Share News

ఇంధన స్వావలంబన ఏదీ?

ABN , Publish Date - Apr 11 , 2026 | 05:35 AM

రాజకీయ ఘోషలు బిగ్గరగా ఉన్నాయి, అయితే ప్రజల మౌనాలు మరింత బిగ్గరగా ఉన్నాయి! రుతుపవనాల ప్రవేశ భూమి కేరళలో కొద్ది రోజుల క్రితం పర్యటించినప్పుడు అక్కడి ప్రజల్లో ఏదో అశాంతి ఉన్నట్టు గమనించాను. ఆ పశ్చిమ తీర...

ఇంధన స్వావలంబన ఏదీ?

రాజకీయ ఘోషలు బిగ్గరగా ఉన్నాయి, అయితే ప్రజల మౌనాలు మరింత బిగ్గరగా ఉన్నాయి! రుతుపవనాల ప్రవేశ భూమి కేరళలో కొద్ది రోజుల క్రితం పర్యటించినప్పుడు అక్కడి ప్రజల్లో ఏదో అశాంతి ఉన్నట్టు గమనించాను. ఆ పశ్చిమ తీర రాష్ట్రంలోని అన్ని పట్టణాలలో ఎల్లెడలా కన్పించే టీ దుకాణాలు మూతపడి ఉన్నాయి. అన్నీ కాకపోయినప్పటికీ, ఉపేక్షించడానికి వీలు లేనంతగా అవి మూతపడ్డాయి. ఒక దుకాణదారు ఇలా అన్నాడు: ‘‘ఎల్‌పీజీ సిలిండర్లు లేనప్పుడు మేము ఏమి చేయగలం? పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగానే ఇక్కడ మాకు వంటగ్యాస్‌ సిలిండర్ల కొరత ఏర్పడింది. ఇందుకు మేము ఎవరినీ నిందించడం లేదు. అయితే ఢిల్లీలోని ప్రభుత్వం మా సమస్యలను ఎందుకు గుర్తించదు?’’

ఎన్నికల రణగొణ ధ్వనులలో, రాజకీయ ఘీంకారాలలో ఆ సగటు పౌరుని ప్రశ్న సాదాసీదాగా కన్పించవచ్చుగానీ అందులో ఈ 2026 సంవత్సర భారతదేశ ఆర్థిక అంతర్వాహిని ప్రతిధ్వనించడం లేదూ? ఇరాన్‌ యుద్ధ ప్రభావం ఉన్నప్పటికీ దేశ ఆర్థిక పరిస్థితులు సజావుగా ఉన్నాయని పాలకులు ఘంటాపథంగా చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయి వాస్తవికత అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఈ సత్యాన్ని అంగీకరించేందుకు పాలకులు నిరాకరిస్తున్నారు. ఇప్పుడు మన ఆర్థిక జీవనాన్ని కల్లోలపరుస్తున్న సంక్షోభం కోవిడ్‌ లాంటి ఉపద్రవం కాదు మూతపడిన టీ దుకాణం, ఎల్‌పీజీ సిలిండర్‌ సరఫరాలో తీవ్ర జాప్యం, నిత్యావసర సరుకులను సమకూర్చుకోవడంలో లక్షలాది కుటుంబాల అవస్థలకు మూలాలు దేశ సరిహద్దుల వెలుపల చాలా దూరాన ఉన్నాయి. ఆ అంతర్జాతీయ నేపథ్యం నిర్లక్ష్యం చేయలేనిది. పశ్చిమాసియాలో ఘర్షణలు దిగుమతులకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయి. నిన్నగాక మొన్నటి వరకు ఊహించదగిన రీతిలో ఉన్న ప్రపంచ సరఫరా గొలుసు ఇప్పుడు దాదాపుగా విచ్ఛిన్నమైపోయింది. అమెరికా అధినేత ట్రంప్ అనుసరిస్తున్న విధానాలతో ప్రపంచ వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది. అయితే ప్రపంచవ్యాప్త అంతరాయాలు సంక్షోభాన్ని ప్రేరేపించినా దాని ప్రభావ తీవ్రతను దేశీయ విధానాలే నిర్ణయిస్తున్నాయనే సత్యాన్ని మనం విస్మరించకూడదు. ఇదిగో ఇక్కడే ‘అంతా సక్రమంగా ఉన్నది’ అన్న ప్రభుత్వ భరోసా ఒట్టి డొల్ల మాట అని స్పష్టమవుతుంది.


ఎల్‌పీజీ విషయాన్నే తీసుకోండి. గత పది సంవత్సరాలలో ఈ సంక్షేమ సాధన సదుపాయాన్ని లక్షలాది కుటుంబాలకు సమకూర్చారు. అయితే ఎల్‌పీజీ ధర భరించలేనంతగా పెరిగిపోయినప్పుడు అది అందుబాటులో ఉన్నప్పటికీ ప్రయోజనమేముంది? ధర పెరిగిపోయి, సకాలంలో సరఫరా కాని ఎల్‌పీజీ సిలిండర్‌ల కారణంగా లక్షలాది కుటుంబాలు ఇప్పుడు తమ వంటగదుల్లో మళ్లీ సంప్రదాయ ఇంధనాలనే వినియోగించుకుంటున్నాయి. ఎల్‌పీజీ కొరత తీవ్రంగా ఉందనడానికి ఇదొక నిదర్శనం. భారత్‌ ఇప్పటికీ తన క్రూడాయిల్ అవసరాలలో 85 శాతాన్ని దిగుమతుల ద్వారా తీర్చుకుంటున్నది. అలాగే 60శాతానికి పైగా ఎల్‌పీజీ అవసరాలను కూడా దిగుమతులే తీరుస్తున్నాయి. యుద్ధం కారణంగా అంతర్జాతీయ విపణిలో వంటగ్యాస్‌ మరింత ప్రియమవడం, సరఫరాలకు తీవ్ర అంతరాయాలు ఏర్పడడంతో భారతీయ వంటగదులకు కూడా ఆ యుద్ధం పాకినట్లయింది. సందేహం లేదు. వంటగ్యాస్‌ విషయంలో ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని మోదీ ప్రభుత్వం దిగుమతి సుంకాలను తగ్గించింది. పలు ఉపశమన చర్యలు చేపట్టింది. అయితే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తరువాత ధరలు మళ్లీ పెరుగుతాయన్న ఆందోళన ప్రజల్లో తీవ్రంగానే ఉన్నది. ఒక ఇబ్బందికరమైన ప్రశ్న వేయక తప్పదు: అంతర్జాతీయ విపణిలో క్రూడాయిల్‌ ధరలు తగ్గినప్పుడు ఆ తగ్గుదల ప్రయోజనాలను వినియోగదారులకు ఎందుకు సమకూర్చలేదు?

యుద్ధాల సమయంలో ప్రపంచ మార్కెట్లలో ధరలు పెరుగుతాయి. ప్రభుత్వాల నుంచి వినియోగదారులకు సమకూరే సహాయమూ తగ్గి పోతుంది. దీని పర్యవసానాలు ఇప్పుడు అంతటా కనిపిస్తున్నాయి. కేరళలో టీ దుకాణాన్ని మూసివేసిన చిరువ్యాపారి ఒకరు ఉత్పాదకాల ధరల పెరుగుదల వల్లే తనకు ఆ దుస్థితి దాపురించిందని వాపోయాడు. డీజిల్‌, ఎరువుల ధరలు పెరిగిపోవడంతో రైతులు సతమతమవుతున్నారు. ఏ రోజుకారోజు కాయకష్టంపై ఆధారపడి బతికే వారికి పని దొరకడం లేదు. చిన్న ఫ్యాక్టరీలు మనుగడనే కోల్పోతున్నాయి.

మరో ముఖ్యమైన విషయమేమిటంటే ఇంధన భద్రతను సమకూర్చుకునేందుకు మన దేశం చేస్తున్న ప్రయత్నాలు నిలకడగా లేవు. చైనాతో పోల్చితే మన ఆర్థిక వ్యూహాలు లోపభూయిష్టమైనవి. ఆర్థిక ఒడిదుడుకులకు చైనా అతీతమేమీ కాదు. అయితే భారీ వ్యూహాత్మక నిల్వలు, పునరుత్పాదక ఇంధనాల వినియోగానికి వేగవంతమైన పరివర్తనతో ఎటువంటి సంక్షోభాలనైనా సమర్థంగా ఎదుర్కోగల సామర్థ్యం ఆ దేశానికి ఉన్నది. చైనాకు భిన్నంగా భారత్‌, సంక్షోభం విరుచుకుపడినప్పుడు మాత్రమే ప్రతిస్పందిస్తోంది. సంభావ్య ముప్పును సమర్థంగా ఎదుర్కొనేందుకు ముందస్తుగా సంసిద్ధమవడం లేదు. కేంద్రంలోను, రాష్ట్రాలలోను అవసరమైన తక్షణ శ్రద్ధ తరచూ కొరవడుతోంది. అవరోధాలు అనేకం. ఇంధన పరివర్తనలు ఒకటి రెండు రోజుల్లో సంభవించవు. అభివృద్ధిపథంలో వడివడిగా ముందుకు సాగుతున్న భారత్‌ ఇంధన అవసరాలు అన్నీ ఇన్నీ కావు కదా. వాటిని జరూరుగా తీర్చడంపై సంపూర్ణ శ్రద్ధ చూపడం తప్పనిసరి.


ఏమి చేయాలి? సమస్య పరిష్కారానికి నిజాయితీగా తొలి అడుగు వేయాలి. ప్రజల అవస్థలు పరిమితమైనవే అన్నట్టుగా ప్రభుత్వాలు వ్యవహరించడం ఎవరికీ ఎటువంటి మేలూ చేయదు. గ్యాస్‌ సిలిండర్‌ ఖర్చులు పెరిగినప్పుడు, నిత్యావసరాల ధరలు మిన్నంటినప్పుడు, బతుకుతెరువుకు ఆధారపడుతున్న చిన్నాచితకా వ్యాపారం ఇంకెంత మాత్రం లాభసాటి కానప్పుడు ప్రజల కష్టాలు మిక్కుటమవుతాయి. ఈ కఠోర వాస్తవాన్ని ప్రభుత్వాలు అంగీకరించి తీరాలి. ఈ చిత్తశుద్ధే విశ్వసనీయమైన విధానానికి పునాది అవుతుంది. రెండో అడుగు ప్రజలకు తక్షణ సహాయాన్ని అందించడం. అప్పుడప్పుడూ ధరల తగ్గింపుతో ఇది సమకూరదు. పారదర్శక, పటిష్ఠ విధానాలు అత్యవసరం. అంతర్జాతీయ విపణిలో ధరలు పడిపోయినప్పుడు వినియోగదారులు లబ్ధి పొందేందుకు అవి తోడ్పడాలి. ఆ ధరలు పెరిగినప్పుడు వారి ప్రయోజనాలను కాపాడేందుకు ఆ విధానాలు పూచీ పడాలి.

ఎల్‌పీజీ సబ్సిడీలపై పునరాలోచన చేయవలసిన అవసరమున్నది. నిరుపేద కుటుంబాలతో పాటు దిగువ మధ్యతరగతి కుటుంబాలకు సైతం సబ్సిడీపై వంటగ్యాస్‌ సరఫరా చేస్తున్నారు. సంక్షోభ సమయాల్లో సమకూర్చే స్వల్పకాలిక సహాయంతో ప్రజల అవస్థలు తీరవు. చేయవలసిందేమిటి? ఇంధన స్వావలంబనకు స్వదేశీ ఇంధన ఉత్పత్తిపై దీర్ఘకాలిక దృష్టితో కూడిన విధానాలను అనుసరించి తీరాలి. అయితే మన విధాన నిర్ణేతల ఆలోచనలు ఈ దిశగా లేవు. ప్రపంచ వ్యాప్తంగా ఘర్షణలు పెరుగుతున్నాయి. సరఫరా గొలుసులు దుర్బలమవుతున్నాయి. అనూహ్య రీతుల్లో సంక్షోభాలు సంభవిస్తున్నాయి. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మనం మళ్లీ కేరళలో మూతపడిన టీ దుకాణాల విషయానికి వెళదాం. అవి కేవలం మూతపడిన చిన్న వ్యాపారాలు కావు. వాటిని మూసివేయడం అనేది ఆర్థిక వ్యవస్థలోని చిన్న, అసంఘటిత వ్యాపారాలకు, వాటిపై ఆధారపడినవారికి వాటిల్లనున్న ముప్పుకు ముందస్తు హెచ్చరికలు. ఈ నష్టం మరింతగా ముమ్మరమవక ముందే దాన్ని అదుపు చేయాలి. ఈ బాధ్యత ఎవరిది? పాలకులది. అయితే వారు అంతా బాగానే ఉన్నది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది సుపరిపాలనను సూచించదు. సంక్షోభం వాటిల్లక ముందే,


అది అందరి అనుభవంలోకి రాకముందే దాన్ని గుర్తించి, నివారించేందుకు ముందస్తు చర్యలు చేపట్టడమే సరైన పాలన. అది ప్రజాపాలకుల ధర్మం. మన ఆర్థిక వ్యవస్థ మందగమనం ప్రభావాన్ని కోట్లాది భారతీయులు మౌనంగా ఎదుర్కొంటున్నారు. అంతకంతకూ తగ్గిపోతున్న కుటుంబాల వినియోగ సామర్థ్యంపై ఆధారపడి 5 లక్షల కోట్ల డాలర్ల విలువైన ఆర్థిక వ్యవస్థను నిర్మించడం ఎలా సాధ్యమవుతుంది? సగటు భారతీయ కుటుంబాల వంటగదులలో ఏమి వండుతున్నారు, ఎలా వండుతున్నారు, అలాగే వీధి చివర ఉన్న టీ దుకాణం తెరిచి ఉండాలా లేక మూసివేయాలా అనే విషయాన్ని ప్రపంచ యుద్ధాలు నిర్ణయిస్తున్నప్పుడు అది ఇంకెంత మాత్రం సుదూర సీమల నుంచి ఎదురవుతున్న సమస్య కానేకాదు; అది కచ్చితంగా దేశీయ విధానాల వైఫల్యమే, సందేహం లేదు. ఈ భయానక వాస్తవాన్ని మనం ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. లేని పక్షంలో సమీప భవిష్యత్తులోనే అందుకు మనం భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు.

రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌)

ఈ వార్తలూ చదవండి:

200 మిలియన్ డాలర్ల అమెరికన్ డ్రోన్ అదృశ్యం!

ఇజ్రాయెల్ ఆగ్రహం! పాక్ మంత్రి ట్వీట్‌ను డిలీట్ చేయించిన ఆర్మీ చీఫ్

Updated Date - Apr 11 , 2026 | 05:35 AM