ప్రతిపక్షమా.. నిన్ను నీవు చదువుకో!
ABN , Publish Date - May 07 , 2026 | 02:33 AM
నడుస్తున్న చరిత్రలో ఎన్నికల ప్రకరణం ఒకటి ముగిసింది. భారత ప్రజాస్వామిక ప్రతిపక్షానికి ఒక పరీక్షా ఘట్టం ప్రారంభమయింది. అవును, ప్రతిపక్షం ఆత్మశోధన చేసుకోవల్సిన సమయమిది. కఠోర సత్యాలను...
నడుస్తున్న చరిత్రలో ఎన్నికల ప్రకరణం ఒకటి ముగిసింది. భారత ప్రజాస్వామిక ప్రతిపక్షానికి ఒక పరీక్షా ఘట్టం ప్రారంభమయింది. అవును, ప్రతిపక్షం ఆత్మశోధన చేసుకోవల్సిన సమయమిది. కఠోర సత్యాలను ఎదుర్కోవల్సిన సందర్భమిది. ప్రశ్నలు, నిస్సంశయంగా కఠిన ప్రశ్నలు, మనస్తాపం కలిగించే ప్రశ్నలు వేసుకోవల్సిన అగత్యమిది.
రెండు సంవత్సరాల క్రితం లోక్‌సభ ఎన్నికలలో ప్రజల తీర్పు ఆశ్చర్యకరంగా ప్రతిపక్షానికి ఒక అవకాశాన్ని సమకూర్చింది. అయితే తదాది ఆ అవకాశం అంతకంతకూ కృశించిపోతోంది. ఇప్పుడు పూర్తిగా లేకుండా పోయింది. జాతీయ ఆధిపత్యం, సంపూర్ణ అధికారం అనే తన దీర్ఘకాలిక లక్ష్యసాధనలో భారతీయ జనతా పార్టీ ఒక ప్రముఖ మైలురాయిని దాటింది. పశ్చిమ బెంగాల్‌ను బీజేపీ చరిత్రాత్మకంగా గెలుచుకోవడం గురించి నేను ప్రస్తావిస్తున్నాను. అది బీజేపీకి ఒక గొప్ప ముందడుగు, సందేహం లేదు. అయితే వర్తమాన భారతదేశ ఎన్నికల సమగ్రతకు (ఇంకా ఏమైనా మిగిలివుంటే) అదొక తిరుగులేని తిరోగతి కూడా. ఈ చివరి రెండు మాటలలోని నామవాచకాన్ని మనసును స్థిమితం చేసుకుని అంగీకరిద్దాం; దానికి ముందున్న విశేషణం శాశ్వత నిజం కాబోదని ఆశిద్దాం, కాకుండా ఉండేందుకు సంకల్పిద్దాం.
కేరళ, తమిళనాడు ఎన్నికల ఫలితాలు ఆ కఠోర సత్యం నుంచి మన దృష్టిని మళ్లించలేవు. కేరళలో జరిగిందేమిటి? పదేళ్ల క్రితం వరకూ ప్రతి ఐదేళ్లకొకసారి ఓటర్లు ప్రత్యామ్నాయ పార్టీని ఎన్నుకుంటూ ఉండేవారు. అలా కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ లేదా సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ ప్రతి ఐదేళ్లకొకసారి ప్రత్యామ్నాయంగా అధికారంలోకి వస్తుండేవి. ఏ ఒక్క కూటమీ వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చేది కాదు. 2021లో ఎల్‌డీఎఫ్ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. 2026లో ఆ అరుదైన ఆనవాయితీకి భంగం కలిగింది. ఈసారి యూడీఎఫ్ అధికారంలోకి వచ్చింది. అంటే కేరళ రాష్ట్ర విశిష్ట రాజకీయ సంప్రదాయం –ప్రతిసారీ ప్రత్యామ్నాయ పార్టీని ఎన్నుకోవడం– పునరుద్ధరణ అయింది. ఇది శుభ పరిణామమే. ఎల్‌డీఎఫ్ ప్రభుత్వ పాలన పట్ల ప్రజల అసంతృప్తి ఈ ఎన్నికల తీర్పులో పూర్తిగా ప్రతిబింబించింది.
తమిళనాడులో విజయ్ టీవీకే మహావిజయం ఆశ్చర్యకరం. వర్తమాన భారతదేశంలో నిజమైన అద్భుత రాజకీయ పరిణామమది. అయితే మరొక రాష్ట్రంలో సుసాధ్యంకాని సఫల నమూనా అది. డీఎంకే సర్వాధిపత్యం తమిళులకు వెగటు కలిగించింది. ప్రత్యామ్నాయానికి ఆరాటపడ్డారు. చీలికలతో కునారిల్లి, మళ్లీ సుసంఘటితమైన అన్నాడీఎంకే తాము కోరుకునే ప్రత్యామ్నాయ పాలననందించలేదని తమిళులు భావించారు. పైగా, తమిళనాడు రాజకీయ సంస్కృతికి విరుద్ధంగా వ్యవహరించే బీజేపీతో అన్నాడీఎంకే అంటకాగడాన్ని తమిళులు సుతరామూ అంగీకరించలేకపోయారు. ద్రావిడ భావజాలాన్ని గౌరవిస్తూ డీఎంకే రాజకీయ నమూనాకు భిన్నంగా ఉండే పార్టీని తమిళ ఓటర్లు కోరుకున్నారు. ఎమ్‌జీఆర్ స్ఫూర్తితో ఆయన బాటలో నడయాడుతూ ప్రజారంగంలోకి వచ్చిన తమ ఆరాధ్య నటుడు విజయ్ పార్టీకి పట్టంకట్టి తమిళ ప్రజలు కొత్త చరిత్రకు నాంది పలికారు. డీఎంకే తన ‘రాజకీయ ప్రత్యర్థి’ అని, బీజేపీ ‘భావజాల విరోధి’ అని స్పష్టం చేస్తూ తాను సదా పెరియార్, కామరాజ్, అంబేడ్కర్ ఆదర్శాల స్ఫూర్తితో వారి అడుగుజాడల్లో నడుస్తానని విజయ్ ప్రకటించడం తమిళ ప్రజలను బాగా ఆకట్టుకున్నది. తమిళ రాజకీయాల స్వతస్సిద్ధ సంప్రదాయాలకు సరికొత్త విశిష్ట ప్రతీకగా భాసిల్లిన విజయ్‌కు అధికారం అప్పగించేందుకు తమిళులకు అభ్యంతరం లేకపోయింది. పర్యవసానమే తమిళనాట పెనుమార్పు.
అసోంలో బీజేపీకి లబ్ధి సమకూరేలా నియోజకవర్గాల సరిహద్దులను ఎన్నికల సంఘం మార్చివేసింది. ఆ నియోజకవర్గాల పునర్విభజన మత ప్రాతిపదికన జరిగిందన్నది ఒక చేదు సత్యం. భారతదేశ ఎన్నికల చరిత్రలో మున్నెన్నడూ సంభవించని పరిణామమది. ఆ కారణంగానే ఎవరూ ఓటు వేయకముందే పది సీట్లను బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. సరే, ముఖ్యమంత్రి హిమంతశర్మ వాగ్ఝరిలో మతవిద్వేషం కాక మరేముంటుంది? ‘మియాన్’ సామాజికవర్గానికి వ్యతిరేకంగా ఆయన పేలిన అవాకులు చెవాకులను ఎన్నికల సంఘమేకాదు, సర్వోన్నత న్యాయస్థానమూ మౌనంగా వింటూ ఉండిపోయింది. మరి ప్రతిపక్షం ఏమి చేసింది? ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. పాలక పక్షంపై పోరాడేందుకు రాజకీయ సంకల్పం చూపిందా? లేదు. ముఖ్యమంత్రిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. వాటిపై ఆయనను నిలదీసిందా? లేదు కదా. గాయకుడు జుబిన్ గర్గ్ మరణం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక భావోద్వేగ అంశమయింది. ప్రతిపక్షం ప్రతిస్పందన ఏమిటి? సత్యశోధన చేసి ఆ గాయకుడి అభిమానులకు ఊరట కల్పించిందా? సరి సరి. పాలక పక్షాన్ని ఎదుర్కోవడంలో అసోం ప్రతిపక్షం వ్యవహరించిన వైనం ఎన్నికల్లో ఓడిపోవడం ఎలా అనే విషయానికి ఒక ప్రశస్త పాఠ్యపుస్తకం సుమా!
బెంగాల్‌లో ప్రతిపక్షం అసోం విపక్షం వలే బలహీనంగా లేదు. బీజేపీకి బలమైన సవాల్ విసరలేదని మమతా బెనర్జీని ఎవరూ ఆక్షేపించలేరు. ఆమెకు ఒక స్పష్టమైన వ్యూహం ఉన్నది; దానిని పటిష్ఠంగా అమలుపరచగల సామర్థ్యమూ ఉన్నది; ఎదురులేకుండా దూసుకొస్తోన్న బీజేపీని నిలువరించగల తృణమూల్ కాంగ్రెస్ రూపేణా సంస్థాగత శక్తియుక్తులూ ఉన్నాయి. నిజమే, బెంగాల్‌లో ప్రతిపక్షాలు సమైక్యంగా లేవు. అయితే ఈ ప్రతికూల పరిస్థితి మమతకు అనుకూలతగా పరిణమించింది. వామపక్షాలు వేర్వేరుగా పోటీ చేశాయి. ఇక కాంగ్రెస్‌తో మమత పార్టీకి వాటిల్లిన నష్టం స్వల్పమైనదే.
వాస్తవాలను అవును.. కఠోర వాస్తవాలను సూటిగా, నిశితంగా చూద్దాం. డొంక తిరుగుడుగా కాకుండా నిక్కచ్చిగా చెప్పుకుందాం. ‘ప్రభుత్వ వ్యతిరేకత’ అనేది గణనీయంగా లేనిపక్షంలో మమతకు, ఆమె పార్టీకి అటువంటి పరాజయాలు సంభవించి ఉండేవేనా? మమత పాలన తీరుతెన్నులపై ఓటర్లలో అవధులు మీరిన అసంతృప్తి ఉన్నది, గూడుకట్టుకున్న ఆందోళనగా వారి మనోభావాలు ఉన్నాయి. ప్రజల అంతరంగాన్ని మమత అర్థం చేసుకోలేదా? గ్రహించారు కానీ, అది తనకు వ్యతిరేకంగా తుపాను సదృశంగా చెలరేగి ఉగ్రతాండవం చేయగలదని ఊహించలేకపోయారు. రాజకీయాలలో తప్పుడు అంచనాలు జారుడుమెట్లే సుమా! పెల్లుబికిన ప్రజాగ్రహం మమతకు వ్యతిరేకంగా కాకపోవచ్చు. నిజమే. అయితే, మమతను ఆమె పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌ను విడివిడిగా చూడడం సబబేనా? అధికార ప్రాభవంతో ఆ పార్టీ స్థానిక నాయకుల వ్యవహరణ వైనాలే మమతకు నష్టదాయకమయ్యాయి. పైగా పాలనా నాణ్యత ప్రశస్తంగా లేకపోవడాన్ని ప్రజలు ఎంతకాలం క్షమిస్తారు? మమత పరిపాలన కంటే అధ్వాన పాలన ఉన్న కొన్ని ఇతర రాష్ట్రాలలో ప్రజలు తమ ప్రభుత్వాలను ఇంతగా శిక్షించలేదు. బెంగాల్ కథ వేరు. మమతపై కానవచ్చిన జనాగ్రహాన్ని బీజేపీ, ఆ పార్టీ విధేయ మీడియా చక్కగా వినియోగించుకున్నాయి. ఆమె పాలనలోని గోరంత లొసుగులనూ కొండంతలు చేశాయి; తృణమూల్ కాంగ్రెస్‌పై రాజకీయ మెరుపుదాడులు చేశాయి. చెప్పవచ్చినదేమిటంటే ప్రతిపక్షమూ తన సొంత పాలనా చరిత్రపై నిజాయితీగా ఆత్మపరీక్ష చేసుకోవాలి. ఇది కేవలం పశ్చిమ బెంగాల్‌లో మాత్రమే కాదు, పంజాబ్, కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రతిపక్ష ప్రభుత్వాలు తమ పాలన ప్రజాశ్రేయస్సుకు దోహదం చేస్తుందో లేదో ఒక్కసారి నిష్పాక్షికంగా అవలోకన చేసుకోవాలి. జాతీయ స్థాయిలో బీజేపీ మహాశక్తితో తలపడేందుకు కొత్త ప్రణాళికలు రూపొందించుకునే లోగానే ఈ ఆత్మశోధన జరిగితీరాలి.
పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు సంబంధించిన ఒక బాధాకర, ఆందోళనకర సత్యాన్ని మనం అంగీకరించాలి. బెంగాల్ ఎన్నికల ఫలితం ప్రజాసంకల్పానికి ఒక సహజ ప్రతిబింబం కాదు. ఆ రాష్ట్రంలో బీజేపీ విజయం కేంద్ర ప్రభుత్వ, ఎన్నికల సంఘం విశేష ప్రమేయంతో ముందుగా నిర్ణయించిన ఫలితం అని నిష్కర్షగా చెప్పక తప్పదు. ఎందుకని? రాజ్యాంగ సంస్థ ఎన్నికల సంఘం తన విధ్యుక్త ధర్మ నిర్వహణలో తటస్థంగా వ్యవహరించలేదు. నిష్పాక్షికత కొరవడడంతో ఎన్నికల సమగ్రత కళంకితమయింది. 2024 లోక్‌సభ ఎన్నికలలో వాటిల్లిన పరాజయాలతో బీజేపీ బెంగాల్‌లో ఒక అవ్యవస్థకులోనైంది. తృణమూల్ కాంగ్రెస్‌తో తలపడే పరిస్థితి బీజేపీకి లేకపోయింది. అయితే కేంద్ర ప్రభుత్వమూ, సానుకూల మీడియా బెంగాల్ బీజేపీకి అండగా నిలబడ్డాయి. మమత ప్రభుత్వానికి నిధుల కొరత ఏర్పడేలా కేంద్రం చేయవలసినవన్నీ చేసింది. గ్రామీణ ఉపాధి హామీ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన మొదలైన సంక్షేమ పథకాలను దాదాపుగా నిలిపివేసింది. మరింత స్పష్టంగా చెప్పాలంటే సంక్షేమ వ్యయాలకు మమత ప్రభుత్వం కటకటలాడిపోయేలా చేసింది. ఇక బీజేపీ విషపూరిత మతతత్వ ప్రచారాన్ని ముమ్మరం చేసినా ఎన్నికల సంఘం మౌనంగా ఉండిపోయింది. ఈ మత విద్వేష ప్రచారం అసోంలో కంటే బెంగాల్‌లోనే తీవ్రంగా జరిగింది. మరీ ముఖ్యంగా ఎన్నికల సంఘం మరే రాష్ట్రంలోనూ చేపట్టని అసాధారణ చర్యలు కొన్నిటిని బెంగాల్‌లో అమలుపరిచింది. వాటిలో భాగంగా తాము ఓటు హక్కుకు పూర్తిగా అర్హులమని సమస్త ధ్రువీకరణ పత్రాలు సమర్పించిన 27 లక్షల మంది ఓటర్ల పేర్లను ఓటర్ జాబితాల నుంచి తొలగించింది! ప్రతి స్వతంత్ర విచారణలోనూ ఈ తొలగింపులు ఎంతమాత్రం సక్రమమైనవి కావని నిర్ధారణ అయింది. అంతేకాదు, నిర్దిష్ట వర్గాల ఓటర్లను లక్ష్యంగా చేసుకుని వారి పేర్లను తొలగించినట్టు స్పష్టమయింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అయిన మొత్తం ఓట్లలో 4.3 శాతంగా ఆ తొలగింపులు లెక్కలోకి వస్తాయి. తృణమూల్ కాంగ్రెస్‌పై బీజేపీ ఓట్ల ఆధిక్యత 4.6శాతం. ఈ వాస్తవం దృష్ట్యా ఒక ప్రశ్న అనివార్యంగా తలెత్తుతోంది: ఆ 27 లక్షల మంది పౌరులను ఓటు వేసేందుకు అనుమతించి ఉన్నట్టయితే ఎన్నికల ఫలితాన్ని ఆ నిర్ణయం ఏ విధంగా ప్రభావితం చేసి ఉండేది? ప్రతిపక్షం కలసికట్టుగా ఎదుర్కోవలసిన కఠోర ప్రశ్న అది.
యోగేంద్ర యాదవ్
(వ్యాసకర్త ‘స్వరాజ్ ఇండియా’ అధ్యక్షుడు)
ఇవి కూడా చదవండి..
విజయ్ టీవీకేతో కాంగ్రెస్ పొత్తుపై కనిమొళి కీలక వ్యాఖ్యలు
సంఖ్యా బలం కావాలి.. విజయ్‌కు గవర్నర్ అనుమతి నిరాకరణ