Share News

సర్దుకుపోవటమే మనకు శాపమా!?

ABN , Publish Date - Feb 17 , 2026 | 03:19 AM

కష్టకాలం అందరికీ ఉంటుంది. ఇష్టకాలమే ఉండాలని అందరమూ కోరుకుంటాం. నిజజీవితంలో అది సాధ్యంకాదు. ఇష్టకాలంలో కంటే కష్టకాలంలోనే వ్యక్తికైనా దేశానికైనా భవిష్యత్తును కొత్తదారుల్లో...

సర్దుకుపోవటమే మనకు శాపమా!?

కష్టకాలం అందరికీ ఉంటుంది. ఇష్టకాలమే ఉండాలని అందరమూ కోరుకుంటాం. నిజజీవితంలో అది సాధ్యంకాదు. ఇష్టకాలంలో కంటే కష్టకాలంలోనే వ్యక్తికైనా దేశానికైనా భవిష్యత్తును కొత్తదారుల్లో నడిపే అవకాశాలు వస్తాయి. వాటిని అందిపుచ్చుకోవటంతోనే నాయకత్వపటిమ వెల్లడవుతుంది. సమాజంలోని పైవర్గాల నిజస్వభావమూ అర్థమవుతుంది.

మనం మోయలేని రీతిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన వాణిజ్య సుంకాలు ఇటీవల ఎన్నడూ చూడని కష్టకాలాన్ని సృష్టించాయి. ఎక్కువ సంఖ్యలో శ్రామికులకు ఉపాధినిచ్చే అనేక రంగాలు అధిక సుంకాలతో సతమతమైపోయాయి. సుంకాల వ్యవహారాల్లో ఏర్పడిన విపత్కర పరిస్థితి ఎటు దారితీస్తోందోనన్న ఆందోళన అధికమైపోయింది. ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు, డిజిటల్‌ టెక్నాలజీలు, ఫార్మా, ఐటీరంగాలు, సైనికసహకారాలు, ఎగుమతులు మాత్రమేగాక ఇంకా అనేక విషయాల్లో అమెరికాపై ఆధారపడటం మూడున్నర దశాబ్దాల్లో మనకు విపరీతంగా పెరిగిపోయింది. మన దేశం అమెరికాకు డిజిటల్‌ కాలనీగా మారిపోతోందన్న వ్యాఖ్యలు ఈ మధ్య ఎక్కువవుతున్నాయి. ట్రంప్‌ యంత్రాంగం సృష్టించిన అనిశ్చితి, భారత్‌ను ఉద్దేశించి పలికిన చిన్నబుచ్చే మాటలు మనం అనుసరిస్తున్న విధానాలపై ఎన్నో ప్రశ్నలను లేవనెత్తాయి. ఈలోగా భారత్‌–అమెరికా వాణిజ్య ఒప్పందం తెరమీదకు వచ్చింది. పాత ప్రశ్నలు చల్లారకముందే కొత్త ప్రశ్నలు తలెత్తాయి. వీటికి జవాబులివ్వలేక ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఎవరి దగ్గర నుంచి ఏది కొనాలి? దిగుమతులపై పన్నులెంత ఉండాలి? ఏ వస్తువులను దేశంలోకి అనుమతించాలి? అన్నవి ఒక దేశానికుండే స్వయంనిర్ణయాత్మక అధికారాలుగా, సార్వభౌమిక హక్కులుగా భావిస్తాం. వీటికి భంగం కలిగించే రీతిలో అమెరికా–భారత్‌ వాణిజ్య ఒప్పందం ఉండబోతోందన్న విమర్శలను ఒకపట్టాన కొట్టేయలేని పరిస్థితే కనపడుతోంది. వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత్‌ అంగీకరించిన షరతులు ఇవేనంటూ ట్రంప్‌ తన సోషల్‌ మీడియా ‘ట్రూత్‌’లో ప్రకటించిన తర్వాత ఉపశమనంలేని ఉక్కపోత వాతావరణం నెలకొంది.

ఒప్పందంలోని ఇబ్బందికర షరతుల నుంచే ఈ ఉక్కపోత వస్తోందని స్పష్టమవుతున్నా అది తాత్కాలికమేననీ, త్వరలో అంతా సర్దుకుపోతుందనీ, జరిగిందంతా మంచేననీ సమాధానపడటానికే ఎక్కువ ఆస్కారం ఉంది. దీనికి మూలం పాలకపార్టీ ఎప్పటి నుంచో నమ్మే భావాల్లో కూడా ఉంది. అన్ని కీలక నిర్ణయాలనూ ప్రభావితం చేస్తోన్న 10శాతం పైస్థాయి తరగతి ప్రజల మనస్తత్వం కూడా దానికి కారణమవుతోంది.


మనకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అమెరికా అనుకూలతను ప్రదర్శించే రాజకీయపార్టీలు చాలా తక్కువగా ఉండేవి. వాటిల్లో ప్రధానమైంది జనసంఘ్‌ పార్టీ. ఈనాటి బీజేపీకి మాతృసంస్థ అయిన జనసంఘ్‌ అమెరికా అనుకూలతనే ఎక్కువగా ప్రదర్శించేది. ఆ దేశం అనుసరించే స్వేచ్ఛావాణిజ్య విధానాల్లాంటివే దేశంలో అమలుచేయాలని డిమాండు చేసేది. సామ్యవాద ఆదర్శాలనూ, విధానాలనూ విదేశీ సిద్ధాంతాలుగానూ, వాటితో దేశ సాంస్కృతిక జీవితానికి ప్రమాదం వస్తుందనీ ప్రకటించేది. రాజకీయ అవసరాల కోసం అమెరికా అనుకూలతను కొన్ని సందర్భాల్లో కొంత తగ్గించుకోటానికీ ప్రయత్నాలను చేసింది. సోషలిజానికీ, క్యాపిటలిజానికీ మధ్యేమార్గంగా ఉండే విధానాలనూ జనసంఘ్‌ నేతలు ప్రకటించారు. అవన్నీ పెద్ద ప్రభావాన్ని చూపలేదు. మందిర్‌–మండల్‌ రాజకీయాలతో వాటి ప్రభావాలు పూర్తిగా తగ్గిపోయాయి. సరిగ్గా అప్పుడే దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు మొదలయ్యాయి. జనసంఘ్‌, బీజేపీలు ఎప్పటి నుంచో కోరుకున్న విధానాలను పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది.

1990ల నుంచి అన్నివిధాలుగా అమెరికా వైపే మొగ్గినా ఇబ్బందులు తొలగిపోలేదు. భారత్‌ అవసరాలకు ప్రాధాన్యం ఎప్పుడూ సరిగ్గా దక్కలేదు. ఇరాన్‌ నుంచి సహజవాయువును చౌకగా పొందటానికి ఎన్నో ఏళ్లపాటు చేసిన ప్రయత్నాలకు అమెరికా గండికొట్టింది. 3000 కిలోమీటర్ల పొడవునా పైపులు వేసి సహజవాయువు తీసుకురావటానికి ఇరాన్‌– పాకిస్థాన్‌–భారత్‌ల మధ్య చర్చలు కొలిక్కి వచ్చే సమయానికి అట్లా జరగటానికి వీల్లేదని ఆదేశిస్తే దాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అనుకున్నట్లుగా ఆ సహజవాయువు వచ్చి ఉంటే మన అవసరాలు చాలా తీరేవి. చాలాచోట్ల ఇంటింటికీ వంటగ్యాస్‌ సరఫరా అయ్యేది. కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ కొరత లేకుండా దొరికేది. ఎన్నో పరిశ్రమలకు ఇంధన అవసరాలు తీరేవి. రైతులకు ఎరువుల లభ్యతా పెరిగేది. ఆ తర్వాత చమురు దిగుమతులనూ ఆపేయాల్సి వచ్చింది. ఒకప్పుడు మన చమురు అవసరాల్లో 17శాతం వరకూ ఇరానే తీర్చేది.


రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భవిష్యత్తులో ఏ రూపంలో కొనుగోలుచేసినా అపరాధసుంకం వెంటనే అమల్లోకి వస్తుందనీ ట్రంప్‌ స్పష్టంచేశారు. ఈ షరతుకు అంగీకరించారా? లేదా? అన్న విషయానికి ఇప్పటికీ ప్రభుత్వం సూటిగా సమాధానం చెప్పలేదు. దీంతో ఒత్తిడులకు లొంగిపోయిందనే విమర్శలకు బలం చేకూరింది. ఇక అమెరికా నుంచి వచ్చే అనేక వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తులపై సుంకాలను భారత్‌ గణనీయంగా తగ్గించనున్నదని కూడా ట్రంప్‌ ముందుగా ప్రకటించేశారు. ఆ తర్వాత విడుదలైన సంయుక్త ప్రకటన, ఒప్పందానికి సంబంధించి రూపొందిన ప్రాతిపదిక పత్రంలో కూడా ట్రంప్‌ చెప్పినవే ఉన్నాయి. వచ్చే అయిదేళ్లలో 500 బిలియన్ల విలువైన ఉత్పత్తులను భారత్‌ కొనుగోలు చేస్తుందని హామీ ఇవ్వటం కూడా వివాదాలకు కారణమైంది. అది హామీ కాదు ఆకాంక్ష అని తర్వాత మాటమార్చినా అనుమానాలు తొలగలేదు. వాటన్నిటికంటే ప్రమాదకరంగా పలువురు నిపుణులు భావిస్తున్నది మరొకటి ఉంది. రెండు దేశాల భద్రతకు ఇబ్బంది కలగకుండా ఆర్థిక వ్యవహారాలను నిర్వహించుకోవాలన్నది ఒప్పందంలో కీలకంగా ఉండబోతోంది. అంటే ఒకదేశ భద్రతకు ఇబ్బందిగా ఉండే ఆర్థిక వ్యవహారాలను ఇంకో దేశం చేపట్టకూడదు. అమెరికా భద్రతకు చైనా చిప్‌లను ఉపయోగించటం వల్ల ఇబ్బంది ఉందని భావిస్తే భారత్‌ కూడా వాటికి దూరంగా ఉండాలి. ఇదేదో చిప్‌లకు, కృత్రిమమేధ లాంటి ఉన్నతస్థాయి సాంకేతిక పరిజ్ఞానాలకో పరిమితం అవ్వాల్సిన పనిలేదు. అవసరాన్ని బట్టి ఏ దేశ ఉత్పత్తికైనా వర్తింపచేసే ప్రమాదం ఉందనే నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా తన భద్రతకు ఫలానా దేశం ప్రమాదకరంగా ఉందని భావిస్తే ఆ దేశంతో లావాదేవీలను కట్టడిచేసుకోవాల్సి వస్తుంది. అవెంత లాభకరంగా ఉన్నా వాటి జోలికి వెళ్లకూడదు.

అమెరికా నుంచి పెద్దఎత్తున ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉంటే ఇప్పటికే ఆ దిశగా వాణిజ్యం జరిగేది. మన అవసరాలకు సరిపడే ఉత్పత్తులను మనం పెట్టగలిగిన ఖర్చుకు ఎగుమతి చేసే స్థితిలో అమెరికా లేదు. ముఖ్యంగా పారిశ్రామిక ఉత్పత్తుల విషయంలో ఇది నిజం. చైనా ఆ స్థాయిలో ఉంది కాబట్టే అక్కడ నుంచి ఎన్నో ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాం. అమెరికాతో పోల్చితే చైనాతో సత్సంబంధాలు తక్కువ. అయినా ఆర్థికకోణం నుంచే మనం అక్కడ నుంచి దిగుమతులు ఎక్కువ చేసుకుంటున్నాం. ఇప్పుడు అమెరికాతో కుదిరే వాణిజ్య ఒప్పందంలో ఆ కోణంకంటే ట్రంప్‌ కోరికలను నెరవేర్చటమే ప్రధానంగా మారే ప్రమాదం కనపడుతోంది. బెదిరింపులతో దిగుమతి సుంకాలను పెంచేస్తే అమెరికా అప్పుల బాధ తీరుతుందనీ, అదే ఊపుతో అమెరికా ఎగుమతులు ఎక్కువయ్యేలా ఒత్తిళ్లు తెస్తే దేశంలో కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందనీ ట్రంప్‌ భావిస్తున్నారు. ఈ రెండు లక్ష్యాల భారాన్ని అన్ని దేశాలూ మోయాల్సింది అన్నట్లుగానే ఆయన వ్యవహారం ఉంది.


అమెరికా ఒత్తిళ్లను ఎదుర్కొనే స్థితిలో భారత్‌ లేదా? అంటే పూర్తిగా లేదని చెప్పలేం. కానీ మన విధానాలన్నీ పైవర్గంలోని 10శాతం జనాన్ని దృష్టిలో పెట్టుకునే రూపొందుతున్నాయి. విపత్కర పరిస్థితుల్లో సైతం మిగతా అధికశాతం ప్రజలను కూడగట్టి ఎదుర్కొనే స్థితిలో పైవర్గం లేదు. రెండు వర్గాల మధ్యా ఆర్థిక అంతరాలు పెరిగిపోతుండటంతో ఆ దిశగా ఆలోచనలు కూడా చేయటం లేదు. ఓట్ల కోసం ఉద్వేగ అంశాలను ప్రేరేపించటానికి రాజకీయ పార్టీలు చేసే ప్రయత్నాలకు పైవర్గం కూడా దోహదం చేస్తోంది. అమెరికా లాంటి దేశాలు పెట్టే షరతులకు సర్దుకుపోవటమే పరిష్కారంగా భావిస్తోంది. పైవర్గానికి పట్టుదల, దృఢసంకల్పం ఉండి జాతీయ ప్రయోజనాలు పరమ ప్రధానమైనవిగా భావించి అడుగులు వేస్తే చరిత్రగతి మారిపోయే అవకాశం ఉండొచ్చు. జపాన్‌లోని పైవర్గం ఒకనాడు ఆ పటిమను ప్రదర్శించి యూరప్‌, అమెరికా ఆధిపత్యాన్ని ఎదిరించి సత్తాను నిరూపించుకుంది. 17వ శతాబ్దం ఆరంభం నుంచి ఈస్టిండియా కంపెనీల్లాంటివి ఆసియాదేశాలపై ఆధిపత్యం సాధించటానికి అడుగులు వేస్తున్న వేళ రాబోయే ప్రమాదాన్ని ముందే పసిగట్టినట్లుగా జపాన్‌లోని పైస్థాయి వర్గం 200 ఏళ్లపాటు ప్రపంచ పరిణామాలకు పనికట్టుకున్నట్లు దూరంగా ఉండిపోయింది. డచ్‌ వ్యాపారులను మినహా మిగతా వాళ్లని దేశంలోకి అనుమతించలేదు. వాళ్లను కూడా నాగసాకీ పోర్టుకే పరిమితం చేసింది. మతం, రాజకీయాల్లో జోక్యం చేసుకోకుండా వాళ్లని కట్టడిచేసింది. అందుకు వాళ్లూ అంగీకరించి వ్యాపారానికే పరిమితమయ్యారు. డచ్‌ వ్యాపారుల వల్ల పరిచయమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుకరించి, సొంతంగా ఆధునిక పరికరాలను తయారు చేయటం నేర్చుకోవటం మొదలుపెట్టారు. నేర్చుకున్నదల్లా సొంతభాషలో రాసుకుని విపరీతంగా కొత్త పరిజ్ఞానాలను వ్యాప్తిచేశారు.


1853 వరకూ అది కొనసాగింది. ఇంతలో అమెరికా నౌకాదళం నాయకుడు మాథ్యూ పెర్రీ వచ్చి నౌకాశ్రయాలన్నీ విదేశీ వ్యాపారాలకు తెరవాల్సిందేనని హుకుం జారీచేశారు. పాశ్చాత్య బలగాన్ని తమకున్న బలంతో ఎదిరించలేమన్న నిజం జపాన్‌ పైవర్గం గ్రహించింది. తీవ్ర అంతర్మథనం మొదలైంది. పెనుమార్పులకు రంగం సిద్ధమైంది. ముత్సుహితో చక్రవర్తికి పూర్తి అధికారాలు దఖలుపరిచే మెయిజీ యుగం 1868లో మొదలైంది. ఆ కేంద్రీకృత పాలనతో అన్నిరంగాల్లో విప్లవాత్మక మార్పులు ఉరకలు వేశాయి. ప్రభుత్వ ప్రోత్సాహంతో పరిశ్రమలు నెలకొన్నాయి. అన్నిటినీ సొంతంగా తయారుచేసుకునే క్రమాన్ని మొదలుపెట్టారు. 1914 నాటికి అగ్రదేశాల సరసన జపాన్‌ నిలిచింది. నిర్బంధ విద్యావిధానాన్ని అమలు జరిపి, అసంఖ్యాకంగా నిపుణ కార్మికులను తయారుచేసుకుని శాస్త్ర, సాంకేతిక విజ్ఞానంలో యూరప్‌ దేశాలకు దీటుగా ఎదిగింది. పాశ్చాత్య ఆధిపత్యానికి ఏరూపంలోనూ లొంగకుండా ఉండాలనే దృఢ చిత్తంతో జపాన్‌ పైవర్గం వ్యవహరించింది. తెగువకు, నిర్భీతికి, సవాళ్లను స్వీకరించే స్థితికి నిదర్శనంగా నిలిచింది. భారత్‌కు ఇప్పుడు అంతకుమించి వ్యవహరించే అవకాశమూ, స్థాయీ రెండూ ఉన్నాయి. అయినా మన పైవర్గం అంతటి తెగువను చూపుతుందా అన్నది ఇప్పటికైతే ప్రశ్నార్థకమే! సంజయబారు లాంటి వాఖ్యాతలు అదిప్పుడు కనపడటంలేదనే ఎత్తిచూపుతున్నారు. సర్దుకుపోవటం కొన్ని సందర్భాల్లో అవసరమైనా ఏ నిర్ణయమూ స్వీయశక్తిని తగ్గించే శాపంగా మారకూడదు!

రాహుల్ కుమార్

(ఆంధ్రజ్యోతి ఎడిటర్‌)

ఈ వార్తలు కూడా చదవండి...

ఏపీ ప్రభుత్వంపై బిల్‌గేట్స్ ప్రశంసలు..

ఏపీ అభివృద్ధికి గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం కీలక మలుపు: పవన్ కల్యాణ్

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 17 , 2026 | 03:19 AM