Share News

భారత్‌ పరిణత ప్రజాస్వామ్యమేనా?

ABN , Publish Date - Feb 28 , 2026 | 01:54 AM

న్యూఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సదస్సులో, పెచ్చరిల్లుతున్న నిరుద్యోగం, అమెరికా–భారత్‌ వాణిజ్య ఒప్పందాన్ని నిరసిస్తూ యువజన కాంగ్రెస్‌ కార్యకర్తల అర్ధనగ్న ప్రదర్శనకు తీవ్ర ప్రతిస్పందనలు...

భారత్‌ పరిణత ప్రజాస్వామ్యమేనా?

న్యూఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సదస్సులో, పెచ్చరిల్లుతున్న నిరుద్యోగం, అమెరికా–భారత్‌ వాణిజ్య ఒప్పందాన్ని నిరసిస్తూ యువజన కాంగ్రెస్‌ కార్యకర్తల అర్ధనగ్న ప్రదర్శనకు తీవ్ర ప్రతిస్పందనలు వెల్లువెత్తాయి. ఆగ్రహం, పరిహాసం, నీతి పాఠాలు... ఆ ఘటన చోటుచేసుకున్న కొద్ది నిమిషాలలోనే సామాజిక మధ్యమాలలో ఈ అసంకల్పిత ప్రతిస్పందనలు వ్యక్తమయ్యాయి. ప్రైమ్‌ టైమ్‌ టీవీ షోలలో ఆ నిరసన ప్రదర్శన ఉదంతానికి సంబంధించిన వీడియోను మళ్లీ మళ్లీ చూపారు. యాంకర్ల వ్యాఖ్యలు: కాంగ్రెస్‌ కార్యకర్తల అర్ధనగ్న ప్రదర్శన ‘దారితప్పిన నిరసన’, ‘నివ్వెరపరిచింది’, ‘కలవరపరుస్తోంది’ ఇంకా, ‘దేశ ప్రతిష్ఠను మంటగలిపింది’ అని కూడా గట్టిగా అన్నారు.

నిజానిజాలను తరచి చూద్దాం. యువజన కాంగ్రెస్‌ కార్యకర్తల నిరసనపై విమర్శనాత్మక ప్రతిస్పందనలు పూర్తిగా న్యాయబద్ధమైనవే. ఒక అంతర్జాతీయ సదస్సు సందర్భంగా అటువంటి నిరసన ప్రదర్శన ఒక పేలవమైన రాజకీయ వ్యక్తీకరణ అని నేను భావిస్తున్నాను. ఇంకా సంతకాలు చేయని భారత్‌–అమెరికా వాణిజ్య ఒప్పందంతో ఆ అంతర్జాతీయ ఏఐ సదస్సుకు ఎలాంటి సంబంధం లేదు. అయినా కాంగ్రెస్‌ కారకర్తలు తమ నిరసనకు అంతర్జాతీయ సదస్సు జరుగుతున్న ప్రదేశాన్ని ఎంపిక చేసుకున్నారు. మీరు ఆ నిర్ణయంతో ఏకీభవించవచ్చు లేదా ఏకీభవించకపోవచ్చు. ప్రజాస్వామిక చర్చ కచ్చితంగా అటువంటి అభిప్రాయభేదాలపైనే ఆరంభముతుంది. ప్రతి నిరసన వివేకవంతమయింది కాదు. ప్రతి నినాదం ప్రతి ఒక్కరినీ ఒప్పించలేదు. యువజన కాంగ్రెస్‌ కార్యకర్తల అర్ధనగ్న ప్రదర్శన వలే ప్రతి నిరసన కూడా మీడియా దృష్టిని తమపై కేంద్రీకరింప చేసుకునే లక్ష్యంతోనే నిర్వహించడం కద్దు. మీరు ఒక నిరసన ప్రదర్శనను ఏవగించుకోవచ్చు. అయితే శాంతియుతంగా నిరసన తెలిపే హక్కుకు చట్టబద్ధత లేకుండా చేయడం అంగీకరించాల్సిన విషయం కాదు. శాంతియుతంగా నిరసన తెలిపిన యువజన కాంగ్రెస్ కార్యకర్తలను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ కాంగ్రెస్‌ విభాగం అధ్యక్షుడిని బెయిల్‌ మంజూరుకు ఆమోదయోగ్యంకాని న్యాయ నిబంధనల కింద అరెస్ట్‌ చేశారు. ‘జాతికి వ్యతిరేకంగా ‘కుట్ర’ చేశారని కూడా యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలపై అభియోగాలు మోపారు. ఇది నిరసన ప్రదర్శనలపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నది. ఆసక్తికరమైన విషయమేమిటంటే ఢిల్లీ పోలీసులు గుజరాత్‌ పోలీసులు పరిపూర్ణత నిచ్చిన నిబంధనలనే అనుసరించి యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు. ఎటువంటి బహిరంగ సమావేశాలనైనా అడ్డుకునేందుకై గుజరాత్‌ పోలీసులు తరచూ నిరంతరాయంగా సెక్షన్‌ 144ను అమలుపరిచేవారు. పోలీసులు ఆ సెక్షన్‌ను అలా అమలుపరచడం న్యాయ సమ్మతం కాదని, పౌరుల హక్కులపై రాజ్యాంగ విరుద్ధంగా ఆంక్షలు విధించడమేనని గుజరాత్‌ హైకోర్టు గత ఏడాది ఒక తీర్పులో స్పష్టం చేసింది.


ఒక విధంగా మోదీ–షాల ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న గుజరాత్‌ రాజ్యాధికార నమూనా జాతీయ స్థాయికి చేరుకున్నది. ఇప్పుడు దీనిని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు (బీజేపీయేతర పార్టీల ప్రభుత్వాలు కూడా) అమలుపరుస్తున్నాయి. తమ రాజకీయ ప్రత్యర్థులకు ఇబ్బందులు సృష్టించేందుకు స్థానిక పోలీసులను నిస్సిగ్గుగా ఉపయోగించుకోవడం సాధారణమైపోయింది. భిన్నాభిప్రాయాల వ్యక్తీకరణను సహించలేకనే ఇటువంటి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నారు. ఇది ప్రమాదకరమైన ధోరణి. ప్రజా జీవితంలో ప్రజాస్వామిక అవకాశాలు సన్నగిల్లిపోతున్నాయి. పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడు వివాదాస్పద అంశాలపై మాట్లాడకుండా పాలకపక్ష సభ్యులు అడ్డకుంటున్నారు. ప్రజాస్వామిక చర్చకు ఇదెలా దోహదం చేస్తుంది? పార్లమెంటులో చట్టాలపై ఎలాంటి చర్చ లేకుండానే వాటిని ఆమోదింప జేసుకోవడంలో పాలకపక్షం ఆరితేరిపోయింది. అధికారంలో ఉన్నవారికి ఇబ్బంది కలిగించే ప్రశ్నలు సంధించేందుకు ప్రధాన స్రవంతి మీడియా సంకోచిస్తోంది. విశ్వవిద్యాలయాలలో ప్రత్యామ్నాయ అభిప్రాయాలను వ్యక్తం చేసేవారిని ‘జాతి–వ్యతిరేకులు’గా ముద్ర వేస్తున్నారు. పౌర సమాజం కూడా అధికారంలో ఉన్నవారిని సవాల్‌ చేసేందుకు సాహసించలేకపోతోంది. తాము నిర్వహిస్తోన్న ఓ కార్యక్రమంలో ప్రసంగించేందుకు నటుడు నసీరుద్దీన్‌ షాను ముంబై విశ్వవిద్యాలయం ఆహ్వానించింది. తీరా ప్రసంగించాల్సిన రోజు సమీపిస్తుండగా ఎటువంటి వివరణ ఇవ్వకుండానే ఆ ఆహ్వానాన్ని రద్దు చేసింది. మోదీ సర్కార్‌ను విమర్శిస్తుండడమే నసీరుద్దీన్‌ షా చేసిన అపరాధం! యూట్యూబర్లు, స్టాండప్‌ కమెడియన్లు తదితరులు కూడా అధికారంలో ఉన్నవారికి భయపడుతున్నారు. సర్వత్రా భయం రాజ్యమేలుతోంది.

ఇబ్బందికరమైన వాస్తవాలనే కాకుండా తప్పుడు విషయాలనూ అతిగా మాట్లాడేందుకు అనుమతించి రక్షణ కల్పించే వ్యవస్థే ప్రజాస్వామ్యం. మనం ఆమోదించే నిరసన ప్రదర్శనల పట్ల ఎలా వ్యవహరిస్తున్నామన్నది కాకుండా మనకు ఆగ్రహం కలిగించే అసంబద్ధ నిరసనలకు ఎలా ప్రతిస్పందిస్తున్నామన్నదే ప్రజాస్వామిక పరిణతికి గీటురాయి. అయితే పాలకుల ప్రవృత్తి ఇందుకు విరుద్ధంగా ఉంటున్నది. బెయిల్‌కు అవకాశంలేని ఆరోపణలనేవి తీవ్ర నేరాలకు పాల్పడినవారిపై మోపడానికి మాత్రమే ఉద్దేశించినవి. అంతేగానీ శాంతియుతంగా భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న వారిని కట్టడి చేసేందుకు వారిపై అటువంటి ఆరోపణలు మోపకూడదు. అటువంటి చర్య అరెస్టయినవారినే కాకుండా ఇంకా చాలా మందిని ప్రభావితం చేస్తుంది. అందులోని సంకేతం సూక్ష్మమైనదేకానీ శక్తిమంతమైనది: నిరసన తెలిపితే భారీ మూల్యం చెల్లించడం అనివార్యమవుతుంది.


భిన్నాభిప్రాయాల వ్యక్తీకరణను అరాచకంగా భావించకూడదు. అలా భావించడం ప్రజాస్వామ్యానికి మేలు చేయదు. ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రజా సార్వభౌమాధికారం, జవాబుదారీతనం ప్రాతిపదికన నిర్మితమవుతాయి. చర్చలు వాటిని బలోపేతం చేస్తాయి. మరి అసమ్మతి, భిన్నాభిప్రాయాల వ్యక్తీకరణ శాంతిభద్రతలకు ముప్పుగా పరిగణించడం ప్రజాస్వామ్య పటిష్ఠతకు ఎలా దోహదం చేస్తుంది? స్వేచ్ఛగా సమావేశమయ్యేందుకు, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు ప్రజలకు హక్కు ఉండితీరాలి. లోపభూయిష్ఠ నిరసన ప్రదర్శనల వల్ల కాకుండా ప్రజాస్వామిక అవకాశాలు తగ్గిపోవడం వల్లే ప్రజాస్వామ్య వ్యవస్థలు బలహీనమవుతాయన్న వాస్తవాన్ని విస్మరించకూడదు.

ఏఐ సదస్సులో యువజన కాంగ్రెస్‌ కార్యకర్తల అర్ధనగ్న ప్రదర్శనల వల్ల భారతదేశ గౌరవానికి భంగం కలిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు ఎప్పుడూ ప్రతీకాత్మకతకు రంగస్థలాలుగా ఉండడం పరిపాటి. ప్రజల నిరసన మౌన ప్రదర్శనలు, నిరాహారదీక్షలు తదితర రూపాల్లో వ్యక్తమవుతుంది. నిరసన ప్రదర్శనలు ఒక తీర్చిదిద్దిన పద్ధతిలో జరగవు. అలాగే అవి ఆహ్లాదకరంగా కూడా ఉండవు. నిరసన కార్యక్రమాల స్వభావమే అలా ఉంటుంది. 2004లో మణిపూర్‌ మహిళలు ఇంఫాల్‌లో అసోం రైఫిల్స్‌ ప్రధాన కార్యాలయం ఎదుట నిర్వహించిన నగ్న ప్రదర్శనను గుర్తుచేసుకోండి. ఆ ఘటన దేశ ప్రజలను దిగ్భ్రాంతి పరిచింది. యావద్భారతదేశాన్ని కుదిపివేసింది. మణిపూర్‌లో అణచివేతల క్రూరత్వాన్ని ప్రపంచానికి చాటింది. ఏఐ సదస్సులో యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల అర్ధనగ్న ప్రదర్శన జాతీయ అవమానంగా పరిగణించడం సబబేనా? భారత గణతంత్ర రాజ్య గౌరవం సమున్నతమైనది, దృఢమైనది. రాజకీయ నిరసన ప్రదర్శనలు ఆ గౌరవానికి ఎటువంటి హాని కలిగించలేవు. ఇది స్పష్టం. ఇంతకూ జాతీయ అవమానం అంటే ఏమిటి? ఎప్పుడు దేశ ప్రతిష్ఠకు భంగం కలుగుతుంది? రాజకీయ నిరసన ప్రదర్శనల వల్ల అయితే కాదు. వ్యవస్థీకృత వైఫల్యాలే జాతి గౌరవాన్ని కించపరుస్తాయి గానీ, భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసే నిరసన ప్రదర్శనలు కావని సునిశ్చితంగా చెప్పవచ్చు. ప్రభుత్వ యంత్రాంగంలో ఎల్లెడలా అవినీతి ప్రజల జీవితాలను ఎలా ఇబ్బందులపాలు చేస్తుందో మనం చూడడం లేదూ? ఆ అవినీతి దేశానికి ఎలా ప్రతిష్ఠాకరం? రాజ్యాంగ సంస్థలు, వ్యవస్థలు బలహీనపడడం దేశానికి ప్రతిష్ఠాకరమా? వాటికి పూర్తిగా భిన్నమైన ఒక నిరసన ప్రదర్శన దేశ గౌరవాన్ని ఎలా తగ్గించివేస్తుంది?


నిరసనకారుల పట్ల అతిగా ప్రతిస్పందించడం ద్వారా వారి నిరసనలకు ప్రభుత్వాలు మరింత ప్రాధాన్యాన్ని సంతరింపజేస్తాయి. అరెస్టయిన నిరసనకారులు కూడా తమ నిరసనల లక్ష్యం పొందదగిన ప్రాధాన్యం కంటే ఎక్కువగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తారు. సమాజం సానుభూతినీ పొందుతారు. పరిణత ప్రజాస్వామ్యం శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యతను విస్మరించదు. అదే సమయంలో పౌర స్వేచ్ఛలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతనూ గుర్తిస్తుంది. ఈ రెండిటి మధ్య ఒక సమతుల్యత ఉండేలా పరిణత ప్రజాస్వామ్యం జాగ్రత్త వహిస్తుంది. నిరసనలను నియంత్రించడం ఒక విషయం అయితే భిన్నాభిప్రాయాన్ని నేరంగా పరిగణించడం మరో విషయం. ఈ రెండింటి మధ్య వ్యత్యాసమున్నది. ఏఐ సమ్మిట్‌లో యువజన కాంగ్రెస్‌ కార్యకర్తల అర్ధనగ్న ప్రదర్శన ఒక నిరసన ప్రదర్శన గురించి తక్కువగాను, ప్రజాస్వామిక స్వభావం గురించి ఎక్కువగాను చెబుతోంది. నిజానికి ఆ నిరసన ప్రదర్శన మన ప్రజాస్వామ్య స్వభావానికి ఒక పరీక్ష. ఎందుకని? పరిణత ప్రజాస్వామ్యం భిన్నాభిప్రాయాల వెల్లువకు బెదిరిపోదు. ప్రభుత్వాధికారాలను ఉపయోగించి వాటిని అణచివేయదు.. వాటిని చర్చిస్తుంది. పరిహసిస్తుంది. ఉపేక్షిస్తుంది. ఆపై ముందుకు సాగిపోతుంది. నిరసన ప్రదర్శనల వల్ల కాకుండా భిన్నాభిప్రాయాల అణచివేత కారణంగానే ప్రజాస్వామ్య వ్యవస్థలు క్షీణించిపోయాయని చరిత్ర ఘంటాపథంగా చెబుతోంది. భారత ప్రజాస్వామ్యపు మహాబలం అభిప్రాయాల వైవిధ్యమే కానీ పోలీసు రాజ్య నిరంకుశత్వ పద్ధతులు కానేకాదు.

రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌)

ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ హయాంలో వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయింది: సీఎం చంద్రబాబు

జగన్ హయాంలో పరిశ్రమలు ఏపీ నుంచి వెళ్లిపోయాయి.. మంత్రి టీజీ భరత్ ధ్వజం

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 28 , 2026 | 01:55 AM