పనిచూపని భారతం.. నిందా?.. నిజమా?
ABN , Publish Date - Nov 17 , 2026 | 02:06 AM
2047.. దీని గురించి ఎక్కువగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ సంవత్సరం మనకు నిజంగా ఘనమైనదే! ఆనాటికి భారత్ అన్నిరకాలుగా వికసించి, వైభవోపేతంగా మారుతుందని విపరీతంగా ప్రచారం...
2047.. దీని గురించి ఎక్కువగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ సంవత్సరం మనకు నిజంగా ఘనమైనదే! ఆనాటికి భారత్ అన్నిరకాలుగా వికసించి, వైభవోపేతంగా మారుతుందని విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఒక సమున్నత లక్ష్యాన్ని సాధించాలంటే దాన్ని ప్రచారం చేయటమూ, ప్రజలను ఆ దిశగా ప్రేరేపించటమూ అన్ని చోట్లా కనపడేదే. దీనికి మన దేశం ఏ రకంగానూ మినహాయింపుకాదు. 2047 నాటికి మనకు స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు అవుతుంది. అన్ని ఆధునిక నాగరికతల్లో వందేళ్లను మైలురాయిగా పెట్టుకుని లక్ష్యాలను ఏర్పరచుకోవటమూ, సాఫల్యవైఫల్యాలను సమీక్షించుకోవటమూ సహజంగానే జరుగుతుంది. వైఫల్యాలను అంగీకరించకపోతే ఆశించిన సాఫల్యాలను పొందలేం. వాటి కోసం సరైన చర్యలనూ తీసుకోలేం. వికసిత భారత్‌లో ఎన్ని పెద్ద లక్ష్యాలైనా ఉండొచ్చు. కానీ ప్రజల దృష్టి నుంచి చూస్తే పనిచేయగలిగిన సామర్థ్యం ఉన్న వారికి పని కల్పించి, గౌరవప్రదమైన జీవితాన్ని అందించటమే అసలైన లక్ష్యంగా ఉండాలి. ఆ దిశగా మన అడుగులు పడుతున్నాయా? లేవా అన్నదే చూడాలి. అలా చూస్తే పరిస్థితులు అంత ఆశాజనకంగా కనిపించటం లేదు.
1960ల తర్వాత ప్రగతిపథంలోకి దూసుకువెళ్లిన హాంగ్‌కాంగ్, సింగపూర్, దక్షిణకొరియా, తైవాన్లతో పోల్చితే ఉపాధికల్పనలో భారత్ ఎంతో వెనుకబడి ఉంటుంది. ఆ చిన్న దేశాలతో.. ఎంతో అధిక జనాభాను కలిగి, ఎన్నో వైవిధ్యాలకు నిలయమై, ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థ అమలయ్యే భారత్‌ను పోల్చి చూడటం సమంజసం కాదనే అనుకుందాం. అందులో సహేతుకతనూ ఒకపట్టాన కాదనలేం. మరి ఏ దేశంతో పోల్చిచూసుకోవాలన్న ప్రశ్న మనకు తలెత్తుతుంది. అసలు అభివృద్ధి అంటేనే పోల్చిచూసుకోవటం కదా! దాన్నే మన పాలకులు నిత్యం జపిస్తున్నారు కదా! దేశీయస్థూల ఉత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటులో మనం అందరికంటే ముందుంటున్నాం.. విదేశీ పెట్టుబడులూ మనకే ఎక్కువగా వస్తున్నాయి... తయారీరంగంలో అగ్రగామి ప్రపంచ కంపెనీలన్నీ మన వద్దకే వరుస కడుతున్నాయి... డేటా సెంటర్ల ఏర్పాటులో దారులన్నీ భారత్‌కే చేరుకుంటున్నాయి... మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో మొదటి స్థానాన్ని సంపాదించుకుంటున్నాం... లాంటి ఘనమైన ప్రకటనలన్నీ ఇతర దేశాలతో పోల్చిచూసుకునేవే! అంతర్లీనంగా చైనాతో పోల్చిచూసుకోవటమే ఎక్కువగా ఉంటుంది. ఇది రాజకీయనేతలకే పరిమితం కావటం లేదు. మన కార్పొరేట్ రంగమూ, దాంట్లో భాగస్వాములైన వ్యూహకర్తలూ, మేధావులూ, స్వేచ్ఛా వ్యాపారంలో గట్టి నమ్మకం ఉన్న వాళ్లూ చైనాతో ఏదో విధంగా పోలిక తీసుకువస్తూనే ఉన్నారు.
సాధారణ ప్రజల దృష్టి నుంచి చూస్తే చైనాతో అన్నిరంగాల్లో పోల్చుకోవటం అంత తక్షణ అవసరంగా అన్పించదు. వారికి అవసరమయ్యే ఉపాధికల్పనతో పోల్చిచూస్తేనే ప్రయోజనం ఉంటుంది. ప్రజలకు గౌరవమైన ఉపాధి కల్పించటమే అన్నిటికంటే కీలకమైంది. ప్రజాస్వామ్యం అంటే ప్రజలందరికీ ఓటుహక్కు కల్పించటం, అయిదేళ్లకొకసారి ప్రభుత్వాలు శాంతియుతంగా మారటం, బహుళ రాజకీయ పార్టీలు క్రియాశీలకంగా ఉండటం.. మాత్రమే కాదన్న భావన ఎప్పుడో మారిపోయింది. పనిచేయగలిగిన సామర్థ్యం ఉన్న ప్రజలకు ఉపాధి కల్పించటమూ, ఆ సామర్థ్యాన్ని నిరంతరం పెంపొందించే విధంగా తగిన ఏర్పాట్లు చేయటమూ ప్రజాస్వామ్య పాలనకు గీటురాయిగా ఉండాలన్న భావనే ఇప్పుడు ప్రబలంగా ఉంది. ఈ రెండింటినీ నిర్లక్ష్యం చేయటమే అనేక దేశాల్లో యువకులనూ, విద్యార్థులనూ వీధుల్లోకి వచ్చేలా చేస్తోంది. పాఠశాలల్లో టీచర్లు తగినంతగా లేరన్న కారణంతో ఫ్రాన్స్‌లో జెన్‌జీ ఆందోళన వెనుకా అదే ఉంది. నీట్ పరీక్షల్లో అక్రమాలను వ్యతిరేకిస్తూ భారత్‌లో ఆరంభమైన కాక్రోచ్ ఉద్యమం వెనుకా భ్రష్టుపడుతోన్న విద్యారంగంపై ఆక్రోశమే ఉంది. ఉపాధి సామర్థ్యాలను పెంపొందించటంలో విద్యారంగానిదే కీలకపాత్ర అన్నది అందరికీ తెలిసిందే. చైనాతో పోల్చితే మన ఉపాధి సామర్థ్యాలు ఎక్కడో ఉంటాయి. ఆ సామర్థ్యాలను పెంచే విద్యా, నైపుణ్యశిక్షణ రంగాలు కూడా అనుకున్న లక్ష్యాలకు మైళ్లదూరంలోనే నిలిచిపోతున్నాయి.
దేశ జనాభాలో యువత అధికంగా ఉండటం భారత్‌కు లభించిన బ్రహ్మాండమైన సదవకాశంగా వర్ణించటం పదిహేనేళ్లుగా విపరీతంగా జరుగుతోంది. దీన్నే ‘డెమొగ్రాఫిక్ డివిడెండ్’గా జనాభా నిపుణులూ, ఆర్థికవేత్తలూ వర్ణించారు. వాళ్లు వర్ణించినట్లుగానే 2040 వరకూ మనకు ఆ సదవకాశం ఉంది. వికసిత భారత లక్ష్యం చేరాలంటే ముందుగా దీన్ని ఉపయోగించుకోవాలి. చైనాకూ ఒకప్పుడు ఈ అవకాశం బాగా ఉండేది. దాన్ని చాలా వరకూ పూర్తిగా సద్వినియోగం చేసుకుంది. 2012–2015 మధ్య నాటికి అక్కడ యువకుల సంఖ్య తగ్గి వృద్ధుల సంఖ్య పెరగటం మొదలైంది. అందుకే డెమొగ్రాఫిక్ డివిడెండ్ చైనాలో ముగిసిందనే చెప్పుకోవాలి. కానీ అప్పటికే ఉపాధికల్పనలోనూ, దానికి అవసరమైన సామర్థ్యాల కల్పనలోనూ చైనా గణనీయమైన ప్రగతిని సాధించింది. వ్యవసాయేతర రంగాల్లో ఉపాధికల్పనకు చేయూతనివ్వటంలో చైనాతో సాటిరాగల దేశం 1950 తర్వాత మరొకటి లేదు. దాంతోనే 85 కోట్ల మందిని నాలుగు దశాబ్దాల కాలంలో దారిద్య్రరేఖకు ఎగువకు తీసుకువెళ్లి మధ్యతరగతిగా మార్చటంలో చైనా చరిత్రను సృష్టించిందని కిషోర్ మహబూబనీ లాంటి వ్యాఖ్యాతలు ఇప్పటికే చాలా వేదికలపై బలంగా చెప్పారు. ఇతర దేశాలను ఆక్రమించుకుని వలసలుగా మార్చుకోకుండా, దీర్ఘకాలిక యుద్ధాలకు దిగకుండా దీన్ని సాధించటం 20వ శతాబ్దపు అద్భుతంగా కిషోర్ వర్ణించారు. సరిహద్దు తగాదాల వల్ల చైనాను నిరంతరం అనుమానంతోనూ, అక్కడ జరిగిన ప్రతి పరిణామాన్నీ శంకించే దృష్టితోనూ చూడటం వల్ల గుణపాఠాలూ నేర్చుకునే అవకాశాన్నీ మనం కోల్పోయాం. అధికారం కోసం ఏదో ఒకటి మాట్లాడే రాజకీయాలు.. నిష్పాక్షిక దృష్టిని మసకబార్చుతాయనటానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి లేదు. ఒక మనిషిని గానీ దేశాన్ని గానీ నిరంతరం శత్రుదృష్టితో చూడటం వల్ల ఎప్పుడూ వాస్తవాలకు దూరంగానే ఉండిపోవాల్సి వస్తుంది. చైనా 1949 తర్వాత విద్యా, ఆరోగ్యరంగాల్లో గణనీయంగా పెట్టుబడులు పెట్టింది. అది 1980ల తర్వాత ఆర్థికపురోగతికి చాలా ఉపయోగపడింది. 2000 వరకూ కూడా మనం ఈ రెండు రంగాల్లో పెట్టిన పెట్టుబడులు చాలా తక్కువ. ఆ తర్వాత కొంత పెరిగినా చైనాతో ఏ రకంగానూ పోల్చలేం.
ప్రజాస్వామ్యానికి గీటురాయి ఉపాధి అవకాశాలనూ, అందుకు అవసరమైన సామర్థ్యాలనూ కల్పించటమే అనుకుంటే భారతదేశం చేయాల్సిన ప్రయాణం అసాధారణమైంది. ఇప్పటివరకూ చేసింది ఏ మాత్రమూ సరిపోనిది. చైనాను మించిపోయి జనాభాపరంగా మొదటి స్థానానికి చేరుకున్నా కార్మికశక్తి భాగస్వామ్య రేటులో (లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్) ప్రపంచ సగటుకంటే మనం తక్కువగా ఉన్నాం. అంటే పనిచేసే వయస్సులో ఉన్నవాళ్లకి తగిన ఉపాధిని కల్పించటంలో ప్రపంచ సగటుని కూడా చేరుకోలేకపోతున్నాం. దీన్నే పనిచూపించలేని భారతంగా వర్ణిస్తూ ఇటీవలే సంతోష్ మెహరోత్రా, జాజతీ పరీడా ‘ఇండియా అవుట్ ఆఫ్ వర్క్’ పేరుతో ఒక పుస్తకాన్ని ప్రచురించారు. చదువుకున్న యువతలో నిరుద్యోగం పెరిగిపోవటం ఇబ్బందికర పరిస్థితిని సృష్టిస్తోంది. విద్యార్హతలూ, నైపుణ్యాలున్నా తగిన ఉద్యోగాలు రావటంలేదని భావించటం యువతలో పెరుగుతుంటే.. తమ అవసరాలకు తగిన వ్యక్తులు మార్కెట్లో దొరకటంలేదని కంపెనీలు వాపోతున్నాయి. మొత్తంమీద ఉద్యోగకల్పనలో ఎదురవుతున్న దుస్థితి 45 ఏళ్లలోపు వ్యక్తుల్లో ఆత్మహత్యలకు ప్రధానకారణమవుతోంది. ఆత్మహత్యల్లో 66శాతం ఈ వయస్సు వారే ఉంటున్నారు. అన్నిరకాలుగా ఉద్యోగాల కోసం ప్రయత్నించి విసిగిపోయి, పై చదువులను కొనసాగించకుండా, ఏ శిక్షణ పొందకుండా, దొరికిన ఏదో ఒక పనిలో కుదురుకోకుండా (నాట్ ఇన్ ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్ ఆర్ ట్రైనింగ్– నీఈఈటీ) మిగిలిపోతున్న వారి సంఖ్య ప్రమాదకరంగా పెరిగిపోతోంది. నీఈఈటీ వర్గంగా పిలిచే ఇట్లాంటి వాళ్ల సంఖ్య 2021 నాటికే 12.1 కోట్లకు చేరింది. 2017–18లో 5.1కోట్లు ఉన్న ఈ సంఖ్య మూడేళ్లలో రెట్టింపు పైగా పెరిగింది. ఇట్లాంటి వాళ్లు ఎంత పెరిగితే అంతగా సామాజిక వైషమ్యాలకు అవకాశాలూ ఏర్పడతాయి. అసంతృప్తులు తీవ్రభావజాలాల వైపు మొగ్గే విధంగానూ చేస్తాయి. జనరల్ డిగ్రీ పూర్తిచేసిన వాళ్లల్లో నిరుద్యోగిత 30శాతానికి పైగా చేరుకుంది. సాంకేతిక డిగ్రీలు ఉన్న వాళ్ల పరిస్థితీ ఏమంత బాగోలేదు. వాళ్లల్లో కూడా 18 నుంచి 26 శాతం వరకూ ఉద్యోగాల్లేకుండా ఉన్నారు. పోస్టు గ్రాడ్యుయేట్లలోనూ (20 నుంచి 30శాతం) అదే పరిస్థితి కనపడుతుంది. మహిళల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. కార్మికశక్తిలో మహిళల భాగస్వామ్యం ప్రపంచంలో అతితక్కువ ఉన్న దేశాల్లో మనం మొదటి స్థానంలో ఉన్నాం.
వచ్చే పదిహేనేళ్లలో ఏడాదికి కోటి మంది చదువుకున్న యువత ఉపాధి మార్కెట్లోకి అడుగుపెడతారు. వీళ్లల్లో 20శాతం మందికి పైగా 12వ తరగతికి పై స్థాయి విద్యను పూర్తిచేసిన వాళ్లే ఉంటారు. డెమొగ్రాఫిక్ డివిడెండ్ 2040 వరకూ కొనసాగే నేపథ్యంలో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలనూ, విద్యా, నైపుణ్య సామర్థ్యాలనూ అందివ్వకపోతే వికసిత భారత్ లక్ష్యం వికసించని పువ్వులాగే మారే పరిస్థితిని కొట్టేయలేం. ఇప్పటి పరిస్థితి, ప్రాథమ్యాలు ఇలాగే కొనసాగితే యువతకు పనిచూపని భారతం ఆర్థికాభివృద్ధికి పెను అవరోధంగా మారుతుంది. ఉపాధి కల్పనపై కృత్రిమ మేధ (ఏఐ) విసిరే సవాల్‌కు జనాభా తక్కువ ఉన్న దేశాలే అల్లలాడిపోయే పరిస్థితి ఉంది. ఏటేటా జనాభా పెరగటం 2065 వరకూ కొనసాగే భారత్‌లో ఏఐ సవాల్ మరింత ఉధృతంగా ఉంటుంది. మత, కుల విభజనల రాజకీయాలతో పరిస్థితులను నెట్టుకురావటం అన్ని సందర్భాల్లో సాధ్యం కాదు. అమెరికాలో శ్వేతజాతి ఆధిక్యతా భావనతో, ఇతర దేశాలను కించపరుస్తూ ఉన్మాద రాజకీయాలను ఎంతగా వ్యాప్తిచేసినా ఎన్నికల్లో ట్రంప్ అపజయాన్ని చూడక తప్పలేదు. ఆర్థిక, ఉపాధి, విద్యా సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించే స్థాయిని ప్రపంచవ్యాప్తంగా యువత అధిగమిస్తోంది. ఇంకా పదిహేనేళ్లపాటు యువరక్తం ఉరకలువేసే దేశంలో ఆర్థిక విధానాలూ, రాజకీయాలూ గణనీయంగా మారకపోతే చరిత్ర ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేని అశక్తులుగా మిగిలిపోతాం! పని కల్పించని ప్రజాస్వామ్యం ప్రమాదం అంచులపైనే ఉండిపోతుంది! ఉపాధిని విస్తరించలేని పెట్టుబడులతో అసమానతలు మాత్రమే పెరిగితే మొత్తం ఆర్థికవ్యవస్థపైనే వ్యతిరేకత ఊపందుకుంటుంది! విపరీతం, విద్వేషం ఎప్పుడూ ఎదురు బదురుగానే ఉంటాయి. చరిత్ర నేర్పే పాఠం అదే!
రాహుల్ కుమార్
(ఆంధ్రజ్యోతి ఎడిటర్)
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల
సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్