Share News

నీలి విప్లవంలో నవభారత శకం

ABN , Publish Date - Sep 17 , 2026 | 02:25 AM

‘సబ్‌కా సాథ్.. ‘సబ్‌కా వికాస్.. ‘సబ్‌కా విశ్వాస్.. ‘సబ్‌కా ప్రయాస్’ అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వ తారకమంత్రం. భారతదేశ అభివృద్ధి ప్రస్థానాన్ని అది సదా...

నీలి విప్లవంలో నవభారత శకం

‘సబ్‌కా సాథ్.. ‘సబ్‌కా వికాస్.. ‘సబ్‌కా విశ్వాస్.. ‘సబ్‌కా ప్రయాస్’ అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వ తారకమంత్రం. భారతదేశ అభివృద్ధి ప్రస్థానాన్ని అది సదా సార్వజనీనంగా, సర్వతోముఖంగా నిలుపుతోంది. గడచిన పాతికేళ్లలో కోట్లాది ప్రజల, ప్రత్యేకించి పేద–అణగారిన వర్గాలవారి జీవితాలను మోదీ తన విశిష్ట పాలనా దక్షతతో అమితంగా ప్రభావితం చేశారు. ఆర్థిక ప్రగతిపై ఆయన విధానం అందరికీ ఆదర్శప్రాయం. వెనుకబడిన జిల్లాలను ‘ఆకాంక్షాత్మక జిల్లాలు’గా, సరిహద్దు గ్రామాలను ‘సమర్థ–ప్రథమ గ్రామాలు’గా, ఈశాన్య ప్రాంతాన్ని ‘అష్టలక్ష్మి’గా అభివర్ణించడం ఆయన పరిణామాత్మక దృక్పథానికి ప్రతీక. ఈ విధానం భౌగోళిక వివక్షను సాధికారతగా రూపుదిద్ది, వికసిత భారత్ దిశగా ప్రస్థానంలో వివిధ వర్గాల క్రియాశీల భాగస్వామ్యానికి బాటలు వేసింది. ‘పీఎం జన్మాన్‌, పీఎం జన్‌-ధన్, పీఎం- గరీబ్ కల్యాణ్‌ యోజన’ వంటి పథకాలే ఈ విజయానికి నిదర్శనం. వీటితో పాటు ఇతరత్రా అమలుపరుస్తోన్న కార్యక్రమాలు కూడా సార్వజనీన ప్రగతి, సామాజిక సాధికారతపై ప్రధానమంత్రి నిబద్ధతను చాటిచెబుతున్నాయి. కనుకనే దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తి పొందారు. ఈ అపూర్వ పురోగతి మన జాతి జీవనంలోనే కాకుండా సమస్త మానవాళి చరిత్రలో కూడా ఒక చిరస్మరణీయ మలుపు. ప్రపంచవ్యాప్తంగా పేదరికం, ఆకలి దప్పుల నుంచి నిరుపేదలు శాశ్వతంగా బయటపడే రోజు త్వరలోనే తప్పక వస్తుందనడానికి ఈ భారత విజయం ఒక శుభ సంకేతం.

ఈ సార్వజనీన వృద్ధికి మరింత భరోసా, సుస్థిరత కల్పించేందుకు ప్రధాని మోదీ ‘నీలి ఆర్థిక వ్యవస్థ’పై దృష్టి సారించారు. హరిత విప్లవం 1960ల్లో దేశ ప్రజల క్షుద్బాధను తీర్చింది. తదాదిగా ప్రపంచ ఆహార భద్రతలో భారత్‌ పాత్ర మరింత పటిష్ఠమవుతోంది. బియ్యం, గోధుమలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాల ఉత్పత్తిలో భారత్‌ నేడు ప్రపంచ అగ్ర దేశాలలో ఒకటిగా నిలిచింది. హరిత విప్లవం శ్వేత విప్లవంతో దేశంలో పాల కొరత తీరిపోయింది. పాడి ఉత్పత్తులపై మన పరాధీనత తొలగిపోయింది. భారత్‌ ఇప్పుడు పాడి ఉత్పత్తులలో ప్రపంచ అగ్రగామిగా వెలుగొందుతోంది. ఈ ఆహారోత్పత్తి విజయాలతో ప్రజల్లో, ముఖ్యంగా బాలల్లో పోషకాహార లోపం గణనీయంగా తగ్గింది.


మన విజయగాథలో ఇవాళ నీలి విప్లవం మరో ఉజ్వల అధ్యాయంగా నిలుస్తోంది. ప్రకృతి మాత కరుణతో మన దేశానికి 11,000 కిలోమీటర్లకు పైగా తీరప్రాంతం సమకూరింది. ప్రాచీన కాలం నుంచీ సముద్రయానం, విదేశీ వాణిజ్యంలో మనకొక సుసంపన్న సంప్రదాయం కూడా ఉంది. అలాగే, మనకు మన భూభాగాల పరివేష్ఠిత సముద్రాలలో దాదాపు 24 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ప్రత్యేక ఆర్థిక మండలం (ఈఈజడ్‌) కూడా ఉంది. సముద్ర సంపదపరంగానూ ప్రపంచంలో భారత్‌ కీలక స్థానంలో నిలుస్తోంది.

ప్రధాని మోదీ ప్రభుత్వం 2019లో మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమల మంత్రిత్వశాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఆ విధంగా మత్స్య రంగం తొలిసారి ఒక మంత్రిత్వశాఖ పరిధిలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ‘‘మన జాతీయ పతాకంలోని నీలి చక్రం ‘నీలి విప్లవం’- అంటే సముద్ర ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోంది’’ అని నరేంద్ర మోదీ అభివర్ణించారు. భారత మత్స్య- జల సాగు రంగం (ఆక్వా కల్చర్‌/ ఫిషరీస్‌ సెక్టార్‌) గడచిన దశాబ్ద కాలంలో మన ఆర్థిక వ్యవస్థలో ఒక వాస్తవిక ఉషోదయ రంగంగా ఆవిర్భవించింది. అంతర్జాతీయంగా చేపల ఉత్పత్తిలో సుమారు 8 శాతం వాటాతో మన దేశం నేడు రెండో స్థానంలో ఉంది. ఇంచుమించు 3 కోట్ల మంది జాలర్లు, చేపల పెంపకందారుల జీవనోపాధికి ఇప్పుడిది ఒక పెద్ద ఆసరాగా ఉంది. అంతేకాకుండా దేశంలో ఆహార భద్రతకూ ఈ రంగం గణనీయంగా దోహదం చేస్తోంది. 2024-–25లో మన చేపల ఉత్పత్తి సామర్థ్యం 195 లక్షల టన్నుల స్థాయిని మించిపోయింది. ఈ భారీ ఉత్పత్తి మత్స్య రంగం అద్భుత పురోగమనాన్ని స్పష్టం చేస్తోంది.

మత్స్య, -పశుసంవర్ధక, -పాడిపరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇటీవల ఒడిషాలో, లక్షదీవులలో నిర్వహించిన వివిధ కార్యక్రమాలకు నేను హాజరయ్యాను. వీటిలో మొదటిది-– సముద్రపు లోతుల్లోని మత్స్య సంపద సుస్థిర వినియోగాన్ని ప్రోత్సహించేందుకు, భారత పతాకం గల నౌకలకు అధికార పత్రాల ప్రదానానికి ఉద్దేశించిన జాతీయ కార్యక్రమం. రెండోది-– మత్స్య రంగంపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన కార్యక్రమం. కేంద్ర మత్స్య, -పశుసంవర్ధక, -పాడిపరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాలను నిర్వహించడం నాకెంతో సంతోషాన్నిచ్చింది. సముద్ర మత్స్య పరిశ్రమలో వృద్ధి, సుస్థిరత, సౌభాగ్య సహిత నవశకం వైపు పయనించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ సంస్థలు, మన మత్స్యకార సంఘాల సమష్టి సంకల్పాన్ని ఆ కార్యక్రమాలు ప్రతిబింబించాయి. బాధ్యతాయుత చేపల వేట పద్ధతులు మన దేశ భవిష్యత్తుకు కచ్చితంగా విలువైన మూలధనమేనని నేను ప్రగాఢంగా విశ్వసిస్తాను. నేను ఉపరాష్ట్రపతిగా గత నెలలో లక్ష దీవులలో తొలిసారి పర్యటించాను. ఆ సందర్భంగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద అక్కడ అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని తెలిసి చాలా ఆనందించాను.


గత ఆర్థిక సంవత్సర కేంద్ర బడ్జెట్ కూడా మన ‘ఈఈజడ్‌’ పరిధిలోని జలాల్లో నిబిడీకృత సామర్థ్యం సద్వినియోగం కాకపోవడాన్ని గుర్తించింది. దీని పరిధితోపాటు అంతర్జాతీయ జలాల్లోని మత్స్య సంపద సుస్థిర వినియోగం దిశగా ఒక ప్రగతిశీల విధాన చట్రాన్ని ప్రకటించింది. ఈ కొత్త సరిహద్దుల్లో మన మత్స్యకారులు ధైర్యంగా వేటాడేందుకు ఈ కొత్త విధాన చట్రం తోడ్పడుతుంది.

మన మత్స్యకారులకు ఈ కొత్త చట్రం ఎనలేని ప్రాధాన్యమివ్వడం నాకెంతో ఆనందదాయకంగా ఉంది. ‘ఈఈజడ్‌’లో మత్స్య రంగంపై రూపొందించిన నిబంధనలు, అంతర్జాతీయ జలాల్లో వేటకు సంబంధించిన 2025 నాటి మార్గదర్శకాలు మన మాతృభూమి భారత్‌కు ఓ శుభారంభాన్ని సూచిస్తున్నాయి. ఈ మేరకు మత్స్యకారుల సహకార సంఘాలు, చేపల పెంపకందారులు, ఉత్పత్తిదారు సంస్థలు, భారతీయ మత్స్యకారులకు అధికార పత్రాల జారీలో దీనికింద ప్రాధాన్యం ఉంటుంది. అలాగే, సుమారు 32 చదరపు కిలోమీటర్ల భూభాగం గల లక్షద్వీప్‌కు దాదాపు 145 కిలోమీటర్ల తీరరేఖ, సుమారు 4,200 చదరపు కిలోమీటర్ల మడుగు ప్రాంతం ఉన్నాయి. అంతేగాక 20,000 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరిత ప్రాదేశిక జలాలు, సుమారు 4 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రత్యేక ఆర్థిక మండలం కూడా ఉన్నాయి. అంటే- భారత ‘ఈఈజడ్‌’లో దాదాపు ఆరో వంతు లక్షదీవులలోనే ఉంది. ఇదే మన నిజమైన సాగర సామర్థ్యం. ఇప్పుడు ఇదొక శక్తిమంతమైన సందేశాన్నిస్తోంది: వ్యష్టిగా పనిచేస్తే వ్యక్తి ముందడుగు వేస్తాడు, అయితే అందరూ ఒక్కటై సమష్టిగా కృషి చేస్తే ఒక పరిణామాత్మక మార్పును తేగలరు.

భారత సముద్ర ఆహారం నేడు 120కి పైగా దేశాలకు ఎగుమతి అవుతోంది. ఈ నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరంలోనే మత్స్యరంగం ఎగుమతులు రూ.73,000 కోట్ల మేర అద్భుత స్థాయికి చేరాయి. దీన్ని 2013–-14 నాటి గణాంకాలతో పోలిస్తే 140 శాతానికి పైగా పెరుగుదలను సూచిస్తుంది.


ప్రపంచ అగ్రగామి మార్కెట్లలో భారత సముద్రపు ఆహారానికి మరింత ఆదరణను సముపార్జించడంలో డిజిటల్ ప్రామాణీకరణ వ్యవస్థలు, నౌకల పర్యవేక్షణ, అంతర్జాతీయ ధ్రువీకరణ, ఇతర చర్యలు ఎంతగానో తోడ్పడతాయి. ప్రగతి పథంలో పయనించేటప్పుడు మనం ప్రకృతి పట్ల మన బాధ్యతను ఎన్నడూ మరువరాదు. సముద్రం వేల ఏళ్లుగా మానవాళిని పోషిస్తోంది. దాన్ని మరిన్ని వేల ఏళ్లపాటు పరిరక్షించడం మన పవిత్ర కర్తవ్యం. కాబట్టి, సుస్థిర చేపల వేట మనకొక నైతిక బాధ్యత. ఈ దిశగా మంత్రిత్వశాఖ జారీ చేసిన కొత్త మార్గదర్శకాలు ఒక ముందంజ. పరిరక్షణ చర్యల అమలు, చట్టవిరుద్ధ, -నియంత్రణ రహిత చేపల వేటపై కఠిన వైఖరి అవశ్యమని ఈ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. లోతైన జలాలు, అంతర్జాతీయ జలాల్లోని మత్స్య సంపద మనకు చేపల వేటలోనే కాకుండా ప్రాసెసింగ్, శీతల గిడ్డంగులు, రవాణా, ప్యాకేజింగ్, లాజిస్టిక్స్, ఎగుమతి సేవలలోనూ ఉపాధిని సృష్టించగలదు. తద్వారా మన యువతకు అపార అవకాశాలు అందివస్తాయి. ముఖ్యంగా ప్రాసెసింగ్, విలువ జోడింపులో మహిళలకు అధిక భాగస్వామ్యం లభిస్తుంది. దీంతో భారత తీరప్రాంతాల ఆర్థిక జీవనం మరింత బలోపేతం అవుతుంది.

2047 నాటికి వికసిత భారత్‌ సంకల్ప సాకారం దిశగా దేశం పయనిస్తున్న నేపథ్యంలో నీలి ఆర్థిక వ్యవస్థను సుసంపన్నమైనదిగా, సార్వజనీనమైనదిగా, సుస్థిరమైనదిగా తీర్చిదిద్దడానికి మనం కట్టుబడి ఉన్నాం. ఈ నీలి విప్లవ పథంలో ప్రతి రంగానికి తనదైన పాత్ర ఉంటుంది. ఆ మేరకు మత్స్యకార సంఘాలు జాతీయ నీలి ఆర్థిక వ్యవస్థకు సారథ్యం వహిస్తాయి. ప్రధాని మోదీ దార్శనిక నాయకత్వంలో మత్స్య మంత్రిత్వశాఖ ఈ దిశగా చేస్తున్న కృషి అభినందనీయం. నీలి విప్లవం ద్వారా వృద్ధి, సుస్థిరత, సౌభాగ్య సహిత నవశకం వైపు అది గణనీయ ప్రగతి సాధిస్తోంది. చేపల వేటను వారసత్వ వృత్తిగా మాత్రమేగాక విజ్ఞానం, సాంకేతికత, ఆవిష్కరణలు సహా అంతర్జాతీయ అవకాశాల వైపు నడిపించే ఒక ఆధునిక వృత్తిగా పరిగణించాలని ఈ సందర్భంగా యువతకు సూచిస్తున్నాను. అలాగే, మన మత్స్యకార సమాజానికి జ్ఞానం, సాంకేతికత, ఆర్థిక సహాయం ద్వారా చేయూతను కొనసాగించాలని నేను మన సంస్థలను కోరుతున్నాను. ఆత్మవిశ్వాసంతో ముందడుగువేస్తూ సమష్టిగా మరింత శక్తిమంతమైన తీరప్రాంత మాతృభారతాన్ని ఆవిష్కరిద్దాం. సదా మాతృభూమి సేవలో...!

సి.పి.రాధాకృష్ణన్‌

భారత ఉపరాష్ట్రపతి

Also Read:

9 ఏళ్ల బాలుడికి యూట్యూబ్‌ ఛానల్.. యాడ్స్‌పై రూ.1.13 కోట్ల ఖర్చు

కూటమి ప్రభుత్వంపై కుట్రలను తిప్పికొట్టాలి: నారా లోకేశ్

Updated Date - Sep 17 , 2026 | 02:25 AM