Share News

పణిక్కర్‌తో నా ప్రయాణం

ABN , Publish Date - Mar 11 , 2026 | 02:10 AM

చరిత్రకారుడు కె.ఎన్‌.పణిక్కర్‌ సోమవారం కన్నుమూశారు. ఆయనతో నా అనుబంధం సుదీర్ఘమైనది. నేను గ్రాడ్యుయేషన్‌ వరకూ మా కావలిలో చదివి, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ వాల్తేరు, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో...

పణిక్కర్‌తో నా ప్రయాణం

చరిత్రకారుడు కె.ఎన్‌.పణిక్కర్‌ సోమవారం కన్నుమూశారు. ఆయనతో నా అనుబంధం సుదీర్ఘమైనది. నేను గ్రాడ్యుయేషన్‌ వరకూ మా కావలిలో చదివి, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ వాల్తేరు, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ముగించుకుని, నా మాతృసంస్థ కావలి జవహర్‌ భారతిలో అధ్యాపక ఉద్యోగం చేశాను. చరిత్రపై అభిలాష పెరిగి, పరిశోధన చేయాలన్న తలంపుతో, జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (న్యూఢిల్లీ)లో 1972 జూలైలో ఎం.ఫిల్‌లో చేరాను. జేఎన్‌యూతో ఇది నా పరిచయ ప్రారంభం.

చరిత్ర శాఖాధిపతి, ప్రొఫెసర్‌ రోమిలా థాపర్‌ని కలిస్తే, ఆమె ప్రొఫెసర్‌ బిపన్‌చంద్రను కలవమన్నారు. ప్రొఫెసర్‌ బిపన్‌చంద్ర నన్ను ప్రొఫెసర్‌ సర్వేపల్లి గోపాల్‌ దగ్గరకు తీసుకెళ్లి పరిచయం చేస్తే, ఆయన నేతృత్వంలో నా పరిశోధన ప్రారంభమైంది. జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన బోధన, పరిశోధనలకు పేరుపొందింది.

చరిత్రశాఖను దేశ విదేశాల్లో, వివిధ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న పేరెన్నికగన్న చరిత్రకారులను అధ్యాపకులను ఆచార్య బిపన్‌చంద్ర, ఆచార్య సతీశ్‌చంద్ర (ఆయన ఆ తర్వాత యూజీసీ చైర్మన్‌గా నియమితులయ్యారు), తమిళనాడు నుంచి ఆచార్య చంపక లక్ష్మి, ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి ఆచార్య కె.ఎన్‌.పణిక్కర్‌ ప్రభృతులను చరిత్రశాఖలో నియమించారు. వీరందరూ చరిత్రశాఖకు, జేఎన్‌యూకు ఎనలేని పేరుప్రఖ్యాతులు సమకూర్చారు.

నేను పరిశోధన కోసం జేఎన్‌యూలో చేరాను, అయితే నాకు ఫెలోషిప్‌ లేదు. తమ మాతృభాష కాని, మరొక భాషలో డిప్లొమా చేయాలన్న నిబంధనతో తమిళంలో చేరగా, నా సహ విద్యార్థి తెలుగు ఎంపిక చేసుకుంటే అది బోధించడానికి ఎవరూలేక, నన్ను అడిగారు. అంగీకరించగా నన్ను చెప్పమన్నారు. దానికి నెలకు రూ.200 ఇచ్చారు. నాకు ఫెలోషిప్‌లేని లోటు ఆ విధంగా తీరింది.

‘ఆంధ్రదేశంలో సంఘ సంస్కరణలు’ ఇదీ నా పరిశోధనాంశం. నాకు ప్రొఫెసర్‌ సర్వేపల్లి గోపాల్‌ సూపర్‌వైజర్‌ (వారికి తెలుగు రావడం వల్ల). ఎం.ఫిల్‌ పూర్తి చేసిన తర్వాత ఆచార్య బిపన్‌చంద్ర తదితరులు ‘ఆంధ్రదేశంలో సంఘసంస్కరణ’పై పీహెచ్‌డీ చేయమని నన్ను ప్రోత్సహించారు. ఇంటి నుంచి పరిశోధన సాగించాలని నా శ్రీమతి లలిత, ఇతర మిత్రులు, శ్రేయోభిలాషులు ప్రోత్సహించారు.


పీహెచ్‌డీ పరిశోధన సామాజిక అంశం కావడం, ఆ క్రమంలోనే ప్రొఫెసర్‌ పణిక్కర్‌ తన పరిశోధనలు చేయడం... దీంతో ఆయనతో పరిచయం గట్టిపడింది. మా మధ్య చర్చలు తమిళ సమాజంపై పరిశోధనలు చేసిన ఆచార్య పణిక్కర్‌, నా పరిశోధనపై ఆసక్తి చూపి, రెండు ప్రాంతాలపై పరిశోధనల్లోని సామ్యాలు, విభిన్నతలు చర్చించడంతో వారితో సాన్నిహిత్యం పెరిగింది. నేను పీహెచ్‌డీ పరిశోధనా గ్రంథం/థీసిస్‌ రాస్తున్నప్పుడు వారితో సుదీర్ఘ చర్చలు జరిగేవి. ఇలా నా పరిశోధనాపత్రం రాయడంలో పణిక్కర్‌ సలహాలు, సూచనలు చోటుచేసుకున్నాయి. ఇలా థీసిస్‌ రాయడంలో అనేక సందర్భాల్లో నాకు సలహాలు ఇచ్చి, తోడ్పడ్డారు.

ఆ తర్వాత పీహెచ్‌డీ ముగించుకుని కావలి కళాశాలలో చేరాను. నా ఆహ్వానంపై ఆయన కావలికి వచ్చి, రెండు రోజులుండి, ‘భారతదేశంలో ఆధునికత’పై ఓ రెండు ఉపన్యాసాలు ఇచ్చారు. అప్పటి నుంచి జేఎన్‌యూ చరిత్రశాఖ నుంచి ఒకరు ఇద్దరు మినహా దాదాపు అందరూ కావలి జవహర్‌ భారతి కళాశాలకు రావడం, చరిత్రపై సాధికార ఉపన్యాసాలివ్వడం జరిగింది. అదే క్రమంలో కాంగ్రెస్‌ వార్షిక సభలకు వచ్చినప్పుడు చర్చల్లో పాల్గొని ‘ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర’పై ఉపన్యాసాలిచ్చారు.

మా ఇద్దరి స్నేహం, రిటైరైన తర్వాత కూడా దూరం నుంచి కొనసాగింది. తెలుగు వారి వంటకాల్లో ఆయనకు ఆవకాయ (ఊరగాయ) అమితమైన ఇష్టం. పణిక్కర్‌ సహృదయుడు, స్నేహశీలి, చరిత్ర సాధకుడు. వారి స్మృతికి నా నివాళి.

వకుళాభరణం రామకృష్ణ

చరిత్రకారుడు

ఇవి కూడా చదవండి..

సుదీర్ఘ యుద్ధానికి సిద్ధం... ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారు కమల్ ఖరాజీ

నౌకల స్వాధీనం కంటే ముంచేయడమే సరదాగా ఉంటుంది.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

Updated Date - Mar 11 , 2026 | 02:10 AM