Share News

ఆన్‌లైన్ ఔషధ విక్రయాలపై చిరువ్యాపారుల పోరాటం

ABN , Publish Date - May 19 , 2026 | 12:17 AM

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మనిషి అవసరాలను సులభతరం చేస్తూ సమస్తాన్ని ఇంటి ముంగిటకే తెచ్చిపెడుతోంది కానీ, ప్రాణాలతో ముడిపడి ఉన్న ఔషధాల విషయంలో మాత్రం ఈ విధానం...

ఆన్‌లైన్ ఔషధ విక్రయాలపై చిరువ్యాపారుల పోరాటం

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మనిషి అవసరాలను సులభతరం చేస్తూ సమస్తాన్ని ఇంటి ముంగిటకే తెచ్చిపెడుతోంది కానీ, ప్రాణాలతో ముడిపడి ఉన్న ఔషధాల విషయంలో మాత్రం ఈ విధానం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కేవలం లాభాలే పరమావధిగా సాగుతున్న ఈ–ఫార్మసీల ధాటికి ప్రజారోగ్యం గాలిలో దీపం అవుతోంది. సాధారణ వస్తువుల విక్రయానికి, ప్రాణరక్షక ఔషధాల విక్రయానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని విస్మరించి ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు తలుపులు బార్లా తెరవడం విచారకరం. ప్రిస్క్రిప్షన్ల వెరిఫికేషన్ లేకుండానే మందులు సరఫరా అవుతుండటంతో నకిలీ మందులు రోగి చెంతకు చేరే ప్రమాదం పొంచి ఉంది. యువత నిద్రమాత్రలు, ఇతర మత్తు పదార్థాలకు సులభంగా బానిసయ్యే అవకాశం ఉంది. ఇది యువశక్తిని నిర్వీర్యం చేస్తూ జాతి భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతుంది. మరోవైపు, భారీ డిస్కౌంట్ల పేరుతో బహుళజాతి కంపెనీలు సాగిస్తున్న ఈ వ్యాపార పోకడల వల్ల దేశవ్యాప్తంగా ఉన్న 12.40 లక్షలకు పైగా చిరు వ్యాపారుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. చదువురాని పేద రోగులకు ఆన్‌లైన్ ఆర్డర్లు ఒక భారంగా మారుతుంటే, స్థానిక కెమిస్టులు అందించే కౌన్సెలింగ్, భద్రత ఈ విధానంలో మృగ్యమవుతున్నాయి.

ఈ ప్రమాదకర ధోరణులను నిరసిస్తూ ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్స్ పిలుపు మేరకు మే 20న దేశవ్యాప్త మెడికల్ షాపుల బంద్ జరుగనుంది. కేవలం వ్యాపార లాభాల కోసమే కాకుండా, ప్రిస్క్రిప్షన్ వెరిఫికేషన్ చూడకుండా మందులు అమ్మే ఆన్‌లైన్ పద్ధతి వల్ల ప్రజల ప్రాణాలు బలికాకూడదన్నదే ఈ నిరసన వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం. ఇప్పటికే అనేకచోట్ల ఆన్‌లైన్ ఆర్డర్ల ద్వారా నాణ్యత లేని మందులు సరఫరా అవుతున్న సంఘటనలు వెలుగుచూస్తుండగా, ప్రభుత్వం ఈ– ఫార్మసీ విధానాన్ని ప్రోత్సహించడం ప్రజా శ్రేయస్సుకు గొడ్డలిపెట్టు. అత్యవసర మందుల అవసరం ఉన్న రోగులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కలిగిన ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ–ఫార్మసీ విధానాన్ని నియంత్రించాలి. అలాగే ఔషధ రంగంలో బహుళజాతి సంస్థల పెత్తనాన్ని నిలువరించి, విద్య, వైద్యం లాభాపేక్ష లేని సేవలుగానే కొనసాగేలా చూడాలి.

యండి. ఉస్మాన్‌ఖాన్

ఇవి కూడా చదవండి..

మహిళలకు ఫ్రీ బస్సు, సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక శాఖ.. సీఎం సతీశన్

అన్నాడీఎంకేలో అంతర్గత పోరు.. సీనియర్ నేత సెమ్మలై రాజీనామా

Updated Date - May 19 , 2026 | 12:17 AM