Share News

అన్నదాతకు గ్లోబల్ గ్యారెంటీ

ABN , Publish Date - Feb 12 , 2026 | 02:08 AM

‘ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఒక ఆశాకిరణం. భారత్ కుదుర్చుకుంటున్న ఇన్ని వాణిజ్య ఒప్పందాలు ఆ దేశంపై ప్రపంచానికి ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తున్నాయి....

అన్నదాతకు గ్లోబల్ గ్యారెంటీ

‘ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఒక ఆశాకిరణం. భారత్ కుదుర్చుకుంటున్న ఇన్ని వాణిజ్య ఒప్పందాలు ఆ దేశంపై ప్రపంచానికి ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తున్నాయి. ప్రపంచ వృద్ధిలో 15శాతం వాటా భారత్ నుంచే వస్తోంది.’’ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థకు చెందిన క్రిస్టాలినా జార్జీవా చెప్పిన నిజం ఇది. భారత్ – అమెరికా మధ్య కుదిరిన తాజా ట్రేడ్ డీల్‌తో ఇది మరోసారి నిజం అయింది. ప్రధాని మోదీ దార్శనికతతో భారత్ నేడు ప్రపంచ వేదికపై ఒక శక్తిమంతమైన ఆర్థిక శక్తిగా ఆవిర్భవిస్తోంది.

అమెరికాతో కుదిరిన చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందం అంకెలకు సంబంధించింది కాదు, ఇది 140 కోట్ల మంది భారతీయుల ఆత్మనిర్భరతకు దక్కిన అంతర్జాతీయ గుర్తింపు. సుమారు 190 బిలియన్ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రాబోయే ఐదేళ్లలో 500 బిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా కుదిరిన ఈ ఒప్పందం, భారత ఆర్థిక వ్యవస్థలో నూతన అధ్యాయాన్ని లిఖించబోతోంది. భారతీయ ఎగుమతిదారులకు అపారమైన అవకాశాలు లభించనున్నాయి. భారతీయ వస్త్రాలు, ఇంజనీరింగ్ వస్తువులు, ఫార్మా ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న దిగుమతి సుంకాలు భారీగా తగ్గడం వల్ల మన ఎగుమతిదారులకు ఏటా సుమారు 10 బిలియన్ డాలర్ల అదనపు ఆదాయం చేకూరుతుంది.

ఒకే సంవత్సర కాలంలో ప్రపంచంలోని ఐదు శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థలతో భారత్ వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడం నరేంద్ర మోదీ ఆర్థిక దౌత్య విజయం. ఈ ఒప్పందాలు కుదుర్చుకున్న దేశాల ఆర్థిక శక్తిని గమనిస్తే, ఇవి ప్రపంచ మొత్తం జీడీపీలో 50 శాతానికి పైగా వాటా కలిగి ఉన్నాయి. ప్రపంచ సంపదలో సగం వాటా ఉన్న మార్కెట్లలోకి నేడు భారతీయ వస్తువులకు నేరుగా మార్గం దొరికింది. యూఏఈ, ఆస్ట్రేలియా, మారిషస్ వంటి దేశాలతో పాటు ఐరోపాలోని కీలక దేశాలతో కుదిరిన ఈ ఒప్పందాల ద్వారా కోట్లాది మంది యువతకు ఉపాధి, లక్షలాది చిన్న మధ్యతరహా పరిశ్రమలకు గ్లోబల్ మార్కెట్, రైతులకు గిట్టుబాటు ధర లభించబోతున్నాయి. ఇది కేవలం వ్యాపారం కాదు, 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మించే దిశగా వేసిన బలమైన పునాది.


అమెరికాతో జరిగిన ఒప్పందంలో రైతు వ్యతిరేక అంశాలు ఉన్నాయని కాంగ్రెస్‌ ప్రచారం చేస్తున్నది. ఆ పార్టీ చెబుతున్నట్లు, విదేశీ ఉత్పత్తులు మన మార్కెట్‌ను ముంచెత్తడం అనేది ముమ్మాటికీ అవాస్తవం. దీన్ని నివారించేందుకే ప్రభుత్వం నెగెటివ్ లిస్ట్ అనే రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసింది. మన దేశంలోని చిన్న, మధ్య తరహా రైతులకు వెన్నెముకగా ఉన్న పాడి పరిశ్రమ, గోధుమలు, వరి, చెరకు వంటి కీలక పంటలను ఈ జాబితాలో ఉంచడం ద్వారా అమెరికా నుంచి వచ్చే చౌకైన దిగుమతుల నుంచి మన రైతులకు పూర్తి రక్షణ కల్పించారు. అంటే, మన అంతర్గత మార్కెట్ స్థిరంగా ఉంటుంది, విదేశీ పోటీ వల్ల మన రైతుకు నష్టం కలిగే అవకాశమే లేదు.

మరోవైపు, ఈ ఒప్పందం భారతీయ రైతులకు కొత్త ఆదాయ మార్గాలను తెరుస్తోంది. ఇప్పటివరకు అమెరికా వంటి దేశాలకు మన వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయాలంటే కఠినమైన ఫైటోశానిటరీ నిబంధనలు, భారీ సుంకాలు అడ్డంకిగా ఉండేవి. ఈ ఒప్పందం వల్ల భారతీయ మామిడి, ద్రాక్ష, దానిమ్మ, బాస్మతియేతర బియ్యం వంటి ఉత్పత్తులకు అమెరికా మార్కెట్లోకి జీరో డ్యూటీ లేదా నామమాత్రపు సుంకంతో ప్రవేశం లభిస్తుంది. దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం తగ్గి, రైతు పండించిన పంటకు అంతర్జాతీయ స్థాయిలో గిట్టుబాటు ధర లభిస్తుంది. ఇది కేవలం వ్యాపారం కాదు, మన అన్నదాతను గ్లోబల్ ఎగుమతిదారుగా మార్చే ఒక గొప్ప సామాజిక మార్పు. అలాగే ఈ ఒప్పందం వల్ల అగ్రి–టెక్నాలజీ, కోల్డ్ స్టోరేజ్ రంగాల్లో అమెరికా నుంచి భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. పంట కోత అనంతరం జరిగే వృథాను అరికట్టడానికి ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వస్తుంది. తద్వారా రైతు పండించిన ప్రతి గింజకూ విలువ లభిస్తుంది.


మేధో సంపత్తి హక్కుల విషయంలో ప్రభుత్వం రాజీ పడిందని, దీనివల్ల మందుల ధరలు పెరుగుతాయని కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదం. భారత ఫార్మా రంగం ప్రపంచానికే మెడికల్ హబ్‌గా ఉంది. మన దేశంలోని సామాన్యులకు చౌకగా లభించే జెనరిక్ మందుల లభ్యతకు ఎలాంటి ముప్పు వాటిల్లదనీ, పేటెంట్ చట్టాల్లో మన జాతీయ ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వం వ్యవహరిస్తోందనీ విపక్షాలు గ్రహించాలి. అలాగే డేటా ప్రైవసీ, సార్వభౌమత్వం గురించి కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు హాస్యాస్పదం. డిజిటల్ విప్లవం ద్వారా భారతీయుల డేటా భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వం ఇప్పటికే కఠిన చట్టాలను రూపొందించింది. అమెరికా టెక్ కంపెనీలు భారత చట్టాలకు లోబడి ఉండాల్సిందే తప్ప, మన పౌరుల సమాచారాన్ని తరలించుకుపోవడం సాధ్యం కాదు.

ఈ ఒప్పంద చర్చల్లో పారదర్శకత లేదనే విమర్శలు కూడా అర్థరహితమైనవి. అంతర్జాతీయ వాణిజ్య చర్చలు వ్యూహాత్మక గోప్యతతో జరుగుతాయి. ఒప్పందం పూర్తయ్యాక ప్రతి అంశం ప్రజల ముందుకు వస్తుంది. 2014కు ముందు దేశాన్ని కుంభకోణాలమయం చేసినవారు, నేడు పారదర్శకత గురించి మాట్లాడటం విడ్డూరం. కోట్లాదిమంది యువతకు లభించే ఉపాధిని అడ్డుకోవడమే విపక్షాల అసలు ఎజెండాగా కనిపిస్తోంది. 21వ శతాబ్దం భారత్‌దే అని ప్రపంచం నమ్ముతున్న తరుణంలో, అమెరికాతో కుదిరిన ఈ ఒప్పందం మన దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు నడిపించే ఒక శక్తిమంతమైన అడుగు. అభివృద్ధికి అడ్డుపడటం మానుకుని, దేశ ప్రయోజనాల కోసం జరుగుతున్న ఈ బృహత్తర కార్యాన్ని విపక్షాలు గుర్తించాలి.

యస్.విష్ణువర్ధన్‌రెడ్డి

బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు

ఇవి కూడా చదవండి..

వందేమాతరం కొత్త ప్రోటోకాల్.. జనగణమన కంటే ముందే వందేమాతరం ఆలాపన

ఎప్‌స్టీన్‌ను కలిసాను కానీ.. రాహుల్ ఆరోపణలపై హర్దీప్ సింగ్ పూరి

Updated Date - Feb 12 , 2026 | 02:08 AM