నిరుపేదలు నిజంగా తగ్గారా?
ABN , Publish Date - Nov 10 , 2026 | 01:32 AM
ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం భారత్‌లో ఈ దశాబ్దంలో నిరుపేదలు గణనీయంగా తగ్గారు. రోజుకి మూడు డాలర్లకు తక్కువగా వినియోగం చేయగలిగినవారు దశాబ్దం కిందట 26శాతం ఉండగా...
ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం భారత్‌లో ఈ దశాబ్దంలో నిరుపేదలు గణనీయంగా తగ్గారు. రోజుకి మూడు డాలర్లకు తక్కువగా వినియోగం చేయగలిగినవారు దశాబ్దం కిందట 26శాతం ఉండగా, ప్రస్తుతం 2.6శాతం మాత్రమే ఉన్నారు. ఇంకొంచెం పైస్థాయి పేదలు కూడా తగ్గారు. మరో పద్ధతి– మల్టి డైమెన్షనల్ పావర్టీ. ఈ లెక్కలు కూడా దేశంలో పేదరికం గణనీయంగా తగ్గిందని చెప్తోంది. ఈ పద్ధతి ప్రకారం విద్య, వైద్యం, జీవన ప్రమాణాలకు సంబంధించి 12 కొలతలు తీసుకుని ప్రశ్నిస్తారు. వాటికి సమానంగా మార్కులు కేటాయిస్తారు. మొత్తం స్కోరు 33 కన్నా పైబడితే వారిని పేదలుగా లెక్కవేస్తారు. ఈ రకంగా చూసినా దేశం పేదరికం నుంచి బయటపడిందని ప్రపంచ బ్యాంకు తేల్చింది. సంతోషించాల్సిన విషయమే. వికసిత భారత్ లక్ష్యంగా అడుగులు వేస్తున్న దశలో ప్రభుత్వ పరపతికి ఈ నివేదిక ఊతం ఇస్తుంది. ప్రభుత్వం కూడా తాము చేపట్టిన పేదరిక నిర్మూలన కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తున్నట్లు చెప్తోంది. అయితే ఈ నివేదిక చెప్తున్నంత మంచి నిజంగా జరిగిందా? ఆ స్థాయిలో పేదరికాన్ని జయించామా? లేక లెక్కపెట్టే తీరులో ఏమైనా తేడా ఉందా? అన్నవి తొలుస్తున్న ప్రశ్నలు.
కోట్లాది ప్రజలకు ప్రభుత్వం సబ్సిడీపై ఆహార ధాన్యాలు అందిస్తున్నది. అలా అందించకపోతే వారికి మనుగడ లేదు. ఆ సాయాన్ని నికర ఆదాయంగా చూపిస్తే వారు పేదల కిందికు రారు. దారిద్ర్యరేఖకు పైనే కనబడతారు. ఆ సాయం ఆగితే, వారు మళ్ళీ నిరుపేదలే. అలాగే జీవన ప్రమాణాల విషయం. బ్యాంకు ఖాతా ఉండడం ఒక పైస్థాయి సూచిక. కానీ సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం, ఉపాధి హామీ పథకం కోసం బ్యాంకు ఖాతాలు తెరిచారు. ఆ ఖాతాల సంఖ్య లెక్కిస్తే ప్రయోజనం లేదు. అందులో డబ్బులు ఎంత ఉన్నాయి, సొంతంగా సంపాదించగల అవకాశాలు ఏ మేరకున్నాయో చూస్తేనే వాస్తవం తెలుస్తుంది. ఏది ఏమైనా ప్రపంచ దేశాల సరసన ఆకలి సూచీలో 100వ స్థానంలో, పోషకాహార లేమిలో, శిశు మాతృ ఆరోగ్య సూచీల్లో వెనుకబాటు స్థానాల్లో ఉన్నాం. కార్మిక గణాంకాలు, నిరుద్యోగ గణాంకాలు ఆశాజనకంగా లేవు. వాటికీ, ఈ ప్రపంచ బ్యాంకు లెక్కలకూ పొంతన కుదరడం లేదు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం క్షేత్ర స్థాయిలో మరింత స్పష్టమైన విజయాలు సాధించాలి. పెరిగే ధరలు, ఉపాధిలేమి, నిలకడ లేని ఆదాయాలు, తగ్గుతున్న ఉద్యోగాలు, ఖరీదైన విద్య, వైద్యాలు ప్రజల్ని పేదరికం వైపే నెడుతున్నాయి.
డి.వి.జి. శంకరరావు
ఈ వార్తలనూ చదవండి:
ఎన్విడియా సీఈఓపై మేము గూఢచర్యం చేయలేదు: చైనా
వాళ్లు చాలా క్లోజ్.. ఎన్విడియా సీఈఓ ఎఫైర్‌పై 6 నెలల క్రితమే డౌట్