప్రయోగించినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలంటూ పార్లమెంటును ప్రతిపక్షాలు స్తంభింపజేస్తున్నాయి. చిన్నా చితక బిల్లులు తప్ప కీలక బిల్లులను ప్రవేశ పెట్టలేకపోతున్న ప్రభుత్వం సాధ్యమైనంత త్వరలో పార్లమెంటును నిరవధికంగా వాయిదా వేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులపై లాఠీచార్జి దృశ్యాలు మాకెందుకు చూపిస్తున్నారు.. మా టైమ్ వేస్ట్ చేయకండి.. అని రెండు వారాల క్రితం వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ విద్యార్థులపై ఎఫ్ఐఆర్‌లను ఉపసంహరించుకునేందుకు ప్రభుత్వానికి వీలు కల్పిస్తున్నారు. కేంద్రమే ఈ విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించినందువల్ల తలెత్తుకుని తిరిగే దారి ప్రభుత్వానికి ఆయన కల్పిస్తున్నట్లున్నారు. ఒకవైపు తన అభిమానులు, బీజేపీ నేతలు విద్యార్థులను రకరకాల పదజాలంతో దూషిస్తున్నప్పటికీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎంతో పెద్ద హృదయంతో వారిని తాను క్షమించానని ప్రకటించారు. అయినా ఈ ప్రకటన అనుకున్నంత సానుకూల ఫలితాలు ఇవ్వలేదు. పార్లమెంటుకు మోదీ, అమిత్ షాలు వస్తున్నారే కానీ ఉభయ సభలకు హాజరయ్యే సావకాశం వారికి లభించడం లేదు. ఆశ్చర్యకరమైనదేమంటే హోంమంత్రి అసలు నార్త్ బ్లాక్ (హోం మంత్రిత్వశాఖ నెలవు)కే రావడం లేదని, ఒకటి రెండు ముఖ్యమైన సమావేశాలు పార్లమెంటులో తన గదిలోనే నిర్వహిస్తున్నారని అధికారులే చెబుతున్నారు. ఈ సంక్షోభ సమయంలో మోదీని బాగా సంతోషపెట్టిన ఘటన ఒకటే. అది– ఆంధ్రప్రదేశ్‌లో భోగాపురం విమానాశ్రయం ప్రారంభం సందర్భంగా ఆయనను నృత్యగీతాలతో, ప్రశంసల కుంభవృష్టితో అలరించడం! మళ్లీ ఢిల్లీ తిరిగి రాగానే పరిస్థితిలో అదే వేడి!
ఈ సంక్షుభిత సమయం ఎంతకాలం ఉంటుందో తెలియదు కానీ, ఇదే సమయంలో వచ్చిన మూడు అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలలో రాబోయే మార్పును సూచిస్తున్నాయని అనేక మంది పరిశీలకులు చెబుతున్నారు– ముఖ్యంగా బిహార్‌లోని బంకీపూర్ నియోజకవర్గ ఎన్నికల ఫలితాలు. బిహార్ రాజధాని పాట్నా సాహెబ్ లోక్‌సభా పరిధిలో ఒక నియోజకవర్గమైన బంకీపూర్ కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనకు కేంద్రంగా మారింది. ఇటీవల నీట్ ప్రశ్నపత్రాల లీక్ సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో విద్యార్థులు వీధుల్లోకి రాగా, పాట్నాలో దాని ఉధృతి తీవ్రంగా కనిపించింది. కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ బంకీపూర్‌లో కేంద్రీకృతమైన కాలేజీల్లో, హాస్టళ్లలో ఉన్న వేలాది విద్యార్థులు ఊరేగింపుగా దూసుకువచ్చారు. సిటీలో విద్యార్థులు కోచింగ్ తీసుకునే కేంద్రాలు అధికంగా ఉన్న అశోక్‌రాజ్‌పథ్, బోరింగ్ రోడ్లలో జనజీవనం స్తంభించిపోయింది. సివాన్, ఇతర కీలక జిల్లాల్లో నిరసన హింసాత్మకంగా మారింది. లాఠీచార్జిలు రాళ్లు రువ్వడం, బాష్పవాయువు, నీటి క్యానన్లను ప్రయోగించడం, పోలీసు జీపులను దహనం చేయడం, జాతీయ రహదారులను దిగ్బంధనం చేయడం వంటి సంఘటనలు జరిగాయి. ఏకే–47తో కాల్పులు జరపడంతో విద్యార్థులు గాయపడ్డ వీడియోలు ప్రచారమయ్యాయి. బంకీపూర్ సందుగొందుల్లో ఉన్న ప్రైవేట్ హాస్టళ్లలోకి పోలీసులు దూసుకుపోయి కోచింగ్ కోసం వచ్చిన విద్యార్థులను బయటకు లాగి చితకబాదారు. జూలై 25న ఇచ్చిన బిహార్ బంద్ సందర్భంగా ఒక్క రోజే 690 మందిని నిర్బంధించారు. అనేకమందిపై హత్యా నేరం క్రింద కేసులు మోపారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే బంకీపూర్ ఉప ఎన్నిక జూలై 30న కాగా జూలై 27న బిహార్ హోం విభాగం విద్యార్థులపై అన్ని ఎఫ్ఐఆర్ లను ఉపసంహరించుకుంటూ అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. అయినా ఫలితం లేకపోయింది.
1974 మార్చిలో జయప్రకాశ్ నారాయణ్ నేతృత్వంలో పాట్నా యూనివర్సిటీ విద్యార్థులు అసెంబ్లీని ముట్టడించినప్పుడు పోలీసులు జరిపిన కాల్పులు, లాఠీచార్జిలో అనేకమంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత గాంధీ మైదాన్‌లో లక్షలాది ప్రజల సమక్షంలో జరిగిన బహిరంగ సభలో జేపీ సంపూర్ణ క్రాంతికి పిలుపునిచ్చారు. బంకీపూర్‌లో అదే గాంధీ మైదానం పక్కనే ఉన్న చౌరస్తాలో నిర్మించిన జయప్రకాశ్ విగ్రహం ఇటీవలి సంఘటనలకు ప్రత్యక్ష సాక్షి. జేపీ గోలంబర్‌గా పిలిచే ఈ ప్రాంతం పరిసరాల్లోనే మళ్లీ విద్యార్థులపై పోలీసులు విరుచుకుపడ్డారు. ఎమర్జెన్సీకి ముందు జేపీ ఉద్యమం పాట్నా నుంచి ఢిల్లీకి పాకింది. ఇప్పుడు ఢిల్లీ నుంచి కాక్రోచ్ నిరసన పాట్నా వీధుల్లో ప్రతిధ్వనించింది. ఈ ప్రతిధ్వని బంకీపూర్ ఎన్నికల ఫలితాలను నిర్ణయించిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. గత మూడు దశాబ్దాలుగా బీజేపీ పట్టులో ఉన్న బంకీపూర్‌లో గెలిచింది, గత ఎన్నికల్లో అన్ని సీట్లూ కోల్పోయిన జన్ సురాజ్ పార్టీ నేత ప్రశాంత్‌కిశోర్ కాదు, విద్యార్థులు అని వేరే చెప్పనక్కర్లేదు. ఇక్కడి నుంచి అయిదుసార్లు గెలిచినందువల్లే నితిన్ నబీన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు కాగలిగారు. ఆయన తన ఎమ్మెల్యే సీటు వదులుకుని రాజ్యసభను ఎంచుకోవడానికి కారణం అక్కడ అవలీలగా బీజేపీ గెలుస్తుందని ఆ పార్టీ అగ్రనేతలు భావించడమే. ‘అక్కడ కుక్కను నిలబెట్టినా బీజేపీ గెలిపించుకుంటుంది..’ అని కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, పాట్నా ఎంపీ వ్యాఖ్యానించడమే ఇందుకు నిదర్శనం. అయితే బీజేపీ ఓటు శాతం ఒక్క ఏడాదిలోనే 62శాతం నుంచి 34.4శాతానికి పడిపోయింది! బంకీపూర్ ఓటర్లలో 14శాతం మంది కాయస్థులే కావడంతో నితిన్ నబీన్ అక్కడి నుంచి గెలిచేవారు. ఎందుకంటే 8శాతం చొప్పున ఉన్న భూమిహార్లు, బ్రాహ్మణులు, 7శాతం ఉన్న రాజపుత్రులు, 5శాతం ఉన్న కుర్మీలు, 3శాతం ఉన్న కుష్వాహులు సైతం ఆయనకు ఓటు వేసేవారు. ఈ ఉప ఎన్నికల్లో కుల సమీకరణాలు పూర్తిగా విఫలమయ్యాయి. కులసమీకరణాలపైనే ఆధారపడే రాజకీయ నాయకులకు ఈ ఫలితాలు కళ్లు తెరిపించాల్సిందే!
మధ్యతరగతి వర్గాలు, అగ్రవర్ణాలు అధికంగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ ఇక మీదట అత్యంత జాగ్రత్తగా వ్యవహరించేందుకు బంకీపూర్ ఎన్నికల ఫలితాలు ఒక హెచ్చరిక మాత్రమే. ఈ దేశంలో విద్యావంతులైన యువ ఓటర్లు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగలరన్న విషయం బంకీపూర్ స్పష్టం చేసింది. మరో ఏడెనిమిది నెలల్లో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లోని లక్నో, ప్రయాగ్‌రాజ్, కాన్పూర్, నోయిడా తదితర నగర ప్రాంతాలు గతంలో మాదిరి తమ కంచుకోటలుగా ఉంటాయని బీజేపీ నేతలు ధీమాగా ఉండేందుకు ఇక మీదట అవకాశం లేదు.
కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (ఎన్ఐపీఎఫ్‌పి)లో ప్రొఫెసర్‌గా ఉన్న ప్రముఖ ఆర్థికవేత్త లేఖా చక్రవర్తి విద్యార్థుల ఆందోళనను శాస్త్రీయంగా విశ్లేషించే ప్రయత్నం చేశారు. వ్యక్తులకు సమానమైన సమస్యలు ఉన్నంత మాత్రాన వారు స్వచ్ఛందంగా పోరాడరని, పేపర్ లీకేజీలు, ఉద్యోగ అభద్రత వంటి సమస్యలు బలమైన ప్రేరణగా మారినప్పుడు డిజిటల్ పరిజ్ఞానం తోడై యువత పెద్ద ఎత్తున ఏకమవుతారని ఆమె ఒక అధ్యయనంలో అభిప్రాయపడ్డారు. డిగ్రీలకు ఉపాధికి పొంతన లేదని, డిగ్రీ చదువుకున్న వారిలో నాలుగోవంతు మందికే వేతనంతో కూడిన సరైన ఉద్యోగాలు లభిస్తున్నాయని ఆమె చెప్పారు. పీరియాడిక్ లేబర్ ఫోర్స్‌లో మూడోవంతు స్వయం ఉపాధిపైనే జీవిస్తున్నారు. వారిలో కూడా అత్యధికులు వ్యవసాయంపై ఆధారపడుతూ, తక్కువ ఆదాయం ఆర్జిస్తున్నవారే. లేఖా చక్రవర్తి చేసిన అధ్యయనాన్నే అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ విడుదల చేసిన ‘స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2026’ నివేదిక కూడా ధ్రువపరుస్తోంది. గతంలో ప్రయోజనాలు చేకూరని వర్గాలకు విద్య అందుబాటులోకి వచ్చినప్పటికీ వారి అర్హతలను ఉత్పాదక ఉపాధిగా మార్చే అర్థవంతమైన అవకాశాలు రావడం లేదని తెలిపింది. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల నుంచి ఫ్యాకల్టీలు వైదొలగడం, పాఠ్యాంశాల నాణ్యత తగ్గడం, డిగ్రీల విలువ పడిపోవడం గురించి ఈ అధ్యయనాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
అధునాతన సాంకేతికత లీకేజీలను తగ్గించి పారదర్శకతను పెంచగలదు కానీ, లేబర్ డిమాండ్‌ను సృష్టించలేదని, విద్యాసంస్థల విశ్వసనీయతను పునరుద్ధరించలేదని స్పష్టం చేస్తున్నాయి. జాతీయ విద్యావిధానం సూచించిన విధంగా విద్యారంగ బడ్జెట్‌ను జీడీపీలో 6 శాతానికి పెంచకుండా, తరగతి గదుల నిర్మాణం, ఉపాధ్యాయుల జీతాలు, శిక్షణ సరిగా లేకుండా, అధిక నైపుణ్యం గల ఉద్యోగాలను సృష్టించకుండా, పరీక్షల విశ్వసనీయతను పునరుద్ధరించకుండా సమస్యలను పరిష్కరించలేమని ఆర్థికవేత్తలే అంటున్నారు. పరిష్కారం కాని అసంతృప్తి ప్రజలకు నిరంతర ప్రేరణ అందిస్తుందని, ప్రభుత్వ అణిచివేత చర్యలు ప్రమాద స్థాయిని పెంచి సామూహిక ఐక్యతను బలపరుస్తాయని హెచ్చరిస్తున్నారు. ఆర్థికవేత్తలు ఆలోచించినంత శాస్త్రీయంగా రాజకీయ నాయకులు ఆలోచిస్తే సమస్యలు సంక్షోభంగా మారి వారి చాప క్రిందకు నీరు ఎందుకు ప్రవహిస్తుంది? ‘మహా సామ్రాజ్యాలను బయటి శక్తులు జయించలేవు. లోలోపలి నుంచే అవి తమను నాశనం చేసుకుంటాయి’ అని రోమ్ సామ్రాజ్య పతనం గురించి ప్రముఖ చరిత్రకారుడు విల్ డ్యూరంట్ ఊరికే వ్యాఖ్యానించలేదు.
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
ఇవి కూడా చదవండి...
కిడ్నాప్ కేసు.. గుజరాత్‌లో వైసీపీ నేత ముస్తఫా అరెస్ట్
పెద్దపులి మృతి కేసులో ఇద్దరు అనుమానితుల అరెస్ట్
Read Latest AP News And Telugu News