Share News

‘అయోధ్య’ అవినీతికి జవాబుదారీ ఎవరు?

ABN , Publish Date - Jul 01 , 2026 | 03:29 AM

బాబ్రీ మసీదు కట్టడాన్ని కూల్చివేసిన రోజు (డిసెంబర్‌ 6, 1992) ముందు రాత్రి అయోధ్యలో సీనియర్ ఆర్‌ఎస్ఎస్ సభ్యుడు, జర్నలిస్టు, రామజన్మభూమి ఉద్యమం సమయంలో మీడియా వ్యవహారాలను పర్యవేక్షించిన...

‘అయోధ్య’ అవినీతికి జవాబుదారీ ఎవరు?

బాబ్రీ మసీదు కట్టడాన్ని కూల్చివేసిన రోజు (డిసెంబర్‌ 6, 1992) ముందు రాత్రి అయోధ్యలో సీనియర్ ఆర్‌ఎస్ఎస్ సభ్యుడు, జర్నలిస్టు, రామజన్మభూమి ఉద్యమం సమయంలో మీడియా వ్యవహారాలను పర్యవేక్షించిన రమా శంకర్ అగ్నిహోత్రిని కలుసుకున్నాను. ఆయన పక్కనే ఉన్న ఫైజాబాద్ (అయోధ్య) ఎంపీ వినయ్ కతియార్ నాకు కరసేవ గురించి సమాచారం ఇచ్చారు. భజరంగ్‌దళ్ వ్యవస్థాపక అధ్యక్షుడుగా ఆయన రామ జన్మభూమి ఉద్యమాన్ని తీవ్రతరం చేసిన వారిలో ఒకరు. అశోక్ సింఘాల్, వినయ్ కతియార్, కల్యాణ్ సింగ్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువు మహంత్ వైద్యనాథ్, ఉమాభారతి, సాధ్వి రితంభర వంటి నేతలు లేకపోతే రామజన్మభూమి ఉద్యమమే లేదు. రామ్ రథయాత్ర పేరిట ప్రజల్లోకి వెళ్లిన ఆడ్వాణీ ఈ ఉద్యమానికి రాజకీయ రూపమే కాని, అసలు ఉద్యమం నిర్వహించిన వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ వంటి శక్తులు వేరు. అయోధ్య నుంచి మూడుసార్లు గెలిచిన వినయ్ కతియార్ ‘మందిర్ వహీ బనాయేంగే’ వంటి నినాదాలతో ప్రాచుర్యం పొందారు.

అలాంటి వినయ్ కతియార్ ఇవాళ అయోధ్యలో జరుగుతున్న పరిణామాలను తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఆలయంలో ఉన్న హుండీల నుంచి భారీ ఎత్తున నగదు, ఆభరణాలను దోచుకోవడంపై ఆయన తీవ్ర మనస్తాపం ప్రకటించారు. ‘ప్రస్తుతం ఉన్నవారందరూ దొంగలే’ అని ఆయన అన్నారంటేనే పరిస్థితి తీవ్రత మనకు అర్థమవుతుంది. వినయ్ కతియార్ మాత్రమే కాదు, అనేకమంది సాధువులు కూడా ఈ దోపిడీని ఖండించారు. ‘నిధులు దోచుకున్నవారు రావణులు’ అని భాగేశ్వర్‌ధామ్ అధినేత ధీరేంద్ర కృష్ణశాస్త్రి అన్నారు. స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి, ప్రవచనకర్త దేవకీనందన్ ఠాకూర్, మహంత్ కమల్‌నయన్ దాస్ వంటి సాధువులు ఎందరో ఈ దోపిడీ వెనుక శక్తిమంతులు ఉన్నారని ఆరోపించారు. ‘ఈ విషయంలో నేను నిజం చెపితే సమస్యల్లో పడతాను’ అని బీజేపీ మాజీ ఎంపీ ఒకరు అన్నారు. ఆలయ నిర్మాణం, ఆస్తుల నిర్వహణ, ప్రజల విరాళాలను నిర్వహించేందుకు 2020లో కేంద్ర ప్రభుత్వం శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఏర్పాటు చేసినప్పటి నుంచే ఈ నిధులను కొల్లగొడుతున్నారని, భక్తులు సమర్పించిన బంగారం, వెండి, నగలపై ఎవరూ సరిగా లెక్కలు రాయలేదని ట్రస్టు మాజీ సీఈఓ మహిపాల్‌సింగ్ ఆరోపించారు. ఓచర్లకూ, నగదు, నగలకు మధ్య పొంతన లేదని ఆయన ఎత్తి చూపిన తర్వాత దర్యాప్తు చేసేందుకు బదులు ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు. 2026 జూన్ 7న ఈ విషయం సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ప్రస్తావించి, న్యాయవిచారణ జరపాలని డిమాండ్ చేసిన తర్వాతే అయోధ్య విరాళాల బాగోతం బయటకు పొక్కింది. బ్యాంకు ఖాతాలు, ట్రస్టు ఖాతాలను ప్రజలకు చూపించి పారదర్శకంగా వెల్లడించాలని బీజేపీ నేత రజనీష్‌సింగ్ నేరుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. ఎట్టకేలకు జూన్ 13న ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను నియమించింది.


అయోధ్యలో రామజన్మభూమి కోసం భక్తులు ఎంత పెద్ద సంఖ్యలో విరాళాలు, ఆభరణాలు, బంగారం, వెండి ఇటుకలు సమర్పించారో లెక్క తెలియదు. అక్షింతల పంపిణీ పేరిట, ‘రామ్ రామ్ గ్రామ్ అభియాన్’ పేరిట నిర్వహించిన కార్యక్రమాలకు అనేకమంది భక్తులు తాదాత్మ్యంతో ప్రతిస్పందించారు. సీసీటీవీ కెమెరాల్లో కనీసం 70సార్లు నగదు తీసుకువెళుతున్నట్లు, మూటలు మోసుకెళుతున్నట్లు దృశ్యాలు బహిర్గతమయ్యాయి. సిబ్బంది కొందరు కావాలనే కెమెరాలకు అడ్డుగా నిలుచుని హుండీల నుంచి నగదు కాజేసే దృశ్యాలు రికార్డు కాకుండా చేశారని సిట్ తేల్చింది. దోచుకున్న డబ్బుతో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారన్న సమాచారం కూడా లభించింది. సిట్ అరెస్టు చేసిన వారిలో నోట్లు లెక్కపెట్టే కొందరు అధికారులు, ట్రస్టు ప్రధాన కార్యదర్శి, వీహెచ్‌పీ అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు చంపత్‌రాయ్ బన్సల్, ఆయన వ్యక్తిగత డ్రైవర్ రమాశంకర్ యాదవ్ అలియాస్ టిన్నూ యాదవ్ తదితరులు ఉన్నారు. కానీ బాధ్యత వహించాల్సిన చంపత్ రాయ్ బన్సల్, ట్రస్టీ అనిల్ మిశ్రాలు కేవలం రాజీనామాలు చేశారు. అనిల్ మిశ్రా అయోధ్యలో అధునాతన సౌకర్యాలతో మూడంతస్తుల బ్రహ్మాండమైన బంగళాను నిర్మించుకున్నారని వార్తలు వచ్చాయి. నిజానికి అయోధ్యలో కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ వ్యవహారాలు నడిపిన అలోక్ బన్సల్, ఆయన సతీమణి శివానీ బన్సల్, చందన్ రాయ్ బన్సల్, మనీష్ బన్సల్ తదితరులు చంపత్ రాయ్ బంధువర్గీయులే, సిట్ స్వాధీనం చేసుకున్న అనేక భూమి కొనుగోళ్ల పత్రాలు మీడియాకు చేరాయి. మహారాష్ట్రకు చెందిన కర్ణాటక ప్రాంత ప్రచారక్, వీహెచ్‌పీ కేంద్ర జాయింట్ సెక్రటరీ గోపాల్‌రావును పరిపాలనా అధికారిగా నియమించింది. చంపత్ రాయ్ తర్వాత అత్యంత శక్తిమంతుడైన గోపాల్‌రావు అయోధ్యలో అనేక ఉడుపి హోటల్స్ సృష్టికర్త అని కూడా సమాచారం.

రామమందిర ఉద్యమం అనేదే లేకపోతే భారతీయ జనతా పార్టీయే లేదు అన్నది పూర్తిగా సత్యదూరం కాదు. బీజేపీ ఉత్థానంలో రామజన్మభూమి పాత్ర ఉన్నదన్న విషయం లాల్‌కృష్ణ ఆడ్వాణీయే తన జీవిత చరిత్రలో వివరించారు. రామజన్మభూమి ఉద్యమాన్ని స్వతంత్ర భారత చరిత్రలో అతి పెద్ద ప్రజా ఉద్యమంగా ఆయన అభివర్ణించారు. సోమనాథ్ నుంచి ఆయన రథయాత్ర జరిపిన తర్వాతే 1991 ఎన్నికల్లో బీజేపీకి 120 సీట్లు లభించాయి. 1998లో బీజేపీ ఎన్నికల ప్రణాళికలో రామమందిరం గురించి వాగ్దానం చేసింది. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో అటల్ బిహారీ వాజపేయి నాయకత్వంలో బీజేపీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడింది. మతం పట్ల ప్రజలకు ఉన్న మమేకతను సానుకూల దిశలో మళ్లించినట్లయితే ఒక అద్భుతమైన శక్తిగా తీర్చిదిద్దగలమని నిరూపించామని, ఒక దేశ ఆత్మ వ్యక్తీకరణతో ప్రజల సామూహిక వ్యక్తీకరణ కలిసికట్టుగా ప్రతిధ్వనించిందని ఆయన ప్రకటించారు. తన ఉద్యమం ద్వారా నిద్రాణంగా ఉన్న హిందూత్వను మేలుకొల్పాలని భావించిన ఆడ్వాణీ రాముడిని భారత జాతీయ వ్యక్తిత్వానికి, సమైక్యతకు, సమగ్రతకు విశిష్టమైన సంకేతంగా అభివర్ణించారు. ఈ ఉద్యమం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ రామజన్మభూమి కోసం చేసిన ఎన్నో త్యాగాలు పరమార్థం కోల్పోయినట్లు కనిపిస్తోంది.


కొన్ని దశాబ్దాలుగా రామాయణం ఈ దేశంలో సమున్నత నైతిక విలువల వ్యవస్థను ప్రభావితం చేసిందని ఆడ్వాణీ లాంటి వారు భావించారు. మతానికీ, మత వ్యవస్థకూ రామాయణం అతీతమైనదని ఆర్ష విజ్ఞాన ట్రస్టును నెలకొల్పిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి పమిడిఘంటం కోదండరామయ్య రాశారు. ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అన్నట్లుగా రాముడు రూపుదాల్చిన ధర్మం కనుకనే భారతదేశంలో రామాయణం కలకాలం నిలిచిందని ఆయన తన ‘రామాయణ ప్రభ’ గ్రంథంలో పేర్కొన్నారు. శ్రీరాముడి సత్యసంధత గురించి వాల్మీకి రామాయణంలో అడుగడుగునా ప్రస్తావించారని, ఆ సత్యవాక్పరిపాలనే యుగయుగాలుగా భారతీయ సమాజాన్ని ప్రభావితం చేసిందని ఇలపావులూరి పాండురంగారావు వంటి పండితులు చెప్పారు. రాముడిని మూర్తీభవించిన ధర్మదేవతగా మారీచుడితో వాల్మీకి చెప్పించారు. రాముడు సత్యపరాక్రముడని, సత్య ధర్మ పరాయణుడని, సత్యసంధుడని, సత్యశీలుడని, సత్యమే ఆత్మగా కలవాడని వాల్మీకి ప్రశంసించారు. ‘సత్యమొక్కటే దైవం, లోకంలో భక్తికి ఆధారభూతం సత్యమే. అన్నిటికీ మూలమున్నది సత్యంలోనే. సత్యానికి మించి ఉన్నత లక్ష్యం లేనే లేదు’ అని వాల్మీకి చెప్పారు. ‘ధర్మం పుట్టేది బలం లోంచి. (బలో ప్రతిష్టో ధర్మః ధరణ్యామివ జంగమం.) ‘ధర్మమూ, బలమూ సత్యానికి తోడయితే ఏ మహా విపత్తు నుంచైనా కాపాడగలుగుతాయి’ అని ఆయన సూత్రీకరించారు. సత్యం ద్వారా సమస్త లోకాన్ని జయించవచ్చునని అన్నారు. ‘నాకు ధన కనక వస్తువాహనాలపై మోహం లేదు నాకు కావల్సింది రాజ్యం కాదు (నా హమర్థ పరో దేవి లోకమావస్తు ముత్సహే)’ అని రాముడితోనే వాల్మీకి చెప్పిస్తారు.


కాని ఇప్పుడు జరుగుతున్నదేమిటి? రామాయణం అంటే రాముడు నడిచిన దారి అని అర్థం. ఆ దారిలో మనం నడుస్తున్నామా? ఇవాళ బలవంతులు సత్యానికీ, ధర్మానికీ అండగా ఉన్నారా? అధికారం కంటే దేశమే ముఖ్యమని భావిస్తున్నారా? రామమందిరం నిర్మించి రాముడి విగ్రహం ప్రతిష్ఠాపిస్తే సరిపోతుందా? దేశంలో అంతటా సత్యం, ధర్మం అనే వాటికి ఏ మాత్రం విలువ లేదని, స్వప్రయోజనాలు, ధనార్జన, అధికార ఆకాంక్ష, దౌర్జన్య పాలనే ధ్యేయంగా మారిందని జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి. ‘అధికారం అవినీతికి దారితీస్తుంది. సంపూర్ణ అధికారం సంపూర్ణ అవినీతికి దారితీస్తుంది’ అన్న సూక్తిని ఇతర పార్టీలతో పాటు బీజేపీ నేతలు కూడా నిరూపిస్తున్నారు. సంఘ్ పరివార్‌లో సైతం కొందరు అవినీతికి అతీతులు కాదని తేలింది. ఇవాళ బీజేపీలోనూ, సంఘ్‌లోను నానాజీ దేశ్‌ముఖ్, కుశాభావు ఠాక్రే, జేపీ మాథుర్, బైరాన్ సింగ్ షెఖావత్, లక్ష్మణరావు ఇనామ్‌దార్ వంటి నీతిమంతుల కోసం అన్వేషించాల్సి వస్తోంది. ఆలయం నిర్వహణను సంఘ్ నుంచి ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకునేందుకో లేక యోగి ఆదిత్యనాథ్‌ను ఇరకాటంలో పెట్టేందుకో అయోధ్య విరాళాల దోపిడీని రచ్చ కెక్కించారన్న ప్రచారం కూడా జరుగుతోంది. దేశ రాజకీయాల్లో బీజేపీ పట్టు పూర్తిగా బిగుస్తుందనుకున్న సమయంలో ఆ పార్టీ పురోగతికి కారణమైన అయోధ్యలో దోపిడీ జరగడం ఒక దుష్పరిణామం. ఈ పరిణామం ప్రజల్లో కలవరం సృష్టిస్తోంది. ఇవాళ అయోధ్యలో న్యాయవాదులు కూడా దోపిడీదారుల తరఫున వాదించేందుకు నిరాకరిస్తున్నారు. ఇది ఒక రాజకీయ పార్టీపైనో, ఆర్ఎస్ఎస్ లాంటి హిందూ ధర్మానికి కట్టుబడ్డామని చెప్పుకుంటున్న సంస్థపైనో వచ్చిన కళంకం కాదు. దేశంలో శ్రీరాముడిని, రామాయణాన్ని ఆరాధించే ప్రజల మనసులపై ఏర్పడ్డ గాయం. ఏ రాముడి బాణం బీజేపీ ఉత్థానానికి కారణమయిందో అదే బాణం బీజేపీ పతనానికి కారణం కాకుండా చూసుకోవల్సిన బాధ్యత ఆ పార్టీ నేతలపై ఉన్నది.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Also Read:

టీమిండియా నిష్క్రమించినా.. అగ్రస్థానంలోనే శ్రీ చరణి

డెలివరీ బాయ్‌తో వివాదంపై స్పందించిన రాజు వెడ్స్ రాంబాయి హీరో అఖిల్ రాజ్

Updated Date - Jul 01 , 2026 | 03:29 AM