ఇలియట్ పై రససిద్ధాంత ప్రభావం
ABN , Publish Date - Jun 01 , 2026 | 02:06 AM
టి.ఎస్. ఇలియట్ ఇరవయ్యవ శతాబ్దానికి చెందిన మహత్తర సాహిత్య దిగ్గజం. ఆయన ఆంగ్ల సాహిత్యంలో ప్రఖ్యాత కవే గాక, విమర్శకుడు, నాటకకర్త కూడా. ఒక నాటకకర్తగా ఆయన ఆధునిక సమాజంలో క్షీణించిన...
టి.ఎస్. ఇలియట్ ఇరవయ్యవ శతాబ్దానికి చెందిన మహత్తర సాహిత్య దిగ్గజం. ఆయన ఆంగ్ల సాహిత్యంలో ప్రఖ్యాత కవే గాక, విమర్శకుడు, నాటకకర్త కూడా. ఒక నాటకకర్తగా ఆయన ఆధునిక సమాజంలో క్షీణించిన విలువలను వ్యక్తపరచడానికి, ప్రసారం చేయడానికి కవిత్వాన్ని ప్రభావవంతమైన మాధ్యమంగా వినియోగించారు. ఆయన కవితలలోనూ, కవితా నాటకాలలోనూ (Poetic Dramas) ఆధ్యాత్మిక తృప్తి కోసం సాగే అన్వేషణ ప్రధానంగా కనిపిస్తుంది. ఆయన రాసిన ఆధునిక మహత్తర దీర్ఘకావ్యం ‘ది వేస్ట్‌లాండ్’ ప్రపంచవ్యాప్తంగా ఆధునిక కవులు, విమర్శకులపై అపార ప్రభావాన్ని చూపింది. జి.ఎస్. ఫ్రేసర్ అనే ఆంగ్ల విమర్శకుడు ‘ది వేస్ట్‌లాండ్’ గురించి ఇలా వ్యాఖ్యానించాడు: ‘‘ది వేస్ట్‌లాండ్ కన్నా మరే ఇతర ఆధునిక కవిత ఇంత విస్తృతమైన విశ్లేషణకు లోను కాలేదు. అయినప్పటికీ, దీన్ని సంప్రదాయ కవితావర్గాలలో ఏదో ఒకదానికి ధైర్యంగా చేర్చగలిగిన విమర్శకుడూ లేడు; లేదా ఇది పూర్తిగా కొత్త రకమైన కవిత అని భావించినా, ఆ రకానికి కొత్త పేరు పెట్టినవాడూ లేడు.’’
ఒక గొప్ప పండితుడిగా ఇలియట్ భారతీయ తత్త్వశాస్త్రం, ఆలోచనా ధోరణి, కవిత్వం పట్ల అపారమైన గౌరవం ఏర్పర్చుకున్నారు. ఇది ఆయన కవితా రచనలలోనూ, నాటకాలలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. భారతీయ సౌందర్యశాస్త్రం పట్ల కూడా ఆయనకు గొప్ప ఆకర్షణ ఉంది. అందుకే 1911లో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చార్లెస్ రాక్‌వెల్ లాన్‌మన్ మార్గదర్శకత్వంలో ఇలియట్ సంస్కృతం, పాళీ సాహిత్యాలను విస్తృతంగా అధ్యయనం చేశాడు. ఆయనకు భారతీయ తత్త్వశాస్త్రమంటే ఎంత గాఢమైన ప్రేమో ఈ వాక్యాలు తేటతెల్లం చేస్తాయి: ‘‘చాలా కాలం క్రితం నేను ప్రాచీన భారతీయ భాషలను అధ్యయనం చేశాను. ఆ సమయంలో నాకు ముఖ్యంగా తత్త్వశాస్త్రం పైనే ఆసక్తి ఉన్నప్పటికీ, కొద్దిగా కవిత్వాన్నీ కూడా చదివాను. నా కవిత్వంలో భారతీయ ఆలోచనలూ, భావస్పర్శ ప్రభావం చూపాయని నాకు తెలుసు.’’
చార్లెస్ లాన్‌మన్ మార్గదర్శకత్వంలో సంస్కృతం అధ్యయనం చేయడమే కాక జేమ్స్ వుడ్స్ ఆధ్వర్యంలో పతంజలి మెటాఫిజిక్స్‌ను ఒక సంవత్సరం చదువు కోవడం వలన ఇలియట్‌కు భారతీయ తత్వశాస్త్రం మీద అమితమైన ఆసక్తి కలిగింది. ‘‘భారతీయ తత్వవేత్తలముందు మహత్తర యూరోపియన్ తత్త్వవేత్తలు పాఠశాల విద్యార్థుల్లా కనిపిస్తారు,’’ అని ఇలియట్ అన్నారు.
1911 నుంచి రెండేళ్ళ పాటు ఇలియట్ భారతీయ సౌందర్యశాస్త్రాన్ని కూడా అధ్యయనం చేశాడు. ఆయన కవితా నాటకాలు 1926 నుంచి 1959 మధ్యకాలంలో రచించబడ్డాయి. కాబట్టి ఇలియట్ నాటకాలు రాసే సమయానికే ఆయనకు భారతీయ సౌందర్యశాస్త్రంపైన, దాని సిద్ధాంతాలపైన అవగాహన ఉన్నదని అర్థం చేసుకోవచ్చు. ఇలియట్ భారతీయ ఆలోచనలతోనే కాదు, భారతీయ సాహిత్యంతో కూడా ప్రభావితుడయినందువల్ల భారతీయ సౌందర్యశాస్త్ర సిద్ధాంతాల దృష్టిలో ఇలియట్ రచనలను అధ్యయనం చేయవచ్చు.
ముఖ్యంగా ఇలియట్ మానవ స్వభావంలోని సంక్లిష్టతలను అన్వేషించడానికి పద్య నాటకాన్ని శక్తివంతమైన మాధ్యమంగా గుర్తించాడు. పద్యనాటక సంప్రదాయాన్ని పునరుజ్జీవింపజేసి, ఇంగ్లండ్‌లోనే కాక విదేశాల్లోనూ దానికి ప్రాచుర్యం కల్పించేందుకు కృషి చేశాడు. నాటకానికి కవిత్వమే సహజమైన, సంపూర్ణమైన మాధ్యమం అని ఆయన నమ్మాడు. రంగస్థలం అందించగలిగే సంపూర్ణ అనుభూతిలో కొంతే గద్యనాటకం ఇవ్వగలదనీ, పద్యనాటకం అయితే మరింత తీవ్రమైన, ఉత్తేజకరమైన అనుభూతిని అందించగలదనీ ఆయన అంటాడు. ఇలియట్ తన నాటకాలలో మతపరమైన, లౌకికమైన ఇతివృత్తాలను నైపుణ్యంతో వాడుతూ, మానవ అస్తిత్వంలోని వివిధ స్థాయిలను, విభిన్న భావోద్వేగాలను ప్రతిబింబించడానికి పద్య నాటకాన్ని మాధ్యమంగా ఉపయోగించాడు.
ఇలియట్ మొత్తం ఐదు ప్రధాన నాటకాలు, రెండు ఉప నాటకాలు రచించాడు. Sweeny Agonistes (1926), The Rock (1934), Murder in the Cathedral (1935), The family Reunion (1939), The Cocktail Party (1950), The Confidential Clerk (1954), The Elder Stateman (1959) వంటి పద్య నాటకాలలో ఆయన నాటకీయ ప్రతిభ సంపూర్ణంగా వ్యక్తమైంది.
భారతదేశంలో కవితాశాస్త్రం నాట్యశాస్త్రం నుంచే వికసించింది. ఇది సాహిత్య విమర్శలో ఒక శాస్త్రీయంగా అభివృద్ధి చెందిన వ్యవస్థ. విస్తృతంగా చెప్పాలంటే ఇది ఎనిమిది సంప్రదాయాలుగా విభజించబడింది. అవి... అలంకార, రీతి, గుణ, వక్రోక్తి, అనుమాన, ఔచిత్య, ధ్వని, రస.
భారతీయ కవితాశాస్త్రం విశ్వవ్యాప్తమైనదని అనేకమంది కవులు, సౌందర్యవేత్తలు నిరూపించారు. ఇది భౌగోళిక పరిమితులకు లోబడలేదు, కాబట్టి ఏ కళాఖండాన్నయినా దీని ద్వారా అంచనా వేయవచ్చు. ‘రసం’ అంటే సారం. ఇది పరమ సౌందర్యానుభూతిని సూచిస్తుంది. అది స్వయంసిద్ధమైన ఆనందాలలో ఒకటి. భారతీయ కవితాశాస్త్రం ప్రాచీనమైనదే కాక అత్యంత అభివృద్ధి చెందిన కళాశాస్త్రం కావడం మూలాన అన్ని కాలాల్లోని, అన్నీ ప్రాంతాల్లోని కళాఖండాల్ని అంచనా వేయడానికి సాధనాలను సమకూరుస్తుంది.
ఇప్పటివరకు ఇలియట్ రచనలను పాశ్చాత్య విమర్శాసిద్ధాంతాల దృష్టిలో విశ్లేషించారు కానీ, భారతీయ కవితాశాస్త్రపు దృష్టిలో అధ్యయనం జరగలేదు. ఇలియట్ కవితానాటకాలకు భారతీయ రససిద్ధాంతాన్ని అన్వయించి పరిశీలించి పరిశోధన చేయడానికి సరిగ్గా సరిపోతాయి.
రససిద్ధాంతాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోకుండా ఇలియట్ నాటకాలపై దానిని అన్వయించడం సాధ్యం కాదు. రస సిద్ధాంత మూలాలు వేదకాలంలోనే ఉన్నాయని భావిస్తారు. భరతుడు రససిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పటికీ, ఆనందవర్ధనుడు, అభినవగుప్తుడు వంటి పండితుల చేతుల్లో ఇది మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. సౌందర్యవేత్తల అభిప్రాయం ప్రకారం, మానవ భావోద్వేగాలను పరిశీలించే రసమే ఏ కళాఖండానికైనా ఆత్మలాంటిది.
భట్టనాయకుడు రససిద్ధాంతానికి ఒక మెటాఫిజికల్ కోణాన్ని జోడించాడు. ఆయన ప్రకారం, రసం బ్రహ్మానందానికి సమానమైన అనుభూతి, ఇది లోకాసక్తుల నుంచి విముక్తికి మార్గం కూడా. భరతుని నాట్యశాస్త్రం భారతీయ సౌందర్యశాస్త్ర చరిత్రలో గొప్ప మైలురాయి. అందులో భరతుడు ఇలా అంటాడు: ‘‘రసం అనే పదం అర్థం చేసుకోవడానికి సులభమైనదే అయినా, నిర్వచించడానికి అత్యంత కఠినమైనది.’’
రసం అనేది ఒక గొప్పనాటకాన్ని చూస్తున్నప్పుడు ప్రేక్షకులు అనుభవించే ఆనందభరితమైన సౌందర్యానుభూతి. ఇది కళాఖండాన్ని సమృద్ధిగా, సార్థకంగా చేస్తుంది. భరతుని ప్రకారం రసం ఇలా ఉత్పన్నమవుతుంది: ‘‘విభావాను భావవ్యభిచారిభావసంయోగాద్రసనిష్పత్తిః’’ – అంటే విభావాలు, అనుభావాలు, వ్యభిచారి భావాలు స్థాయీ భావంతో కలిసినప్పుడు రసం ఉద్భవిస్తుంది.
నాట్యశాస్త్రం ఎనిమిది రసాలను విస్తృతంగా చర్చిస్తుంది: శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుత రసాలు. శాంత రసాన్ని తొమ్మిదవ రసంగా అభినవగుప్తుడు ప్రతిపాదించాడు. భారతీయ రససిద్ధాంతం విశ్వవ్యాప్తమైనందున, ఏ కళాఖండమైనా నవరసాల దృష్టిలో విశ్లేషించవచ్చు.
కాళిదాసు, వాల్మీకి వంటి ప్రాచీనకవుల రచనల్లో రసభావన స్పష్టంగా కనిపిస్తుంది. వాల్మీకి రామాయణం కరుణ రసంతో నిండి ఉంది. వాల్మీకి అనుభవించిన శోకం శ్లోకంగా మారింది. అలాగే ఇలియట్ కూడా తన కవితానాటకాలలో మానవ భావోద్వేగాలను శక్తివంతంగా వ్యక్తీకరించాడు. ప్రాథమికంగా కవియైన ఆయన, ఆ భావాలను సహజంగా చిత్రించడానికి నాటకాన్ని మాధ్యమంగా ఎంచుకున్నాడు.
విమర్శకుల అభిప్రాయాలను సమగ్రంగా పరిశీలిస్తే, ఇలియట్ కవితానాటకాన్ని ఆధునిక సమాజానికి ఆధ్యాత్మిక క్రమాన్ని పునఃసృష్టించగల శక్తివంతమైన మాధ్యమంగా అభివృద్ధి చేశాడని తెలుస్తుంది. నేటి ఆధునిక సమాజంలోని ఆలోచనలను, భావోద్వేగాలను క్రమబద్ధం చేయడానికి కవిత్వం అత్యవసరం. అటువంటి కవిత్వాన్ని ప్రజలకు చేరువ చేయడానికి కవితానాటకం అత్యుత్తమ మార్గమని తెలుసుకున్న ఇలియట్ ఆ దిశగా అపారమైన నిబద్ధతతో పనిచేశాడు. ఇలియట్ దృష్టిలో, ప్రేక్షకులను ప్రేరేపించగల ఏకైక కళారూపం నాటకమే.
ఇలియట్ తన నాటకాలలో వాస్తవం–ఆదర్శాల మధ్య సంఘర్షణను చూపించాడు. మత విశ్వాసం ప్రధాన ఇతివృత్తమైనప్పటికీ, ఆ నాటకాలు సమకాలీన మానవ సమస్యల్ని ప్రతిబింబించాయి. ఆధునిక యాంత్రిక ప్రపంచం సృష్టించిన మానసిక ఆందోళనల నుంచి విముక్తికి ఆధ్యాత్మిక చైతన్యం అవసరమని ఇలియట్ విశ్వసించాడు.
మొత్తంగా చెప్పాలంటే, ఇలియట్ కవితానాటకాలు మతపరమైన, ఆధ్యాత్మిక భావనల ప్రభావాన్ని మానవ జీవితాలపై ప్రతిబింబిస్తాయి. ఇలియట్ ఒక్కో కవితానాటకాన్ని ఎవరైనా నిబద్ధులైన పరిశోధకులుంటే భారతీయ సౌందర్యశాస్త్ర రససిద్ధాంతం దృష్టితో అధ్యయనం చేస్తే, వాటి లోతైన భావాత్మక విలువ మరింత స్పష్టంగా అవగతం కావడమే గాక, మన భారతీయ సాహిత్య సాంస్కృతిక ఔన్నత్యాన్ని ప్రపంచానికి ఇంకా విశాలంగా అర్థం చేయవచ్చు.
బాణాల శ్రీనివాసరావు
94404 71423
ఇవి కూడా చదవండి..
టీఎంసీలో అంతర్గత కుమ్ములాటలే అభిషేక్ బెనర్జీపై దాడికి కారణం... బీజేపీ
పాక్ కుట్ర.. ఉగ్రవాదులకు సాయంగా భారత్‌లోకి టెలికం సిగ్నల్స్