Share News

విపక్ష రాజకీయాల్లో మౌలిక మార్పు ఎలా?

ABN , Publish Date - Jun 18 , 2026 | 04:04 AM

పది రోజుల క్రితం జరిగిన ప్రతిపక్ష ఇండియా కూటమి సమావేశం మన కాలపు ఒక రాజకీయ ఆవశ్యకతను గుర్తుచేసింది. తమ విధ్యుక్త ధర్మ నిర్వహణలో ప్రతిపక్షాలు సరికొత్తగా పునఃప్రారంభమవడమే...

విపక్ష రాజకీయాల్లో మౌలిక మార్పు ఎలా?

పది రోజుల క్రితం జరిగిన ప్రతిపక్ష ఇండియా కూటమి సమావేశం మన కాలపు ఒక రాజకీయ ఆవశ్యకతను గుర్తుచేసింది. తమ విధ్యుక్త ధర్మ నిర్వహణలో ప్రతిపక్షాలు సరికొత్తగా పునఃప్రారంభమవడమే వాటి ప్రస్తుత కర్తవ్యమవాలి. దూరదృష్టి, దీక్షా దక్షతలతో కూడిన ప్రతిపక్షాల క్రియాశీలతను అవి చూపాలి. అవును, ప్రతిపక్షాల ఐక్యత మనకు అవసరం, అత్యవసరం కూడా. అంతే కాకుండా ఒక శక్తిమంతమైన సమైక్య ప్రతిపక్షం పునరుద్ధరణ ఇప్పుడు మనకు అవసరం.

సందేహం లేదు, నేడు మనకు సరికొత్త, సమైక్య ప్రతిపక్షం ఆవశ్యకత మునుపెన్నడూ లేని విధంగా ఉన్నది. అది అవశ్యం. ఎందుకని? రాజ్యాంగబద్ధమైన మార్గాల ద్వారానే నిరంకుశత్వం ప్రబలుతున్న సందర్భంలో మనమున్నాం. రాజ్యాంగ సంస్థల మధ్య ఉండాల్సిన సమతౌల్యత క్రమంగా క్షీణిస్తోంది. ఫలితంగా ప్రజాస్వామిక పాలన బలహీనపడుతోంది. అధికారాలు కేంద్రీకృతమవుతున్నాయి. ఈ పరిస్థితుల పట్ల ప్రజా వ్యతిరేకత కూడా ప్రబలుతోంది. సంకుచిత మెజారిటేరియన్‌ శక్తుల ప్రాబల్యం నుంచి మన గణతంత్ర రాజ్యాన్ని రక్షించుకోవాల్సిన అవసరమున్నది. ఈ సవాల్‌ నెదుర్కొనేందుకు ప్రతిపక్ష ఇండియా కూటమి ఏ మేరకు సంసిద్ధంగా ఉన్నదీ ఇప్పుడే చెప్పలేం. మన ప్రజాస్వామ్యం మనుగడ ఒక విషమ పరిస్థితిలో ఉన్నది. దీన్ని అధిగమించేందుకు ప్రతిపక్షాలు సంప్రదాయ రాజకీయ పద్ధతులకు భిన్నమైన మార్గాలను అనుసరించడం ముఖ్యం. అందుకు నిజమైన రాజనీతిజ్ఞత అవసరం. అంతకంటే ముఖ్యంగా నైతిక నిబద్ధత చూపాలి.

ప్రతిపక్ష రాజకీయాలలో ఒక మౌలిక మార్పు రావాలి. ఇదెలా సాధ్యమవుతుంది? ఎన్నికలలో గెలుపు సాధించడమే ధ్యేయంగా ఉండకూడదు. ప్రభుత్వ అధికారాన్ని స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా ఉన్న రాజకీయాల నుంచి గణతంత్రాన్ని కాపాడుకునే రాజకీయాల దిశగా ఆ మార్పు ఉండాలి. ఇందుకు ప్రతిపక్షాల దృక్పథం మారాలి. ప్రతిపక్షం విధులను పునర్‌ నిర్వచించాలి. ప్రతిపక్షాల ఐక్యతకు ప్రయత్నించాలి. ప్రతిపక్ష రాజకీయాలు చేయడమంటే ఏమిటో కొత్త ఆలోచనలతో నిర్ణయించుకోవాలి. తమ రాజకీయ కార్యాచరణలో ప్రజలను భాగస్వాములను చేసుకోవాలి. ఈ కార్యాచరణపరమైన మార్పు తప్పనిసరి. ఆ దిశగా మొదటి అడుగు పలు ప్రధాన ప్రతిపక్షాలు భాగస్వాములుగా ఉన్న ‘ఇండియా’ కూటమిని పునరుజ్జీవింపచేయడమే. తద్వారా మాత్రమే ప్రస్తుతం అధికారంలో ఉన్న పాలకులను సవాల్‌ చేయడం సాధ్యమవుతుంది. ప్రస్తుత నాయకులతోనే అది జరగాలి. ఈ నాయకుడి లేదా ఆ నాయకుడి యోగ్యతలు, అయోగ్యతల విషయమై చర్చలు వ్యర్థం. ప్రత్యామ్నాయ వ్యవస్థీకృత రాజకీయాలను అభివృద్ధిపరచడమే లక్ష్యంగా ఉండాలి. 2024 సార్వత్రక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని గట్టిగా సవాల్‌ చేసేందుకు ప్రతిపక్షాలు వేసిన ముందడుగే ‘ఇండియా’ కూటమి ఏర్పాటు. గత లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి కనీస మెజారిటీ సైతం లభించకుండా చేయడంలో ఇండియా కూటమి సఫలమయింది. అయితే తదాది దాని ప్రస్థానం నిరాశాజనకంగా సాగుతూ వస్తోంది.


గత సార్వత్రక ఎన్నికల అనంతరం వివిధ రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ మంచి విజయాలు సాధించి దేశ రాజకీయాలలో తన స్థానాన్ని మరింతగా బలోపేతం చేసుకున్నది. ఆ సార్వత్రక విజయం అనంతరం ప్రభుత్వ ఆధ్యర్యంలోని దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి పలు ప్రతిపక్షాలకు తీరని నష్టం వాటిల్లేలా చేసింది. ఈ పరిణామంతో ప్రతిపక్షాలలో నైతిక స్థైర్యం దిగజారిపోయింది. విపక్షాల స్వీయ తప్పిదాలు కూడా వాటి ప్రస్తుత దుస్థితికి కారణమయ్యాయన్నది ఎవరూ కొట్టివేయలేని సత్యం. నిజానికి ఇండియా కూటమి సమావేశం ఎప్పుడోనే జరిగి ఉండవల్సింది. జూన్‌ 8 నాటి సమావేశం భాగస్వామ్య పక్షాలు తమ మధ్య అంతర్గత విభేదాలను తొలగించుకునేందుకు తోడ్పడింది. తరచూ సమావేశమవ్వాలని, పార్లమెంటులో సమన్వయ సహకారంతో పనిచేయాలని ‘ఇండియా’ భాగస్వాములు నిర్ణయించుకోవడం ముదావహం. అయితే ఆ సమావేశం అనంతరం ప్రకటించిన కార్యాచరణ పథకం ప్రభుత్వాన్ని సమర్థంగా సవాల్‌ చేసేందుకు సహాయపడుతుందా? నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన డీలిమిటేషన్‌ బిల్లును అడ్డుకోవడంలో సాధించిన విజయం స్ఫూర్తితో రాజ్యాంగ సంస్థల కూల్చివేతకు జరుగుతోన్న ప్రయత్నాలను నిరోధించేందుకు విపక్షాలు ఒక సమైక్య వ్యూహాన్ని రూపొందించుకోవాలి.

ఇందుకు ఇండియా కూటమికి వెలుపల ఉన్న ప్రతిపక్షాలతో ప్రయోజనకరంగా పొత్తు పెట్టుకోవల్సిన అవసరమున్నది. ప్రజల విశ్వసనీయతను పొందేందుకు ఇది తోడ్పడుతుంది. రాజకీయ పక్షాల విషయాన్ని అలా ఉంచితే ఇప్పుడు దేశవ్యాప్తంగా అనేక సమస్యలపై ప్రజా నిరసనలు, ప్రజా పోరాటాలు ప్రజ్వరిల్లుతున్నాయి. బీజేపీ–ఆరెస్సెస్‌లను మొదటి నుంచీ సైద్ధాంతికంగా వ్యతిరేకిస్తున్న ప్రజా సంఘాలు ఆ ఆందోళనలలో కొన్నిటికి నాయకత్వం వహిస్తున్నాయి. వామపక్షాలకు అనుబంధంగా ఉన్న కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, ఇంకా పౌర, మానవ హక్కుల సంఘాలు మొదలైనవి ప్రజా చైతన్యాన్ని పెంపొందిస్తున్నాయి. వివిధ సామాజిక సముదాయాల ప్రత్యేక సమస్యలపై పోరాడుతున్న ప్రజా సంఘాల పోరాటాలు తప్పనిసరిగా భావజాలపరమైనవి కాకపోవచ్చు కానీ ఆదివాసీలు, ఓబీసీలు, దళితులు, సంచార జాతులు, మైనారిటీలలో ప్రజాస్వామిక చైతన్యానికి అవి తోడ్పడుతున్నాయి. ప్రశ్న పత్రాల లీకేజీ, అభివృద్ధి ప్రాజెక్టుల నెపంతో ప్రభుత్వాలు చేస్తున్న భూసేకరణ, పాలనా వ్యవస్థల్లో అవినీతి తదితర సమస్యలకు వ్యతిరేకంగా రగులుతున్న నిరసనలు, సాగుతున్న పోరాటాలు ఒక స్పష్టమైన సైద్ధాంతిక స్ఫూర్తితో బీజేపీ పాలనను వ్యతిరేకిస్తున్నవి కావు.


ఈ వాస్తవాలు, ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ పట్ల ప్రతిపక్షం దృక్పథం ఎలా ఉండాలో స్పష్టం చేస్తున్నాయి. సమాజంలోని పరిస్థితుల పట్ల యువ భారతీయుల అసంతృప్తిని, ఆగ్రహాన్ని శక్తిమంతంగా, వినూత్నంగా వ్యక్తం చేసిన ఉద్యమమది. అయితే సర్వత్రా స్వార్థపరత్వంతో కరడుగట్టిన వ్యవస్థను ఆ ‘బొద్దింకల ఉద్యమం’ బద్దలుకొడుతుందని ఆశించడం శుద్ధ పొరపాటే అవుతుంది. ఎందుకంటే అదొక అపరిణత రాజకీయ సంస్థ. ఆవశ్యక మౌలిక మార్పును సాధించే బృహత్‌ రాజకీయ బాధ్యతా భారాన్ని దానిపై మోపడం సరికాదు. అదే సమయంలో దాన్ని ఏ విధంగాను కొట్టివేయడమూ సమంజసం కాదు. అలాంటి వైఖరి ప్రతిపక్షానికి తనను తాను దెబ్బ తీసుకోవడమే అవుతుంది. చెప్పవచ్చినదేమిటంటే ప్రజలు తమంతట తాము వీధుల్లోకి వస్తున్నారు. ప్రభుత్వం పట్ల తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రజాందోళనలను ఒక అవకాశంగా ప్రతిపక్షం తీసుకోవాలి. వాటిని తమ ప్రతిష్ఠకు, మనుగడకు ముప్పుగానో, పోటీగానో ఎంత మాత్రం చూడకూడదు. ఎటువంటి మినహాయింపులు లేకుండా ఆ ప్రజాశక్తితో మమేకమవ్వాలి.

ప్రజలు ఉద్యమిస్తున్నారు, పోరాడుతున్నారు. ప్రతిపక్షాన్ని పునరుద్ధరించడమనే చరిత్రాత్మక కర్తవ్యం వారి ఉద్రేకాలు, బాధలు, నిరసనలు అన్నిటినీ ఏకీకృతం చేసి ఒక సమష్టిశక్తిగా రూపొందించాలి. ప్రతిపక్ష రాజకీయాలలో మౌలిక మార్పుకు ప్రయత్నించడం ద్వారానే అది సాధ్యమవుతుంది. ఆ మార్పును సాధించడమెలా? ప్రభుత్వాన్ని విమర్శించడానికే, అదెంత అత్యవసరమూ, న్యాయబద్ధమూ అయినా ప్రతిపక్షం పరిమితం కాకూడదు. ప్రత్యామ్నాయ రాజకీయాలను నిర్మించేందుకు ఇండియా కూటమి అజెండా ఏమిటి? ఈ విషయాన్ని దేశ ప్రజలకు స్పష్టంగా వివరించాలి. ఇందుకొక పూర్తి స్థాయి మ్యానిఫెస్టోను విడుదల చేయాలి. అందుకు సమయం పడుతుంది కనుక ఆలోగా కొన్ని ప్రధాన ఆలోచనలు, ప్రతిపాదనలతో ప్రజల ముందుకు వెళ్లాలి. ప్రజలతో సంభాషించడమనేది పత్రికా విలేఖర్లతో భేటీ, పార్లమెంటరీ ప్రసంగాలు, ప్రకటనలకే పరిమితం కాకూడదు. శాంతియుతమైన, అహింసాత్మక పద్ధతుల్లో చేస్తున్న వీధి పోరాటాలను మరింత ప్రభావశీలంగా నిర్వహించడం ద్వారా ప్రజలకు తమ సందేశంతో చేరువ కావాలి. ప్రజలు సులభంగా అర్థం చేసుకోలేని రాజ్యాంగ సంబంధిత వాదనల నుంచి సాంస్కృతికంగా ఉత్తేజపరిచే భావోద్వేగాలతో మిళితమైన పద్ధతులను అనుసరించాలి. ఇందుకు భారత జాతీయోద్యమ మహోన్నత వారసత్వం, మన పురానవ మత సంప్రదాయాలు, మన సమున్నత నాగరికతా విలువల నుంచి ప్రతిపక్షం స్ఫూర్తి పొందవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.


పాలకులు తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికై ఉద్దేశపూర్వకంగా సృష్టించే కథనాలను తార్కిక విమర్శ, హేతుబద్ధమైన వాదనతో ప్రతిపక్షం ఎదుర్కోవాలి. అసాధారణ సమయాల్లో సైతం పాలకుల రాజకీయ ప్రాబల్యాల నెదుర్కొనేందుకు మీమ్స్‌, కార్టూన్లు, ‘బొద్దింకల’ తరహా నిరసనలు చాలా ప్రభావవంతంగా ఉపయోగపడతాయి. ‘పెరుగుట విరుగుట కొరకే’ అన్నది ప్రజల అనుభవంలో ఉన్న చిర సత్యం. సర్వాధికారాలు తమ చేతుల్లో కేంద్రీకృతమయ్యాయని నిరంకుశ పాలకులు సంతృప్తి చెందిన తరుణంలోనే వారి సర్వాధిపత్యం బద్దలవడం ప్రారంభమవుతుందని చరిత్ర నిరూపించిన సత్యం. వాస్తవానికి నిరంకుశ పాలనా వ్యవస్థలు పెళుసైనవి. వ్యవస్థీకృత ప్రతిపక్షం సవాల్‌ చేసినప్పుడు అవి కూలిపోతాయి. ఈ సత్యాన్ని భారతీయ ప్రతిపక్షాలు సదా గుర్తుంచుకోవాలి.

యోగేంద్ర యాదవ్

(వ్యాసకర్త ‘స్వరాజ్‌ ఇండియా’ అధ్యక్షుడు)

ఇవీ చదవండి:

సైబర్ నేరస్థులు 'పరాన్నజీవులు'.. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

ఐఎస్ఐ సంబంధిత ఉగ్ర ముఠా గుట్టురట్టు.. ఏడుగురి అరెస్ట్

Updated Date - Jun 18 , 2026 | 04:04 AM