రానున్నది కృత్రిమ మేధో యుగం!
ABN , Publish Date - Feb 28 , 2026 | 01:31 AM
దక్షిణార్ధగోళంలోని ప్రపంచ దేశాల్లోనే తొలిసారి నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి ఏఐ సదస్సు ఢిల్లీలో జరగడం భారత్‌కు తలమానికం. ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్ని ప్రభావితం చేసే శక్తి కృత్రిమ...
దక్షిణార్ధగోళంలోని ప్రపంచ దేశాల్లోనే తొలిసారి నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి ఏఐ సదస్సు ఢిల్లీలో జరగడం భారత్‌కు తలమానికం. ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్ని ప్రభావితం చేసే శక్తి కృత్రిమ మేధకు ఉంది. అందుకు తగినట్టుగా వ్యక్తులు, సమాజం తయారుకావాలి. రానున్న మార్పుల్ని పసిగట్టి అవకాశాల్ని ఒడిసిపట్టాలి. లేదంటే ఇంతవరకూ బలమైనవిగా భావించబడుతున్న దేశాలు బలహీనమవుతాయి. సరిగ్గా వినియోగించుకోగలిగిన దేశాలు బలం పుంజుకుంటాయి. ఈ మార్పుల్ని ముందే ఊహిస్తూ అమెరికా, చైనా దేశాలు కృత్రిమ మేధ పరిశోధనలపై అధికంగా ఖర్చు పెడుతున్నాయి. అక్కడి ప్రైవేట్ రంగం కూడా అదే దారిలో ఉంది. ఫలితంగా చాట్ జీపీటీ, డీప్ సీక్ లాంటివి జనంలోకి వచ్చాయి. మన దేశం కూడా ఈ అంశంపై ఇప్పటికే దృష్టి పెట్టినా, బలోపేతం కావడానికి సమయం పడుతుంది. దానికి కారణం సంస్థాగత లోపాలు. ముఖ్యంగా నిధుల కొరత, నాణ్యమైన, చవకైన ఉన్నత విద్య అందుబాటులో వెనకంజ. అందుకే మనం దేశ పునాదులను దృఢపరచుకోవాల్సి ఉంది. మౌలికంగా అవసరమయ్యే డేటా సెంటర్‌లు, బహుళజాతి పెద్ద సంస్థలు భారత్‌లో పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడానికి ముఖ్య కారణం– వారికి ఇక్కడ చవకగా సదుపాయాలు, వనరులు కల్పించడం. ఏదైతేనేం, ఆ సంస్థలు వచ్చాక కలిగే ఫలాలు దేశ ఖజానా నింపడంతోపాటు, ప్రజల సౌకర్యాలు, ఉపాధి పెరిగే పరిస్థితిని కలిగిస్తేనే ఫలితం ఉన్నట్లు భావించాలి.
దేశం కేవలం ఏఐ వినియోగ మార్కెట్‌గా మిగిలిపోకుండా సేవలందించే, ప్రయోజనం పొందే శక్తిగా మారాలి. వ్యవసాయ, వైద్య, రక్షణ, పాలన తదితర రంగాల్లో ముద్ర వేయగల ఈ సాంకేతికత ప్రజాబాహుళ్యానికి, ప్రగతికి అవసరమైన రీతిలో తయారుకావాలి. ఏవో కొన్ని దేశాల గుత్తాధిపత్యానికి వీలు కల్పించని రీతిలో ప్రపంచ ఏఐ విధానం రూపకల్పన జరగాలి. శాస్త్ర సాంకేతిక పరిశోధనలకు పెద్దపీట వేయడంతో పాటు, ఫలాల్ని ప్రజల వరకూ తీసుకురావడం ప్రభుత్వ ప్రాధాన్యం కావాలి. ఆ దిశగా అడుగులు వేయగల శక్తి నవభారతానికి ఉంది. చిత్తశుద్ధితో అందుకు తోడ్పడాలి.
డి.వి.జి.శంకరరావు, మాజీ ఎంపీ
ఇవి కూడా చదవండి:
వరుస డకౌట్లకు చెక్.. అభిషేక్ ఫామ్ అందుకోవడానికి కారణం అదే!
టీమిండియా కీలక పోరులో సత్తా చాటింది: సచిన్ టెండూల్కర్