Share News

సమస్యలు వాస్తవం.. స్వేచ్ఛ లేదనడం అవాస్తవం!

ABN , Publish Date - Jun 02 , 2026 | 02:36 AM

ఇటీవల విదేశీ పర్యటనలో భాగంగా నార్వే వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ నార్డిక్ (నార్వే, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్‌లాండ్, స్వీడన్) దేశాధినేతలతో జరిగిన సమావేశానంతరం నార్వే ప్రధాని జోనాస్ గార్‌స్టోర్‌తో...

సమస్యలు వాస్తవం.. స్వేచ్ఛ లేదనడం అవాస్తవం!

ఇటీవల విదేశీ పర్యటనలో భాగంగా నార్వే వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ నార్డిక్ (నార్వే, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్‌లాండ్, స్వీడన్) దేశాధినేతలతో జరిగిన సమావేశానంతరం నార్వే ప్రధాని జోనాస్ గార్‌స్టోర్‌తో కలిసి మీడియా ముందుకు వచ్చినప్పుడు స్థానిక డాగ్సవిసెన్ పత్రికకు చెందిన పాత్రికేయురాలు హెల్లే లింగ్ కొన్ని ప్రశ్నలు మోదీని అడగడానికి ప్రయత్నించడం, దానికి మోదీ స్పందించకపోవడంతో... ‘ప్రపంచంలోని అత్యంత స్వేచ్ఛాయుతమైన మీడియా నుంచి మీరు ఎందుకు ప్రశ్నలు తీసుకోరు?’ అంటూ ఆమె విమర్శించడం తెలిసిందే. దీనిపై స్పందించిన భారత విదేశీ వ్యవహారాల శాఖ... తాము ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ప్రశ్నలు అడగొచ్చని ఆమెకు సూచించింది. భారత ప్రజాస్వామ్యం, రాజ్యాంగ వ్యవస్థపై అవగాహన లేకుండానే కొంతమంది ప్రశ్నలు లేవనెత్తుతున్నారని విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి సి.బి.జార్జి చురకలంటించారు. ఈ విషయాన్ని ఎద్దేవా చేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ ఎక్స్‌లో పోస్ట్ చేయడం, వెంటనే హెల్లే లింగ్ ఆయనకు ఫోన్ చేసి ఇంటర్వ్యూ కోరడం విశేషం. అయితే తాజాగా విడుదలైన పత్రికా స్వేచ్ఛలో నార్వే మొదటి స్థానంలో ఉండగా, భారత్ 157వ స్థానంలో ఉందని... ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి తీవ్రమైన హెచ్చరిక అని కొంతమంది విమర్శిస్తున్నారు. నిజంగానే భారత్‌లో పత్రికా స్వేచ్ఛ లేదా? అన్నది విశ్లేషిద్దాం.

భారత్‌లో దాదాపు 1.46 లక్షలకు పైగా పత్రికలు రిజిస్టర్ అయ్యాయి. వివిధ భాషల్లో దాదాపు వెయ్యికి పైగా శాటిలైట్ ఛానెల్స్ ఉన్నాయి. కొన్ని వేల యూట్యూబ్ ఛానెళ్లు, స్వతంత్ర వెబ్‌సైట్లు ఉన్నాయి. వీటిలో లక్షల మంది జర్నలిస్టులు తమ అభిప్రాయాలను నిర్భయంగా చెపుతున్నారు. ప్రభుత్వాన్ని రోజూ కఠినంగా విమర్శించే పత్రికలూ, ఛానెళ్లు, వెబ్‌సైట్లు స్వేచ్ఛగా నడుస్తున్నాయి. ప్రభుత్వాలు కేసులు పెట్టినా, న్యాయవ్యవస్థ జర్నలిస్టులకు వెంటనే ఉపశమనం కల్పిస్తోంది. సెన్సార్షిప్ ఉన్న దేశాల్లో ఇది సాధ్యం కాదు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 19(1)(ఎ) కింద భావ ప్రకటన స్వేచ్ఛకు పూర్తి రక్షణ కల్పించింది. పత్రికా స్వేచ్ఛ ఇందులో భాగమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోర్టులు పదేపదే జర్నలిస్టుల హక్కులను కాపాడాయి. ఎమర్జెన్సీ సమయంలో తప్ప మీడియాపై ముందస్తు నిషేధం విధించలేదు. అయితే మీడియా స్వేచ్ఛపై ఎందుకు నియంత్రణలు ఉన్నాయన్నది కొందరి ప్రశ్న. దీనిపై గతంలో రాజ్యసభలో కూడా విస్తృత చర్చ జరిగింది. భావ ప్రకటనా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తే ఇక ఆ స్వేచ్ఛకు అర్థమే లేదని ఒక వర్గం వాదిస్తే, ప్రపంచంలో ఎక్కడా పరిమితులకు లోబడని స్వేచ్ఛ లేదని, ఎవరికీ అపరిమిత అధికారాలు దఖలుపరచడం సబబు కాదని మరొక వర్గం వాదించింది. చివరికి పరిమితులతో కూడిన స్వేచ్ఛకే రాజ్యసభ ఆమోద ముద్ర వేసింది.


హేతుబద్ధ పరిమితులకు కట్టుబడి ఉండే మీడియా స్వేచ్ఛను కాపాడే క్రమంలో దశాబ్దాలుగా ఉన్నత న్యాయస్థానం తిరుగులేని నిబద్ధతను చాటుకుంటోంది. భారతదేశంలో స్వేచ్ఛ ఉంది కాబట్టే మీడియా అనేక భారీ కుంభకోణాలను బట్టబయలు చేయగలిగింది. 2జీ స్పెక్ట్రమ్, బొగ్గు కుంభకోణం, వ్యాపం కేసు, రాఫెల్ డీల్, ఎలక్టోరల్ బాండ్స్ లాంటి విషయాలపై మీడియా కథనాలే కీలకంగా మారాయి. ఆదర్శ స్కామ్, కామన్‌వెల్త్ గేమ్స్ అవినీతి, పీఎం కేర్స్ నిధులు లాంటి అనేక అంశాలను జర్నలిస్టులు ఆర్టీఐ ద్వారా బయటపెట్టారు. అలాగని పాత్రికేయులపై దేశంలో ఎక్కడా దాడులు, కేసులు, హత్యలు జరగడం లేదని కాదు. అడపాదడపా జరిగినా నిందితులను కఠినంగా శిక్షించి, పత్రికా స్వేచ్ఛను కాపాడడానికి మన వ్యవస్థలు నిబద్ధతతో పనిచేస్తున్నాయన్నది వాస్తవం. ఇదే సమయంలో... మన దేశంలో ఉంటూ ఇక్కడి నాయకులను, వ్యవస్థలను ప్రతీ దానికీ విమర్శించడం, పాశ్చాత్య నాయకులను సమర్ధిస్తూ మాట్లాడి ఆనందించడం స్థానికంగా ఉన్న కొంతమంది సూడో మేధావులకు పరిపాటి అయింది. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న భారతదేశానికి, మన దేశంలోని ఒక నగరానికి కూడా సరిపోని 50 లక్షల జనాభా ఉన్న నార్వే లాంటి దేశానికి చెందిన వ్యక్తి విమర్శిస్తుంటే గుడ్డిగా సమర్ధించే వారిని చూసి జాలిపడడం తప్ప చేసేదేమీ లేదు. భారత మీడియా విషయంలో ఎంతో పకడ్బందీగా రాజ్యాంగ, న్యాయ పరమైన రక్షణ కల్పించినా కూడా పత్రికా స్వేచ్ఛలో భారత్‌కు 157వ స్థానం ఇవ్వడం విడ్డూరం. ఈ విషయంలో ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేసే రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే సంస్థ ఏటా ఇచ్చే ర్యాంకింగ్స్‌పై అనుమానం కలుగక మానదు.


భిన్న మతాలు, కులాలు, సంస్కృతులకు నిలయమైన మన దేశంలో ఎన్నో సంక్లిష్టతలు ఉన్నాయి. అయినా కూడా ఇక్కడ అవధుల్లేని సమాచార, భావ ప్రకటన వాహికలుగా ప్రసార మాధ్యమాలు నిరుపమానమైన పాత్ర పోషిస్తున్నాయి. మన దేశంలో స్వాతంత్ర్యానికి ముందు, ఆ తరువాత జాతి నిర్మాణ క్రమంలో మీడియా అనితరసాధ్యమైన పాత్ర పోషించింది. ప్రస్తుత పరిస్థితుల్లో విస్తృతంగా నెలకొన్న పత్రికలు, చానెళ్ల మధ్య పోటీతత్వం పెరగడంతో రేటింగ్స్ కోసం కొన్ని సందర్భాలలో కల్పిత కథనాలు, వార్తలు సృష్టించడం, ప్రచారం చేయడం పరిపాటిగా మారింది. ఇది నియంత్రించదగ్గ విషయం కాబట్టి పత్రికా యాజమాన్యాలు కూడా బాధ్యతతో వ్యవహరించాలి. ఒకరి స్వేచ్ఛ మరొకరికి ప్రతిబంధకంగా మారకూడదు. నిజం, నిష్పక్షపాతం, ధైర్యం, జవాబుదారీతనం, బాధితుల గొంతుగా ఉండడం... నిజమైన పాత్రికేయానికి నిలువెత్తు స్తంభాలు. సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా అధికారం ముందు మోకరిల్లకుండా, ప్రజల ముందు మాత్రమే తలవంచినవారు, కలాన్ని ఆయుధంగా చేసుకుని సమాజాన్ని మేల్కొల్పిన గొప్ప పాత్రికేయులు ఈ దేశంలో ఎందరో ఉన్నారు.

భారత పాత్రికేయం కేవలం వార్తలను చెప్పలేదు, దేశపు దశను, దిశను మార్చింది. బ్రిటిష్ తుపాకులకు ఎదురొడ్డి నిలిచిన కలం నుంచి, అవినీతి కోటలను బద్దలు కొట్టిన పరిశోధనల వరకు భారత జర్నలిజం గొప్పగా నిలచింది. ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా జర్నలిజానికి స్వేచ్ఛనిచ్చి, ఇబ్బందులు వచ్చినప్పుడు అండగా నిలబడడం మన భారత రాజ్యాంగ వ్యవస్థల గొప్పతనం. భారతీయుల ఎదుగుదలను యూరోపియన్లు ఎప్పుడూ సహించలేరు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఇక్కడి పరిస్థితులను గమనించకుండా, స్వయంగా పరిశీలించకుండా ఎక్కడో కూర్చుని, ఎవరో ఇచ్చిన నివేదికల ఆధారంగా ర్యాంకులు నిర్ణయించడం అంటే కళ్ళతో చూసి నక్షత్రాలను లెక్కించడమే.

కూసంపూడి శ్రీనివాస్

జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి

ఈ వార్తలనూ చదవండి:

పెళ్లైన కొన్ని గంటల్లోనే విషాదం.. హెలికాప్టర్ ప్రమాదంలో భారత సంతతి పైలట్ మృతి..

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. అమెరికా-ఇరాన్ మధ్య పరస్పర దాడులు..

Updated Date - Jun 02 , 2026 | 02:36 AM