Share News

తెలుగిళ్ళ శ్రీనాథము

ABN , Publish Date - Jun 08 , 2026 | 02:13 AM

తెలుగువారి అహారపు అలవాట్లలో ఆవకాయ పచ్చడికీ, పెరుగన్నానికీ, మిగతా అన్ని ఆహార పదార్ధాలతో పోలిస్తే, ఒక ప్రత్యేక స్థానం ఉంది. అన్నంలోకి కూరలు ఏమీ లేకపోయినా, మొదట్లో రెండు ముద్దలు కలుపుకుని...

తెలుగిళ్ళ శ్రీనాథము

తెలుగువారి అహారపు అలవాట్లలో ఆవకాయ పచ్చడికీ, పెరుగన్నానికీ, మిగతా అన్ని ఆహార పదార్ధాలతో పోలిస్తే, ఒక ప్రత్యేక స్థానం ఉంది. అన్నంలోకి కూరలు ఏమీ లేకపోయినా, మొదట్లో రెండు ముద్దలు కలుపుకుని తినడానికి ఒక బద్ద ఆవకాయ కారము, ఆ తరువాత కాస్త పెరుగు కలిపిన అన్నము, పక్కన నంజుకోవడానికి కారం తుడిచేసిన అదే ఆవకాయ బద్ద ఉంటే చాలు ఆ పూట గడిచి పోతుంది అనుకుంటాం. ఇది అతిశయోక్తి కాదు. బాగా ముసురు పట్టి, కూరలు కొనుక్కోవడానికి కాలు బయట పెట్టలేని వానాకాలం రోజులలో, ఒకటి రెండు పూటలు ఇలా గడవడం సాధారణంగా జరిగే విషయమే. ఈ అలవాటు ఎప్పటిది? అని ఎవరైనా సరదాకైనా ప్రశ్న వేసుకుని అవలోకిస్తే మహాకవి శ్రీనాథుడు నివసించిన (క్రీ.శ.1370– 1450) 14–15 శతాబ్దుల నాటి కంటే పూర్వపుదే అని సమాధానం దొరుకుతుంది.

పెరుగన్నంలో ఆవకాయ నంజుకుని భుజిస్తుంటే మంట నషాళానికి అంటినప్పుడు కలిగే అనుభవం శ్రీనాథుని ‘శృంగార నైషధం’ ఆరవ ఆశ్వాసంలోనిదైన ఈ పద్యంలో స్ఫష్టంగా కనిపిస్తుంది.

తే. మిసిమిగల పుల్ల పెరుగుతో మిళిత మైన

ఆవపచ్చళ్ళు చవిచూచిరాదరమున

జుఱ్ఱుమని మూర్ధములుదాఁకి యెఱ్ఱఁదనము

బొగలు వెడలంగ నాసికాపుటములందు.

(శృం.నై. ఆరవ ఆశ్వాసం, 130 పద్యం)

తొలినాళ్ళ నుంచీ తెలుగు సాహిత్యం నేల విడిచి సాము చెయ్యడంలో మునిగిపోయిందనే మాట సంగతి అలా ఉంచితే, తెలుగు సాహిత్యాన్ని నింగి నుంచి నేల మీద ‘వీధి’ లోకి లాక్కొచ్చి దాన్ని సామాన్య ప్రజానీకం మధ్య నిలబెట్టిన ఘనత పూర్వ కవులలో శ్రీనాథుడికి చెందినంతగా మరెవరికీ చెందదు. చాటు పద్యాల రూపంలోనే కాకుండా, అవకాశం చిక్కినప్పుడల్లా కావ్యాలలో సైతం తెలుగువారి జీవన విధానానికి సంబంధించిన అనేక విశేషాలనూ, ఆహారపుటలవాట్లనూ విస్తృత స్థాయిలో పొందుపరిచిన వ్యక్తి, మహాకవి శ్రీనాథుడు. శ్రీనాథుడి కంటే ముందు నన్నయ, తిక్కనలు ఈ పని ఎందుకు చేయలేకపోయారు? అనే ప్రశ్నకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తే, ముందుగా అర్థ చేసుకోవాల్సిన విషయాలు రెండు. ఒకటి – అసలు తెలుగులో పద్యమైనా, గద్యమైనా శాసనాల్లో తప్ప వేరే ఎక్కడా లిఖితమై లేని ఆ రోజులలో, తనకు అప్పగించబడిన ‘మహాభరత ఆంధ్రీకరణం’ అనే అతి పెద్ద పనిని బాధ్యతాయుతంగా నిర్వర్తించడంలో మునిగిపోయిన నన్నయ దృష్టి ప్రధానంగా తెలుగులో పద్య నిర్మాణానికి, కావ్య నిర్మాణానికి సంబంధించిన వ్యవస్థను ఏర్పరచడం పైనే తప్ప వేరే విషయాలపై ఉండకపోవడం సహజం. రెండు – తిక్కన విషయానికొస్తే, ఏ కారణం చేతనో అసంపూర్తిగా ఆగిపోయిన మహాభారత అంధ్రీకరణ యజ్ఞంలో తాను చేపట్టి పూర్తి చేయాల్సిన భాగం కొండంత. కనుక తిక్కన దృష్టంతా మహాభారత అంధ్రీకరణాన్ని నన్నయ చూపిన దారిలో ముందుకు తీసుకువెళ్ళి పూర్తి చేయడంపైనే తప్ప, వేరే విషయాలపై ఉండే అవకాశం లేదు.


శ్రీనాథుని కాలానికి ఈ అవస్థ లేదు. వ్యక్తిత్వ పరంగా ఆలోచిస్తే, శ్రీనాథుడిది ఏ అవస్థనూ ఆట్టే పట్టించుకోని, మనసుకు అంటించుకుని అదే పనిగా మథనపడడానికి ఇచ్చగించని మనస్తత్వం. జీవితాన్ని ఒక ప్రయాణంగా తీసుకుని సంచరిస్తూ కొత్త కొత్త విషయాలను అన్వేషించడంపై శ్రద్ధ చూపిన శ్రీనాథుడు, తన సాహిత్యంలోనూ అదే ధోరణిని కొనసాగించాడు. ఈ ధోరణి ఫలితమే కావ్యాలలో కొద్దోగొప్పో పరిమాణంలో మనకిప్పుడు లభ్యమౌతున్న ఆనాటి ప్రజల జీవన చిత్రణ.

శ్రీనాథుడి ‘శివరాత్రి మహత్యం’ కావ్యంలోనివైన రెండు పద్యాల గురించి ఇక్కడ ముచ్చటించుకోవాలి.

గీ. చలి ప్రవేశించు నాగుల చవితినాడు

మెఱయు వేసవి రథసప్తమీ దినమున

అచ్చు సీతు ప్రవేశించు పెచ్చు పెరిగి

మార్గశిర పౌష్యమాసాల మధ్య వేళ.

(నాల్గవ ఆశ్వాసం, 25వ పద్యం)

గీ. ఇండ్ల మొదలను నీరెండ నీడికలను

అనుగుదమ్ముడు నన్నయు నాటలాడు

అత్తయును కోడలును కుమ్ములాడు కుమ్ము

గాచుచోటికి మకర సంక్రాంతి వేళ.

(నాల్గవ ఆశ్వాసం, 27వ పద్యం)

దీపావళి తరువాత వచ్చే నాగులచవితి రోజున చలి వాతావరణంలో ప్రవేశిస్తుందని, రథసప్తమి (మాఘమాసంలో వచ్చే శుద్ధసప్తమి తిథిని రథసప్తమి అంటారు, ఫిబ్రవరి నెలలో వస్తుంది) రోజునుంచి వేసవి ఎండ మెరవడం మొదలెడుతుందని, మార్గశిర పుష్య మాసాలలో (అనగా డిసెంబరు, జనవరి నెలలు) అచ్చమైన చలి పెచ్చుపెరిగి ప్రజలను వణికిస్తుందని మొదటి పద్యం చెప్తుంది.

ఒక సంక్రాంతి వేళ, ఒక తెలుగింటి ముంగిలి నమూనా చిత్రం రెండవ పద్యం. ప్రభాత కాలపు నీరెండలో, అన్న తన తమ్ముడితో ఆటలాడుకోవడం, అదే సమయంలో ఇంటిలో అత్తా కోడళ్ళు చలికాచుకోవడానికి పొయ్యి ముందు స్థానం కోసం, నేను ముందంటే నేను ముందని, పరుగు తీసే దృశ్యం కళ్ళకు కట్టినట్లు చిత్రించబడి కనిపిస్తుంది ఈ పద్యంలో. ఇలాంటి చిత్రాలన్నీ మొదటగా చిక్కింది శ్రీనాథుడి కంటికే. ఇట్లాంటి వాటినన్నిటినీ మనసుపడి కవిత్వీకరించింది కూడా మొదటగా శ్రీనాథుడే. తెలుగువాడి జిహ్వను ఆవకాయ పెరుగన్నాల రుచి ఎన్ని శతాబ్దాలు గడిచినా ఎలా విడిచిపెట్టి వెళ్ళదో, అలాగే శ్రీనాథుడు కవిత్వీకరించి చూపెట్టిన తెలుగిళ్ళ ఆచారాల, అలవాట్లలోని సౌకుమార్యం, సౌందర్యం ఎన్ని శతాబ్దాలు గతించినా కనుమరుగైపోదు.


తెలుగిళ్ళ సంస్కృతి గురించిన సమాచారం ఈ రెండు పద్యాల్లో అలతి అలతి మాటలలో అతి మనోహరంగా పొందుపరచబడింది. శ్రీనాథుడు ఈ మొదటి పద్యంలో పేర్కొన్న కాలగమనంలో ప్రకృతిలో చోటుచేసుకునే మార్పులకు సంబంధించిన సమాచారం స్థూలంగా భారతదేశం మొత్తానికీ వర్తించినా, రెండవ పద్యంలో పేర్కొన్న సంక్రాంతివేళ చిత్రణ కేవలం దక్షిణాది ప్రజలకు, అందునా ముఖ్యంగా తెలుగు ప్రజలకు సంబంధించినది.

బుద్ధి పెరుగుతున్న తొలినాళ్ళలోనే, అంటే పిల్లలు నాల్గవ లేదా ఐదవ తరగతి చదువుతున్న రోజులలోనే, ఈ పద్యాలను కంఠస్తం చేయించి మనసుకు పట్టిస్తే జరిగే ఉపయోగాలు రెండు: ఒకటి – భారతీయులు గానూ, తెలుగువారి గానూ మనదైన ఒక సంస్కృతిలో చాంద్రమానాన్ని అనుసరిస్తూ మనం పెట్టుకున్న గుర్తులు, తిథులకు సంబంధించిన సమాచారం చిన్నతనంలోనే మనసుకు పట్టడం.

రెండవది – ఏ ఏ తిథినాడు ప్రకృతిలో ఏ ఏ మార్పులు చోటు చేసుకుంటాయో, స్థూలంగానైన ఒక అవగాహన ఏర్పడడం. ఒక అర్ధ శతాబ్ది క్రితందాకా ‘పెద్ద బాలశిక్ష’ రూపంలో ఇలాంటి సమాచారమంతా విద్యార్థి చిత్తంలోకి గుప్పించబడేది. విద్యా బోధనలో కాలానుగుణంగా చోటు చేసుకున్న మార్పులలో దీన్ని తరగతులలో పాఠ్యాంశంగా వదిలేశారు.

భట్టు వెంకటరావు

ఈ వార్తలు కూడా చదవండి...

ఫాంహౌస్‌ కేడీతోనైనా, ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడేందుకు సిద్ధం: సీఎం రేవంత్‌‌రెడ్డి

ఆ పనుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు.. మంత్రి సీతక్క వార్నింగ్

Read Latest Telangana News, AP News And National News

Updated Date - Jun 08 , 2026 | 02:14 AM