Share News

ఎంపీలను కాదు.. ఎమ్మెల్యేలను పెంచాలి

ABN , Publish Date - Apr 07 , 2026 | 04:24 AM

స్వాతంత్ర్యానంతరం డీలిమిటేషన్‌ కమిషన్‌ను నాలుగుసార్లు ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ల ప్రకారం, లోక్‌సభ స్థానాల సంఖ్య– 1952లో 489గా, 1963లో 522గా, 1973, 2002లో 543గానూ నిర్ణయించారు. అయితే...

ఎంపీలను కాదు.. ఎమ్మెల్యేలను పెంచాలి

స్వాతంత్ర్యానంతరం డీలిమిటేషన్‌ కమిషన్‌ను నాలుగుసార్లు ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ల ప్రకారం, లోక్‌సభ స్థానాల సంఖ్య– 1952లో 489గా, 1963లో 522గా, 1973, 2002లో 543గానూ నిర్ణయించారు. అయితే 1981, 1991 జనగణనల తరువాత ఎటువంటి కమిషన్లనూ ఏర్పాటు చేయలేదు.

84వ రాజ్యాంగ సవరణ ప్రకారం, 2026 తర్వాత జరిగే మొదటి జనగణన ఆధారంగా మాత్రమే తదుపరి డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) జరగాలి. అప్పటివరకు ఆయా నియోజకవర్గాల సరిహద్దులను మార్చడానికి వీల్లేదు. ఈ సవరణ ప్రధాన ఉద్దేశ్యం– రాష్ట్రాల మధ్య జనాభా పెరుగుదలలో ఉన్న అధిక వ్యత్యాసాల కారణంగా పార్లమెంట్‌లో వాటి దామాషా ప్రాతినిధ్యం మారిపోకుండా చూడటం. కొన్ని రాష్ట్రాలు జనాభా నియంత్రణను సమర్థంగా అమలు చేయగా, మరికొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో అమలు కాలేదు. ఇప్పటికీ పలు రాష్ట్రాల మధ్య జనాభా పెరుగుదలలో వ్యత్యాసం ఎక్కువగానే ఉంది. అందువల్ల ప్రస్తుత జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే, జనాభాను సమర్థంగా నియంత్రించిన పలు రాష్ట్రాలపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదముంది.

మొదటి లోక్‌సభ (1952) ఏర్పడే నాటికి 17.3 కోట్ల మంది ఓటర్లకు ప్రాతినిధ్యం వహిస్తూ దేశంలో మొత్తం 489 స్థానాలు ఉండేవి. గత ఏడు దశాబ్దాల్లో మన దేశ జనాభా, దాంతోపాటే ఓటర్ల సంఖ్యా పెరిగింది. ఈ నేపథ్యంలో రెండు ప్రధానమైన ప్రశ్నలు ఎదురవుతున్నాయి: పెరిగిన జనాభాకు అనుగుణంగా లోక్‌సభ స్థానాల గరిష్ఠ పరిమితి (ప్రస్తుతం 550గా ఉంది)ని పెంచాలా? జనాభాను నియంత్రించిన రాష్ట్రాల్లో సీట్లు స్వల్పంగానూ, అధిక జనాభా గల రాష్ట్రాల్లో సీట్లు భారీగానూ పెరిగే అవకాశం ఉన్నా, ఆయా రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనను చేపట్టాల్సిందేనా?

నా అభిప్రాయం ప్రకారం.. తదుపరి జనగణన అనంతరం కూడా, లోక్‌సభ స్థానాల గరిష్ఠ పరిమితిని పెంచాల్సిన అవసరం లేదు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించడానికి, అవసరమైన చట్టాలు చేయడానికి ఇప్పుడున్న సభ్యుల సంఖ్య సరిపోతుంది.

ఉదాహరణకు, అమెరికాలో 50 పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి. భారతదేశం కంటే మూడు రెట్లు ఎక్కువ విస్తీర్ణం ఉన్నప్పటికీ, వారి ఫెడరల్ శాసనసభ అయిన యూఎస్‌ కాంగ్రెస్‌లో కేవలం 435 మంది సభ్యులే ఉన్నారన్న విషయం ఇక్కడ గమనించాలి. పెరిగిన టెక్నాలజీ పుణ్యమా అని, తమ నియోజకవర్గ ప్రజలను ఎంపీలు తరచూ నేరుగా కలవాల్సిన అవసరమూ లేదు. సాంకేతిక సాధనాల సాయంతో వారి సమస్యలను సులభంగా తెలుసుకోవచ్చు. ఎంపీల ప్రధాన బాధ్యత చట్టాలు చేయడం, విధానాలను రూపొందించడం, దేశ ప్రయోజనాల కోసం పాటుపడడం. అంతేగానీ, ప్రభుత్వ పథకాల అమలు, స్థానిక అభివృద్ధి పనులను పర్యవేక్షించడం కాదు. అందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థలు ఉన్నాయి.


మన దేశ జనాభా రాబోయే పాతిక సంవత్సరాల్లో గరిష్ఠ స్థాయికి చేరుకుని, తర్వాత క్రమంగా పడిపోతుందన్న అంచనా ఉంది. అందువల్ల లోక్‌సభ సభ్యుల సంఖ్యను పెంచాల్సిన అవసరం లేదు. బదులుగా ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రతినిధుల సంఖ్యను పెంచడంపై దృష్టి పెట్టడం మంచిది.

మళ్లీ లోక్‌సభ స్థానాల విషయానికొద్దాం. రాష్ట్రాల మధ్య సీట్ల సమతుల్యత మారకుండా ఉండాలంటే, 1971 నాటి జనగణన ఆధారంగా సీట్ల పెంపు జరగాలి. లోక్‌సభ గరిష్ఠ స్థానాల సంఖ్య 550కి గానూ ప్రస్తుతం 543 మంది సభ్యులే ఉన్నారు. మిగిలిన 7 స్థానాలను జనాభా అధికంగా ఉన్న రాష్ట్రాల్లో పెంచుకోవచ్చు. ఇందుకు రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాల్సిన అవసరం లేదు. 2026–27 జనగణన తర్వాత, సరైన యంత్రాంగం ద్వారా దీన్ని పూర్తి చేయవచ్చు. ఇక, ప్రస్తుతం రాజ్యసభలో 245 మంది సభ్యులు ఉన్నారు. రాజ్యాంగం ప్రకారం గరిష్ఠంగా 250 వరకు సీట్ల సంఖ్య పెంచుకునే అవకాశం ఉంది. ఈ పెంపును తదుపరి జనగణన తరువాత చేపట్టబోయే లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (ఆ ఏడు సీట్ల)తో పాటు పరిశీలించవచ్చు.

ప్రస్తుతం దేశంలో 4,123 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలు ఉన్నాయి. రాజ్యాంగంలోని 170వ అధికరణ ప్రకారం, ప్రతి రాష్ట్ర శాసనసభలో గరిష్ఠంగా 500 మంది సభ్యులు ఉండవచ్చు. 2026–27 జనగణన తర్వాత ఈ సంఖ్యలోనూ అవసరమైన మార్పులు చేయవచ్చు. ఉత్తరప్రదేశ్‌ వంటి అధిక జనాభా గల రాష్ట్రాల్లో, అసెంబ్లీ నియోజకవర్గ స్థానాల సంఖ్య పరిమితికి మించితే, మెరుగైన పరిపాలనా సామర్థ్యం కోసం ఆ రాష్ట్రాన్ని విభజించడం అనే అంశాన్ని సైతం పరిగణనలోకి తీసుకోవచ్చు. లేదా ఆ రాష్ట్రానికి మాత్రమే 500కు మించి సభ్యుల సంఖ్యను పెంచుకునేందుకు రాజ్యాంగ సవరణ చేయవచ్చు. అలాగే, ఆయా రాష్ట్రాల్లోని ఎమ్మెల్సీ స్థానాల సంఖ్యను కూడా రాజ్యాంగ నియమాలకనుగుణంగా సవరించవచ్చు.

మన ప్రజాస్వామ్య భారతంలో డీలిమిటేషన్‌ చాలా ప్రాధాన్యం కలిగిన అంశమే. అయితే, ఎంపీల సంఖ్యను పెంచడం కంటే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఎమ్మెల్యేల సంఖ్యను పెంచడంపైనే కేంద్రం అధిక దృష్టి పెట్టాలి. ప్రస్తుతమున్న సీట్ల పరిమితులను పాటిస్తూ, చిన్నపాటి సర్దుబాట్లు చేయడం ద్వారా, అటు పార్లమెంట్‌లోనూ ఇటు అసెంబ్లీల్లోనూ అవసరమైన ప్రాతినిధ్యాన్ని, సమతుల్యతను కాపాడుకోవచ్చు.

కె. రవీంద్రబాబు

రిటైర్డ్‌ జీఎం, ఎన్టీపీసీ

ఇవి కూడా చదవండి..

పుదుచ్చేరికి రాష్ట్ర హోదా, 6 నెలల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు: రాహుల్

బెంగాల్ స్టార్ క్యాంపెయినర్ లియాండర్ పేస్‌కు ఎక్స్ కేటగిరీ భద్రత

Updated Date - Apr 07 , 2026 | 04:24 AM