Share News

గురిలేని విఫల ఉరిశిక్షలు

ABN , Publish Date - Nov 20 , 2026 | 12:41 AM

మరణశిక్షల నైతిక, న్యాయబద్ధతల విషయం గతవారం ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో మరోసారి చర్చకు వచ్చింది.

గురిలేని  విఫల ఉరిశిక్షలు

న్యాయాధికారం అనే ముసుగులో మనిషి ప్రాణాలు తీయడం అంటే, రాజ్యం తాను ఏ హింసనైతే ఖండిస్తోందో, తిరిగి అదే హింసను అనుసరించడమే! ఉరిశిక్షలను చట్టబద్ధం చేయడం ద్వారా రాజ్యం తిరిగి వెనక్కి తీసుకోలేని నైతిక హద్దును దాటుతోంది.

మరణశిక్షల నైతిక, న్యాయబద్ధతల విషయం గతవారం ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో మరోసారి చర్చకు వచ్చింది. మరణశిక్షలను పూర్తిగా రద్దు చేయాలని, ప్రపంచవ్యాప్తంగా ఉరిశిక్షల అమలు మీద తాత్కాలిక నిషేధం విధించాలని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానానికి 133 సభ్యదేశాలు అనుకూలంగా ఓటు వేసినా, భారతదేశం మరో 32 దేశాలతో కలిసి ఈ తీర్మానాన్ని వ్యతిరేకించింది. అత్యంత అరుదైన కేసులలో చట్టబద్ధమైన ప్రక్రియకు లోబడి మాత్రమే మరణశిక్షలు విధిస్తున్నామని న్యూఢిల్లీ సమర్థించుకుంది. చట్టవిరుద్ధమైన హత్యలకు, న్యాయస్థానాలు విధించే మరణశిక్షలకు మౌలికమైన తేడా ఉందని ఐరాస వేదికపై భారత్‌ వాదించినప్పటికీ, చట్టం ముసుగులో మనుషుల ప్రాణాలను తీసే ఈ వైఖరిపై మానవ హక్కుల దృక్పథం నుంచి వెలువడుతున్న విమర్శలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఒక వ్యక్తి ప్రాణాలను తీసే నైతిక లేదా సార్వభౌమ అధికారం రాజ్యానికి లేదు. న్యాయాధికారం అనే ముసుగులో మనిషి ప్రాణాలు తీయడం అంటే, రాజ్యం తాను ఏ హింసనైతే ఖండిస్తోందో, తిరిగి అదే హింసను అనుసరించడమే! ఉరిశిక్షలను చట్టబద్ధం చేయడం ద్వారా రాజ్యం తిరిగి వెనక్కి తీసుకోలేని నైతిక హద్దును దాటుతోంది.భవిష్యత్తులో జరిగే ఘోర నేరాలను ఉరికంబం భయం నిరోధిస్తుందని మరణశిక్షల సమర్థకులు తరచూ వాదిస్తుంటారు. కానీ గణాంకాలను పరిశీలిస్తే ఈ వాదన భారతదేశం విషయంలో పూర్తిగా తప్పు అని అర్థమవుతుంది.2016 నుంచి 2025 మధ్యకాలంలో, దేశంలోని సెషన్స్ కోర్టులు దాదాపు 1,310 మందికి మరణశిక్షలు విధించాయని జాతీయ నేర గణాంకాల బ్యూరో చెబుతోంది.


ఇలా శిక్షల విధింపులో భారీ పెరుగుదల కనిపిస్తున్నప్పటికీ ఆ పదేళ్లలో వాస్తవంగా అమలైన ఉరిశిక్షలు కేవలం నాలుగు మాత్రమే. 2012 నాటి నిర్భయ కేసులో నలుగురు దోషులకు 2020 మార్చిలో ఉరిశిక్షలు అమలు చేశారు. అంతకుముందు 2012లో అజ్మల్ కసబ్, 2013లో అఫ్జల్ గురు, 2015లో యాకూబ్ మెమన్‌ల ఉరిశిక్షలను కలుపుకున్నా, గత రెండు దశాబ్దాలకు పైగా కాలంలో మన దేశం పది కన్నా తక్కువ మందినే ఉరితీసింది. ఆచరణలో దాదాపు అమలు కాని, ఏళ్ల తరబడి అప్పీళ్ల ప్రక్రియలో జాప్యం జరిగే, ఈ శిక్ష ఎంతవరకు సమర్థమైన నేర నిరోధకమో అర్థం కాదు.

అజ్మల్ కసబ్, నిర్భయ దోషుల వంటి సంచలన కేసులలో ఉరిశిక్షలు అమలు చేసినప్పటికీ, అవి అలాంటి నేరాలను ఆపలేకపోయాయి అనేందుకు స్పష్టమైన దాఖలాలు ఉన్నాయి. 26/11 ముంబైలో ఉగ్రదాడులకు గాను 2012లో కసబ్‌ను ఉరితీయడం వల్ల సరిహద్దు ఆవలి ఉగ్రవాద నెట్‌వర్క్‌లు ఆగిపోలేదు, భారత గడ్డపై ఉగ్రదాడులూ తగ్గలేదు. అదేవిధంగా, 2012 నిర్భయ విషాదం తర్వాత వెల్లువెత్తిన ప్రజాగ్రహంతో తీవ్రమైన లైంగిక నేరాలకు మరణశిక్షలను విస్తరిస్తూ చట్టసవరణలు చేశారు. చివరకు 2020లో ఆ నలుగురు దోషులను ఉరితీశారు. అయినప్పటికీ, దేశవ్యాప్తంగా లైంగిక హింసలో తగ్గుదల కనిపించలేదు. జాతీయ నేర గణాంక బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక ప్రకారం, ఒక్క 2024లోనే భారతదేశంలో 29,536 అత్యాచార కేసులు నమోదయ్యాయి..

దేశంలో ప్రతి 71 సెకన్లకు మహిళలపై ఏదో ఒక నేరం నమోదవుతోంది. లైంగిక దాడుల కేసులలో మరణశిక్షలను విస్తరించడం వల్ల నేరస్థులు భయపడటానికి బదులు, ఏకైక సాక్షి అయిన బాధితురాలిని సైతం హత్య చేసి ఆధారాలు చెరిపివేసే ప్రమాదకర ధోరణి పెరుగుతోంది. మరోవైపు, తిరిగి సరిదిద్దలేని మరణశిక్షను విధించడానికి న్యాయమూర్తులు వెనుకాడటం వల్ల నేర నిరూపణ రేటు మరింత పడిపోతోంది


ఒక నేరస్థుడి ఉనికి ఒక మహిళ ప్రాణాలకు, శారీరక స్వేచ్ఛకు నిరంతర ముప్పుగా పరిణమించినప్పుడు, సమాజం నుంచి అత్యంత కఠినమైన స్పందన రావాలి. ఆ స్పందన ప్రతీకార చర్యలకు గాక, మహిళల రక్షణకు ప్రాధాన్యం ఇచ్చేదిగా ఉండాలి. ఉరికంబం చుట్టూ తిరిగే ప్రతీకాత్మక రాజకీయాలను పక్కనపెట్టి, వ్యవస్థాగత సంస్కరణల దిశగా విస్తృత స్థాయి విధానపరమైన చర్చ జరగాలి. శిక్షల తీవ్రత కంటే, నేరం చేస్తే తప్పకుండా వెంటనే శిక్ష పడే పరిస్థితి ఉండటమే అసలైన నేర నిరోధకంగా పనిచేస్తుంది.

ఇందుకోసం మందకొడిగా సాగే పోలీసు దర్యాప్తులను సమూలంగా ప్రక్షాళన చేయాలి. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను విస్తరించాలి. లైంగిక దాడుల విచారణలో నేర నిరూపణ రేటును పెంచాలి. సంస్కరణకు ఏ మాత్రం అవకాశం లేని కరుడుగట్టిన నేరస్థులకు ముందస్తు విడుదలకు వీలులేని కఠిన యావజ్జీవ కారాగార శిక్షను అమలు చేయాలి. నమోదైన అత్యాచార కేసులలో 96.8శాతం మంది నిందితులు బాధితులకు తెలిసినవారేనని ఎన్‌సీఆర్‌బీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి ఇళ్లలోనూ సమాజంలోనూ మహిళలను అభద్రతకు గురిచేస్తున్న పితృస్వామ్య ఆధిపత్య భావజాలం, సామాజిక కట్టుబాట్లు, వ్యవస్థాగత వైఫల్యాలపై విధాన నిర్ణేతలు దృష్టి సారించాలి, మగపిల్లల పెంపకంలో మార్పు తేవాలి.

మానవీయ విలువలను, హక్కులను గౌరవించే ఒక పరిణతి చెందిన ప్రజాస్వామ్యం, ఒక వ్యక్తి ప్రాణం తీసే స్థాయికి దిగజారకుండానే ప్రమాదకర నేరస్థులను శాశ్వతంగా సమాజానికి దూరం చేసి కట్టడి చేయగలదు.

జి. జ్యోతిరావు

అధ్యక్షురాలు, అమిక మధ్యవర్తిత్వ కేంద్రం

ఇవి కూడా చదవండి..

ట్రైన్ డ్రైవర్ క్యాబిన్‌లోకి వెళ్లేందుకు యువతి యత్నం.. ఘటనపై ఆర్పీఎఫ్‌ విచారణ

‘అక్వాన్’ తుపాను: 5 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో 31 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాల మోహరింపు

Updated Date - Nov 20 , 2026 | 01:19 AM