Share News

ఏది ప్రతిపక్షం? ఏది అధికారపక్షం? అంతా మిథ్య!

ABN , Publish Date - Jun 18 , 2026 | 04:00 AM

‘విపక్షాలకు ఒకే మాట, ఒకే బాట ఏదీ?’ అన్న వ్యాసం (జూన్ 10) చూశాక, దానిలో వ్యాసకర్త ఎ.కృష్ణారావు ప్రస్తావించిన రెండు విషయాల గురించి రాయాలనిపించింది: 1) తన పాలన మీద విమర్శలు..

ఏది ప్రతిపక్షం? ఏది అధికారపక్షం? అంతా మిథ్య!

‘విపక్షాలకు ఒకే మాట, ఒకే బాట ఏదీ?’ అన్న వ్యాసం (జూన్ 10) చూశాక, దానిలో వ్యాసకర్త ఎ.కృష్ణారావు ప్రస్తావించిన రెండు విషయాల గురించి రాయాలనిపించింది: 1) తన పాలన మీద విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ, ప్రధాని మోదీ ‘రాజకీయ మహాబలుడు’గా సుస్థిరం కావడం గురించి. 2) తమ మధ్య వైరుధ్యాలను తొలగించుకోలేని ప్రతిపక్షాల బలహీనత గురించి. వ్యాసకర్త ఎత్తి చూపిన ఈ రెండు విషయాలూ కళ్లముందున్న వాస్తవాలే! ఇదే వాస్తవాన్ని, రాజ్‌దీప్ సర్దేశాయ్ వ్యాసం కూడా ఎత్తి చూపింది. (జూన్ 13). అయితే, అవి అలా ఉండడానికి కారణాలను వివరించే ప్రయత్నమే ఈ వ్యాసం.

ఆ కారణాలను తెలుసుకోవడానికి, రెండు ప్రశ్నలకు జవాబులు వెతకాలి: 1) పెట్టుబడిదారీ సమాజంలో ఒక దేశ ప్రధాని రాజకీయంగా మహాబలుడుగా స్థిరపడడానికి కారణాలేమిటి? 2) వర్గాలుగా చీలిన సమాజంలో రాజకీయ పార్టీలనేవి ఏ వర్గాల ప్రయోజనాల కోసం పనిచేస్తాయి? ఈ రెండు ప్రశ్నలకూ సంతృప్తికరమైన జవాబులు ఇవ్వాలంటే, దేశంలో ఉన్న ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితులను వివరించాల్సి ఉంటుంది. అదంతా యూనివర్సిటీ పరిశోధనల్లోనే సాధ్యం, పత్రికా వ్యాసాల్లో కాదు. అందుకే, ఈ రెండు ప్రశ్నలకూ ఇక్కడ క్లుప్తంగా మాత్రమే జవాబులు చెప్పుకోగలం.

మొదటి ప్రశ్నకు జవాబు: ఏ దేశంలోనైనా, అతిపెద్ద పెట్టుబడిదారీ సంస్థల ప్రతినిధుల్లో, ఎక్కువ మందికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకోగలిగే అధికార పార్టీ నాయకుడే మహాబలుడుగా నిలుస్తాడు. ఉదాహరణకు, ప్రధాని మోదీ మీద, దేశంలో అతిపెద్ద పెట్టుబడిదారీ కుబేరుల అభిప్రాయం వినండి.

ముఖేశ్‌ అంబానీ: ‘‘భారతదేశాన్ని గొప్పదనం వైపు నడిపించడానికి, భగవంతుడు పంపిన అవతార పురుషుడు ప్రధాని మోదీ’’ (ఎకనామిక్ టైమ్స్, 17–9–2025).

గౌతమ్‌ అదానీ: ‘‘మన్మోహన్‌సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, భారతదేశ పురోగతి విమానం ఎగరడానికి ముందు వేగంగా ముందుకు కదలడానికి కావలిసిన ‘రన్ వే’ లాగా ఉండేది. మోదీ ప్రధానిగా ఉన్న ఈ పదేళ్లలో, ఆకాశంలోకి దూసుకెళ్లే విమానం లాగా తయారైంది’’ (హిందూస్థాన్ టైమ్స్, 19–1–2024).


అయితే, ఈ కుబేరులు, గురజాడ మాటల్లో చెప్పాలంటే, కేవలం ‘‘వట్టి మాటలతో’’ సరిపెట్టక ‘‘గట్టి మేల్’’ తలపెట్టారు కూడా. వీరి ఆధీనంలో ఉన్న అనేక కంపెనీల ద్వారా మోదీ నాయకుడిగా ఉన్న బీజేపీకి, ఎన్నికల బాండ్ల రూపంలో అనేక వందల కోట్ల రూపాయల చందాలు ఇచ్చినట్టు ఎన్నికల కమిషన్ ద్వారా బైటకొచ్చిన సమాచారం. ఇలా చందాలిచ్చే కుబేరులకు భాషా భేదాలూ, ప్రాంతీయ భేదాలూ ఉండవు. ఉదాహరణకు, మోదీకి చందాలు ఇచ్చిన అంబానీ, అదానీలు గుజరాతీలు కావొచ్చు. కానీ, ఒక తెలుగు కుబేర కంపెనీ ఇతర పార్టీలకు ఇచ్చినదాని కంటే ఎక్కువ మొత్తంలో బీజేపీకి చందా ఇచ్చింది (హిందూ, 22–3–2024). ఏ రాజకీయ పార్టీ ఎంత గట్టిగా తమ వ్యాపార ప్రయోజనాలను కాపాడే ఆర్థిక విధానాలను అమలు చెయ్యగలదో, దాన్నిబట్టి, ఆ పార్టీలకు చందాలిస్తారు. ఆ ప్రయోజనాలను బాగా కాపాడగలిగే పార్టీల నాయకులే ‘మహా బలులు’ అవుతారు. ‘‘అందరితో కలిసి, అందరి అభివృద్ధి కోరి, అందరి నమ్మకాన్ని చూరగొనడమే నా మహత్తర ఆశయం’’ అనే నాయకుడి మాటల్ని, వర్గ చైతన్యం లేని ఓటర్లలో ఎక్కువ మంది నమ్మినప్పుడు, ఆ నాయకుడు, ‘అవతార పురుషుడు’గానూ, ‘మహాబలుడు’గానూ స్థిరపడతాడు.

రెండో విషయం: ప్రతిపక్ష పార్టీలు ఒకే మాటమీద, ఒకే బాటలో ఎందుకు లేవంటే, ఈ పార్టీలన్నీ, ఆస్తి కోసం అన్నదమ్ములు పోట్లాడుకున్నట్టు, అధికారం కోసం, దానిలో వాటాల కోసం పోట్లాడుకుంటాయి. వేరువేరు పెట్టుబడిదారులు, తాము పెట్టిన పెట్టుబడులకు, అప్పటికి ఉన్న సగటు శాతం లాభాలు వచ్చినంత కాలమూ, మంచి అన్నదమ్ములలాగే మెలుగుతారు. కానీ, ఆ సగటు లాభాలు తగ్గి, కొందరికి బాగా ఎక్కువా, కొందరికి బాగా తక్కువా వచ్చినప్పుడు, ‘శత్రు సోదరుల’ వలే పోట్లాడుకుంటారు! పెట్టుబడిదారీ వర్గ ప్రయోజనాలు కాపాడే రాజకీయ పార్టీలు కూడా, అధికారం కోసం అలాగే ప్రవర్తిస్తాయి. ఎందుకంటే, ప్రతిపక్ష పార్టీలకూ, అధికారంలో ఉన్న పార్టీలకూ, మూల స్వభావంలో తేడాలేమీ లేవు. అన్ని పార్టీలూ, పెట్టుబడిదారీ కంపెనీల నుంచి చందాలు పుచ్చుకునేవే! వాళ్ల ప్రయోజనాల్ని కాపాడేవే! ఉదాహరణకు, అన్ని పార్టీలూ, శ్రామిక జనాలకు నష్టం కలిగించే ప్రైవేటీకరణను, సరళీకరణను మనస్ఫూర్తిగా అమలు చేసేవే! రకరకాల నిర్బంధ చట్టాల్ని అమలు చెయ్యడమూ; అవకాశం ఉంటే, ఉన్న చట్టాలకు మరింత పదును పెట్టడమూ; లేదా, కొత్త వాటిని ప్రవేశపెట్టడమూ చేస్తాయి! ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా నిరుద్యోగ సమస్య అలానే కొనసాగుతుంది. ఏ పార్టీ అయినా విద్యా, వైద్యం, నివాసం అనే కనీస అవసరాలు తీర్చకుండా, ‘సంక్షేమ పథకాల’ పేరుతో ప్రజల్ని భ్రమల్లో ఉంచేదే! ప్రతి పార్టీ జనాల్ని కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా చీల్చి ఓట్లు దండుకునేదే! కాకపోతే ఈ పనులన్నీ అన్ని పార్టీలూ, అన్ని సమయాల్లోనూ, అన్ని ప్రాంతాలలోనూ ఒకే మోతాదులో చెయ్యవు. సింగంపల్లి అశోక్ కుమార్ అనే కవి చెప్పినట్టు: ‘‘ఎన్నికల బరిలో పులీ, తోడేలూ, డేగా, రాబందూ.../ మనకున్న చాయిస్ ఎవరికాహారం కావడమో తేల్చుకోవడం!’’ దీన్నిబట్టి, అర్థం అయ్యేదేమిటంటే, అధికార పక్షమూ, ప్రతిపక్షమూ అనే తేడా ఒక మిథ్య! ఈ విషయం పార్టీ ఫిరాయింపుల్ని చూస్తే బాగా అర్థం అవుతుంది.


పార్టీలు ఫిరాయింపుల విషయంలో, అన్ని పార్టీలదీ ఒకటే మాట! ఒకటే బాట! డబ్బులూ, పదవులూ, కాంట్రాక్టులూ– వంటి అవకాశాలు ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడికి గెంతులు. దాదాపు 50 ఏళ్ల కిందట ఈ ఫిరాయింపులు మొదలైనా, మోదీ ప్రధాని అయిన 2014 నుంచీ ఇప్పటి వరకూ, ఈ 12 ఏళ్లలో, ఫిరాయింపులూ, పార్టీల చీలికలూ చాలా మామూలయ్యాయి. ఎన్నికల సంఘం నుంచి రాబట్టిన సమాచారం ప్రకారం, 2014–2024 మధ్య కాలంలో, 14 రాజకీయ పార్టీల మధ్య, మొత్తం 1671 ఫిరాయింపులు జరిగాయి. వాటిల్లో, ఇతర పార్టీల నుంచి ఒక్క బీజేపీలోకి ఫిరాయించినవాళ్లు 426 మంది. బీజేపీ నుంచి ఇతర పార్టీలలోకి వెళ్లినవాళ్లు 144 మంది మాత్రమే. కాంగ్రెస్ పార్టీని వీడినవాళ్లు 399 మంది అయితే, ఇతర పార్టీల నుంచి ఇటు దూకినవాళ్లు 176 మంది మాత్రమే. అప్పటిదాకా, ఒకరిని ఒకరు పరమ అసహ్యంగా తిట్టుకున్న నాయకులు, నిర్లజ్జగా, ఫిరాయింపులకు పాల్పడతారు. (‘‘ఇక్కడ ఫిరాయించి అక్కడికి పోయినోడు ఎంతో/ అక్కడ ఫిరాయించి ఇక్కడికి వచ్చినోడూ అంతే!’’) ఇవన్నీ నాయకుల స్థాయి వాళ్ల లెక్కలు. వందలాదిగా ఉండే, వాళ్ల అనుచరులూ, ఇతర కార్యకర్తలూ సరేసరి! అందుకే అనేది: అధికార పక్షం–ప్రతి పక్షం అనే తేడా ఒక మిథ్య!

మరి, ప్రజలకు మరో మార్గం లేదా? ఉంది. కానీ, అది వేరే చర్చ.

నౌరోజీ

ఇవీ చదవండి:

సైబర్ నేరస్థులు 'పరాన్నజీవులు'.. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

ఐఎస్ఐ సంబంధిత ఉగ్ర ముఠా గుట్టురట్టు.. ఏడుగురి అరెస్ట్

Updated Date - Jun 18 , 2026 | 04:00 AM