ఉన్న నిపుణులనే వాడుకోలేకపోతున్నాం!
ABN , Publish Date - Oct 02 , 2026 | 04:46 AM
ఈనాడు మన దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్నది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అనేక నూతన విద్యా సంస్థలు, వైద్య కళాశాలలు, సాంకేతిక కేంద్రాలను...
ఈనాడు మన దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్నది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అనేక నూతన విద్యా సంస్థలు, వైద్య కళాశాలలు, సాంకేతిక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. గతంలో కంటే ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో ఒక ఐఐటీ, ఒక ఐఐఎం, ఒక ఎయిమ్స్ హాస్పిటల్ అందుబాటులోకి వచ్చాయి. అలాగే దాదాపు ప్రతి జిల్లాలోనూ కొత్తగా వైద్య కళాశాలలను నెలకొల్పుతున్నారు. కొత్త భవనాలు, కళాశాలలు నిర్మిస్తున్నారు. అయినప్పటికీ, ఒక పెద్ద సమస్య ఇంకా అలాగే ఉన్నది. అది– అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, నైపుణ్యం కలిగిన నిపుణుల కొరత.
కేవలం భవనాలు కట్టడం, సీట్లు పెంచడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందదు. ఆ తరగతి గదుల్లో పాఠాలు చెప్పడానికి, పరిశోధనలు జరిపించడానికి సరైన అనుభవం, ల్యాబ్ నైపుణ్యాలు, ఉన్నత అర్హతలు కలిగిన అధ్యాపకులు చాలా అవసరం. కానీ, ప్రస్తుతానికి మన దేశంలో ఈ రకమైన అధ్యాపకుల కొరత స్పష్టంగా కనిపిస్తున్నది.
ఒక నిపుణుడు లేదా అధికారి పదవీ విరమణ పొందిన తర్వాత, వారి జ్ఞానాన్ని, అనుభవాన్ని మన విద్యా వ్యవస్థ మళ్లీ ఉపయోగించుకోవడంలో విఫలమవుతున్నది. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలలో ఒక శాస్త్రవేత్త లేదా అధికారి రిటైర్ అయితే, అక్కడి విశ్వవిద్యాలయాలు వెంటనే వారిని ఆహ్వానించి, వారి కోసం ప్రత్యేకంగా పరిశోధనా ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తాయి. దీనివలన పదవీ విరమణ పొందిన వారికి విశ్వవిద్యాలయంలో తగిన గౌరవం, హోదా లభిస్తాయి. వారు తమకున్న అనుభవంతో సరికొత్త పరిశోధనలు చేయగలుగుతారు. విద్యార్థులకు ప్రత్యక్షంగా పాఠాలు చెప్పి, గొప్ప ఆవిష్కరణలకు మార్గదర్శకత్వం వహిస్తారు.
మన దేశంలో పదవీ విరమణ తర్వాత అటువంటి నిపుణులను విశ్వవిద్యాలయాలు పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల, వారు ఖాళీగా ఉండిపోవడమో, లేదా అమెరికా వంటి ఇతర దేశాలకు వెళ్లి అక్కడి విశ్వవిద్యాలయాలలో పెద్ద పెద్ద ల్యాబ్‌లను నడిపించడమో చేస్తున్నారు. మన దేశం మాత్రం మానవ వనరులను, మేధోసంపత్తిని కోల్పోతున్నది. ఇతర దేశాలు ఆ మేధస్సుతో లాభపడుతుంటే, మన దేశం మాత్రం నష్టపోతున్నది.
విద్యారంగంలోనే గాక, ప్రభుత్వ పాలనా రంగంలో కూడా నైపుణ్యాల కొరత కనిపిస్తున్నది. మన దేశంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు 25 ఏళ్ల వయస్సులో ఉద్యోగంలో చేరి, దాదాపు 60 ఏళ్ల వయస్సు వరకు వివిధ విభాగాలలో పరిపాలనా బాధ్యతలను నిర్వర్తిస్తుంటారు. కాలక్రమేణా ప్రపంచంలో పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ ఎనర్జీ విధానాలు, గ్లోబల్ ట్రేడ్, ఇంటర్నేషనల్ పాలసీలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి అనేక రకాల నూతన సాంకేతిక మార్పులు వస్తున్నాయి. ఈ అధికారులకు నూతన సాంకేతిక రంగాలు, అంతర్జాతీయ వ్యాపార విధానాలపై ప్రత్యేకమైన డిగ్రీలు గానీ, లోతైన అవగాహన గానీ ఉండవు. దీనివల్ల వేగంగా మారుతున్న ఆధునిక సమస్యలకు తగిన పరిష్కారాలను వారు అందించలేకపోతున్నారు.
ఈ అంతరాన్ని పూడ్చడానికి ప్రభుత్వం కొన్ని సంవత్సరాల క్రితం ‘లేటరల్ ఎంట్రీ’ అనే నూతన విధానాన్ని తీసుకువచ్చింది. ఈ విధానం ప్రకారం ప్రైవేట్ రంగంలో, బిజినెస్ రంగంలో, రీసెర్చ్ రంగంలో 15–20 సంవత్సరాల పాటు పనిచేసిన నిపుణులను నేరుగా ప్రభుత్వంలో ‘జాయింట్ సెక్రటరీ’ లేదా ‘డైరెక్టర్’ స్థాయిలో నియమిస్తారు. వారు దాదాపు 5 సంవత్సరాల పాటు ప్రభుత్వంలో పనిచేసి, తమకున్న సాంకేతిక పరిజ్ఞానం, వ్యాపార మెళకువలతో ప్రభుత్వ పాలసీలను మెరుగుపరుస్తారు. కానీ, కొద్ది కాలానికే ఈ విధానంపై కొన్ని వివాదాలు, రాజకీయ వ్యతిరేకతలు రావడం వల్ల, లేటరల్ ఎంట్రీ ప్రక్రియ మళ్లీ నిలిచిపోయింది. దీనివల్ల నిపుణుల సేవలను ప్రభుత్వ పరిపాలనలోకి తీసుకునే ఒక మంచి అవకాశం ఆగిపోయింది.
ఉన్నత విద్యలో అధ్యాపకుల కొరతను తీర్చడానికి విద్యాశాఖ ఇటీవల ప్రవేశపెట్టిన మరొక మంచి విధానం ‘ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్’. ఈ విధానం ముఖ్య ఉద్దేశం– పరిశ్రమలలో, వ్యాపార రంగంలో లేదా సాంకేతిక రంగంలో 15–20 ఏళ్లకు పైగా పనిచేసిన అనుభవజ్ఞులను ఇంజనీరింగ్, ఎంబీఏ లేదా ఇతర కళాశాలల్లో ఆచార్యులుగా పాఠాలు చెప్పడానికి అనుమతించడం. ఒక కార్పొరేట్ కంపెనీలో లేదా ఒక పరిశ్రమలో సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి కళాశాలకు వచ్చి పాఠాలు చెప్పినప్పుడు, పుస్తకాల్లోని థియరీ మాత్రమే కాకుండా, నిజమైన ప్రాక్టికల్ పరిజ్ఞానం విద్యార్థులకు లభిస్తుంది. ఈ విధానం కొన్ని కళాశాలల్లో ప్రారంభమైనప్పటికీ, ఇంకా మన దేశంలోని విశ్వవిద్యాలయాలు దీనిని విస్తృతంగా అమలుచేయడానికి ముందుకు రావడం లేదు.
మనం ఆత్మ నిర్భర్ భారత్ దిశగా అడుగులు వేయాలంటే, కేవలం బయటి దేశాల నుంచి పెట్టుబడులను తీసుకురావడం మాత్రమే సరిపోదు. పెట్టుబడులు అప్పుల ద్వారా లేదా ఎఫ్‌డీఐ ద్వారా రావచ్చు, కానీ మానవ వనరులు మాత్రం మన దేశానికి చెందినవే అయి ఉండాలి. రక్షణ, అంతరిక్ష, శాస్త్ర పరిశోధనా రంగాల నుంచి విరమణ పొందిన సీనియర్ శాస్త్రవేత్తలను మన ఐఐటీలు, యూనివర్సిటీలు ఆహ్వానించి, ప్రత్యేక పరిశోధనా కేంద్రాలను కేటాయించాలి. ప్రభుత్వ నిర్ణయాల రూపకల్పనలో, విధాన రచనలో ప్రైవేట్, అకడమిక్ రంగాల నిపుణుల భాగస్వామ్యం ఉండేలా స్పష్టమైన నియమాలతో లేటరల్ ఎంట్రీని పునరుద్ధరించాలి. విశ్వవిద్యాలయాలు, సాంకేతిక కళాశాలలు సంప్రదాయ పద్ధతుల నుంచి బయటపడి, ‘ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్’ వంటి పథకాల ద్వారా నిపుణులను భాగస్వాములను చేయాలి. దేశంలో ఉన్న నైపుణ్యాన్ని, మానవ వనరులను సరైన సమయంలో సరిగ్గా ఉపయోగించుకున్నప్పుడే భారతదేశం అన్ని రంగాలలోనూ నిజమైన ప్రగతిని సాధించగలుగుతుంది.
పి. వేణుగోపాల్‌రెడ్డి
ఏకలవ్య ఫౌండేషన్
ఇవీ చదవండి:
స్కూల్ టైమ్‌లోనే గాఢంగా నిద్రపోయిన ప్రిన్సిపాల్.. వీడియో వైరల్
నాడు నానీ.. నేడు మచ్చార్.. ఇజ్రాయెలీలకు అండగా భారతీయులు.!