ఫిరాయింపులు: భలే ఖరీదైన బేరాలు!
ABN , Publish Date - Jun 26 , 2026 | 02:21 AM
కాల వైపరీత్యం! నిన్నటిదాకా తాము విమర్శించిన పార్టీలోనే నేడు చేరిపోతున్న ప్రజాప్రతినిధుల సంఖ్య పెరిగిపోతోంది. ఇటీవల బెంగాల్, మహారాష్ట్రలో చోటుచేసుకున్న తృణమూల్ కాంగ్రెస్, శివసేన ఎమ్మెల్యే, ఎంపీల ఫిరాయింపులే...
కాల వైపరీత్యం! నిన్నటిదాకా తాము విమర్శించిన పార్టీలోనే నేడు చేరిపోతున్న ప్రజాప్రతినిధుల సంఖ్య పెరిగిపోతోంది. ఇటీవల బెంగాల్, మహారాష్ట్రలో చోటుచేసుకున్న తృణమూల్ కాంగ్రెస్, శివసేన ఎమ్మెల్యే, ఎంపీల ఫిరాయింపులే అందుకు నిదర్శనాలు. ఎటువంటి సంకోచాలు లేకుండా.. చేరిన క్షణమే, ఆ పార్టీ నాయకులతో బహిరంగంగా, చాలా కాలం తరువాత కలుసుకున్న పాత మిత్రుల్లా వ్యవహరిస్తున్నారు! ప్రజలు ఏమనుకుంటున్నారనేది ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలకు పట్టడం లేదు!
నిజానికి ఫిరాయింపులు అనేవి కొత్త రాజకీయ పరిణామాలు కానేకావు. భారతదేశ రాజకీయాలలో పార్టీ ఫిరాయింపులకు దశాబ్దాల చరిత్ర ఉన్నది. ఈ నీతిబాహ్య రాజకీయాల పట్ల ఇప్పుడు ప్రజల్లో ఎటువంటి పట్టింపు లేకపోవడమే దిగ్భ్రాంతికరం. ఫిరాయింపులకు పాల్పడినవారు తమను ఎన్నుకున్న ఓటర్లకుగానీ, విశాల ప్రజానీకానికిగానీ తమ నిర్ణయంపై ఎటువంటి వివరణ ఇవ్వడం లేదు. రాజకీయాలు వ్యాపార లావాదేవీల వ్యవహారమయ్యాయి. ఫిరాయింపుదారులకు, వారిని చేర్చుకున్న పార్టీకి మధ్య కుదిరిన ఒప్పందానికి షరతులు ఏమిటో ప్రతి ఒక్కరికీ తెలుసు. రాజ్య వ్యవస్థ ఆర్థిక వనరులు అందుబాటులో ఉండడమనేది కూడా సదరు ఒప్పందంలో భాగంగా ఉంటోంది. ఇటీవల పార్టీ ఫిరాయించిన శివసేన ఎంపీ ఒకరు ఇలా చెప్పారు: ‘నా నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు సాధించుకోవాలంటే నేను పార్టీ మారడం తప్పనిసరి’.
ఫిరాయింపులను ప్రజల తీర్పును వంచించడంగా ఎవరూ ఇంకెంత మాత్రం భావించడం లేదు. అవి సాధారణ వ్యవహారాలైపోయాయి. అధికార సాధనకు ఫిరాయింపులూ మరొక మార్గమని ప్రజలు అంగీకరిస్తున్నారు! ఫిరాయింపులపై విమర్శలకు బీజేపీ మద్దతుదారులు అదే రీతిలో ప్రతిస్పందిస్తున్నారు: కాంగ్రెస్ విషయమేమిటి? దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో ఫిరాయింపులు జరగలేదా? ‘ఆయారామ్, గయారామ్’ అనే పరిహాసం ప్రాచుర్యంలోకి వచ్చింది నరేంద్ర మోదీ అధికారంలోకి రావడానికి చాలా కాలం ముందే కాదూ?
‘అవును’ అనేదే పై ప్రశ్నలన్నిటికీ సమాధానం. ఫిరాయింపులు భారత ప్రజాస్వామ్యమంత పాతవి. కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనలో ప్రతిపక్షాల ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వాలను రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా బర్తరఫ్ చేశారు. పదవుల కోసం పార్టీ మారిన శాసనసభ్యులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయ అవకాశవాదం బాగా వర్ధిల్లింది. నాయకులు పార్టీలు మారడంపై విమర్శలు రావడం పరిపాటి. అయితే ఆ విమర్శలకు పాలకపక్షం వారు ప్రతిస్పందిస్తూ ‘గతంలో మీరూ అదే చేశారు కదా’ అని పాత విషయాలను బయటకు తీసి ఎత్తిపొడవడం కూడా అంతే పరిపాటి. నాయకులు పార్టీలు మారడం అనేది కొత్తేమీ కాదు. ఇప్పుడు అసలు సమస్యేమిటంటే ఆ ఫిరాయింపుల స్వభావం పూర్తిగా మారిపోవడమే. కాంగ్రెస్ హయాంలో ఆధిపత్య పార్టీ వ్యవస్థకు తార్కాణంగా ఫిరాయింపులు ఉండేవి. ఇప్పుడు ఒక సర్వాధిపత్య పార్టీని సృష్టించి సుస్థిరం చేసే వ్యూహంలో భాగంగా ఫిరాయింపులు జరుగుతున్నాయి.
నాటి నేటి ఫిరాయింపులలో ఈ వ్యత్యాసం సమకాలీన రాజకీయాల్లో ఒక ముఖ్యమైన మార్పును వివరిస్తుంది. గత దశాబ్దకాలంలో నరేంద్రమోదీ, అమిత్‌షాల నేతృత్వంలోని బీజేపీ ఒక శక్తిమంతమైన ఎన్నికల యంత్రంగా ఆవిర్భవించింది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇదొక అపూర్వమైన విషయమే, సందేహం లేదు. సంస్థాగత బలం, ఆర్థిక వనరులు, కమ్యూనికేషన్ సాధనాలు, నాయకత్వ నిర్మాణం మొదలైన అంశాలలో ఈ బీజేపీకి సమస్థాయి పార్టీ మరేదీ లేదు. ఎన్నికలలో బీజేపీ సాధిస్తున్న అప్రతిహత విజయాలకు ఆ శక్తి సామర్థ్యాలే కారణమని అంగీకరించవలసి ఉన్నది. అయితే ఆ ఘన విజయాలు ఒక కొత్త రాజకీయ తర్కాన్ని కూడా సృష్టించాయి. ఎన్నికల్లో విజయం సాధించడం ఇంకెంత మాత్రం అధికారంలో కొనసాగేందుకు ఒక మార్గం కాదు. దేశవ్యాప్తంగా సమస్త ఎన్నికలలోనూ విజయం సాధించడమే బీజేపీకి లక్ష్యంగా మారింది. ఈ దృక్కోణం నుంచి చూసినప్పుడు ఫిరాయింపులు కేవలం యాదృచ్ఛిక సంఘటనలు కాదు, అవి పార్టీలను స్వాధీనపరచుకునే వ్యూహాలు.
ఫిరాయింపులు జరిగిన పద్ధతిని చూడండి.. జ్యోతిరాదిత్య సింధియా, ఆయన విధేయులు కాంగ్రెస్ నుంచి నిష్క్రమించిన తరువాత మధ్యప్రదేశ్‌లో ఆ పార్టీ ప్రభుత్వం పడిపోయింది. మహారాష్ట్రలో శివసేన తొలి చీలికను చవిచూసింది. ఆ తరువాత ఎన్సీపీ చీలిపోయింది. ఈశాన్య రాష్ట్రాలలో ప్రత్యర్థి పార్టీల నాయకులు, శాసనసభ్యులను చేర్చుకోవడం ద్వారా బీజేపీ అక్కడ క్రమంగా విస్తరించింది. ఇప్పుడు పలు ఈశాన్య రాష్ట్రాలలో అధికారంలో ఉన్నది. శాసనసభలలో సంఖ్యా బలాన్ని పెంచుకోవడం కంటే ప్రత్యర్థి పార్టీలను అన్ని విధాలా దెబ్బతీయడమే బీజేపీ అసలు లక్ష్యం. భవిష్యత్తులో తనకు ఏ విధమైన సవాళ్లూ రాకుండా ఉండేందుకు బీజేపీ చాలా పకడ్బందీగా వ్యవహరిస్తోంది. సైద్ధాంతిక నిబద్ధత, కార్యకర్తల విధేయత పరిపూర్ణంగా ఉన్న పార్టీ తమది అని ఒకప్పుడు సగర్వంగా చెప్పుకున్న బీజేపీ, ఇప్పుడు ప్రత్యర్థి పార్టీల నాయకులు, కార్యకర్తలను పెద్ద ఎత్తున చేర్చుకుంటున్నది. భారతీయ జనతా పార్టీ నిజానికి ‘భర్తీ జనతా పార్టీ’ అని పలువురు వ్యంగ్యంగా విమర్శిస్తున్నారు. ఈ పరిహాసంలో సత్యం ఉన్నది.
వాజపేయి నాయకత్వంలో బీజేపీ ఇతర పార్టీలతో పొత్తులు, సామాజిక సంకీర్ణాలు, ఓటర్లను ఆకట్టుకోవడం ద్వారా విస్తరించింది. ప్రజలను ఒప్పించడం ద్వారానే రాజకీయ విస్తరణ సాధ్యమని వాజపేయి విశ్వసించారు. అయితే మోదీ–షాల నేతృత్వంలోని బీజేపీ రాజకీయ విస్తరణకు ఎమ్ అండ్ ఏ (మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్) నమూనాను అనుసరిస్తోంది. నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను పార్టీలో చేర్చుకోవడం, కొన్ని సందర్భాలలో పార్టీలకు పార్టీలనే కలుపుకోవడం ద్వారా విస్తరిస్తోంది. వాజపేయి, మోదీ నమూనాలు రెండిటికీ పార్టీ పెరుగుదలే లక్ష్యం. అయితే అందుకు అనుసరించిన పద్ధతులు మౌలికంగా భిన్నమైనవి.
రాజకీయవేత్తలు సాధారణంగా విజయవంతమైన పార్టీల వైపు ఆకర్షితులవుతారని బీజేపీ మద్దతుదారులు వాదిస్తారు. ఈ వాదన నిస్సందేహంగా నిజమే. అయితే ఇది ఒక రాజకీయ శూన్యంలో సంభవించడం లేదు. మోదీ సర్కార్ తమ నాయకులపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతుందని, ఆర్థిక ఒత్తిళ్లకు లోనుచేస్తుందని, విధేయతలు మార్చుకున్నవారికి ప్రోత్సాహకాలు కల్పిస్తుందని ప్రతిపక్షాలు తరచూ ఆరోపిస్తున్నాయి. అవినీతి ఆరోపణలు ఉన్న విపక్ష నాయకులు బీజేపీలో చేరితే వారికి ఆ పార్టీ చట్టం నుంచి రక్షణ కల్పిస్తుందనే భావన ప్రజలలో నెలకొనడానికి సహేతుకమైన కారణాలు ఉన్నాయి. ప్రభుత్వ సంస్థల, రాజ్యాంగ వ్యవస్థల నిష్పాక్షికత పైనే కాకుండా ఆ నిష్పాక్షికతపై ప్రజల పరిపూర్ణ నమ్మకంపై కూడా ప్రజాస్వామ్య వ్యవస్థల మనుగడ ఆధారపడి ఉన్నది. అయితే ఇప్పుడు ఆ సంస్థల, వ్యవస్థల నిష్పాక్షికతలో ప్రజల విశ్వాసం హరించుకుపోతోంది. ఫిరాయింపుల వ్యతిరేక చట్టాన్ని చాలా తెలివిగా ఉల్లంఘించడం జరుగుతోంది. ఇటీవల బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు త్రిపురకు చెందిన ఒక అనామక పార్టీలో చేరడమే అందుకొక నిదర్శనం. న్యాయవ్యవస్థ సైతం ఫిరాయింపుల వ్యతిరేక కేసులలో నిర్ణయం తీసుకోవడంలో చేస్తున్న జాప్యం ఆ అక్రమ చర్యలను నిరోధించడానికి దోహదం చేయడం లేదు.
పౌరులు ఓటు వేసినప్పుడు ఒక అభ్యర్థిని తమ ప్రతినిధిగా ఎన్నుకోవడమే కాకుండా ఒక రాజకీయ పార్టీని, దాని ప్రణాళికను అంగీకరిస్తున్నారు. పాలనకు దిశా నిర్దేశంగా ఒక రాజకీయ దార్శనికతను ఆమోదిస్తున్నారు. మరి ఎన్నికల అనంతరం గెలిచినవారి ఎత్తుగడలు పౌరుల అభీష్టాన్ని వమ్ము చేస్తున్నాయి. ఇది న్యాయమేనా? రాజకీయ పునరేకీకరణలకు వ్యతిరేకంగా చేస్తున్న వాదన కాదు ఇది. పార్టీల ప్రాధాన్యాలు మారుతుంటాయి. నాయకులు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటుంటారు. సైద్ధాంతిక విశ్వాసాలతో కాకుండా అధికార లాలసతో ఫిరాయింపులు మామూలు వ్యవహారమయినప్పుడు ప్రజాస్వామ్యం భావాల సంఘర్షణకు ఆస్కారమివ్వదు; రాజకీయ ఆస్తుల విపణిగా పరిణమిస్తుంది.
బెంగాల్, మహారాష్ట్రలో ఫిరాయింపులకు పాల్పడినవారు తమను ఒక రాజకీయ వేలంలో అమ్ముడుపోయినవారుగా ప్రజలు భావిస్తారనే విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదు. ప్రజలు తమను ఛీ కొడతారనే భయం ఆ ఫిరాయింపుదారులకు ఏ మాత్రం లేదు. అసలు రాజకీయ సంస్కృతే పార్టీ ఫిరాయింపులకు అనుకూలంగా ఉన్నప్పుడు ప్రజలకు ఎందుకు భయపడాలి? చెప్పవచ్చినదేమిటంటే ఫిరాయింపులకు నైతిక సమర్థింపు, న్యాయ సమ్మతి ఇంకెంత మాత్రం అవసరం లేదు. అధికార సాధనలో సఫలమవడమే ముఖ్యం. ఎలా అందలాలు ఎక్కారన్నది ఎవరూ పట్టించుకోని చాలా అప్రధాన వ్యవహారమే సుమా!
స్వాతంత్ర్య శతాబ్దికి వడివడిగా సాగుతున్న నేటి భారతదేశంలో ఫిరాయింపులు అనేవి ఇంకెంతమాత్రం రాజకీయ నాయకులు పార్టీలు మారే సాధారణ వ్యవహారం కాదు. ఫిరాయింపుల అనైతికతతో రాజకీయ సంస్కృతే సమూలంగా మారిపోయింది: రాజకీయాలు సైద్ధాంతిక నిబద్ధత కోల్పోయి వ్యాపార వ్యవహారాలయ్యాయి; ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం కంటే స్వార్థ ప్రయోజనాలకు పార్టీలు మారడం సాధారణమైపోయింది; ప్రజలను ఒప్పించి ఓట్లు, సీట్లు సాధించడం కాకుండా ఇతర పార్టీల తరఫున గెలిచిన వారిని ప్రలోభాలతో వశపరచుకుని చట్టసభలలో సంఖ్యా బలం పెంచుకోవడానికి నాయకులు ప్రాధాన్యమిస్తున్నారు. కార్పొరేట్ సంస్థలు కంపెనీలను స్వాధీనం చేసుకున్న విధంగా రాజకీయ పార్టీలు ధనబలంతో శాసనసభ్యుల మద్దతును కూడగట్టుకోవడం ప్రజాస్వామిక తీర్పును అపహాస్యం చేస్తోంది. నాయకుల, పార్టీల అనైతిక వ్యవహారాల ఫలితంగా ఎన్నికలు రాజకీయ బేరసారాలకు మొదటి వేలంపాట (ఓపెనింగ్ బిడ్)గా మారిపోయాయి.
రాజ్‌దీప్ సర్దేశాయి
(వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్)
ఈ వార్తలనూ చదవండి:
పరువు నష్టం కేసు.. రాహుల్ గాంధీ విచారం
వెలుగులోకి సంచలన విషయాలు.. హత్య ఎలా చేయాలో ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసి..