Share News

కథగా కల్పనగా.. చరిత్ర!

ABN , Publish Date - May 18 , 2026 | 06:10 AM

చారిత్రక నవలా రచన కేవలం వాస్తవాలు, గణాంకాలతో మాత్రమే రూపొందదు. ‘‘నాకు చారిత్రక కల్పన అంటే ఇష్టం, ఎందుకంటే అందులో ఒక అక్షరసత్యం ఉంటుంది. ఒక భావోద్వేగ సత్యం ఉంటుంది. రచయిత కల్పనలో....

కథగా కల్పనగా.. చరిత్ర!

చారిత్రక నవలా రచన కేవలం వాస్తవాలు, గణాంకాలతో మాత్రమే రూపొందదు. ‘‘నాకు చారిత్రక కల్పన అంటే ఇష్టం, ఎందుకంటే అందులో ఒక అక్షరసత్యం ఉంటుంది. ఒక భావోద్వేగ సత్యం ఉంటుంది. రచయిత కల్పనలో సృష్టించడానికి ప్రయత్నించేది ఆ భావోద్వేగ సత్యాన్నే’’ అని జువెల్ పార్కర్ రోడ్స్ అంటారు.

సరిగ్గా రాయబడని చారిత్రక కాల్పనిక నవల (హిస్టారికల్‌ ఫిక్షన్‌) పాఠకుడిని గత కాలానికి తీసుకు వెళ్లడంలో విఫలమవుతుంది. పాత్రలకు జీవం పోయడంలో విఫలమవుతుంది. అది పాఠకుడిని ఏడ్పించడంలో, నవ్వించడంలో, బాధపడేలా చేయడంలో, సానుభూతి చూపించేలా చేయడంలో, ద్వేషించేలా చేయడంలో విఫలమవుతుంది. అందులోని పాత్రలు నిజం కానంత మంచివిగా లేదా చెడ్డవిగా అనిపిస్తాయి. అందులో కాలవిరుద్ధమైన అంశాలు ఉంటాయి. మూస ధోరణులు ఉంటాయి. దాని రచనా శైలి పాఠకుడి దృష్టిని కథనం నుంచి మళ్లిస్తుంది. వీటన్నిటికీ కారణం ఆ రచయిత రచనా సమయంలో ఎదురయ్యే క్లిష్ట సమస్యలను, సవాళ్ళను అధిగమించలేక పోవడమే!

చారిత్రక నవల రాయడంలో రచయిత ఎదుర్కొనే ప్రధాన సమస్య పరిశోధనలో కూరుకుపోవడం. ఉదాహరణకు– 1565లో విజయనగర సామ్రాజ్యంలో మహర్నవమి దిబ్బదగ్గర జరిగే దసరా ఉత్సవాలలో అమ్మబడిన ఒక ఇడ్లీ ఖచ్చితమైన ధర ఎంత? అనే దానిపై నెలల తరబడి పరిశోధన చేసి, చివరికి ఒక్క అధ్యాయం కూడా రాయలేమని గ్రహించడం చాలా సులభం. ఇక్కడ సమస్య ఏమిటంటే, సమాచార సేకరణ ఎప్పుడు ఆపాలో తెలియకపోవడం. ఆనాటి ప్రపంచం సజీవంగా ఉన్నట్లు అనిపించడానికి మనకు తగినంత వివరాలు అవసరమే, కానీ మనం ఒక నవలా రచయితకు బదులుగా ఒక విద్యావేత్తగా మారిపోయేంత ఎక్కువగా ఆ వివరాలు ఉండకూడదు. సమాచారాన్ని కుప్పగా పోయడాన్ని (Dumping of information) నివారించడమే అసలైన సవాలు. రాజకీయాలు, సంస్కృతి, దుస్తులు, భాష, దైనందిన జీవితం వంటి విషయాల గురించి కచ్చితమైన పరిశోధన అవసరం. కానీ అంతిమంగా పాఠకులకు కావలసింది ఒక కథే గానీ, పాఠ్య పుస్తకం కాదు. వాస్తవాలను కథనంలో సహజంగా అల్లడమే ఇక్కడ అసలు పని.


చారిత్రక నవలలు రాయడంలో ఎదురయ్యే మరో సమస్య కాలదోషాలను నివారించడం. అప్పటికి ఇంకా ఉనికిలోలేని పదాలను, జాతీయాలను ఉపయోగించడం. మనం ఆధునిక భాషలో రాస్తే అది అప్రామాణికంగా అనిపించవచ్చు. పాతకాలపు భాషను ఉపయోగిస్తే అది చదవడానికి కష్టంగా అనిపించవచ్చు. కష్టంగా లేకుండా, చారిత్రకం అనిపించే సహజమైన భాషా ధోరణిని సాధించడం అనుకున్నంత సులభం కాదు. మాట్లాడే విధానంలో ఒక ‘‘మధ్యేమార్గాన్ని’’ కనుగొనడం చాలా కష్టం. గ్రాంథిక తెలుగు లేదా ప్రాచీన మాండలికాలను ఖచ్చితంగా అనుకరించడానికి ప్రయత్నిస్తే, ఆ పుస్తకం చదవడానికి వీలు లేకుండా పోతుంది. మరీ ఆధునికంగా ఉంటే చారిత్రక నేపథ్యం కలిగించాల్సిన మాయ తొలగిపోతుంది. విజయవంతమైన చారిత్రక కల్పన సాధారణంగా ఆ కాలపు భాష తాలూకు శైలీకృత రూపాన్ని ఉపయోగిస్తుంది. ఆ కాలపు అనుభూతిని తెలియజేస్తూనే, ఆధునిక పాఠకులకు కూడా సులభంగా అర్థమయ్యేలా ఉంటుంది.

చారిత్రక నవలలు రాసేప్పుడు ఆనాటి సమాజపు మానసిక దృక్పథాలను పట్టుకోవడం కూడా చాలా కష్టం. దీనిని ‘‘మానసిక కాలదోషం’’ అని చెప్పవచ్చు. ఒక చారిత్రక పాత్రను నేటి పాఠకులకు నచ్చేలా చేయడానికి, వారికి సామాజిక న్యాయం, విజ్ఞానశాస్త్రం, మతం వంటి ఆధునిక విలువలను ఆపాదించాలని అనిపించడం సహజమే! కానీ అలా చేయడం వల్ల ఆ పాత్ర కృత్రిమంగా అనిపిస్తుంది. మనం పాత్రలను వాటి కాలానికి విరుద్ధంగా ప్రవర్తించేలా చేయలేం. అదే సమయంలో మనకు నాటకీయత, సంఘర్షణ, భావోద్వేగలోతు కూడా అవసరం. ఆ సమతుల్యతను కనుగొనడం చాలా క్లిష్టమైనది. ఉదాహరణకు 14వ లేదా 16వ శతాబ్దంలోని స్త్రీలు, పురుషులు, పాలకులు మనలా ఆలోచించలేదు. వర్గం, లింగం, మతం, నైతికత గురించిన వారి నమ్మకాలు వర్తమాన కాలానికి భిన్నంగా ఉంటాయి. ఆధునిక పాఠకులకు పరాయి వారిగా అనిపించకుండా, ప్రామాణికమైన ప్రపంచ దృష్టికోణంతో ఆ పాత్రలను రాయడం పెద్ద సవాలు.

అలాగే ఈ నవలా రచనలో చరిత్రలోని ‘‘ఖాళీలను’’ పూరించడం మన సృజనాత్మకతకు ఒక పరీక్ష. చరిత్రలో తరచుగా విజేతల గురించి, ఉన్నత వర్గాల గురించి రాస్తారు. దీని వల్ల సామాన్య ప్రజలు, మహిళలు, అణగారిన వర్గాల జీవితాలకు సంబంధించిన విషయాలు ఖాళీలుగా మిగిలిపోతాయి. మనం ఒక ఖాళీని కనుగొంటే, దాన్ని కల్పించడానికి మనకు స్వేచ్ఛ ఉంటుంది, కానీ మన కల్పన ఆ కాలంలోని తెలిసిన పరిమితులలో నమ్మశక్యంగా ఉందని మనం నిర్ధారించుకోవాలి. ఉదాహరణకు శ్రీకృష్ణదేవరాయాలి కాలంలో కారం అనే పదార్థం ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉండేది. సాదారణ ప్రజానీకం కారం కన్నా ముందు మిరియాలు ఉపయోగించేవారు. మనం రాసే కథలో పేదప్రజలు కారం, అన్నం తిన్నట్లుగా రాస్తే అది నమ్మశక్యంగా ఉండదు.


చారిత్రక ఆధారాలు తరచుగా అసంపూర్ణంగా, పక్షపాతంతో ఉంటాయి. లోపించిన వివరాలను రచయితలు బాధ్యతాయుతంగా ఊహించుకోవలసి ఉంటుంది. మరీ మితిమీరిన కల్పన కథను వక్రీకరించే ప్రమాదం ఉంది. మరీ తక్కువ కల్పన కథను ఆసక్తి లేనిదిగా చేస్తుంది. చారిత్రక నవలా రచనలో మరో సవాలు కాలవిరుద్ధమైన విషయాలను నివారించడం. ఇంకా ఉనికిలో లేని వస్తువులను, ఆలోచనలను, పదాలను ప్రస్తావించడం వంటి పొరపాట్లు జరిగే అవకాశం ఉంది.

చారిత్రక నవల రచనలో మనం అప్పటికే జరిగిపోయిన విషయాల గురించి రాస్తాం. అందరకూ తెలిసిన విషయాలే కాబట్టి మనం మరలా ఆ విషయాలు రాస్తే అవి పాఠకుడికి ఆసక్తిని కలిగిస్తాయా అనేది ఒక సందేహం. అంటే పాఠకులకు ఫలితం అప్పటికే తెలిసి ఉంటుంది కాబట్టి అటువంటి విషయాలను రాసేప్పుడు ఉత్కంఠతను, భావోద్వేగ అనుబంధాన్ని సృష్టించడమే అసలైన సవాలు. ఉదాహరణకు రక్కసి తంగడి యుద్ధం ఎవరెవరి మధ్య జరిగిందో, ఆ యుద్ధంలో ఎవరు విజయం సాధించారో చాలామందికి తెలుసు. అటువంటి యుద్ధం గురించి రాసేప్పుడు రచయిత ఆ యుద్ధసమయంలో ఎవరికీ తెలియని విషయాలు పరిశోధన ద్వారా సేకరించి, యుద్ధాన్ని ఉత్కంఠ కలిగించే విధంగా రాయగలగాలి.

చారిత్రక నవల రాసేప్పుడు రచయిత నైతిక బాధ్యతను విస్మరించరాదు. నిజమైన వ్యక్తుల గురించి, సున్నితమైన కాలాల గురించి రాసేటప్పుడు, వారిని/ వాటిని నిష్పక్షపాతంగా, ఆలోచనాత్మకంగా చిత్రీకరించాలనే ఒత్తిడి ఉంటుంది. తప్పుడు చిత్రీకరణ తీవ్ర విమర్శలకు గురికావచ్చు. కొందరు రచయితలు తమది చారిత్రక ‘‘కాల్పనిక’’ నవల అని పేర్కొనడం చాటున ఏది రాసినా చెల్లుతుందనే అపోహను కలిగి ఉన్నారు. కాల్పనికతలో హేతుబద్ధత లోపిస్తే ఆ నవల చెడుతుంది.

చారిత్రక నవలల రచనలో ఎదురయ్యే మరో అతిపెద్ద అడ్డంకి రచయిత ఎదుర్కొనాల్సిన అంతర్గత సంఘర్షణ. కథను సరిగ్గా నడిపించడానికి ఒక చిన్న తేదీని లేదా సంఘటనను మార్చడం సరైనదేనా? అన్న ఘర్షణ రచయితకు తప్పదు. ఈ విషయంలో నవల చివరలో రచయిత ఒక ‘గమనిక’ను చేర్చి అందులో కథ కోసం తాము ఎక్కడెక్కడ సృజనాత్మక స్వేచ్ఛను తీసుకున్నారో స్పష్టంగా పేర్కొంటే సరిపోతుంది. ఏదేమైనా హిస్టారికల్‌ ఫిక్షన్‌ రాయడానికి రచయితకు చాలా సహనం అవసరం.

మారుతి పౌరోహితం

94402 05303

ఈ వార్తలనూ చదవండి:

ప్రపంచంలో అతిపెద్ద ఏఐ టెక్‌ కంపెనీగా టీసీఎస్‌

బంగారంలో పెట్టుబడులకు గోల్డ్‌ ఈటీఎఫ్‌, ఈజీఆర్‌లు

Updated Date - May 18 , 2026 | 06:10 AM